టెక్కలి: శ్రీకాకుళం జిల్లా.. తేలినీలాపురం.. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది విదేశీ పక్షుల కేంద్రం. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఏటా టెక్కలిలోని తేలినీలాపురం గ్రామానికి వచ్చి సంతానోత్పత్తి చేస్తూ ప్రపంచ పటంలో ఈ గ్రామానికి ప్రత్యేక స్థానం కల్పించాయి. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సంతానోత్పత్తిని పూర్తి చేసుకుని పిల్లలతో సహా తిరుగుముఖం పడతాయి. ఈ ఏడాది సంతానోత్పత్తిని ముగించుకుని పిల్లాపాపలతో స్వదేశానికి బయల్దేరాయి.
ఇక్కడికే ఎందుకు...
సంతాన ఉత్పత్తికి ఇక్కడ వాతావరణం అనుకూలం
ఇక్కడి చిత్తడి నేలలు చెరువుల్లో సమృద్ధిగా ఆహార లభ్యత
ఆవరణ వ్యవస్థ
గ్రామస్తుల ఆదరణ
కలిసిరాని కాలం..
ఈ ఏడాది ఎన్నడూలేని రీతిలో అధికసంఖ్యలో పెలికాన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. ఆహారంగా స్వీకరించే చేపల్లో కొత్త వైరస్ దాడి చేసి పక్షుల మరణాలకు కారణమైందని ప్రాథమికంగా నిర్ధారించినా కచ్చితమైన కారణాలను మాత్రం కనుక్కోలేకపోయారు అధికారులు.
గ్రామస్తులకు సెంటిమెంట్..
విదేశీ పక్షుల రాక కోసం గ్రామస్తులు ఏటా ఎదురుచూస్తుంటారు. ఇవి వస్తే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం. ఇవి రాకుంటే తీవ్రంగా మదనపడిపోతారు. వీటిని చక్కగా ఆదరిస్తారు.
సంతానోత్పత్తికి అనుకూలంగా..
తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రం పరిసరాల్లోని చెట్లనే ఇవి ఆవాసంగా మార్చుకుంటాయి. 400 నుంచి 500 వరకు గూళ్లను ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. పిల్లలకు ఆహారం సమకూరుస్తూ ఏప్రిల్ వరకు గడుపుతాయి. ఏప్రిల్ చివరిలో స్వదేశానికి పయనమవుతాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో పక్షులు మరణించినా తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య సంతానోత్పత్తిని కొనసాగించాయి.
ఏయే రకాలు.. ఎన్నెన్ని..
ఏటా పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ అనే రెండు రకాల పక్షులు తేలినీలాపురం పక్షుల కేంద్రానికి వస్తుంటాయి. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది 330 పెలికాన్, 470 పెయింటెడ్ స్టార్క్ పక్షులు సెప్టెంబర్‌లో ఇక్కడికి వచ్చాయి.
పెలికాన్..
సెప్టెంబర్‌లో వచ్చినవి: 330
మృత్యువాత పడినవి: 93
సంతానం: 192
తిరుగుముఖం పట్టినవి: 386
ప్రస్తుతం చెట్లపై ఉన్నవి: 43
పెయింటెడ్ స్టార్క్..
సెప్టెంబర్‌లో వచ్చినవి: 470
సంతానం: 450
తిరుగుముఖం పట్టినవి: 768
ప్రస్తుతం చెట్లపై ఉన్నవి: 152
ఎంతో ఆవేదన..
ఏటా పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల రాకతో మా గ్రామం సందడిగా ఉంటుంది. పక్షుల విన్యాసాలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. గ్రామంలో ఎప్పుడూ పండగ వాతావరణమే. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా పెలికాన్ పక్షులు అధిక సంఖ్యలో చనిపోవడం ఎంతో ఆవేదనకు గురి చేసింది. పక్షుల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
–ఆర్.కృష్ణారావు, తేలినీలాపురం
పక్షుల ఉనికి కాపాడుకోవాలి
సైబీరియన్ పక్షుల ఉనికి కాపాడుకోవడం మనందరి బాధ్యత. జిల్లాను ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపుతెచ్చిన విదేశీ పక్షుల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి.
– కె.రామారావు, జీవ వైవిధ్య శాస్త్రవేత్త
వైరస్ నివారణకు..
తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రానికి ఆనుకుని ఉన్న చెరువుల్లో చేపలకు సోకిన వైరస్‌ను నివారించేందుకు ఆయా శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుతం వేసవి కావడంతో చెరువుల్లో నీరు అడుగంటి పోయిన తర్వాత చర్యలు చేపట్టాలి. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా మత్స్య శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
– పి.వి.శాస్త్రి, అటవీ శాఖ రేంజర్
Comments
Please login to add a commentAdd a comment