Pelicans
-
విదేశీ వలస విహంగాల విలాపం.. పదుల సంఖ్యలో మృతి
సాక్షి, సూళ్లూరుపేట: పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం పరిధిలోని పాములమిట్ట చెరువులో పదుల సంఖ్యలో విదేశీ వలస విహంగాలు ఆదివారం (పెలికాన్స్) మృతి చెందాయి. గత కొద్ది రోజులుగా విహంగాలు మృతి చెందుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువు నీటిలో వాటి కళేబరాలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఖండాంతరాలు దాటి సంతనోత్పత్తి కోసం వచ్చే పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50కు పైగా పెలికాన్స్ చనిపోయినట్లు సమాచారం. చదవండి: (పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..) చనిపోయిన పెలికాన్ పక్షుల రెక్కలను చూపిస్తున్న వైల్డ్ లైఫ్ సిబ్బంది చెరువులో ఇటీవల టన్నుల కొద్దీ చేపలు చనిపోగా, ఆహార వేటకు వచ్చిన పక్షులు వారం రోజులుగా చనిపోతున్నాయి. ఆదివారం సుమారు 38 పక్షులు చనిపోయిన విషయాన్ని రైతులు గుర్తించి సమాచారం అందించారు. వైల్డ్ లైఫ్ సిబ్బంది వెళ్లి చెరువులో చనిపోయిన సుమారు 29 పక్షులను గట్టుకు తీసుకొచ్చారు. చెరువులో చనిపోయిన పక్షుల కళేబరాలు చాలా ఉన్నాయని, వాటి వల్ల నీళ్లు దుర్గంధభరితంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని వన్యప్రాణి సంరక్షణా విభాగం కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత ఘోరం జరుగుతుంటే గుర్తించలేని పరిస్థితుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కో గార్డు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వాళ్లు ఉద్యోగాలు వదిలిపెట్టి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పాదచారి భద్రత కోసం!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పాదచారుల భద్రతకు పెద్దపీట వేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు పై దృష్టి సారించారు. ఇప్పటికే ఠాణాల వారీగా అధ్యయనం పూర్తి చేసి ఎనిమిది ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలోని తొమ్మిది చోట్ల ఇవి అవసరమని తేల్చారు. ఈ మేరకు రూపొందించిన నివేదికలను జీహెచ్ఎంసీకి పంపారు. సిటీలో నిత్యం పాదచారుల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పెడస్ట్రియన్స్ 36 శాతానికి పైగా ఉన్నారు. నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారిపై గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2018కి సంబంధించి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాతపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో గత ఏడాది మొత్తం 2540 ప్రమాదాలు చోటు చేసుకోగా... 2550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాలబారిన పడిన పాదచారుల సంఖ్య 924. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెహదీపట్నం రైతు బజార్ వద్ద ఓ పెలికాన్ సిగ్నల్ అందుబాటులో ఉంది. దీనికి తోడు మరిన్ని ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఠాణాల వారీగా అధ్యయనం చేసిన అధికారులు మరో తొమ్మిది చోట్ల ఇవి అవసరమని తేల్చారు. ఆయా రహదారులపై ఉండే రద్దీతో పాటు రోడ్డు వెడల్పును పరిగణలోకి తీసుకుని ఈ పాయింట్స్ నిర్ధారించారు. గతంలో అక్కడ చోటు చేసుకున్న పాదచారుల ప్రమాదాలను లెక్కించారు. ఇప్పటికే దాదాపు ప్రతి కీలక జంక్షన్‌లోనూ పెడస్ట్రియన్ టైమ్‌తో సిగ్నల్స్ పని చేస్తున్నాయి. దీని ప్రకారం నిర్ణీత సమయానికి ఒకసారి జంక్షన్లో ఉండే అన్ని సిగ్నల్స్లోనూ రెడ్‌లైట్ వెలిగి వాహనాలు ఆగిపోతాయి. ఆ సమయంలో ప్రత్యేక శబ్ధంతో పెలికాన్ సిగ్నల్ వెలుగుతూ పాదచారులు రోడ్డు దాటేందుకు సహకరిస్తుంది. ఇవి దాదాపు అన్ని జంక్షన్స్‌లోనూ అందుబాటులో ఉండటంతో తాజా అధ్యయనాన్ని జంక్షన్లు కాని ప్రాంతాల్లో నిర్వహించారు. అయితే వీటిలో ఏ తరహాకు చెందిన పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు. పాదచారులు రోడ్డు దాటడానికి ఉపకరించే పెలికాన్ సిగ్నల్స్ సాధారణంగా రెండు రకాలైనవి ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటాలని భావించినప్పుడు వారే రెడ్ లైట్ వచ్చేలా సిగ్నల్‌లోని బటన్స్ నొక్కే ఆస్కారం ఉన్నవి మాన్యువల్‌గా పని చేస్తుంటాయి. మరోపక్క నిర్ణీత సమయం తర్వాత కొన్ని సెకన్ల పాటు అన్ని రెడ్‌లైట్ వచ్చి పాదచారులు రోడ్డు దాటడానికి ఉపకరిస్తుంటుంది. ఈ రెండు విధాలైన సిగ్నల్స్‌లో ఉన్న మంచి చెడులతో పాటు వాటిని ఏర్పాటు చేసే ప్రాంతాల పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏ తరహాకు చెందినవి ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయనున్నారు. ప్రతిపాదిత ప్రాంతాలు ♦ బేగంపేట ట్రాఫిక్ ఠాణా పరిధిలోని మినిస్టర్స్ రోడ్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ♦ సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలోని మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ ఇన్‌గేట్ ఎదురుగా ♦ మలక్‌పేట పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న చర్మాస్ షోరూమ్ వద్ద ♦ నల్లకుంటలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని వచ్చే తార్నాకలోని రైల్వే డిగ్రీకాలేజ్ సమీపంలో ♦ బహదూర్‌పుర పరిధిలోని తాడ్‌బండ్ వద్ద ఉన్న జూపార్క్ ప్రధాన ద్వారానికి అటు ఇటుగా ♦ తిరుమలగిరిలోని బోయిన్పల్లి మార్కెట్ ప్రాంతంలో ♦ ఫలక్‌నుమ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని పిసల్‌బండ వద్ద ఉన్న డీఆర్డీఓ చౌరస్తా, బండ్లగూడ సమీపంలో ♦ మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న మాదన్నపేట మండి వద్ద -
చిక్కిందా.. లక్కుందా..
నాది.. నాది.. కాదు నాది అంటూ పోటీపడుతున్న పెలికాన్స్ను చూశారుగా.. ఉన్నదేమో ఒకటే చేప.. పెలికాన్స్ ఏమో మూడు.. దాన్ని అమాంతం మింగేయడానికి నోరు తెరిచి మరీ అక్కడవి వెయిటింగ్.. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? ఈ మూడింటిలో ఏది లక్కీ.. ఏదిఅన్లక్కీ.. ఇంతకీ చేప వాటికి చిక్కిందా.. లేదా చేపకే లక్కుండి.. క్షేమంగా తప్పించుకుందా? ఈ చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ పెడ్రోజార్క్(పెరూ)నే అడుగుదామంటే.. ఆయన తెగ బిజీగా ఉన్నారు. ఎందుకంటే.. పెడ్రో తీసిన ఈ చిత్రం 2019 బర్డ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ తుదిజాబితాకు ఎంపికైంది. ఆయన కూడా అవార్డు వస్తుందా రాదా అన్న టెన్షన్లో ఉన్నారు. ఈపోటీకి 63 దేశాల నుంచి వేలాది ఎంట్రీలు రాగా.. తుది జాబితాకు ఎంపికైన వాటిలో ఈ ఫొటో కూడా ఉంది. ఈ అవార్డును ఏటా బ్రిటన్‌కు చెందిన నేచర్స్ ఫోటోగ్రాఫర్స్ లిమిటెడ్ ప్రదానం చేస్తోంది. -
కొల్లేరులో పెలికాన్ల సందడి!
పెలికాన్ల సందడితో ఆటపాక పక్షుల విడిది కేంద్రం కొల్లేరు గత వైభవాన్ని గుర్తుచేస్తోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు మంచినీటి సరస్సు ఒకప్పుడు విదేశీ విహంగాలకు విడిది కేంద్రంగా ఉండేది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పెలికాన్ (గూడబాతు), ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, కంకణాల పిట్ట వంటి 180 కిపైగా రకాల పక్షులు ఇక్కడకు వలస వచ్చేవి. అయితే రానురాను కొల్లేరులో కాలుష్యం పెరిగిపోవడంతో వాటి రాక అంతకంతకూ తగ్గిపోయింది. అయితే 2007 తర్వాత అటవీశాఖ ఈ పక్షుల కోసం కృష్ణా జిల్లా ఆటపాకలో విడిది కేంద్రాన్ని నెలకొల్పింది. కొల్లేరుకు ఆనుకుని 300 ఎకరాల్లోని చెరువులో సహజ సిద్ధమైన కొల్లేటి వాతావరణాన్ని తలపించే రీతిలో ఏర్పాట్లు చేసి అక్కడికి పెలికాన్లు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పింది. ఐదేళ్లక్రితం పదుల సంఖ్యలో రావడం మొదలుపెట్టిన పెలికాన్ పక్షుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. అక్టోబర్‌లో పెలికాన్లు రావడం మొదలుపెడతాయి. ఇక్కడకు వచ్చిన తర్వాత గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. వాటికి 3 నెలల వయసు వచ్చే వరకూ ఐరన్ స్టాండ్లపైనే గూళ్లు కట్టి ఉంచుతాయి. ఈ పక్షులను వీక్షించడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకూ సమయమని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. - ఏలూరు, సాక్షి ప్రతినిధి