పెలికాన్ల సందడితో ఆటపాక పక్షుల విడిది కేంద్రం కొల్లేరు గత వైభవాన్ని గుర్తుచేస్తోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు మంచినీటి సరస్సు ఒకప్పుడు విదేశీ విహంగాలకు విడిది కేంద్రంగా ఉండేది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పెలికాన్ (గూడబాతు), ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, కంకణాల పిట్ట వంటి 180 కిపైగా రకాల పక్షులు ఇక్కడకు వలస వచ్చేవి. అయితే రానురాను కొల్లేరులో కాలుష్యం పెరిగిపోవడంతో వాటి రాక అంతకంతకూ తగ్గిపోయింది. అయితే 2007 తర్వాత అటవీశాఖ ఈ పక్షుల కోసం కృష్ణా జిల్లా ఆటపాకలో విడిది కేంద్రాన్ని నెలకొల్పింది.
కొల్లేరుకు ఆనుకుని 300 ఎకరాల్లోని చెరువులో సహజ సిద్ధమైన కొల్లేటి వాతావరణాన్ని తలపించే రీతిలో ఏర్పాట్లు చేసి అక్కడికి పెలికాన్‌లు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పింది. ఐదేళ్లక్రితం పదుల సంఖ్యలో రావడం మొదలుపెట్టిన పెలికాన్ పక్షుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. అక్టోబర్‌లో పెలికాన్‌లు రావడం మొదలుపెడతాయి. ఇక్కడకు వచ్చిన తర్వాత గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. వాటికి 3 నెలల వయసు వచ్చే వరకూ ఐరన్ స్టాండ్లపైనే గూళ్లు కట్టి ఉంచుతాయి. ఈ పక్షులను వీక్షించడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకూ సమయమని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
- ఏలూరు, సాక్షి ప్రతినిధి