పాములమిట్ట చెరువులో చనిపోయిన విదేశీ వలస విహంగాలు (పెలికాన్స్)
సాక్షి, సూళ్లూరుపేట: పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం పరిధిలోని పాములమిట్ట చెరువులో పదుల సంఖ్యలో విదేశీ వలస విహంగాలు ఆదివారం (పెలికాన్స్) మృతి చెందాయి. గత కొద్ది రోజులుగా విహంగాలు మృతి చెందుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువు నీటిలో వాటి కళేబరాలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఖండాంతరాలు దాటి సంతనోత్పత్తి కోసం వచ్చే పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50కు పైగా పెలికాన్స్ చనిపోయినట్లు సమాచారం. చదవండి: (పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..)
చనిపోయిన పెలికాన్ పక్షుల రెక్కలను చూపిస్తున్న వైల్డ్ లైఫ్ సిబ్బంది
చెరువులో ఇటీవల టన్నుల కొద్దీ చేపలు చనిపోగా, ఆహార వేటకు వచ్చిన పక్షులు వారం రోజులుగా చనిపోతున్నాయి. ఆదివారం సుమారు 38 పక్షులు చనిపోయిన విషయాన్ని రైతులు గుర్తించి సమాచారం అందించారు. వైల్డ్ లైఫ్ సిబ్బంది వెళ్లి చెరువులో చనిపోయిన సుమారు 29 పక్షులను గట్టుకు తీసుకొచ్చారు. చెరువులో చనిపోయిన పక్షుల కళేబరాలు చాలా ఉన్నాయని, వాటి వల్ల నీళ్లు దుర్గంధభరితంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
సూళ్లూరుపేట పట్టణంలోని వన్యప్రాణి సంరక్షణా విభాగం కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత ఘోరం జరుగుతుంటే గుర్తించలేని పరిస్థితుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కో గార్డు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వాళ్లు ఉద్యోగాలు వదిలిపెట్టి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment