Pelican birds
-
శీతాకాల అతిథుల సందడి
శీతాకాలం వచ్చేసింది.. కొల్లేరు సరస్సుకు విదేశీ అతిథుల రాకా మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచి్చన రంగురంగుల పక్షులు కిలకిలారావాలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. విదేశీ పక్షుల స్వస్థలాల్లో వాతావరణ మార్పు కారణంగా మనుగడ కోసం తరులు, గిరులు, సాగరాలను దాటి ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుతున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో మార్చి చివర్లో సొంతూర్లకు వెళ్లిపోతాయి. ఏటా వచ్చే ఈ అతిథులను ఇక్కడి ప్రజలు సొంతబిడ్డల్లా ఆదరిస్తారు. వీటిని చూసి ఆనందించేందుకు వచ్చే పర్యాటకులతో పక్షుల విహార కేంద్రాలు కళకళలాడుతున్నాయి.రాష్ట్రంలో పక్షుల విహార కేంద్రాలు ⇒ కొల్లేరు – ఏలూరు జిల్లా⇒ పులికాట్ సరస్సు, నేలపట్టు – నెల్లూరు జిల్లా ⇒ ఉప్పలపాడు – గుంటూరు ⇒ తేలినీలపురం, తేలుకుంచి – శ్రీకాకుళం ⇒ కౌండన్య – చిత్తూరు జిల్లా77,138 ఎకరాల విస్తీర్ణంలో.. ప్రకృతి సోయాగాల ఆరాధకులను కనువిందు చేస్తుంది కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లాలో 77,138 ఎకకాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ ఆటపాక, మాధవపురం పక్షుల విహార కేంద్రాలు ప్రశిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో వందలాది జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. మన దేశానికి ఏటా వలస వచ్చే పక్షి జాతులు 1,349 ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కొల్లేరు ప్రాంతానికి వస్తుంటాయి. ఏషియన్ వాటర్ బర్ట్స్ నివేదిక ప్రకారం గతేడాది ఇక్కడ 105 పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులు విడిది చేశాయి. ఈ ఏడాది మార్చిలో 50 వేల పక్షులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వలస పక్షులకు విడిది వలస అనేది పక్షుల జీవన శైలి. రుతువుల్లో మార్పులు వచ్చునప్పుడు దాదాపు 4,000 పక్షి జాతులు అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ వలసలు వెళతాయి. వీటిలో సుమారు 1,800 జాతులు అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. కొల్లేరుకు సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరప్, అ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి రెడ్ క్రిస్టెడ్ పోచార్డ్ (ఎర్ర తల చిలువ), అలాస్మా నుంచి పసిఫిక్ గెల్డెన్ ఫ్లోవర్ (బంగారు ఉల్లంకి), ఐర్లండ్ నుంచి కామన్ రెడ్ షాంక్ (ఎర్ర కాళ్ల ఉల్లంకి), ఐరోపా నుంచి యురేíÙయన్ స్పూన్ బిల్ (తెడ్డు మూతి కొంగ), దక్షిణాఫ్రికా నుంచి బ్రాహ్మణి షెల్ డక్ (బాపన బాతు), ఫిలిప్సీన్స్ నుంచి వైట్ పెలికాన్ (తెల్ల చింక బాతు) వంటివి ముఖ్యమైనవి.చిత్తడి నేలల నెలవు ‘కొల్లేరు’ చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు పక్షుల జీవనానికి అనువైనది. ఇక్కడి ఆటపాక పక్షుల కేంద్రం పెలికాన్ (గూడబాతు) పక్షుల ఆవాస ప్రాంతంగా పేరుగడించింది. దీనిని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. కొల్లేరు సరస్సులో గూడబాతుతో పాటు ఎర్ర కాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), నల్ల రెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), తెడ్డు ముక్కు కొంగ (ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్) కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్), సాధారణ కోయిలలు (స్వాలో), పెద్ద చిలువ బాతు (లార్జ్ విజ్లింగ్ డక్), చెరువు బాతు (గార్గనే), తొండు వల్లంకి (బ్లాక్ టయల్డ్ గాట్‌విట్) వంటి 105 రకాల పక్షి జాతులు ఉన్నాయి.పక్షులు మంచి నేస్తాలు పక్షులు పర్యావరణ సమతుల్యతకు మంచి నేస్తాలు. వాటిని సంరక్షించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉంది. వలస పక్షుల్లో అనేక జాతులు అంతరించేపోయే ప్రమాదంలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కొల్లేరులో చిత్తడి నేలల ప్రదేశాలు వలస పక్షులకు ఆవాసాలుగా ఉన్నాయి. పక్షులకు ఏ విధమైన హాని తలపెట్టకుండా సంరక్షించుకోవాలి. –దీపక్ రామయ్యన్, వైల్డ్‌లైఫ్ ఎక్స్పర్ట్, హైదరాబాద్ఆకాశమే వాటి హద్దుసమశీతల వాతావరణాన్ని వెతుక్కుంటూ పక్షులు వలస వస్తాయి. ఆకాశమే వాటి హద్దు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం వీటికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కడుతుంది. అందువల్ల అవి సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే (సీఏఎఫ్) మీదుగా మన దేశానికి వస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు ద్వారా పక్షులను దగ్గరగా తిలకించే అవకాశం ఉంది. –కేవీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, కైకలూరు. -
కొండెక్కిన కొల్లేరు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల కేరింతలకు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచిన కొల్లేరు టూరిజంపై కొత్త ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా కొల్లేరు టెంపుల్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ తూర్పు గోదావరికి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొల్లేరు పర్యాటకాభివృద్ధికి రూ.187 కోట్లతో డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కొద్ది రోజుల క్రితం కొత్త రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం, సూర్యలంక, రాజమహేంద్రవరం–అఖండ గోదావరి, సంగమేశ్వరం వంటి నాలుగు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి ప్రాంతమైన కొల్లేరు టూరిజానికి ఇందులో చోటు దక్కకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 నియోజకవర్గాల పరిధిలో కొల్లేరు సరస్సు వ్యాపించి ఉంది. దక్షిణ కశ్మీరంగా దీనికి పేరు. జీవో నంబరు 120 ప్రకారం కొల్లేరు కాంటూరు–5 వరకు 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 9 మండలాల్లో కొల్లేరు పరీవాహక గ్రామాలుగా 122 ఉన్నాయి. మొత్తం జనాభా 3.2 లక్షల మంది ఉండగా, 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన వృత్తి చేపల సాగు. కొల్లేరు కాంటూరును 5 నుంచి 3కు కుదిస్తామని ప్రతి ఎన్నికల్లో టీడీపీ నాయకులు చెబుతున్నా అమలు కావడం లేదు. అటకెక్కిన టెంపుల్ టూరిజం ప్రతిపాదనలుకొల్లేరు విస్తరించిన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికం భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమామహేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వస్వామి ఆలయాలు, భీమవరం మావుళ్లమ్మ దేవస్థానాలు ఉన్నాయి. కొల్లేరు ప్రాంతమైన కైకలూరులో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొల్లేరు టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.వైఎస్ జగన్ పాలనలో రూ.187 కోట్ల ప్రణాళికజిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజానికి రూ.187 కోట్ల ప్రణాళికతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయాలని భావించారు. పర్యాటక శాఖ అధికారులు కొల్లేరులో 10 ప్రాంతాలను టూరిజానికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద డీపీఆర్‌లు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. పక్షులపై కానరాని ప్రేమకొల్లేరు సరస్సుపై ఇటీవల జరిగిన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్‌లో మొత్తం 105 రకాల పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులను గుర్తించారు. ప్రధానంగా రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల కేంద్రం వాసికెక్కింది. ఇక్కడ అరుదైన పెలికాన్ పక్షులు రావడంతో పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. అటవీ శాఖ 283 ఎకరాల్లో పక్షుల విహారానికి చెరువును ఏర్పాటు చేసింది. పక్షి నమూనా మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రానికి నిధుల కొరత వేధిస్తోంది. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. వలస పక్షుల సందడి షురూకొల్లేరు ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల అందాలను తిలకించడానికి ప్రతి ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైన కాలం. కొల్లేరు అభయారణ్యంలో 190 రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సంచరిస్తుంటాయి. ప్రధానంగా కొల్లేరులో పెలికాన్ పక్షి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. కొల్లేరు ఇటీవల వరదలు, వర్షాలకు నిండుకుండలా మారింది. ప్రతి ఏటా విదేశీ పక్షులు వలస వచ్చి సంతానోత్పత్తితో తిరిగి స్వస్థలాలకు వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. -
కొల్లేరులో వి‘హంగామా’
శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. ఇక్కడే పుట్టి.. బతుకు పయనంలో వేల కిలోమీటర్ల మేర వలస పోయిన అతిథి పక్షులు గమనం తప్పకుండా ఏటా మాదిరిగానే విడిది కోసం కొల్లేరు అభయారణ్యానికి వస్తున్నాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుని.. పిల్లలతో కలిసి విదేశాలకు వలస పోయేంతవరకు ఇక్కడే గూళ్లు కట్టుకుని సందడి చేస్తుంటాయి. నిండా పక్షులతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతం ఈ ఏడాదీ పర్యాటకులకు ఆహ్వా నం పలుకుతోంది. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ దృష్ట్యా ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాల వద్ద పర్యాటకుల కోసం అటవీ శాఖ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అంచనా వేస్తోంది. - కైకలూరు 105 రకాల పక్షులున్నాయ్ కొల్లేరు అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులు ఉన్నట్టు ఏషియన్ వాటర్ బర్ట్స్ సెన్సస్–2023 నివేదిక వెల్లడించింది. ఇక్కడ మొత్తం 81,495 పక్షులు ఉన్నట్టు నిర్థారించారు. వీటిలో అత్యధికంగా 7,875 కోయిలలు ఉండగా.. రెండో స్థానంలో 6,869 పెలికాన్లు (గూడబాతులు) ఉన్నట్టు తేల్చింది. వీటితోపాటు ఎర్రకాళ్ల కొంగ (పెయిండెడ్ స్టార్క్), కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), నల్లరెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్) వంటి అనేక పక్షి జాతులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఇవికాకుండా కొల్లేరు అభయారణ్యానికి ఏటా 3 లక్షల నుంచి 4 లక్షల పక్షులు విహారానికి వస్తున్నాయి. వీటిలో సుమారు 1.20 లక్షల పక్షలు విదేశాల నుంచి విడిది కోసం వచ్చే పక్షులు ఉంటున్నాయి. కొల్లేరు ప్రాంతాన్ని పక్షులు సంచరించే ప్రయాణంలో ‘సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే’ అంటారు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం కావడంతో వలస పక్షుల ఇక్కడ విడిది చేసేందుకు ఇష్టపడతాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర 30 దేశాల నుంచి వివిధ వలస జాతుల పక్షులు విచ్చేస్తాయి. అక్టోబర్ నుంచి వీటి రాక మొదలవుతుంది. మార్చి నాటికి సంతానోత్పత్తి చేసుకుని ఇవి తిరిగి తిరిగి వెళ్లడం అనవాయితీగా వస్తోంది. ఎకో టూరిజానికి ప్రతిపాదనలు జిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్ల ఖర్చు కాగల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 10 ప్రదేశాలను పర్యాటక శాఖ గుర్తించింది. రానున్న రోజుల్లో కొల్లేరు ఎకో టూరిజం పర్యాటక శాఖకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుంది. ప్రధానంగా పర్యాటకులు విచ్చేసే పక్షుల విహార కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రండి రండి.. ఇలా చేరుకోండి విజయవాడ.. ఏలూరు.. భీమవరం ప్రాంతాల నుంచి కైకలూరు–భీమవరం జాతీయ రహదారి మీదుగా ఆటపాక చేరుకోవచ్చు. ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. బస్సు దిగిన తరువాత పక్షుల కేంద్రానికి నడక మార్గంలో చేరుకోవచ్చు. విజయవాడ–విశాఖపట్నం రైలు మార్గంలో కైకలూరు రైల్వే స్టేషన్లో దిగి ఆటోలపై మూడు కిలోమీటర్ల దూరంలో పక్షుల కేంద్రానికి చేరవచ్చు. పక్షుల కేంద్రం, మ్యూజియం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెరిచి ఉంటాయి. రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు ఆటపాక పక్షుల కేంద్రం వద్ద రూ.30 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పక్షుల నివాసాలకు కృత్రిమ ఇనుప స్టాండ్లు, పక్షుల విహార చెరువు గట్లు పటిష్టపర్చడం, గోడలకు పక్షుల చిత్రాలు, పర్యాటకులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులు చేయనున్నాం. పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధికి అటవీ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తోంది. – జె.శ్రీనివాస్, అటవీశాఖ రేంజర్, కైకలూరు -
తేలినీలాపురం గ్రామస్తుల సెంటిమెంట్..!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా.. తేలినీలాపురం.. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది విదేశీ పక్షుల కేంద్రం. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఏటా టెక్కలిలోని తేలినీలాపురం గ్రామానికి వచ్చి సంతానోత్పత్తి చేస్తూ ప్రపంచ పటంలో ఈ గ్రామానికి ప్రత్యేక స్థానం కల్పించాయి. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సంతానోత్పత్తిని పూర్తి చేసుకుని పిల్లలతో సహా తిరుగుముఖం పడతాయి. ఈ ఏడాది సంతానోత్పత్తిని ముగించుకుని పిల్లాపాపలతో స్వదేశానికి బయల్దేరాయి. ఇక్కడికే ఎందుకు... సంతాన ఉత్పత్తికి ఇక్కడ వాతావరణం అనుకూలం ఇక్కడి చిత్తడి నేలలు చెరువుల్లో సమృద్ధిగా ఆహార లభ్యత ఆవరణ వ్యవస్థ గ్రామస్తుల ఆదరణ కలిసిరాని కాలం.. ఈ ఏడాది ఎన్నడూలేని రీతిలో అధికసంఖ్యలో పెలికాన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. ఆహారంగా స్వీకరించే చేపల్లో కొత్త వైరస్ దాడి చేసి పక్షుల మరణాలకు కారణమైందని ప్రాథమికంగా నిర్ధారించినా కచ్చితమైన కారణాలను మాత్రం కనుక్కోలేకపోయారు అధికారులు. గ్రామస్తులకు సెంటిమెంట్.. విదేశీ పక్షుల రాక కోసం గ్రామస్తులు ఏటా ఎదురుచూస్తుంటారు. ఇవి వస్తే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం. ఇవి రాకుంటే తీవ్రంగా మదనపడిపోతారు. వీటిని చక్కగా ఆదరిస్తారు. సంతానోత్పత్తికి అనుకూలంగా.. తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రం పరిసరాల్లోని చెట్లనే ఇవి ఆవాసంగా మార్చుకుంటాయి. 400 నుంచి 500 వరకు గూళ్లను ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. పిల్లలకు ఆహారం సమకూరుస్తూ ఏప్రిల్ వరకు గడుపుతాయి. ఏప్రిల్ చివరిలో స్వదేశానికి పయనమవుతాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో పక్షులు మరణించినా తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య సంతానోత్పత్తిని కొనసాగించాయి. ఏయే రకాలు.. ఎన్నెన్ని.. ఏటా పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ అనే రెండు రకాల పక్షులు తేలినీలాపురం పక్షుల కేంద్రానికి వస్తుంటాయి. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది 330 పెలికాన్, 470 పెయింటెడ్ స్టార్క్ పక్షులు సెప్టెంబర్‌లో ఇక్కడికి వచ్చాయి. పెలికాన్.. సెప్టెంబర్‌లో వచ్చినవి: 330 మృత్యువాత పడినవి: 93 సంతానం: 192 తిరుగుముఖం పట్టినవి: 386 ప్రస్తుతం చెట్లపై ఉన్నవి: 43 పెయింటెడ్ స్టార్క్.. సెప్టెంబర్‌లో వచ్చినవి: 470 సంతానం: 450 తిరుగుముఖం పట్టినవి: 768 ప్రస్తుతం చెట్లపై ఉన్నవి: 152 ఎంతో ఆవేదన.. ఏటా పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల రాకతో మా గ్రామం సందడిగా ఉంటుంది. పక్షుల విన్యాసాలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. గ్రామంలో ఎప్పుడూ పండగ వాతావరణమే. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా పెలికాన్ పక్షులు అధిక సంఖ్యలో చనిపోవడం ఎంతో ఆవేదనకు గురి చేసింది. పక్షుల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. –ఆర్.కృష్ణారావు, తేలినీలాపురం పక్షుల ఉనికి కాపాడుకోవాలి సైబీరియన్ పక్షుల ఉనికి కాపాడుకోవడం మనందరి బాధ్యత. జిల్లాను ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపుతెచ్చిన విదేశీ పక్షుల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. – కె.రామారావు, జీవ వైవిధ్య శాస్త్రవేత్త వైరస్ నివారణకు.. తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రానికి ఆనుకుని ఉన్న చెరువుల్లో చేపలకు సోకిన వైరస్‌ను నివారించేందుకు ఆయా శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుతం వేసవి కావడంతో చెరువుల్లో నీరు అడుగంటి పోయిన తర్వాత చర్యలు చేపట్టాలి. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా మత్స్య శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – పి.వి.శాస్త్రి, అటవీ శాఖ రేంజర్ -
అంతుచిక్కని వైరస్ పంజా.. ‘విదేశీ అతిథి’కి కష్టం
విడిదికి వచ్చిన విదేశీ అతిథికి కష్టమొచ్చింది. అంతుచిక్కని వైరస్ పంజా విసరడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైబడి పెలికాన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. డిసెంబర్లో మొదలైన మరణ మృదంగం నేటికీ ఆగడం లేదు. గడిచిన మూడు రోజుల్లో మరో ఆరు పక్షులు మృత్యువాతపడ్డాయి. వైరస్ ప్రభావం ఒక్కరకం పక్షుల మీద మాత్రమే ఉండడం ఆలోచించదగిన అంశం. కారణాలు అన్వేషించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నా పూర్తిస్థాయి ఫలితం కనిపించడం లేదు. పక్షుల మరణాలు ఆగకపోవడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. పశువులు, ఇతర మూగజీవాలపై ఈ వైరస్ ప్రభావం ఇప్పటి వరకూ కనబడకున్నా భవిష్యత్తులో ఏమైనా ఉంటుందా..? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చెరువుల నీటి వినియోగంపై ఆందోళన.. తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రానికి ఆనుకుని ఉన్న కర్రివానిచెరువు, కొత్తచెరువు, పాతచెరువు, మిడిబంద, అక్కులవానిచెరువు, దాలిచెరువు, ఊర చెరువుల్లో ఉండే చేపల్లో ఒక రకమైన వైరస్ వ్యాప్తి చెందడంతో వాటిని తిన్న పక్షులు మృత్యువాత పడుతున్నట్లు పశు సంవర్థక శాఖ వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఆయా చెరువుల్లో నీటిని తాగుతున్న మిగిలిన పశువులకు వైరస్ ఏమైనా వ్యాప్తిస్తుందా.. అందులో ఉండే చేపలు తినడం వల్ల ప్రమాదం ఏమైనా ఉంటుందా అన్న సందేహాల్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పరిశోధించాలని అధికారులను కోరుతున్నారు. నీటి వినియోగంపై కూడా ఆందోళన చెందుతున్నారు. అలాగే మృతి చెందిన పక్షుల కళేబరాలను విడిది కేంద్రం సమీపంలోని పంట పొలాల్లో పూడ్చిపెడుతుండడంతో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనని అటు ప్రజలు, ఇటు రైతులు భయాందోళన చెందుతున్నారు. డీ వార్మింగే పరిష్కారమా.. విదేశీ పక్షుల మృత్యువాతను ఏ విధంగా కట్టడి చెయ్యాలో తెలియక అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పశు సంవర్థక శాఖ వైద్యులు సూచన మేరకు పక్షులకు డీ వార్మింగ్ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ అత్యధిక ఖర్చుతో కూడుకోవడంతో ఏం చేయాలో తెలియక అటవీ శాఖాధికారులు సందిగ్ధంలో పడ్డారు. పక్షుల మృత్యువాతకు కారణమైన చేపలపై పరీక్షలు నిర్వహించాలని గత నెలలో జిల్లా స్థాయి మత్స్య శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు అటవీ శాఖాధికారి శాస్త్రి ‘సాక్షి’కి తెలిపారు. పక్షుల కేంద్రంలో పెయింటెడ్ స్టార్క్ పక్షులు పశువులకు ఎటువంటి భయం లేదు.. చేపల్లో బయటపడిన ఒక రకమైన వైరస్ వల్ల ఆయా చెరువుల నీటిని తాగుతున్న పశువులకు ఎటువంటి ప్రాణభయం లేదని టెక్కలి పశు సంవర్థక శాఖ ఏడీ జి.రఘునాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే తేలినీలాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి పక్షుల మృత్యువాత గూర్చి తెలుసుకున్నామని చెప్పారు. ప్రత్యేకతలివే.. పెలికాన్.. ఇది బాతు జాతి పక్షి 8 బరువు 8 కిలోలు ముక్కు పొడవు 14 సెంటీమీటర్లు రోజుకు 4 కిలోల చేపల్ని ఆహారంగా తీసుకుంటుంది ఒకేసారి 2 కిలోల చేపను సునాయాసంగా భుజించేస్తుంది దవడ భాగం సంచి ఆకారంలో ఉంటుంది ఇవి పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి ఆహార సేకరణకు రోజుకు నాలుగు సార్లు బయటకు వెళ్తాయి దవడలో సుమారు 2 కేజీల వరకు ఆహారాన్ని నిల్వ చేసుకునే సదుపాయం ఉంది నిల్వ చేసుకునే క్రమంలో ఏదైనా తేడా జరిగి ఆహారం విషతుల్యమై.. ప్రాణాలు పోతున్నాయా.. అన్న కోణంలో కూడా అధికారులు అన్వేషిస్తున్నారు వైరస్ ప్రభావంతో ఈ జాతి పక్షులు100కు పైగా మరణించాయి జీవిత కాలం 29 ఏళ్లు పెయింటెడ్ స్టార్క్ ఇది కొంగజాతి పక్షి బరువు 5 కేజీలు ముక్కు పొడవు 16 సెంటీమీటర్లు చిన్న చేపలు, పురుగులు, నత్తలు దీని ఆహారం 250 గ్రాముల వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి సేకరించిన ఆహారాన్ని గూళ్ల మీద వేస్తే వాటిని పిల్లలు తింటాయి ఆహార సేకరణకు రోజుకు రెండుసార్లు బయటకు వెళ్తాయి జీవిత కాలం 29 ఏళ్లు తేలినీలాపురంలో ఇప్పటి వరకు ఈ జాతి పక్షి ఒక్కటి కూడా మృత్యువాత పడలేదు అధికారులు వీటిని కూడా పరిశీలిస్తున్నారు విదేశీ పక్షుల మృత్యువాతకు కారణమైన చేపల్లో ఉన్న వైరస్ ఏలిక పాములను చూపుతున్న అటవీ సిబ్బంది స్పందించని మత్స్య శాఖ.. చేపల్లో వ్యాప్తి చెందిన వైరస్ వలన విదేశీ పక్షులు మృత్యువాత పడినట్లు పక్షుల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఈ రోజు వరకు మత్స్యశాఖ సిబ్బంది కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన చేయలేదు. స్థానికులు కొన్ని చెరువుల్లో చేపల్ని పెంచుతున్నారు. అయితే ఈ వైరస్ ప్రభావం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న కోణంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేయాల్సిన మత్స్యశాఖ విభాగం కనీసం దృష్టి సారించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై టెక్కలి ఎఫ్డీఓ ధర్మరాజు వద్ద ప్రస్తావించగా.. పక్షుల అకాల మరణాలకు కారణం తెలియాల్సి ఉందన్నారు. -
విదేశీ వలస విహంగాల విలాపం.. పదుల సంఖ్యలో మృతి
సాక్షి, సూళ్లూరుపేట: పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం పరిధిలోని పాములమిట్ట చెరువులో పదుల సంఖ్యలో విదేశీ వలస విహంగాలు ఆదివారం (పెలికాన్స్) మృతి చెందాయి. గత కొద్ది రోజులుగా విహంగాలు మృతి చెందుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువు నీటిలో వాటి కళేబరాలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఖండాంతరాలు దాటి సంతనోత్పత్తి కోసం వచ్చే పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50కు పైగా పెలికాన్స్ చనిపోయినట్లు సమాచారం. చదవండి: (పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..) చనిపోయిన పెలికాన్ పక్షుల రెక్కలను చూపిస్తున్న వైల్డ్ లైఫ్ సిబ్బంది చెరువులో ఇటీవల టన్నుల కొద్దీ చేపలు చనిపోగా, ఆహార వేటకు వచ్చిన పక్షులు వారం రోజులుగా చనిపోతున్నాయి. ఆదివారం సుమారు 38 పక్షులు చనిపోయిన విషయాన్ని రైతులు గుర్తించి సమాచారం అందించారు. వైల్డ్ లైఫ్ సిబ్బంది వెళ్లి చెరువులో చనిపోయిన సుమారు 29 పక్షులను గట్టుకు తీసుకొచ్చారు. చెరువులో చనిపోయిన పక్షుల కళేబరాలు చాలా ఉన్నాయని, వాటి వల్ల నీళ్లు దుర్గంధభరితంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని వన్యప్రాణి సంరక్షణా విభాగం కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత ఘోరం జరుగుతుంటే గుర్తించలేని పరిస్థితుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కో గార్డు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వాళ్లు ఉద్యోగాలు వదిలిపెట్టి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అతిథి పక్షి వచ్చేసింది..
కృష్ణాజిల్లా కైకలూరు మండలంలోని ఆటపాక పక్షుల విహార కేంద్రంలో అరుదైన తెల్ల పెలికాన్ పక్షి ఆదివారం సందడి చేసింది. ఏటా ఈ పక్షి యూరప్, ఆఫ్రికా దేశాల నుంచి ఆటపాక పక్షుల కేంద్రానికి వస్తూంటుంది. ఈ అతిథి పక్షిని రోజీ పెలికాన్, అమెరికా పెలికాన్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం పెలికానుస్ ఒనోక్రొటలూస్. ఇది 140 నుంచి 180 సెంటీ మీటర్ల వెడల్పు, 47 సెంటీ మీటర్ల ఎత్తు, 15 కిలోల బరువు ఉంటుంది. శీతాకాలంలో ఈ పక్షులు ఇండియా, చైనా, మయన్మార్‌కు వస్తూంటాయి. ఇటీవల గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కూడా తెల్ల పెలికాన్ సంచరిస్తున్నట్లు గుర్తించారు. –ఆటపాక (కైకలూరు) -
దారి తప్పి.. ఉచ్చులో చిక్కి!
వనపర్తి: రష్యాలోని సైబీరియాకు చెందిన అరుదైన పెలికాన్(నేల పట్టు) పక్షి పెద్దమందడి మండలం జంగమాయపల్లిలోని ఈర్లచెరువుకు వచ్చింది. దారితప్పి వచ్చిన ఈ పక్షి చెరువులోని చేపలను తినడాన్ని గ్రామస్తులు గమనించారు. ఏటా చలికాలంలో సైబీరియా నుంచి కొల్లేరు సరస్సుకు కొన్ని అరుదైన పక్షులు వస్తుంటాయి. అందులో భాగంగానే ఇది వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. వేటగాడు అమర్చిన ఉచ్చులో పడి విలవిల్లాడింది. మంగళవారం స్థానికులు శివరాజు, బుచ్చన్న, దాసు బయటికి తీసి వైద్యం చేయించారు. చివరికి ఫారెస్ట్ రేంజర్ అధికారి రవీందర్‌రెడ్డికి అప్పగించారు. -
విహంగమై వాలిపోదాం
పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా! నీలాల ఝరులు ముత్యాల దండలను అలంకరించుకున్నాయా..! అన్నంతగా ఈ సరస్సులు సంభ్రమాన్ని కలిగించే విహార క్షేత్రాలు. విదేశాల నుంచి అరుదెంచిన అరుదైన పక్షిజాతులకు ఆవాసాలు. ఇవన్నీ ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.వలస వచ్చేసిన ఈ పక్షులు ఐదారు నెలల పాటు ఇక్కడే ఉల్లాసంగా గడిపి, సంతానాన్ని పెంపొందించుకొని... మరో రెండు నెలల్లో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లబోతున్నాయి. ఆ లోపే వీటిని తిలకించడానికి పయనమవుదాం రండి. కొల్లేరు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు. విదేశీ విహంగాలకు విడిదిగా పేరొందిన ఈ కేంద్రం పెలికాన్ పక్షులకు ప్రఖ్యాతి గాంచినది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పెలికాన్ (గూడబాతు)తో పాటు దేశ, విదేశాల నుంచి ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, కంకణాల పిట్ట వంటి 189 కి పైగా రకాల పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. కేంద్రప్రభుత్వం అటవీశాఖకు 2007లో ఈ పక్షికేంద్ర బాధ్యతలను అప్పజెప్పడంతో మొదట్లో పదుల్లోనే వచ్చే పెలికాన్ల సంఖ్య ఇప్పుడు మూడు వేలకు పైగా పెరిగింది. ఈ వందల జాతుల పక్షులను వీక్షించడానికి మార్చి వరకు అనువైన సమయం. పక్షులను దగ్గరగా వీక్షించడానికి కొల్లేరు సరస్సులో బోటు సదుపాయం కూడా ఉంది. ఈ పక్షి కేంద్రానికి దగ్గరలోనే పిల్లల కోసం ప్రత్యేకమైన పార్క్‌ను ఏర్పాటు చేశారు. పెలికాన్ కాకుండా 189 రకాల పక్షులను, ఇవి కాకుండా 41 రకాల వలస పక్షులను ఇక్కడ గుర్తించారు అధికారులు. పక్షి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత పక్షుల వివరాలు తెలిపే ఎలక్ట్రానిక్ బర్డ్స్ మ్యూజియం, అక్కడి పిల్లల పార్క్, కొల్లేటి కోటలో పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయం, వెస్ట్ గోదావరిలో త్వరలో ప్రారంభం కానున్న రిసార్ట్లు, ఆటపాక పర్యావరణ అభ్యాస కేంద్రం సందర్శించవచ్చు. ఆటపాకలో బోటు, లాంచి షికారు ఉంటుంది. కొల్లేరు పక్షి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు ఏలూరు నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న ద్వారకా తిరుమలకు చేరుకోవచ్చు. పులికాట్ ప్రకృతి సౌందర్యంలో పక్షుల సోయగాలను చూడటానికి అనువైన సమయం ఉదయం - సాయంత్రాలు. ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న, దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్! 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 17.5 కిలోమీటర్ల వెడల్పున ఉంటుంది ఈ సరస్సు. అటవీ ప్రాంతం కూడా ఉండటంతో పర్యాటకులు అటు నీటి ఝరులను, ఇటు పచ్చని వృక్ష సిరులను తిలకిస్తూ ప్రకృతి ఒడిలో మైమరచిపోవచ్చు. ప్రకృతి సహజసిద్ధ సుందర దృశ్యాలకు నెలవైన ఈ సరస్సు వలస విహంగాలకు సరిపడినంత స్థలాన్ని, అనువైన వాతావరణాన్ని కలిగి ఉండటంతో సమూహాలుగా ఇక్కడికి వలస పక్షులు వస్తుంటాయి. వీటిలో ఫ్లెమింగోలు ప్రధానమైనవి. అయితే ఇక్కడి నీటి కాలుష్యం కారణంగా పక్షులు ఇక్కడ నుంచి నేలపట్టుకు, సౌత్ చెన్నై వైపుకు తరలి వెళుతున్నాయి. వేసవిలో ఎండిన చేపల కోసం కాళ్ల కొంగలు విరివిగా ఇక్కడకు చేరుకుంటాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి నుంచి 27 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ సరస్సును చేరుకోవచ్చు. నేలపట్టు నేలపట్టు నెల్లూరు జిల్లాలోని చిన్న గ్రామం. సూళ్లూరు పేట నుంచి 10 కి.మీ, ఉత్తర పులికాట్ నుంచి 20 కి.మీ దూరంలో ఉంటుంది నేలపట్టు. దీనిని దొరవారి సత్రం అని కూడా అంటారు. శీతాకాలంలో ఇక్కడకు ఆఫ్రికా, అమెరికా, చైనా దేశాల నుంచి వలస పక్షులు అధికంగా వస్తుంటాయి. వాటిలో ప్రధానంగా గూడబాతులు (స్పాట్ బిల్డ్ పెలికాన్), తెడ్డు ముక్కు కొంగలు, (స్పూన్ బిల్), వైట్ ఇబిస్ (తెల్ల కొంగలు) నైట్ హారన్(శబరి కొంగ)లకు ఈ పక్షి కేంద్రం పేరుగాంచింది. అక్టోబర్‌లో వచ్చిన ఈ వలస పక్షులు నాలుగైదు నెలల పాటు సంతానోత్పత్తి గావించి, వేసవి మొదట్లో తిరిగి వచ్చిన చోటుకే వెళ్లిపోతాయి. ఇవే గాకుండా నారాయణ పక్షులు, నీటి కాకి, సముద్రపు కొంగ, గుళ్ల కొంగ, నల్లకంకణాలు, పరజ, నీలిరెక్కల పరజ, సూది తోక బాతు, ఎర్రతల బాతు, చుక్కకోడి, చుక్కమూతి బాతు... మరో 21 రకాల పక్షులు, ఇక్కడే ఉన్న ఇంకో 50 రకాల పక్షులు సందడితో నేలపట్టు ప్రతి ఉదయం మేలుకొంటుంది. సందర్శన సమయం: అక్టోబర్ నుంచి మార్చి వరకు విరివిగా ఉండే ఈ పక్షుల సోయగాలను తిలకించడానికి అనువైన సమయం. ఉప్పలపాడు రాష్ట్రంలో మరో పేరెన్నికగన్న పక్షి స్థావరం ఉప్పలపాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఉంది ఈ గ్రామం. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో సైబీరియా, ఆస్ట్రేలియాల నుంచి గూడబాతుల గుంపులు, ఎర్రకాళ్ల కొంగల వరసలు, నత్తకొట్టు కొంగలు సమూహాలు.. వీటితో పాటు మరో 70 రకాల జాతి పక్షులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోయి ఉంటుంది. పక్షిస్థావరానికి వెళ్లే దారికిరువైపులా పచ్చని చేలు, ఆ చేలపై ఎగురుతున్న మైనగోరలు, కత్తిరిపిట్టలు, అక్కడక్కడ పాలపిట్టలు, కొంగలు... పొలాలను ఆశిస్తున్న మిడతలను, పురుగులను లాఘవంగా వేటాడుతూ కనువిందు చేస్తాయి. గాలిలో ఎగురుతున్న పురుగులను నేర్పరులైన నల్లంచులు వేటాడటం చూడవలసిందే! దారిలో సందడిగా ఉన్న ఊళ్ల గుండా ప్రయాణిస్తూ ఈ గ్రామాన్ని చేరుకుంటాం. గ్రామాన్ని చేరుకొని పక్షల స్థావరాన్ని చేరుకోగానే కలిగే అనుభూతి చెప్పనలవి కాదు. అది ఒక అందమైన దృశ్యకావ్యం. కాలాలననుసరించి వివిధ రకాల పక్షులరాక ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. పక్షులు వాటి గూళ్లలో పిల్లలకు ఆహారాన్ని అందిస్తుంటే చూడడం ఒక ఆనందానుభూతి. పక్షి ప్రేమికులకయితే చెప్పనవసరం లేదు. గంటలతరబడి చూస్తూ అనేకమార్లు వచ్చి వాటి అలవాట్లు గమనిస్తూ నోట్సులు తయారుచేసుకుంటారు. పక్షి శాస్త్రజ్ఞులు ఇక్కడ తమ పరిశోధనలు జరిపి పరిశోధనా పత్రాలు, గ్రంథాలు తయారుచేస్తారు. ఈ పక్షి కేంద్రానికి నత్తకొట్టుకొంగలు, తెల్ల కంకణాలు, ఎర్రకాళ్ల కొంగలు, చుక్కల ముక్కు గూడ బాతులు, చిత్త ఒక్కలు, చుక్కమూతి బాతులు, నల్ల బోలి కోడి, కలికి పక్షులు, జకానాలూ... మొదలైన 70 జాతులకు పైగా పక్షులు వస్తుంటాయి. గుంటూరు నుండి నందివెలుగు మీదుగా తెనాలికి వెళ్లే మార్గంలో 7 కి.మీ దూరంలో ఉంది ఈ పక్షి కేంద్రం. గుంటూరు నుండి ఆర్.టి.సి బస్సులు, ఆటోల ద్వారా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. చెన్నై-హోరా రైలు మార్గాన ప్రయాణించేవారు తెనాలిలో దిగి నందివెలుగు మీదుగా 18 కి.మీ దూరంలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు. సందర్శన సమయం: కిక్కిరిసిన ఈ పక్షులను, వాటి సోయగాలను చూడడానికి ఫిబ్రవరి చివరి వారం మార్చి మొదటి వారం వరకు అనువైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన పక్షి కేంద్రాలను సందర్శించా లనుకునేవారు... ఏలూరు నుంచి కొల్లేరు - గుంటూరులోని ఉప్పలపాడు - నెల్లూరులోని నేలపట్టు - పులికాట్ లను సందర్శించవచ్చు. కొల్లేరు సరస్సు చేరడానికి... గుడివాడ - కైకలూరు, ఏలూరు మీదుగా కొల్లేరుకు చేరుకోవచ్చు. కొల్లేరు టౌన్‌కు నాలుగు వైపులా ఆటపాక 2.5 కి.మీ, భుజబలపట్నం 6 కి.మీ, కొవ్వాడ లంక7 కి.మీ దూరంలో ఉన్నాయి. రోడ్డు మార్గాన ... విజయవాడ నుంచి 60 కి.మీ, ఏలూరు నుంచి 15 కి.మీ, కైకలూరు నుంచి 1.5 కి.మీ, నిడమనూరు నుంచి 8 కి.మీ, గుడివాడకలంక నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న కొల్లేరుకు చేరుకోవచ్చు. రైలు మార్గాన వెళ్లాలనుకుంటే విజయవాడ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది కొల్లేరు. ఉప్పలపాడు పక్షి కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలనుకునేవారు.. గుంటూరు టౌన్ నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న అమరావతికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. బస్‌స్టేషన్ ఎదురుగా అమరావతి మ్యూజియం ఉంటుంది. శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఈ మ్యూజియాన్ని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. నేలపట్టు అందాలను ఒడిసిపట్టుకోవాలంటే... ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో నేలపట్టు పక్షి కేంద్రం కొలువుదీరింది. సైబీరియన్ కొంగల జాతులు 160 ఉన్నట్టు గర్వంగా చెప్పుకుంటుంది నేలపట్టు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ నేలపట్టుకు అక్టోబర్‌లో పెలికాన్ పక్షులు ఎక్కువగా వస్తుంటాయి. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ నుంచి 23కి.మీ. నేలపట్టు ఫ్లెమింగోలకు, పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతిపెద్ద ఆవాసంగా చెబుతారు. పులికాట్ సరస్సులో... మంచినీరు, సముద్రపునీరు కలిసిన సరస్సు ఇది. 60 కిలోమీటర్ల పొడవు పదిహేడున్నర కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఈ సరస్సు ఉంది. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ నుంచి పులికాట్‌కు 10 కి.మీ దూరం. పర్యాటకులు చేయకూడనివి వలస పక్షులు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి. ఏ మాత్రం అనుకూలంగా లేనట్టు అవి పసిగట్టినా అవి ఎప్పటికీ ఆ ప్రాంతాలకు రావు. పక్షులు ఉన్న చోటుకు ఇష్టం వచ్చినట్టుగా వెళ్లకూడదు. సరదా కోసం రాళ్లను విసరకూడదు. అగ్నిప్రమాదాలకు కారణమయ్యే చుట్ట, బీడి, సిగరెట్ పీకలను ఆ ప్రాంతాలలో వదిలేయకూడదు. నీటి కాలుష్యానికి కారకమయ్యే ఆహారపదార్థాలు, ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్స్.. వంటివి చెరువులు, సరస్సులలో వేయకూడదు. వలసపక్షులున్న చెరువులు, సరస్సులలో ఈతకు వెళ్లరాదు. శబ్దాలు చేయకూడదు. ఇన్పుట్స్ - గ్రేసెస్,అటవీశాఖాధికారి, కొల్లేరు - కోకా మృత్యుంజయ రావు, ఉప్పలపాడు - శ్రీనివాస్, నెల్లూరు, సాక్షి ఫొటోలు: ఆకుల శ్రీనివాస్, ఏలూరు