Kolleru lake
-
సుందర కొల్లేరు.. ఉప్పొంగితే ‘ముప్పు’టేరు
‘‘విశాలమైన సరస్సులో ఈదులాడే చేపలు.. విదేశాల నుంచి విడిదికి వచ్చి విహరించే పక్షి సమూహాలు.. నీటి మధ్య వెలసిన ఊర్లలో రెక్కల కష్టంతో బతికే మనసులు’’.. ఇది సహజ సిద్ధమైన కొల్లేరులో మామూలు రోజుల్లో కన్పించే సుందర దృశ్యం..‘‘ఎటు చూసినా సముద్రంలా ఉప్పొంగిన నీరు.. వరద నీటిలో మునిగిన గ్రామాలు.. రెక్కల కష్టం మొత్తం నీటిపాలై బతుకు జీవుడా అనుకుని భోరున విలపించే ప్రజలు.. నిలువ నీడలేక విలవిల్లాడే పక్షులు.. వరద పోటుకు గల్లంతయ్యే చేపలు’’.. ఇదీ ఏటా వరద ధాటికి కొల్లేరు ఉగ్రరూపం.కొల్లేరుకు మళ్లీ వరద పోటెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే కొల్లేరు చిగురుటాకుల్లా వణికిపోతోంది. కృష్ణా–గోదావరి నదుల మధ్య డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతంలో విస్తరించిన ఈ సరస్సుకు ఏటా భారీగా వరదనీరు పోటెత్తడంతో అతలాకుతలమవుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు భారీ డ్రెయిన్లతో పాటు మరో 31 మీడియం, మైనర్ డ్రెయిన్లు, కాలువలు, ఛానల్స్ ద్వారా వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కొల్లేరుకు చేరుతుంది. ప్రస్తుతం వరద పోటు పెరగడంతో 1,10,920 క్యూసెక్కుల నీరు కొల్లేరుకు వస్తోందని అంచనా. కొల్లేరు నుంచి కేవలం 12 వేల క్యూసెక్కులు మాత్రమే ఉప్పుటేరు డ్రెయిన్ ద్వారా 62 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలోకి చేరుతుంది. దీంతో కొల్లేరులోని గ్రామాలు, లంకలతోపాటు దానికి ఆనుకుని ఉన్న గ్రామాలు సైతం ముంపు ముప్పుతో సతమతమవుతున్నాయి. – సాక్షి, అమరావతి దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు.. ఏలూరు–పశి్చమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ చిత్తడి నేలల జాబితాలో దీన్ని గుర్తిస్తూ 1971లో ఇరాన్ సదస్సు తీర్మానించింది. కొల్లేరు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు, ఉద్యమకారులు గళమెత్తారు. కొల్లేరులో చేపల చెరువుల సాగుతోపాటు గ్రామాలు కూడా పెద్దఎత్తున వెలిశాయి. ఏలూరు జిల్లాలోని కైకలూరు, మండవల్లి, పెదపాడు, ఏలూరు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాలతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో విస్తరించిన కొల్లేరులో 71 గ్రామాలు, కొల్లేరుకు ఆనుకుని 150 గ్రామాలు కలిపి మొత్తం 221 గ్రామాలున్నాయి. కొల్లేరు రక్షణకు అధ్యయనాలెన్నో.. కొల్లేరు సరస్సు గొప్ప జీవవైవిధ్యం కలిగి ఉంది. వలస పక్షులు, అరుదైన చేప జాతులతోపాటు ప్రజలకు జీవనాధారంగా మారింది. కానీ, చేపల చెరువుల సాగు, ఆక్రమణలతో సహజత్వాన్ని కోల్పోయింది. దీనికితోడు.. వస్తే వరదలు ముంచెత్తడం.. లేదంటే ఉప్పుటేరు ముఖద్వారం ద్వారా సముద్రపు నీరు చొచ్చుకురావడంతో కొల్లేరు దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు ఇబ్బందిలేకుండా కొల్లేరు సహజత్వాన్ని కాపాడి పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పర్యాటక రంగాన్ని కూడా పెంపొందిస్తే మేలని పలు సంస్థలు, పర్యావరణవేత్తలు అధ్యయనం చేసి పలు సిఫార్సులు చేశారు. 1964లో మిత్ర కమిటీ నివేదిక తర్వాత అనేక కమిటీలు అధ్యయనం చేశాయి. తాజాగా.. న్యూఢిల్లీలోని ఎర్త్ సిస్టమ్ సైన్స్ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీకృత అధ్యయనం నిర్వహించింది. కొల్లేరును కాపాడుకునేలా సిఫార్సులు.. రెగ్యులేటర్ల నిర్మాణంతోపాటు కొల్లేరుకు సమాంతరంగా ప్రత్యామ్నాయ ఛానల్స్ ఏర్పాటుచేసి వరద నీటిని సముద్రానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరును కనీసం మూడో కాంటూర్గా నిర్ణయించి ఆ పరిధిలో ఆక్వా సాగును అనుమతించకూడదు. వీటితోపాటు..» సరస్సులోను, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోను పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. » కొల్లేరు నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా సముద్రానికి వెళ్లేలా ఉప్పుటేరును పూర్తిగా తవి్వన తర్వాతే ప్రత్యామ్నాయ ఛానలైజేషన్ పథకాన్ని పునఃప్రారంభించాలి. » సరస్సు లోపల నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకునే నిర్మాణాలు, చెరువులను, రోడ్లను తొలగించాలి.కొల్లేరు పూడిపోకుండా ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ కార్యకలాపాలు తప్పనిసరిగా నిర్వహించాలి.» కాలువలకు అడ్డంగా ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను ఏర్పాటుచేయాలి. » కొల్లేరుకు ఉప్పునీటి చొరబాటును నియంత్రించేలా ఉప్పుటేరుపై పడతడిక, మొల్లపర్రు ఓల్డ్ కోర్సు, ఆకివీడు సమీపంలోని పేరంటాల కనుమ వద్ద మూడు రెగ్యులేటర్లను నిరి్మంచాలి.» ఆలపాడు నుండి గుండుగొలను రహదారికి తూర్పున ఉన్న ఈ అలైన్‌మెంట్‌ను ఒక భాగం.. కైకలూరు–ఏలూరు రహదారితోపాటు ఆళ్లపాడు–ప్రత్తికోళ్లలంక–గుడివాకలంక–ఏలూరు మధ్య రెండో భాగం.. కైకలూరు–ఏలూరు రహదారికి పశి్చమం వైపు 3వ భాగం.. ఏలూరు–గుడివాకలంక–కొక్కిరాయిలంక–చెట్టున్నపాడు–కమ్మగుండపాడు–ఆగడాలలంక–గుండుగొలను రోడ్డు (’యు’ ఆకారంలో రహదారి) అలైన్‌మెంట్‌ను 4వ భాగంగా అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. » సరస్సు నీటిమట్టం తగినంతే ఉండేలా బుడమేరు, తమ్మిలేరు వంటి ప్రధానమైన వాటి నీటి ప్రవాహాలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలి. » రోడ్డు నిర్మాణాల కారణంగా ఛిన్నాభిన్నమైన కొల్లేరు సరస్సును రహదారి అమరికల ఆధారంగా నాలుగు భాగాలుగా (10,000 నుండి 12,000 ఎకరాల వరకు) విభజించి అభివృద్ధి చెయ్యొచ్చు. » కొల్లేరుకు తూర్పున పందికోడు, తోకలపల్లి, కాపవరం కాలువలను ఉప్పుటేరులో ఒకటి,పశి్చమ వైపున బుడమేరు, రామిలేరు, పోల్రాజు, చంద్రయ్య, పెద కొమ్మిలేరు, చైనా కొమ్మిలేరు కాలువలను ఉప్పుటేరులో కలుపుతూ మరొకటి.. వరదను నివారించేలా ఇరువైపులా డ్రెయిన్లు నిరి్మంచాలి.» సరస్సు చుట్టూ ఉన్న పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుండి వ్యర్థ జలాలను నివారించడంతోపాటు వాటి నుంచి వచ్చే నీటి నాణ్యతను, సరస్సు జలాల నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మానిటరింగ్ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలి. » సరస్సు నీటి పర్యావరణ నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రయోగశాల సౌకర్యాలతో కూడిన హైడ్రో బయోలాజికల్ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలి. -
అల్లకల్లోలంగా కొల్లేరు
-
కొల్లేరును ముంచేసిన బుడమేరు వరద నీరు
-
బుడమేరు ఎఫెక్ట్.. కొల్లేరు కొత్త టెన్షన్
సాక్షి, ఏలూరు: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, బుడమేరు కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు విజయవాడ నగరాన్ని ఉక్కిరిబిక్కిరిచేశాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో చనిపోయారు. మరోవైపు.. తాజాగా బుడమేరు ఉధృతి ఎఫెక్ట్‌తో కొల్లేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లంక గ్రామాలకు ముంపు భయల నెలకొంది.కొల్లేరులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పల్లెల్లోకి నీరు చేరుతోంది. దీంతో, లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మండపల్లి, ఏలూరు, కైకలూరు మండలాల్లో కొల్లేరు వరద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే మండవల్లి మండలంలో నుచ్చుమిల్లి, ఇంగిలిపాకలంక, పెనుమాక లంక, నందిగామలంక, ఉనికిలి, తక్కెళ్లపాడు, మణుగునూరు, కొవ్వాడలంక గ్రామాలను కొల్లేరు వరద చుట్టేసింది. మరోవైపు.. కోమటిలంక సమీపంలో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.ఇక, చిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో, రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరు ప్రస్తుత నీటిమట్టం 3.3 మీటర్లుగా ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 3.5 మీటర్లు దాటితే కొల్లేరులో గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు సమీపవాసులు ఆందోళనకు గురవుతున్నారు. -
భయం గుప్పిట్లో కొల్లేరు
-
కొల్లేరు అక్రమాల గురించి టీడీపీ పై ధ్వజమెత్తిన వైఎస్ఆర్
-
కొల్లేరు పక్షుల లెక్క తేలింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పక్షి ప్రేమికుల స్వర్గధామమైన కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్–2023 ముగిసింది. అటవీశాఖ సిబ్బంది 12 బృందాలుగా ఏర్పడి ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ నెలాఖరు వరకు ఏలూరు జిల్లాలో విస్తరించిన కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతాల్లో పక్షుల గణన చేశారు. అభయారణ్యం పరిధిలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులను, 81,495 పక్షులను గుర్తించారు. వీటిలో మొదటి స్థానంలో కోయిలలు, రెండోస్థానంలో పెలికాన్ పక్షులు ఉండగా... అరుదైన పిన్‌టయల్ స్నిప్ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్ వాగ్‌టయల్ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు కనిపించాయి. పక్షుల గణన ఎలా చేశారంటే... పొడిసిపెడి ఫారమ్స్ (గ్రేబ్స్, నీటి ప్రయాణ పక్షులు), అన్సెరి ఫారŠమ్స్ (బాతులు), చరాద్రి ఫారమ్స్ (నీటి దగ్గర నివసించే పక్షులు), సికోని ఫారŠమ్స్ (కొంగజాతి పక్షులు), చిత్తడి నేలలపై ఆధారపడే పక్షులు... ఇలా ఐదు కుటుంబ కేటగిరీలుగా తీసుకుని పక్షుల గణన చేశారు. పక్షి నిపుణుడు, రికార్డింగ్ చేసే వ్యక్తి, ఫొటోగ్రాఫర్, గైడ్‌తోపాటు మరో ముగ్గురు కలిసి మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన 12 బృందాలు ఈ సర్వే చేశాయి. 105 కొల్లేరు అభయారణ్యంలో గుర్తించిన పక్షిజాతులు 7,875 అత్యధికంగా గుర్తించిన కోయిలల సంఖ్య 81,495 ప్రస్తుతం ఉన్న మొత్తం పక్షులు 6,869 రెండోస్థానంలో ఉన్న పెలికాన్ పక్షుల సంఖ్య తక్కువగా కనిపించిన పక్షులు ఈ సర్వేలో పిన్‌టయల్ స్నిప్ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్ వాగ్‌టయల్ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు, మరికొన్ని జాతుల పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం కొల్లేరులోని సహజసిద్ధ వాతావరణం పక్షులను ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి ఏటా విడిది కోసం కొల్లేరుకు వేలాదిగా పక్షులు వస్తుంటాయి. వీటి సంరక్షణ కోసం అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన వల్ల రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణకు విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంటుంది. – ఎస్వీకే కుమార్, వైల్ట్‌లైఫ్ ఫారెస్ట్ రేంజర్, ఏలూరు -
AP: దేశంలో పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలోనే.. ప్రత్యేకతలివే!
అరుదైన చేపలకు జన్మస్థలం... వలస పక్షులకు ఆవాసం... మూడున్నర లక్షల మందికి నివాసం...పెద్దింట్లమ్మ కొలువు దీరిన పుణ్యక్షేత్రం... మన కొల్లేరు. 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి దేశంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా... జీవవైవిధ్యానికి జలతారుగా కొల్లేరు ప్రత్యేకతను సంతరించుకుంది. ఉప్పునీటిని, మురుగునీటిని తనలో ఇముడ్చుకుని... తనను నమ్మి వచ్చిన పక్షులు, మనుషులు... ఒకటేమిటి సకలజీవరాశులను అక్కున చేర్చుకుని స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందిస్తోంది. ఘన చరిత్రకు ఆనవాళ్లు.. మూడో శతాబ్దం నుంచి ఈ సరస్సు పురాతన గ్రంధాల్లో ఉంది. కొల్లేరుపై పట్టు కోసం పూర్వం రాజుల మధ్య యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్.. వెంగీ నగరంతోపాటు కొల్లేరును దర్శించినట్టు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇక కొల్లేరును నూజివీడు జమీందార్లు తమకు విశ్వాసంగా ఉండే ‘కామదాన’ కుటుంబానికి దానం ఇచ్చినట్టు చెబుతారు. సరస్సులో ఊళ్లు ఎలా వెలిశాయంటే.. వరుస యుద్ధాల కారణంగా 17వ శతాబ్దంలో ఒడిశాలో తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో అక్కడి వడ్డెర కులాలకు చెందిన పలు కుటుంబాలు జీవనాధారం వెదుక్కుంటూ వలస వెళ్లాయి. ఆ క్రమంలో సుమారు 10 కుటుంబాలు కొల్లేరు ప్రాంతానికి వచ్చాయి. సరస్సు మధ్యలో మట్టి దిబ్బలపై గుడిసెలు వేసుకుని చేపలను వేటాడి తింటూ జీవనం గడిపేవారు. ఆ తర్వాత పచ్చి, ఎండు చేపల విక్రయం ద్వారా జీవనోపాధి పొందారు. క్రమంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పక్క గ్రామాల దురాక్రమణ నుంచి తమను కాపాడుకోవడానికి పలు సందర్భాల్లో కత్తులు, బరిసెలతో గ్రామాల మధ్య హోరాహోరీ యుద్ధాలు జరిగేవి. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రత్తికోళ్లలంక, పందిరిపల్లిగూడెం గ్రామాల మధ్య సరిహద్దు విషయమై రెండు పర్యాయాలు జరిగిన పోరులో సుమారు 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇటువంటి కొట్లాటలు ఎన్నో కొల్లేరులో జరిగాయి. తొలినాళ్లలో రవాణాకు తాటిదోనెలను వాడేవారు. ఆ తర్వాత నాటు పడవలు, లాంచీలు వినియోగించేవారు. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చెందడంతో వాహనాలు ఉపయోగిస్తున్నారు. కొల్లేరుపై ఆధారపడి జీవించే ప్రజలు చేపలను వేటాడి విక్రయిస్తుంటారు. పర్యాటకంతో కొత్త అందాలు కొల్లేరును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొల్లేరులో కొలువైన పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం, రోడ్లు, వంతెనల అభివృద్ధి, అటపాక పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దడం, ఉప్పుటేరుపై అక్విడక్ట్‌ల నిర్మాణం వంటి అనేక పనులు వేగంగా జరుగుతున్నాయి. కొల్లేరులో అతిథి గృహాలు, రిసార్టులు, బోట్ షికారు వంటివి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. వలస పక్షులకు పుట్టిల్లు.. ► సైబీరియా, ఆ్రస్టేలియా, నైజీరియా వంటి అనేక దేశాల నుంచి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వలస పక్షులు ఇక్కడికి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ► గతంలో వలస పక్షులకు తోడు స్థానిక పక్షులన్నీ కలిపి 189 రకాలు కొల్లేరుపై ఆధారపడి జీవించేవి. ఇప్పుడు సుమారు 73 రకాల పక్షులున్నట్టు లెక్కతేల్చారు. ► కైకలూరు సమీపంలోని అటపాక పక్షుల విహార కేంద్రం వద్ద శీతాకాలంలో పెలికాన్, పెయింటెడ్ సాŠట్క్ వంటి విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి. ► కొల్లేరులో దాదాపు 140 రకాల చేప జాతులు ఉన్నట్టు అంచనా. ► అరుదైన నల్ల జాతి చేపలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి. ► మార్పు, కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ, ఇసుక దొందులు వంటి చేపలు ఇక్కడ పుట్టినవే. కొల్లేరు విస్తరణ ఇలా.. ► ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న తొమ్మిది మండలాల్లో 77,138 ఎకరాల్లో విస్తరించింది. ► సుమారు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయి. వాటిలో సుమారు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. ► అతిపెద్ద మంచినీటి (చిత్తడి నేలల) సరస్సుగా 1971లో ఇరాన్‌లోని రాంసార్ సదస్సు తీర్మానించింది. ► 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు ఈ సరస్సులోకి చేరుతుంది. ► ఉప్పుటేరు ద్వారా కొల్లేటి నీరు సముద్రంలో కలుస్తుంది. -
కొల్లేరులో వలస పక్షుల సందడి
కైకలూరు(ఏలూరు జిల్లా): కిక్కిస పొదలు.. అందమైన జలదారుల నడుమ ప్రకృతి పంపిన రాయబారులు రాజహంసల్లా సందడి చేస్తున్నాయి. వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతోంది. శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి వలస పక్షులు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతానికి చేరుకున్నాయి. అందరికీ విదేశీ పక్షులుగానే కనిపించే.. ఈ విహంగాలు కొల్లేరు ప్రాంత వాసులకు మాత్రం ఇంటి ఆడపడుచులుగా ఏటా ఇక్కడకు విచ్చేస్తాయి. 6 లక్షల పక్షుల రాక రాష్ట్రంలో కొల్లేరు అభయారణ్యం 77,185 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా కొల్లేరుకు దాదాపు 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అక్టోబర్‌లో వలసబాట పట్టే ఈ విహంగాలు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో తిరిగి పయనమవుతాయి. కొల్లేరు అభయారణ్యంలో 190 జాతులకు చెందిన పక్షులు జీవనం సాగిస్తున్నాయి. ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్ పక్షులు వేలాదిగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాలుగా పక్షుల లెక్కింపు జరుగుతోంది. డిసెంబర్ రెండో వారానికి దాదాపు స్వదేశీ, విదేశీ పక్షులు 5 లక్షల 20 వేలను గుర్తించారు. ఏటా శీతాకాలంలో విదేశీ వలస పక్షులు 6 లక్షలు, స్వదేశీ పక్షులు 3.50 లక్షల వరకు గుర్తిస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లేరు ప్రాంతంలో స్పాట్ బిల్డిన్ పెలికాన్, కామన్ శాండ్‌పైపర్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, గ్లోబీ ఐబీస్, పెయింటెడ్ స్టార్క్, రివర్ టర్న్, జకనా, లార్జ్ విజిటింగ్ డక్, ఓరియంటల్ డాటర్, కామన్ రెడ్ షంక్ వంటి 43 రకాల వలస పక్షులను ప్రస్తుతానికి అటవీ సిబ్బంది గుర్తించారు. వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది ప్రకృతి అనుకూలించడంతో కొల్లేరుకు వచ్చే వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది. ఏటా 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తుండగా.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పక్షుల గణన జరుగుతోంది. పక్షుల ఆవాసాల కోసం అటవీ శాఖ కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేస్తోంది. – ఎస్వీకే కుమార్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ రేంజర్, ఏలూరు -
Kolleru Lake: ఎగువ నుంచి భారీగా కొల్లేరుకు వరద నీరు
కైకలూరు: కొల్లేరు సరస్సు ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి కొల్లేరుకు వరద నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరిన వరద నీరు సముద్రానికి చేరే మార్గమధ్యంలో అక్రమ చేపల చెరువులు అడ్డు వస్తున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క తోడవడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు పాకుతోంది. కొల్లేరు గ్రామాల్లో పలు అక్రమ చేపల చెరువులకు గండ్లు పడటంతో రహదారులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రక్షాళన అంశం మరోసారి తెరపైకి వస్తోంది. మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలింపాకలంక గ్రామస్తుల ప్రధాన మార్గమైన పెదఎడ్లగాడి – పెనుమాలంక రహదారి కొల్లేరు వరద నీటికి మునిగింది. దశాబ్దాలుగా ఇదే సమస్య కొల్లేరు గ్రామాల ప్రజలను పట్టి వేధిస్తోంది. పెద ఎడ్లగాడి వంతెన దిగువన ఈ గ్రామాలు ఉండటంతో వరద నీరు వెనక్కి వచ్చి ముంచెత్తుతోంది. పెదఎడ్లగాడి వద్ద 8.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. అదే విధంగా కైకలూరు–ఏలూరు రహదారిలో ఇరువైపులా కొల్లేరు నీరు గట్లను తాకుతోంది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఇనుప వంతెన... సర్కారు కాల్వపై ఇనుప వంతెన ప్రమాదకరంగా మారింది. వరదల సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పందిరిపల్లిగూడెం వద్ద ఇనుప వంతెనను గ్రామస్తులు నిర్మించారు. ఇటీవల వంతెనపై రేకులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు కింద నుంచి ప్రవాహ వేగం పెరిగింది. టోల్గేట్దారులు భారీ వాహనాలను సైతం వంతెనపై అనుమతిస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అడ్డు వస్తున్న చేపల చెరువులు కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి చేరవేసే క్రమంలో అక్రమ చేపల చెరువు గట్లు అడ్డు వస్తున్నాయి. తెలుగుదేశం పాలనలో కొల్లేరులో అక్రమ చేపల చెరువులను తవ్వేశారు. అడ్డుకున్న అటవీ సిబ్బందిపై టీడీపీ నేతల అండతో దాడులు సైతం చేశారు. కొల్లేరులో డ్రెయిన్లు సైతం అక్రమించారు. ఈ కారణంగా వరదల సమయంలో చేరుతున్న నీరు కిందకు చేరడం లేదు. పెద ఎడ్లగాడి వంతెన వద్ద 8 అడుగులు నీటి మట్టం ఉంటే, దిగువన ఉన్న ఉప్పుటేరు వంతెన వద్ద కేవలం 4 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి నీరు కిందకు రావడానికి చేపల చెరువుల గట్లు అడ్డుపడుతున్నాయి. గుర్రపుడెక్కతో చిక్కులు ఎగువ నుంచి కొట్టుకువస్తున్న గుర్రపుడెక్కతో ప్రతీ ఏటా సమస్య ఉత్పన్నమవుతోంది. కొల్లేరుకు చేరుతున్న నీటిని సముద్రానికి చేరవేయడానికి పెద ఎడ్లగాడి వంతెన మార్గంగా ఉంది. ఈ వంతెనకు ఉన్న 56 ఖానాలలో ఇప్పుడు గుర్రపుడెక్క పేరుకుపోయింది. మేటలు వేసిన గుర్రపుడెక్క కారణంగా నీరు వెనక్కి మల్లుతుంది. ఈ కారణంగా పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక చేరే రహదారి నీట మునిగింది. సాదరణంగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత పైనుంచి చేరుతున్న నీటితో కొల్లేరుకు వరద పోటు వస్తుంది. గుర్రపు డెక్క తొలగిస్తాం పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్కను మనుషులతో తొలగిస్తాం. దీనికి రూ.8 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పొక్లయిన్‌తో తొలిగిస్తుంటే వంతెన పాడవుతుందని ఆర్అండ్బీ అధికారులు అడ్డు చెబుతున్నారు. దీంతో మనుషులను పెడుతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 8.6 అడుగులు నీటి మట్టం నమోదయ్యింది. 12 అడుగులకు చేరితే మరింత ప్రమాదం. పరిస్థితిని సమీక్షిస్తున్నాం. – బి.ఇందిరా, డ్రెయినేజీ జేఈఈ, కైకలూరు -
కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొల్లేరులో ఆక్రమణలకు గురై వెలుగులోకి రాని భూములు వేల ఎకరాలు ఉన్నాయి. చెరువుల సాగుకు అనుకూలమైన భూములైనప్పటికీ ఆక్రమణల పర్వంతో స్థానిక కొల్లేరు ప్రజలకు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఈ క్రమంలో కొల్లేరు రీసర్వే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. దీంతో కొల్లేరు ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కొల్లేరు రీసర్వే చేయిస్తామని గత నెలలో గణపవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సర్వేపై అధికారులు వేగంగా దృష్టి సారించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. సర్వే ప్రక్రియ ఇలా కొల్లేరు అభయారణ్యంలో నిర్వహించనున్న సర్వే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖాధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్వే ప్రక్రియను జలవనరుల శాఖ పర్యవేక్షించింది. రాడార్ ల్యాండ్ సర్వే ద్వారా కొల్లేరు భూముల విస్తీర్ణం లెక్క తేల్చనుంది. అభయారణ్యం ఉపరితలంపై రాడార్‌ను అమర్చి డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించనుంది. ఒక్కొక్క కాంటూరు పరిధిలో అభయారణ్యం భూములు ఎంత ఉన్నాయి.. జిరాయితీ భూములు ఎంత ఉన్నాయి.. అనధికారిక చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ఆక్రమణ భూములు ఎంత ఉన్నాయి ఇలా కాంటూరుల వారీగా అభయారణ్యం విస్తీర్ణం పక్కాగా లెక్క తేలనుంది. సర్వే ద్వారా ఐదో కాంటూరు లోపే సుమారు 70 వేల ఎకరాల భూమి వెలుగులోకి వస్తుందని, దీనిలో 55 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 10 వేల ఎకరాలు జిరాయితీ భూమి ఉంటుందని అధికారిక అంచనా. ఐదో కాంటూరు వరకు అభయారణ్యంలో 77,340 ఎకరాల భూమి ఉన్నట్టు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. రాడార్ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక సిద్ధం చేసి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం అనుమతితో వచ్చే నెలాఖరు నాటికి సర్వే ప్రక్రియ జిల్లాలో ప్రారంభం కానుంది. మరోవైపు స్వచ్ఛ కొల్లేరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూ.420 కోట్ల వ్యయంతో మూడు చోట్ల రెగ్యులేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రెగ్యులేటర్ల నిర్మాణం ద్వారా సముద్రం నుంచి వచ్చే ఉప్పు నీటితో కొల్లేరు కలుషితం కాకుండా కట్టడి చేయనున్నారు. సర్వేతో వెలుగులోకి అభయారణ్య, జిరాయితీ భూములు.. మంచినీటి సరస్సుగా కొల్లేరు ప్రపంచ ఖ్యాతిగాంచింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 901 చదరపు కిలోమీటర్ల మేర 2,22,300 ఎకరాల్లో ఉన్న కొల్లేరు రెండు జిల్లాల్లో 12 మండలాల్లో విస్తరించి ఉంది. కొల్లేరుపై ఆధారపడి మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. 1959లో కొల్లేరులో చేపల సాగుకు ప్రభుత్వం మొదటగా అనుమతినిచ్చింది. అప్పటి నుంచి క్రమక్రమంగా చేపల సాగు పెరిగి వేల ఎకరాలకు చేరింది. కొల్లేరు సర్వే వల్ల అభయారణ్య భూములు, జిరాయితీ భూములు వెలుగులోకి రానున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొల్లేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2007లో కొల్లేరులో ప్రక్షాళనలో భాగంగా సుమారు 55 వేల ఎకరాల అనధికారిక చెరువులు కొట్టేసి సాగుదారులకు రూ.55 కోట్ల మేర పరిహారం అందించారు. 2005లోనే సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిత్రా కమిటీలు కొల్లేరులో పర్యటించి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. వాటి ఆధారంగానే కొల్లేరు ప్రక్షాళనకు దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కైకలూరు పరిసర ప్రాంతాల్లో అభయారణ్యంలో 7500 ఎకరాల భూమి వెలుగులోకి వచ్చింది. సమగ్ర సర్వే నిర్వహిస్తాం ప్రభుత్వ ఆదేశాలతో కొల్లేరు రీసర్వేకు ప్రతిపాదనలు, సర్వే నిర్వహించాల్సిన క్రమం, ఇతర అంశాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అభయారణ్యం భూముల లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిస్తాం. – ఎస్వీకే కుమార్, ఏలూరు అటవీ శాఖ రేంజర్ -
కొల్లేరుకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్వచ్ఛ కొల్లేరు దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. కొల్లేరువాసులకు కలగా ఉన్న రెగ్యులేటర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. ఉప్పుటేరులో మూడు ప్రాంతాల్లో రెగ్యులేటర్లు నిర్మించి ఉప్పునీరు కొల్లేరులో కలవకుండా అడ్డుకట్ట వేయనున్నారు. దీనికి సంబంధించి సాంకేతికపరమైన లాంఛనాలన్నీ పూర్తికాగా టెండర్ల ఆహ్వానానికి రంగం సిద్ధమైంది. ఉప్పునీటి ముప్పు తొలగించేలా.. ఉప్పునీటితో కొల్లేరు సరస్సు కలుషితమవుతోంది. సరస్సుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. దీంతో కొల్లేరుపై రెగ్యులేటర్లు నిర్మించి సరస్సును పరిరక్షించాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. 2004లో దివంగత వైఎస్సార్ హయాంలో రెగ్యులేటర్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు. అయితే ఆయన మరణానంతరం ఈ అంశం అటకెక్కింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కొల్లేరు పరిరక్షణపై దృష్టి సారించారు. రెగ్యులేటర్ల నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రభుత్వం ఆమోదం తెలిపిది. భూగర్భ జలాలు పెంచేలా.. సముద్ర నీటిమట్టం నుంచి కొల్లేరు ఐదు మీటర్ల ఎత్తులో ఉంది. ఆటుపోట్ల నేపథ్యంలో సముద్రం నీరు కాలువల ద్వారా సరస్సులోకి చేరుతుంది. దీంతో సుమారు 10 మండలాల్లో వేలాది ఎకరాలు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. రైతులు సాగుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొల్లేరుపై మూడుచోట్ల రెగ్యులేటర్లను నిర్మిస్తే ఉప్పు నీటిని కట్టడి చేయడం ద్వారా కొల్లేరుకు 113 కాలువల ద్వారా మంచినీరు చేరుతుంది. తద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు స్వచ్ఛ కొల్లేరు సాకారం కానుంది. 13 నుంచి టెక్నికల్ బిడ్ ఈనెల 13 నుంచి 27 వరకు టెక్నికల్ బిడ్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. సాంకేతిక బిడ్లను స్వీకరించి 28న టెక్నికల్ బిడ్‌ను ఫైనల్ చేసి 29న ప్రైజ్ బిడ్‌ను ఖరారు చేయనున్నారు. అనంతరం రెండు వారాల్లో మిగిలిన అధికారిక ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు కేటాయించనున్నారు. రెగ్యులేటర్లు ఎక్కడెక్కడంటే.. ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో ఉప్పుటేరుపై 10.560 కిలోమీటర్ల వద్ద రూ.87 కోట్లతో రెగ్యులేటర్ నిర్మాణం. మొగల్తూరు మండలం పడతడిక గ్రామంలో 1.400 కిలోమీటరు వద్ద రూ.136.60 కోట్లతో బ్రిడ్జి కమ్ లాక్ నిర్మాణం. మొగల్తూరు మండలం మోళ్లపర్రు వద్ద 188.40 కోట్లతో బ్రిడ్జి కమ్ లాక్ నిర్మాణం. ఈ మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ. 412 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అధికారులు ఖరారు చేసిన డీపీఆర్, ప్రతిపాదనలను గతనెల 23న స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ ఆమోదించింది. అనంతరం సిద్ధం చేసిన టెండర్ కాపీని జ్యూడి షియరీ ప్రివ్యూకు పంపి అక్కడి అనుమతితో టెండర్ల ప్రక్రియను ఖరారు చేశారు. -
దొడ్డిగట్టు.. కాసులు పట్టు!
ఏలూరు రూరల్ : కొల్లేరు దొడ్డిగట్లు.. అక్రమ చెరువులకు అడ్డాగా మారాయి. కొల్లేరులోని నీటికుంటను మత్స్యకారులు దొడ్డిగట్టుగా పిలు స్తారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మ త్స్యకారులు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నా రు. ఇందుకు అటవీశాఖ అధికారులకు సొమ్ము లు ముట్టజెబుతున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుంచి గార్డు వరకూ దొడ్డిగట్ల ద్వారా ఏడాదికి రూ.కోటికిపైగా మామూళ్లు అందుతున్నట్టు అంచనా. సుమారు 30 వేల ఎకరాల్లో.. 2007లో అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టిన సమయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల విస్తీర్ణంలో వందలాది చెరువు గట్లను ధ్వంసం చేశారు. కాలక్రమేణ వరదలు, వర్షాలకు ఈ చెరువు గట్లు కుంగి దొడ్డిగట్లుగా మారాయి. వీటిని పటిష్టపరిచి కొందరు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అభయారణ్యంలో సుమారు 30 వేల ఎకరాల్లో దొడ్డిగట్లు వెలిశాయి. ఎకరానికి రూ.3 వేల వరకూ.. దొడ్డిగట్లలో చేపల సాగును సెక్షన్ ఆఫీసర్లు, గా ర్డులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడతామని, గట్లు కొట్టేస్తామని మత్స్యకారులను బెదిరిస్తున్నారు. దీంతో మత్స్యకారులు అధికారులకు సొమ్ములు ముట్టజెబుతున్నారు. ఇదే అదనుగా సెక్షన్ ఆఫీసర్లు, గార్డులు కలిసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పెదపాడు సెక్షన్ పరిధిలో శ్రీపర్రు, కలకుర్రు, మానూరులో దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి ఎకరాకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సెక్షన్ పరిధిలో సుమారు 6 వేల ఎకరాల్లో చేపల సాగు ఉంది. అలాగే నిడమర్రు, ఏలూరు, భీమడోలు పరిధిలో సుమారు 24 వేల ఎకరాల దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి అధికారులు సుమారు రూ.కోటి వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కొంత మొత్తం ఉన్నతాధికారులకు సైతం చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దొడ్డిగట్లు కొట్టేస్తాం దొడ్డిగట్లలో చేపల సాగు ను అడ్డుకుంటాం. ఏలూ రు మండలం కొక్కిరాయిలంక వెనక అక్రమ చెరు వు తవ్వకాలను అడ్డుకున్నాం. ఈ ప్రాంతంలో దొడ్డిగట్లను చేపల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నట్టు గుర్తించాం. వెంటనే పూర్తిస్థాయిలో ధ్వంసం చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఏలూరు, కైకలూరు రేంజర్ల పర్యవేక్షణలో దొడ్డిగట్లను ధ్వంసం చేయిస్తాం. –సెల్వం, డీఎఫ్ఓ హక్కులు కాపాడాలి కొల్లేరులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ దొడ్డిగట్లలో చేపలు పట్టుకునే హక్కు మత్స్యకారులకు ఉంది. వేసవిలో వీటిని పట్టుకుని అమ్ముకుంటారు. దొడ్డిగట్లలో చేపల సాగు చాలా కష్టం. కొల్లేరుకు వరద వస్తే దొడ్డిగట్లు మునిగి మత్స్యకారులు నష్టపోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి చేయగానే కొల్లేరు మొత్తం నిండుకుండలా మారిపోతుంది. అప్పుడు మ త్స్యకారులు సంప్రదాయ చేపల వేటతో జీవనం సాగించవచ్చు. –పెన్మెత్స శ్రీనివాసరాజు, ఎంపీపీ, ఏలూరు -
తాబేళ్ల అక్రమ రవాణా గుట్టు రట్టు!
కైకలూరు: కృష్ణాజిల్లా కొల్లేరు పరిసర ప్రాంతాల నుంచి తాబేళ్లను రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వదర్లపాడు గ్రామం వద్ద రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణా శనివారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో ఆటో, మినీ వ్యాన్‌ల్లో 25 బస్తాల్లో నాలుగు టన్నుల తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన పంతగాని నాగభూషణం (48), గరికిముక్కు సందీప్ (30), అదే మండలం కొండూరుకు చెందిన దేవదాసు ఏసుబాబు (27) తాబేళ్లను రవాణా చేస్తుండగా వాహనాలతో సహా అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు ఆదివారం అప్పగించారు. ఇక్కడ కేజీ తాబేలు రూ.15 చొప్పున కొని ఇతర రాష్ట్రాల్లో రూ.50 నుంచి రూ.100కి విక్రయిస్తున్నారు. తాబేళ్ల మాంసానికి గిరాకీ ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. వైల్డ్ లైఫ్ ఏలూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసరు కుమార్ ఆధ్వర్యంలో డెప్యూటీ రేంజ్ ఆఫీసరు జయప్రకాష్, బీటు ఆఫీసరు రాజేష్ నిందితులపై అటవీపర్యావరణ చట్టం 1972 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు. మేజిస్ట్రేటు ఆదేశాలతో పట్టుబడిన తాబేళ్లను కొల్లేరు సరస్సులో విడిచిపెడతామని అధికారులు చెప్పారు. -
పెద్దింట్లమ్మ బోనాలకు సర్వసన్నద్ధం
కైకలూరు: తెలంగాణ బోనాల సంప్రదాయం కొల్లేరు సరస్సుకు ప్రవహిస్తోంది. కృష్ణా జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన బోనాల సమర్పణకు ఏటా మహిళా భక్తులు పెరుగుతున్నారు. ఈ ఏడాది నుంచి కొల్లేరు సరస్సులో సహజ సిద్ధంగా లభించే కలువ పువ్వులతో బోనాలు సమర్పించాలని పెద్దలు నిర్ణయించారు. మార్చి 3 నుంచి 18వ తేదీ వరకు వేడుకగా జరిగే ఈ జాతరకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు పరీవాహక ప్రాంత గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. బోనాలకు సంబంధించిన సామగ్రిని ఇప్పటి నుంచే గ్రామస్తులు సిద్ధం చేస్తున్నారు. నీటి మధ్యలో ద్వీపకల్పం పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి.. వేంగిరాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం.. కొల్లేటి గ్రామాల ప్రజలకు ఆరాధ్యదైవం. దేవాలయంలో అనేక విశేషాలున్నాయి. అమ్మకు ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట పెద్ద జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బోనాల సమయంలో అమ్మవారి రూపాలు బోనం ఇలా సమర్పిస్తారు.. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదే విధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఏడాది 60 మంది బోనాలు సమర్పిస్తే, రెండో ఏడాది ఆ సంఖ్య 200కు చేరింది. మహిళలు మూడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలో పానకం, పిండి వంట, వడపప్పు, చలివిడి నింపి చివర కుండపై నెయ్యితో నిండిన దీపాన్ని ఉంచుతారు. బోనాలకు ముందు వరసలో 7 కావిళ్లలో పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లు, అమ్మవారి ప్రతిరూపాలుగా భక్తులు మోసుకెళ్తారు. అమ్మకు ఇష్టం కలువ బోనాలు.. ఈ ఏడాది నుంచి కొల్లేరు సరస్సులో లభించే కలువ పువ్వుల బోనాలను సమర్పించాలని నిర్ణయించారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలను ఎత్తుకుని మహిళలు ప్రారంభమవుతారు. పూర్వం అమ్మవారికి కొల్లేరు సరస్సులో లభించే కలువ పువ్వులతో పూజలు చేసేవారు. పెద్దింట్లమ్మకు ఈ పువ్వులంటే ఇష్టమని భక్తులు భావిస్తారు. దేవాలయం మరింత అభివృద్ధి కొల్లేరు మధ్యలో ఉన్న పెద్దింట్లమ్మ దేవాలయం వద్ద దేవదాయ శాఖ, ఎమ్మెల్యే డీఎన్నార్ కృషితో అభివృద్థి కార్యక్రమాలు చేపడుతున్నాం. మార్చి 15న జల దుర్గాగోకర్ణేశ్వర స్వామి కల్యాణం, 18న తెప్పోత్సవం నిర్వహిస్తాం. మహిళా భక్తులు ఏటేటా పెరుగుతుండటం శుభపరిణామం. – కె.వి.గోపాలరావు, పెద్దింట్లమ్మ దేవస్థానం ఈవో -
రూ.412 కోట్లతో ఉప్పుటేరు ఆధునికీకరణ
సాక్షి, అమరావతి: కొల్లేరు సరస్సు పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సరస్సు నుంచి మురుగునీటిని సముద్రంలో కలిపే ఉప్పుటేరు ఆధునికీకరణ, మూడు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి కమ్ లాక్‌లను నిర్మించేందుకు రూ.412 కోట్లతో గ్రీన్ íసిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు కొల్లేరులో కలిసే పెదలంక మేజర్ డ్రెయిన్‌పై అవుట్‌ఫాల్ స్లూయిజ్, డబుల్ లేన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల కొల్లేరును పరిరక్షించుకోవడంతోపాటు ప్రజా రవాణాను మెరుగుపర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ► పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మండలం దుంపగడప గ్రామం వద్ద ఉప్పుటేరుపై (10.56 కి.మీ. వద్ద) రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.87 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ► పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం పడతడిక వద్ద ఉప్పుటేరుపై (1.4 కి.మీ. వద్ద) రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి కమ్ లాక్ నిర్మాణానికి రూ.136.60 కోట్లను కేటాయించింది. ► పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం మొల్లపర్రు వద్ద ఉప్పుటేరుపై (57.95 కి.మీ. వద్ద) రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి కమ్ లాక్ నిర్మాణానికి రూ.188.40 కోట్లను మంజూరు చేసింది. ► కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలం నిడమర్రు వద్ద పెదలంక మేజర్ డ్రెయిన్‌పై (3.25 కి.మీ. వద్ద) అవుట్‌ఫాల్ స్లూయిజ్, డబుల్ లేన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. -
కొత్త జిల్లాల ఏర్పాటు.. కొల్లేరు ‘ఏలూరు’లోకే
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాల పునర్విభజనతో ప్రకృతి సహజసిద్ధమైన కొల్లేరు సరస్సు సంపూర్ణంగా ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. ఇప్పటివరకు రెండు జిల్లాల మధ్య సరస్సు సరిహద్దు, అభయారణ్యానికి సంబంధించి వివాదాలు, చేపల సాగులో ఆధిపత్య పోరు ఇలా రకరకాల సమస్యలు కొనసాగుతుండేవి. జిల్లాల పునర్విభజన కొల్లేరుకు అతి పెద్ద మేలు చేసింది. కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజకవర్గం కొత్తగా ఏర్పాటవుతున్న ఏలూరు జిల్లాలో కలవడంతో పూర్తి కొల్లేరు విస్తీర్ణం ఏలూరు పరిధిలోకి చేరింది. 64 కొల్లేరు గ్రామాలు, మూడున్నర లక్షల జనాభా, 2.32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరంతా కొత్త జిల్లాలో కలిసింది. ఆసియాలోనే అతి పెద్ద సరస్సుగా ఖ్యాతి... ఆసియాలోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సుగా కొల్లేరు ఖ్యాతిగడించింది. కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఇది సహజసిద్ధంగా ఏర్పడింది. 2,32,600 ఎకరాల్లో సుమారు 312 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొల్లేరు విస్తరించి ఉంది. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు, ఉండి నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మండలాల్లో కొల్లేరు విస్తరించింది. కొల్లేరు పరిధిలో 64 గ్రామాల్లో 3.50 లక్షల జనాభా ఆవాసం ఉంటుండగా, 90 శాతం మందికి పైగా కొల్లేరు వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న కొల్లేరుకు బుడమేరు, తమ్మిలేరు నదుల వరద నీటితో పాటు 14 పిల్ల కాలువలు, 15 డ్రెయిన్లు, కాలువల్లోని నీరు వచ్చి చేరుతుంది. ఈ నీటినంతటినీ తనలో ఇముడ్చుకునే ప్రకృతిసిద్ధమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా కొల్లేరు రూపాంతరం చెందింది. దీనికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఏలూరు కాలువ ఉన్నాయి. సాధారణంగా కొల్లేరు సముద్ర మట్టానికి ఎనిమిది అడుగుల ఎత్తున ఉండేది. వివిధ వాగులు, నదుల నుంచి వచ్చే వరద నీటిని బట్టి ఇది ఒక్కోసారి పది అడుగుల వరకు ఉండేది. ఈ అడుగుల లెక్కనే కాంటూరు లెవెల్ అని పిలుస్తారు. 2,32,600 ఎకరాల విస్తీర్ణంలో 1.60 లక్షల ఎకరాలు అభయారణ్యం పరిధిలో ఉన్నాయి. ఏటా రూ.200 కోట్ల చేపల విక్రయాలు కొల్లేరుపై ఆధారపడి ప్రతి ఏటా రూ.200 కోట్ల చేపల విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. ప్రతిరోజూ ఇక్కడి నుంచి తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్‌కు లారీల్లో ఎగుమతులు జరుగుతున్నాయి. కైకలూరు, ఆకివీడు, ఏలూరు, భీమడోలు కేంద్రాలుగా ప్రతి నిత్యం ఎగుమతులు జరుగుతున్నాయి. కొల్లేరులో నల్లజాతి చేప రకమైన కొరమేను ఎక్కువగా లభిస్తోంది. దీనికి దేశీయ మార్కెట్లో కేజీ రూ.400 నుంచి రూ.600 వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం ఈ రకం రోజూ 100 టన్నులకు పైగా ఎగుమతులు జరుగుతున్నట్టు అంచనా. సరస్సు ఉనికి బతికింది కొల్లేరు ప్రాంతాన్ని ఒకే గూటికి తీసుకురావడం హర్షణీయం. కృష్ణా జిల్లాలోని కొల్లేరు తీర గ్రామాలన్నింటినీ ఏలూరు జిల్లాలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంతో దీని అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంది. సరస్సు అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి. – భూపతిరాజు తిమ్మరాజు, కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధి, సిద్ధాపురం, ఆకివీడు మండలం 27 గ్రామాలు ఏలూరులోకే... ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో 2,08,600 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 24 ఎకరాల్లో కొల్లేరు ఉంది. కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు, మండవల్లిలో 27 కొల్లేరు గ్రామాలు ఉన్నాయి. మిగిలిన 37 గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, గణపవరం, నిడమర్రు, భీమడోలు, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు మండలాల పరిధిలో ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తూ గెజిట్ జారీ చేసింది. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని కైకలూరు, నూజివీడు ఏలూరు జిల్లా పరిధిలోకి చేరాయి. దీంతో కొల్లేరు పూర్తిగా ఒకే జిల్లా పరి«ధిలోకి చేరింది. కొల్లేరు అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు అనేక ప్రతిపాదనలున్నా, అభయారణ్యం, రెండు జిల్లాల హద్దుల సమస్యలు, ఇతర కారణాలతో బలంగా ముందుకు సాగని పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరును ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఆయన మరణానంతరం దీనిపై ఎలాంటి పురోభివృద్ధీ లేదు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొల్లేరు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిలో భాగంగా కొల్లేరులో నిరంతరం నీరు నిలిచి ఉండేందుకు మూడు రెగ్యులేటర్లు నిర్మించాలని భావిస్తోంది. దీనివల్ల ఉప్పుటేరు కొల్లేరులోకి రాకుండా అడ్డుకోవడంతో పాటు సరస్సు తన స్వభావాన్ని కోల్పోకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
కొల్లేరులో సారా తయారీ గుట్టు రట్టు
కైకలూరు: సారా తయారీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సులో కిక్కిస పొదల మాటున సాగుతున్న సారా తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పలువురు పోలీసులు బుధవారం పడవలపై వెళ్లి ఆ స్థావరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా కొల్లేరు కిక్కిస పొదలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. కైకలూరు రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణ పందిరిపల్లిగూడెం పరిధిలో కొల్లేరు సరస్సు మధ్యలో సారా తయారీ కేంద్రాన్ని మంగళవారం గుర్తించి దాడి చేశారని చెప్పారు. అక్కడ వెయ్యి లీగర్ల సారా, సారా తయారీకి ఉపయోగించే 50 వేల లీటర్ల బెల్లపు ఊటను స్వా«దీనం చేసుకుని పందిరిపల్లిగూడెంకు చెందిన భలే సుబ్బరాజు (40), ఘంటసాల రాంబాబు (35), భలే కోటశివాజీ(35), ఆకివీడుకు చెందిన పన్నాస కృష్ణ (35) అనే వారిని అరెస్ట్ చేశారని వివరించారు. నిందితుల నుంచి సారా తయారీకి ఉపయోగించే రూ.6.80 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను
సాక్షి, అమరావతి బ్యూరో/కైకలూరు: తెల్ల చేప రకాల్లో గోదావరి పులసకు ఎంత పేరుందో.. నల్ల చేప రకాల్లో ఒకటైన కొర్రమీనుకూ అంతే గుర్తింపు ఉంది. అందులోనూ కొల్లేరు సరస్సులో పెరిగే కొర్రమీనుకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడా కొల్లేరు కొర్రమీనులకు కష్టకాలం దాపురించింది. సరస్సులో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలు, పంట కాలువలు, గుంతలు, వరి చేలల్లో కొర్రమీను చేపలు పుట్టి పెరుగుతుంటాయి. ప్రాంతాలను బట్టి పూమేను, కొర్రమీను, మట్టమీను, బురద మట్ట వంటి పేర్లతో పిలుచుకునే ఈ జాతి చేపలు సహజంగా నీటి అడుగున బురదలో జీవిస్తుంటాయి. నీరు లేనప్పుడు భూమి పొరల్లోకి కూడా చొచ్చుకుపోయి అక్కడి తేమను ఆధారం చేసుకుని జీవించగలిగే మొండి జాతి ఇది. కాలుష్యమే అసలు సమస్య కొల్లేరు సరస్సులోకి చేరుతున్న వ్యర్థ జలాలు సరస్సు గర్భంలో పురుడు పోసుకుంటున్న సహజ నల్ల జాతి చేపల ఉసురుతీస్తున్నాయి. స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కొల్లేరు నీరు కాలకూట విషంగా మారింది. సరస్సులో ఉప్పు శాతం ప్రమాదకర స్థాయికి చేరడం అందోళన కలిగిస్తోంది. సరస్సులోకి ఏటా 17 వేల టన్నుల వ్యర్థ జలాలు చేరుతున్నట్టు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనా వేసింది. కేవలం పెద్ద కర్మాగారాల నుంచే రోజుకు 7.2 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు కొల్లేరులో కలుస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి చేరుతున్న వ్యర్థ రసాయనాలు మత్స్య సంపదపై మృత్యు పాశం విసురుతున్నాయి. దీనికి తోడు సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోంది. కొర్రమీను చేప ‘జీరో’ సెలినిటీ (ఉప్పు శాతం లేని) మంచినీటిలో పెరిగే చేప. ప్రస్తుతం కొల్లేరులో ఉప్పు శాతం 3–15 శాతంగా ఉంది. దీంతో సరస్సులో చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత నీటి కాలుష్యం వల్ల కొర్రమీను ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ (ఈయూఎస్) వ్యాధులకు గురవుతోంది. దీనివల్ల శరీరంపై పుండ్లు, రక్తస్రావం కావడం, ఎదుగుదల లోపించడం, సంతానోత్పత్తి నశించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కొల్లేరులో బొమ్మిడాయి, మట్టగిడస, గురక, ఇంగిలాయి, మార్పు, జెల్ల వంటి నల్ల చేప జాతులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు మొండి జాతి రకమైన కొర్రమీను సైతం వాటి జాబితాలో చేరుతోంది. నీటి కాలుష్యాన్ని అరికట్టాలి కొల్లేరు సరస్సులోకి ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ జలాలు రాకుండా నియంత్రించాలి. కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన నీటిని మాత్రమే విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఎండీ ఆసిఫ్‌పాషా, జాతీయ ఉత్తమ చేపల రైతు, కైకలూరు కృత్రిమ సాగు మేలు కొర్రమీను రకం చేపలను కృత్రిమ పద్ధతిలో సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. కొర్రమీను సీడ్‌ను కొల్లేరు సరస్సుతోపాటు, కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరిస్తున్నారు. కొర్రమీను సాగుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ప్రోత్సాహకాలు అందిస్తోంది. – పి.ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు -
ప్రజలకు చంద్రబాబే పెద్ద సమస్య
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించడం మానేసి ప్రజలకు పెద్ద సమస్యగా మారారని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు కొంతైనా అభివృద్ధిపై దృష్టిసారించి ఉంటే ఇప్పుడు కొల్లేరు సరస్సు, పోలవరం ముంపు గ్రామాల సమస్య ఇంత జటిలమయ్యేది కాదన్నారు. ‘వడ్డీలు’ కార్పొరేషన్ చైర్పర్సన్ సైదు గాయత్రీ సంతోషి అధ్యక్షతన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆ కులస్తుల రాష్ట్రస్థాయి నాయకుల సమావేశంలో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన కులాలను వెలుగులోకి తీసుకొచ్చి వారి సామాజిక, రాజకీయ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అందులో భాగంగానే అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ‘వడ్డీలు’కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి, తద్వారా వారు అభివృద్ధి చెందేలా ఒక చక్కని వేదికను రూపొందించామన్నారు. ఈ కులస్తుల ప్రధాన సమస్యలైన కొల్లేరు, కాంటూరుపై పూర్తిగా అధ్యయనం చేసి సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. బీసీలను బలమైన నాయకులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్లను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు. సమావేశంలో వడ్డీలు కార్పొరేషన్ డైరెక్టర్లు పలువురు ప్రసంగించారు. -
ఏపీ: కొల్లేరు, కృష్ణా డెల్టాపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి ఆయకట్టుకు మళ్లించడం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా రూ.75,724 కోట్ల వ్యయంతో కొత్తగా 51 ప్రాజెక్టుల పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ప్రాజెక్టుల పనులు ప్రణాళికాయుతంగా పూర్తి చేసేందుకు ఐదు స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ)ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుల పనుల వ్యయంలో 70 శాతాన్ని జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమీకరిస్తుండగా మిగతా 30 శాతం నిధులను బడ్జెట్ ద్వారా కేటాయించి ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. శ్రీశైలానికి వరద సమయంలోనే.. కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాభావ పరిస్థితులు, ఎగువన ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద 35 నుంచి 40 రోజులకు తగ్గిపోయింది. అది కూడా ఒకేసారి గరిష్టంగా వస్తోంది. ఈ నేపథ్యంలో వరద వచ్చే రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా ఎత్తిపోతలు, కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను ప్రభుత్వం కొత్తగా చేపట్టింది. అవసరమైన చోట కొత్తగా ప్రాజెక్టుల పనులు చేపట్టింది. మొత్తమ్మీద 32 ప్రాజెక్టులను రూ.43,203 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆరీ్డఎంపీడీసీ)ను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా..: పోలవరం ఎడమ కాలువ నుంచి 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలించడం ద్వారా ఉత్తరాంధ్రలో కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాండవ–ఏలేరు అనుసంధానం ద్వారా 57,065 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పనులను చేపట్టేందుకు ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టŠస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(యూఏఐడీసీ) పేరుతో ఎస్పీవీ ఏర్పాటైంది. దీని ద్వారా రూ.8,554 కోట్ల వ్యయంతో మొత్తం నాలుగు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. దుర్భిక్ష పల్నాడుకు దన్ను..: గోదావరి, వరికపుడిశెలవాగు వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష పల్నాడును సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు, వరికపుడిశెల ఎత్తిపోతల ద్వారా వాగు వరద నీటిని తరలించడం ద్వారా పల్నాడును సుభిక్షం చేసే పనులను చేపట్టేందుకు పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఏడీఎంసీ) పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది. ఈ ఎస్పీవీ కింద ఆరు ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి రూ.8,276 కోట్లతో అనుమతి ఇచ్చింది. గోదావరి వరదతో రాష్ట్రానికి జలభద్రత.. గోదావరి వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాథమికంగా పోలవరం కుడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గోదావరి జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించే పనులను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పనులను మొత్తం మూడు విభాగాలుగా చేపట్టడానికి రూ.12,707 కోట్ల వ్యయం కానుందని అంచనా. వాటిని చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టŠస్(ఏపీఎస్‌డబ్ల్యూఎస్డీపీ) పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా డెల్టా, కొల్లేరు పరిరక్షణే ధ్యేయం..: కృష్ణా డెల్టా, కొల్లేరు సరస్సులను ఉప్పు నీటి బారిన పడకుండా చేయడం ద్వారా వాటికి జీవం పోసే పనులను అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలు, వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల, కొల్లేరు పరిరక్షణ పనులను చేపట్టేందుకు కృష్ణా–కొల్లేరు సెలైనిటి మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది. ఈ ఎస్పీవీ కింద రూ.2,989 కోట్లతో ఆరు ప్రాజెక్టులను చేపట్టనుంది. -
Kolleru Lake: పక్షుల ‘కొంప కొల్లేరు’
చుట్టూ కిక్కిస పొదలు.. వాటి నడుమ అందమైన జలదారులు.. ఏదో అత్యవసర పని ఉన్నట్టు నీటి అడుగున అటూ ఇటూ రయ్యిన పరుగులు తీసే పిల్ల చేపలు.. ఎటు చూసినా ఒంటి కాలి జపం చేసే కొంగలు.. దూరతీరాల నుంచి వలస వచ్చే అతిథి విహంగాల విడిదులు.. కిలకిల రావాలు ఆలపించే బుల్లి పక్షులు. కొల్లేరు సరస్సు వైపు తొంగి చూస్తే.. ఇలాంటి రమణీయ దృశ్యాలెన్నో కనువిందు చేసేవి. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా కానరావడం లేదు. ఆకివీడు (పశ్చిమ గోదావరి): స్వదేశీ పక్షులతోపాటు విదేశీ పక్షి జాతులకు ఆలవాలమైన కొల్లేరు సరస్సులో వాటి సందడి తగ్గిపోతోంది. పశ్చిమ గోదావరి, కృష్ణా డెల్టాల నడుమ విస్తరించి ఉన్న కొల్లేరుపై ఆధారపడి 30 ఏళ్ల క్రితం వరకు 2 కోట్ల పక్షులు మనుగడ సాగించేవి. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా తగ్గిపోతోంది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొల్లేరులో పక్షిజాతి గణాంకాలను అభయారణ్య శాఖ సేకరించింది. ఆ మూడు నెలల్లో 3.05 లక్షల పక్షులు విహరించినట్టు అంచనా వేసింది. సహజంగా శీతాకాలంలో కొన్ని రకాల విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి విడిది చేస్తుంటాయి. ఈ ఏడాది ఆ పక్షుల రాక కూడా తగ్గింది. సరస్సులో ప్రస్తుతం సుమారు 1.20 లక్షల మేర పక్షులు మాత్రమే సంచరిస్తున్నాయని అభయారణ్య శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. అంటే రెండు నెలల వ్యవధిలో వాటి సంఖ్య 60 శాతం మేర తగ్గిపోయినట్టు అంచనా వేశారు. ఆక్రమణలు, కాలుష్యమే కాటేస్తున్నాయి వేసవిలో సహజంగానే కొల్లేరులో సంచరించే పక్షుల సంఖ్య తగ్గుతుంది. కానీ.. శీతాకాలంలోనూ వాటి సంఖ్య విపరీతంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సరస్సులో ఆక్రమణలు, కాలుష్యమే కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మరోవైపు విదేశీ పక్షులు సరస్సులో విడిది చేసే రోజులు సైతం తగ్గిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. గతంలో వలస పక్షులు 120 నుంచి 150 రోజుల వరకు ఇక్కడ విడిది చేసేవి. ప్రస్తుతం వాటి విడిది రోజులు సగటున 60 రోజులకు పడిపోయింది. సరస్సులో వాటి సహజసిద్ధ మనుగడకు అవకాశాలు లేకపోవడం, పక్షుల ఆవాసాలు తగ్గిపోవడమే దీనికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. గత ప్రభుత్వాలు కొల్లేరు పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సరస్సు కుంచించుకుపోయిందని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడి పక్షుల సంఖ్య విషయంలో అటవీ శాఖ చెబుతున్న గణాంకాలకు, వాస్తవ గణాంకాలకు చాలా వ్యత్యాసం ఉంటోందని పేర్కొంటున్నారు. సరస్సును, దీనిపై ఆధారపడిన పక్షి జాతులను కాపాడటం ద్వారా ఇక్కడి జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఆటపాకలోని పక్షుల కేంద్రం ఈ చర్యలు చేపడితే మేలు కొల్లేటి సరస్సులో పక్షుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన చర్యలపై పర్యావరణ వేత్తలు చేస్తున్న సూచనలు ఇలా ఉన్నాయి. ► కొల్లేరు ప్రక్షాళన అనంతరం సరస్సు అభివృద్ధి జరగలేదు. సరస్సులో మేటవేసిన పూడికను, పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలి. ► సరస్సులో ఆక్రమణల్ని తొలగించాలి. నీటిమట్టాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ► సరస్సు వెంబడి పలు ప్రాంతాల్లో పక్షుల ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సహజ సిద్ధ ఆవాసాలు పెరిగేలా చూడాలి. చిత్తడి నేలల్లో పెరిగే వృక్ష జాతిని అభివృద్ధి చేయాలి. ► పక్షుల వేట నిషేధాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలి. నామమాత్రంగా ఉన్న చెక్‌పోస్టులను పటిష్టపరచాలి. ► స్థానిక గార్డులను బదిలీ చేసి, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని గార్డులుగా నియమించాలి. కారు చీకట్లో కాంతి పుంజం కొల్లేరులో సంచరించే పక్షి జాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో కారు చీకట్లో కాంతి పుంజంలా ఇటీవల నాలుగు రకాల కొత్త పక్షులు ఇక్కడ సంచరిస్తున్నట్టు అభయారణ్య అధికారులు గుర్తించారు. వీటిలో సీగల్ (బ్రౌన్ హెడ్), ఎల్లో లాఫింగ్ (తీతు పిట్ట జాతి), స్నైఫ్ (మగ ఉల్లంగి పిట్ట), స్పాటెడ్ రెడ్ షాంక్ (ఉల్లంగి పిట్ట జాతి) పక్షులు ఉన్నాయని వెల్లడించారు. కొల్లేరు స్వరూపం ఇదీ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 250 నుంచి 340 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. దీని సరాసరి లోతు 0.5 నుంచి 2 మీటర్ల వరకు ఉంటుంది. ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సు ఇది. 2,22,600 ఎకరాల్లో చేపల చెరువులు విస్తరించి ఉండగా.. 1,66,000 ఎకరాలు అభయారణ్యం (వైల్డ్ లైఫ్ శాంక్చురి) పరిధిలో ఉంది. ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలమైన ఈ సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలస వచ్చే పక్షుల్లో అతి ముఖ్యమైనవి పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుంచి కూడా ఇక్కడకు పక్షులు వలస వస్తూ ఉంటాయి. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగులతోపాటు డెల్టా ప్రాంతం నుంచి వచ్చే 67 మేజర్, మైనర్ కాలువలు ఈ సరస్సులోకి నీటిని చేరుస్తున్నాయి. కొల్లేరులోని ముంపు నీరు 62 కిలోమీటర్ల పొడవైన ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలోకి చేరుతుంది. ఈ సరస్సును 1999 నవంబర్‌లో అభయారణ్య ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొల్లేరు సరస్సుకు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోటలో ప్రసిద్ధ పెద్దింట్లమ్మ సమేత జలదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయంలో 9 అడుగుల పైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని కొలిచేందుకు ఒడిశా, అసోం, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. పక్షి జాతులు తగ్గాయి కొల్లేరు సరస్సులో విహరించే, విడిది చేసే పక్షుల జాతులు బాగా తగ్గిపోయాయి. పక్షి సంతతి వృద్ధి కూడా భారీగా క్షీణించింది. ఇక్కడి పక్షుల సంఖ్య విషయంలో అటవీ శాఖ చెబుతున్న లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదు. ప్రస్తుతం కొల్లేరులో పక్షుల సంఖ్య లక్షల్లో కాదు వేలల్లో మాత్రమే ఉంది. ఆక్రమణలు, వేటగాళ్ల వల్ల పక్షుల సంచారానికి త్రీవ విఘాతం కలుగుతోంది. దీనిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. పక్షుల వృద్ధికి కచ్చితమైన చర్యలు చేపట్టాలి. – పతంజలి శాస్త్రి, పర్యావరణవేత్త కొల్లేరు పక్షుల్ని రక్షించాలి కొల్లేరులో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. చేలు, చెరువుల నుంచి వచ్చే రసాయనాలతో కూడిన నీరు కొల్లేరులో పక్షి జాతి పాలిట మృత్యుపాశంగా మారింది. పక్షుల వేటను పకడ్బందీగా నిర్మూలించాలి. సరస్సులో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కను తొలగించాలి. దీనివల్ల పక్షులకు ఆహారం తగ్గిపోయింది. పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. – భూపతిరాజు చిదానంద మూర్తిరాజు, భారతీయ కిసాన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సిద్ధాపురం, ఆకివీడు మండలం పక్షి జాతుల వృద్ధికి చర్యలు కొల్లేరు సరస్సులో పక్షి జాతుల వృద్ధికి చర్యలు చేపట్టాం. నాలుగైదు రకాల కొత్త పక్షులు కొల్లేరు సరస్సులోకి వచ్చాయి. సరస్సులో గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు చేస్తున్నారు. వేసవి కావడంతో పక్షుల విహారం తగ్గింది. ఆటపాకలోని పక్షుల ఆవాస కేంద్రంలో స్టాండుల సంఖ్య పెంచాం. వచ్చే ఏడాదికి మరిన్ని వసతులు కల్పించే ప్రతిపాదనలున్నాయి. – ఎస్ఎన్ శివకుమార్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (అభయారణ్యం), ఏలూరు -
కొల్లేరు జలం.. కాలకూట విషం
కైకలూరు: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మంచినీటి కొల్లేరు సరస్సు వ్యర్థ జలాల మడుగులా మారింది. వ్యవసాయ రసాయనాలు, ఫ్యాక్టరీల కాలుష్య నీటితో కొల్లేరు సరస్సు సహజత్వాన్ని కోల్పోతోంది. దీంతో నల్లజాతి చేప జాతులు అంతరించి పోతున్నాయి. పక్షులు, మూగజీవాలపైనా ప్రభావం చూపుతోంది. సమతుల్యత దెబ్బతింటోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొల్లేరు 77,138 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా పది వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరుకు చేరుతోంది. ఏడాదిలో 17 వేల టన్నుల వ్యర్థాలు.. కొల్లేరు సరస్సులో రెండు జిల్లాల నుంచి ఏటా 17 వేల టన్నుల వ్యర్థాలు కలుస్తున్నాయని జియోగ్రాఫికల్ రీసెర్చ్ సర్వే అంచనా వేసింది. పొలాల నుంచి ఎరువులు, పురుగుమందులు సహా మిల్క్, షుగర్ ఫ్యాక్టరీలు, రైస్, పేపరు మిల్లులు.. ఇలా 36 వివిధ రకాల కర్మాగారాల నుంచి విష జలాలు కొల్లేరుకు చేరుతున్నాయి. నాలుగేళ్ల క్రితం నెదర్లాండ్‌కు చెందిన జులూలాండ్ యూనివర్సిటీ కొల్లేరు జలాలను పరీక్షించి 14 రసాయనాలను గుర్తించింది. నీటిలో 3% ఉండాల్సిన సెలినిటీ(ఉప్పుశాతం) కొల్లేరులో 12% ఉన్నట్టు వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (వెట్)- భీమవరం వివరించింది. నల్లజాతి చేపలు కనుమరుగు.. వ్యర్థ జలాల వల్ల కొల్లేరులో కొరమేను, ఇంగిలాయి, బొమ్మిడాయి, మట్టగిడిస వంటి నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. పొలాల నుంచి బైప్యూరాన్, నియోడాక్స్, గ్రోవిరాన్, ఎకలెక్స్, గెమాక్సిన్ వంటి రసాయనాలు చేరుతున్నాయి. ఫ్యాక్టరీల నుంచి మెరూ్క్యరీ, ఆర్సెనిక్, కాడ్మియం, అల్యూమినియం వంటివి మోతాదుకు మించి కొల్లేరులో ఉన్నట్టు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లు గుర్తించారు. ఈ నీటిని తాగిన, వీటిలో పెరిగిన చేపలను తిన్న మానవుల నాడీ వ్యవస్థ, కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ప్రధానంగా క్యాన్సర్‌కు దారితీస్తోందని కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్‌నాయుడు చెప్పారు. మోతాదుకు మించి... నదులు, కాల్వల్లో ఖనిజ లవణాలు 200- 330 పీపీఎం(ఫాస్సర్ మిలియన్)గా ఉండాలి. కొల్లేరులో ఏకంగా 22వేల పీపీఎంను గతేడాది జూన్‌లో గుర్తించాం. కొల్లేరుకు చేరే నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి విడుదల చేయాలి. - డాక్టర్ పి.రఘురాం, అసిస్టెంట్ ప్రొఫెసర్, వెట్ సెంటర్- భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు విస్తీర్ణం: 77,138 ఎకరాలు విస్తరించిన మండలాలు: పశ్చిమగోదావరి-7, కృష్ణా- 2 ఏటా కొల్లేరులో కలిసే వ్యర్థ జలాలు: 17 వేల టన్నులు రెండు జిల్లాల్లో కొల్లేరు జనాభా: 3.20 లక్షలు కొల్లేరుకు నీటిని చేరవేసే డ్రెయిన్లు: 67 -
ఎన్నెన్నో.. అందాలు
గలగల పారే గోదావరి..కిలకిలరావాల కొల్లేరు..పాపికొండల సోయగం..ఏజెన్సీలోని కొండకోనల్లోసవ్వడి చేసే సెలయేళ్లు..ఆహ్లాదపరిచే అడవులు.. మరో పక్క ఆధ్యాత్మిక సాగరంలోఓలలాడించే ఆలయాలు.. ఇలా ఆనందంలో ముంచెత్తే ప్రకృతి అందాలకు.. ఆధ్యాత్మిక దేవాలయాలకు జిల్లాలో కొదవ లేదు.. పర్యాటకులను సేదతీర్చే టూరిజం స్పాట్లకు కొరత లేదు.. నేడు వరల్డ్ టూరిజం డేసందర్భంగా అలాఅలా.. ఆ వివరాలు ఇలాఇలా.. బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ఆహ్లాదానికి నెలవు. ఇక్కడ చెట్టు, చేమ, నీరు, రాయి, కొండ ప్రతీది ఆకర్షణీయమే.. ప్రత్యేకమైనవే.. ఈ ప్రాంతంలోని జలపాతాలు.. కొలువైన వన దేవతలు.. ప్రసిద్ధ పర్యాట ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. గోదావరిలో కొనసాగే పాపికొండల యాత్ర అత్యంత మధురమైన అనుభూతిని ఇస్తుంది. పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పాపికొండల యాత్ర మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో ప్రయాణించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. గతంలో పట్టిసీమ, పోలవరం, రాజమండ్రి నుంచి బోట్లలో ప్రయాణం సాగించేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సింగన్నపల్లి నుంచి బోటు ప్రయాణం ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది గోదావరి విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణ సమయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటే పాపికొండల విహారయాత్రలో అనుభూతి మరువలేనిదని పర్యాటకులు అంటున్నారు. పాపికొండల యాత్రలో పట్టిసీమ, వీరభద్రస్వామి, మహానందీశ్వరస్వామి ఆలయాలు, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటీష్ కాలం నాటి పోలీస్‌స్టేషన్, 11వ దశాబ్దం నాటి ఉమా చోడేశ్వరస్వామి ఆలయం, కొరుటూరు రిసార్ట్స్‌ను సందర్శించవచ్చు. గోదావరి వెంబడి గట్లపై గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులకు ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తాయి. పేరంటపల్లి శివునిగుడి ఆధ్యాత్మిక విశ్రాంతినిస్తుంది. కొండల్లోకొలువైనగుబ్బలమంగమ్మ దట్టమైన అటవీప్రాంతం ఎత్తైన కొండలు మధ్య గుహలో కొలువైన తల్లి గుబ్బల మంగమ్మ. గిరిజన ఆరా«ధ్య దేవతగా పూజలందుకుంటున్న ఈమెకు వరాలిచ్చే దేవతగా పేరు. ప్రతి ఆది, మంగళవారం అమ్మ దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తరవాత దట్టమైన అడవిలో కొంత దూరం వెళ్లిన తరవాత అమ్మ గుడి వస్తుంది. బుట్టాయగూడెం మండలంలోని మారుమూల కొండరెడ్డి గ్రామమైన ముంజులూరు సమీపంలో ఏనుగుల తోగు జలపాతం చూపరులను ఆకర్షిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా మారనున్న పోలవరం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్టు పూర్తి అయ్యి టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి పరిస్తే ప్రపంచ స్థాయి పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు. కనువిందు చేసే కొల్లేరు అందాలు ఆకివీడు: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 340 చ.మైళ్ల విస్తీర్ణంలో ఉంది. సరస్సు పరీవాహక ప్రాంతంలో సుమారు 280 రకాల పక్షులు సంచరిస్తున్నాయి. కొల్లేరు ప్రాంతంలో పడవలు, దోనెలు, లాంచీలలో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. కొల్లేరులో పక్షి ఆవాస కేంద్రాలు ఆటపాక, గుడివానిలంక ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు విదేశీ పక్షులు ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలవరకూ వలస వచ్చి విడిది చేస్తుంటాయి. మరికొన్ని విదేశీ పక్షులు ఈ ప్రాంతాల్లోనే జీవిస్తున్నాయి. కొల్లేటి అందాల్ని మరింతగా తిలకించేందుకు కొల్లేరు నడిబొడ్డున ఉన్న పెద్దింటి అమ్మవారి ఆలయంకు చేరుకుంటే ఆ ప్రాంతం నుంచి కూడా కొల్లేరు అందాలు తిలకించవచ్చు. చారిత్రక ప్రసిద్ధి గుంటుపల్లి బౌద్దాలయాలు కామవరపుకోట: జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గుంటుపల్లి బౌద్దాలయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇవి క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.పూ 10వ శతాబ్దం వరకు ప్రముఖ బౌద్దారామాలుగా విరాజిల్లాయి. ఈ గుహలను క్రీ,శ 4వ శతాబ్దంలో చైనా నుంచి షాహియాన్, 7వ శతాబ్దంలో హుయాన్సాంగ్ సందర్శించారు. నేటికి ఈ గుహలను సందర్శించటానికి విదేశాల నుంచి సయితం ప్రతీ ఏడాది విదేశాల నుంచి పర్యాటకులు రావడం విశేషం. ఈ గుహలలో వర్తులాకారములో ఉన్న స్థూపంను «ప్రస్తుతం దర్మలింగేశ్వరస్వామిగా స్థానికులు కొలుస్తున్నారు. ఇసుక రాతి కొండ అంచున వేరు వేరు పరిణామాలలో తొలిచిన గదులు కూడా ఇచట కలవు. ఉప్పలపాడు నుంచి జీలకర్రగూడెం వరకు పది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కొండలు సర్పం ఆకారంలో మెలికలు తిరిగి ఉండటంతో మహానాగపర్వతముగా వర్ణిస్తుంటారు. అనేక ప్రత్యేకతలతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటక కేంద్రంగా పెనుగొండ దివ్యక్షేత్రం పెనుగొండ : వాసవీ కన్యకాపరమేశ్వరి పుట్టినిల్లైన పెనుగొండ దివ్యక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం రికార్డు స్థాయిలో పెనుగొండను రెండు లక్షలకు పైగా పర్యాటకులు అమ్మవారిని సందర్శించారని అంచనా. దేశంలోనే నలుమూలల నుంచి నిత్యం భక్తులు వచ్చి వాసవీ శాంతి థాంలోని వాసవీ మాతను, మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏపీ టూరిజం సైతం పెనుగొండను పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వాసవీ శాంతి థాం, మూలవిరాట్ ఆలయాలకు విస్త్రత ప్రచారం కల్పిస్తోంది. -
ప్రమాదంలో కొల్లేరు సరస్సు..
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కొల్లేరు సరస్సు ఉప్పు నీటి సరస్సుగా మారిపోతుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరుకు ఉన్న 67 మేజర్, మైనర్ డ్రెయిన్ల నుంచి నీరు రాకపోవడంతో ఎండిపోతుందన్నారు. కొల్లేరు లోతు పెంచి నీటి సామర్థ్యం పెంచాల్సిన అవసరం ముందన్నారు. సముద్రం నుండి ఉప్పు టేరుకు, ఉప్పుటేరు నుండి కొల్లేరుకు ఉప్పు నీరు రాకుండా రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తీర ప్రాంతంలో సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లేరును పరిరక్షించి పక్షి జాతులను కాపాడాలని, కొల్లేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. గత నెల 28న కొల్లేరు పరిరక్షణకు కలెక్టర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం జరిగిందని తెలిపారు.