బడుగుల భూముల్లో  రాబంధువులు  | Another Land Grab Come To Light In Tekkali Constituency | Sakshi
Sakshi News home page

బడుగుల భూముల్లో  రాబంధువులు 

Published Thu, Feb 9 2023 4:50 PM | Last Updated on Thu, Feb 9 2023 5:20 PM

Another Land Grab Come To Light In Tekkali Constituency - Sakshi

దశాబ్దాల క్రితం ఆ భూములు నిరుపేద ఎస్సీ, బీసీలకు దాఖలు పడ్డాయి. సర్కారు డీ పట్టాలు ఇచ్చింది. కానీ వారెవరూ వాటిని అనుభవించ లేకపోతున్నారు. కారణం అవి ఎప్పుడో పెత్తందార్లు కబంధ హస్తాల్లో చిక్కుకోవడమే. వారికి టీడీపీ కీలక నేత అండ ఉండటం, అడిగితే అంతు చూస్తారన్న భయంతో బడుగుల వాటి పై ఆశలు వదులుకున్నారు. 2022లో సమాచార హక్కు చట్టం ద్వారా ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దళిత సంఘాలు కోట్ల విలువ చేసే çసుమారు 20 ఎకరాల భూములను టీడీపీ పెత్తందారులు చెర నుంచి రక్షించేందుకు ఉద్యమిస్తున్నారు. అయితే కీలక టీడీపీ నేత సోదరుడు అధికారులపై ఒత్తిడి చేస్తూ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో మరో భూదందా వెలుగులోకి వచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు పక్కనే తులసిపేటలో దాదాపు 19.62ఎకరాల ల్యాండ్‌ సీలింగ్‌ భూమి ఆక్రమణకు గురైంది. నిరుపేద ఎస్సీ, బీసీలకు ఇచ్చిన భూమిని అక్కడి పెత్తందార్లు ఆక్రమించుకోగా.. వీరికి టీడీపీ కీలక నేత అండగా నిలిచారు. ఇంకేముంది వారి కబంద హస్తాలనుంచి ఆక్రమిత భూమి బయటకి రావడం లేదు. గట్టిగా అడుగుదామంటే ఎక్కడ చంపేస్తారేమో అన్న.. భయంతో బాధితులు వణికిపోతున్నారు.   

19.62 ఎకరాల మేర భూ ఆక్రమణ 
దివంగత కింజరాపు ఎర్రంనాయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ రాజకీయాల్లోకి రాకముందు అప్పటి ప్రభుత్వం నిమ్మాడకు పక్కనున్న తులసిపేటలోని నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ల్యాండ్‌ సీలింగ్‌ భూమిని డీ పట్టాల కింద ఇచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వ గ్రామం నిమ్మాడకు కిలోమీటరన్నర దూరంలో ఉ న్న చిట్టివలస రెవెన్యూ పరిధిలో తులసిపేట ఉంది. సర్వే నెంబర్‌.194/1, 194/7,195/2, 200/1, 203/3బి, 208/2ఎ, 208/2సీ, 217/2, 222/1లోగల 19.62ఎకరాల భూమిని 33 మంది నిరుపేద ఎస్సీలకు, 19 మంది నిరుపేద బీసీలకు డీ పట్టాల కింద ప్రభుత్వమిచ్చింది. అయితే, ప్రభుత్వం తమకిచ్చిన భూములను లబ్ధిదారులు వెంటనే సాగు చేయకపోవడంతో అక్కడనున్న టీడీపీ నేతల అండదండలున్న పెత్తందార్లు ఆక్రమించారు. అంతటితో ఆగకుండా సాగు చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములు కావడంతో భూములు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. టీడీపీ కీలక నేతలు అండదండలు ఉండటంతో ఆ భూమి మీదకి నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులు వెళ్లడానికి భయపడుతున్నారు. అసలే అక్కడ హత్యా రాజకీయాలు. నిమ్మాడ కేంద్రంగా టీడీపీ కీలక నేత ఫ్యామిలీకి నేర చరిత్ర కూడా ఉంది. వారిని కాదని అక్కడ ముందుకెళ్లడానికి సహజంగానే భయం. అలాంటి పరిస్థితులున్న  పక్క గ్రామమే కావడంతో ప్రభుత్వం తమకిచ్చిన భూముల్లోకి వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు.  

ఆందోళనలు చేస్తున్నా.. 
నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ దళిత మహసభ జిల్లా శాఖ, మరికొన్ని సంఘాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గత కొన్నాళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ జిల్లా శాఖ అధ్యక్షుడు, టెక్కలి వాసి బోకర నారాయణరావు సమాచార హక్కు చట్టం కింద ఆ భూముల వివరాలు, పట్టాదారులెవరు, ప్రస్తుత అనుభవదారులు ఎవరన్న వివరాలను లిఖిత పూర్వకంగా అడిగారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమాచార హక్కు చట్టం కింద లిఖితపూర్వంగా 2022 మార్చిలో వివరాలు ఇచ్చింది. 19.62 ఎకరాలను 33 మంది ఎస్సీలకు, 19 మంది బీసీలకు ఇచ్చారని, ఇప్పుడా భూమి ఆక్రమణ జరిగిందని, ఫలానా వ్యక్తుల అనుభవంలో ఉందని నిర్ధారణ కూడా చేస్తూ వివరాల్లో పేర్కొంది. ఆక్రమణలో ఉన్న భూమిని అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని కొన్ని నెలలుగా ఆందోళన జరుగుతోంది.   

అధికారులపై ఒత్తిళ్లు 
ఆందోళనలు జరుగుతుండటం, ఆక్రమిత భూమి వ్యవహారం వెలుగు చూడటం, సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన రిప్లయ్‌లో ఆక్రమణలు 

‘డీ–పట్టా భూములు అప్పగించాలి’ 
కోటబొమ్మాళి: మండలంలోని చిట్టివలస పంచాయతీ తులసిపేటలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన డీ–పట్టా భూములను గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా కార్యదర్శి ఎడ్ల గోపి, అధ్యక్షుడు పాల పోలారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు.   ఈనెల 20లోగా రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చిట్టి సింహాచలం, బలగ రామారావు, జామాన రామారావు, బమ్మిడి వేణు  పాల్గొన్నారు. 

 ఆక్రమణదారులకు అండగా పెద్దలు 
డీ పట్టా భూముల ఆక్రమణదారులకు రాజకీయ పెత్తనం, అధికారం చెలాయిస్తున్న ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి. ఆక్రమణ బాగోతమంతా టీడీపీ కీలక నేతల కనుసన్నల్లోనే జరిగింది. పెద్దల అండదండలు ఉండటంతో నిరుపేదలు ఏం చేయలేకపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ వాదన వినిపిస్తున్నారు. ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక నిరుపేద లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ భూములు అసలైన లబ్ధిదారులకు అప్పగించి న్యాయం చేయాలి. 
 – బోకర నారాయణరావు, ఆంధ్రప్రదేశ్‌ దళిత మహసభ జిల్లా శాఖ అధ్యక్షుడు

 స్వాధీనం చేసుకుంటాం 
తులసిపేట ప్రభుత్వ భూమిలో ఎస్సీ, బీసీ పేద కుటుంబాలకు పట్టాలిచ్చారని, అవి ఆక్రమణకు గురయ్యాయని టెక్కలి సబ్‌ కలెక్టర్‌కు దళిత సంఘం నేత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇటీవల గ్రామానికి మా సిబ్బందిని పంపించాం. కానీ, స్థానికంగా ఎవరూ సహకరించలేదు. బుధ వారం మరికొందరు బాధిత లబ్ధిదారులు ఫిర్యా దు చేయడంతో మళ్లీ గ్రామానికి వెళ్లి సమగ్ర విచారణ జరుపుతాం. అంతా నిర్ధారించుకున్నాక పోలీసుల బందోబస్తు మధ్య ఆ భూములను స్వాధీ నం చేసుకుని, అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తాం.  
– జామి ఈశ్వరమ్మ, తహశీల్దార్, కోటబొమ్మాళి  

జరిగాయని అధికారులు నిర్ధారించడం వంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతో టీడీపీ కీలక నేత సోదరుడు రంగంలోకి దిగి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇప్పుడా భూముల జోలికి పోవద్దని, తాము అధికారంలోకి వస్తామని, అంతవరకు జాప్యం చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. తమ మాట వినకపోతే తాము అధికారంలోకి వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు కూడా చేసినట్టు తెలియవచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement