చంద్రబాబు ప్రభుత్వంలో కొల్లేరు పర్యాటకానికి తూట్లు
రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి కేంద్రం రూ.400 కోట్లు
ఇందులో చోటు దక్కని కొల్లేరు టూరిజం
కొల్లేరును అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల వేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.187 కోట్లతో డీపీఆర్
టెంపుల్, ఎకో టూరిజంపై కేంద్రానికి నివేదిక
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల కేరింతలకు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచిన కొల్లేరు టూరిజంపై కొత్త ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా కొల్లేరు టెంపుల్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ తూర్పు గోదావరికి తరలిపోనుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొల్లేరు పర్యాటకాభివృద్ధికి రూ.187 కోట్లతో డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కొద్ది రోజుల క్రితం కొత్త రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం, సూర్యలంక, రాజమహేంద్రవరం–అఖండ గోదావరి, సంగమేశ్వరం వంటి నాలుగు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి ప్రాంతమైన కొల్లేరు టూరిజానికి ఇందులో చోటు దక్కకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 నియోజకవర్గాల పరిధిలో కొల్లేరు సరస్సు వ్యాపించి ఉంది. దక్షిణ కశ్మీరంగా దీనికి పేరు. జీవో నంబరు 120 ప్రకారం కొల్లేరు కాంటూరు–5 వరకు 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది.
మొత్తం 9 మండలాల్లో కొల్లేరు పరీవాహక గ్రామాలుగా 122 ఉన్నాయి. మొత్తం జనాభా 3.2 లక్షల మంది ఉండగా, 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన వృత్తి చేపల సాగు. కొల్లేరు కాంటూరును 5 నుంచి 3కు కుదిస్తామని ప్రతి ఎన్నికల్లో టీడీపీ నాయకులు చెబుతున్నా అమలు కావడం లేదు.
అటకెక్కిన టెంపుల్ టూరిజం ప్రతిపాదనలు
కొల్లేరు విస్తరించిన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికం భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమామహేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వస్వామి ఆలయాలు, భీమవరం మావుళ్లమ్మ దేవస్థానాలు ఉన్నాయి. కొల్లేరు ప్రాంతమైన కైకలూరులో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొల్లేరు టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
వైఎస్ జగన్ పాలనలో రూ.187 కోట్ల ప్రణాళిక
జిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజానికి రూ.187 కోట్ల ప్రణాళికతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయాలని భావించారు. పర్యాటక శాఖ అధికారులు కొల్లేరులో 10 ప్రాంతాలను టూరిజానికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద డీపీఆర్‌లు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
పక్షులపై కానరాని ప్రేమ
కొల్లేరు సరస్సుపై ఇటీవల జరిగిన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్‌లో మొత్తం 105 రకాల పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులను గుర్తించారు. ప్రధానంగా రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల కేంద్రం వాసికెక్కింది. ఇక్కడ అరుదైన పెలికాన్ పక్షులు రావడంతో పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు.
అటవీ శాఖ 283 ఎకరాల్లో పక్షుల విహారానికి చెరువును ఏర్పాటు చేసింది. పక్షి నమూనా మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రానికి నిధుల కొరత వేధిస్తోంది. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.
వలస పక్షుల సందడి షురూ
కొల్లేరు ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల అందాలను తిలకించడానికి ప్రతి ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైన కాలం. కొల్లేరు అభయారణ్యంలో 190 రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సంచరిస్తుంటాయి.
ప్రధానంగా కొల్లేరులో పెలికాన్ పక్షి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. కొల్లేరు ఇటీవల వరదలు, వర్షాలకు నిండుకుండలా మారింది. ప్రతి ఏటా విదేశీ పక్షులు వలస వచ్చి సంతానోత్పత్తితో తిరిగి స్వస్థలాలకు వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment