సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించడం మానేసి ప్రజలకు పెద్ద సమస్యగా మారారని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు కొంతైనా అభివృద్ధిపై దృష్టిసారించి ఉంటే ఇప్పుడు కొల్లేరు సరస్సు, పోలవరం ముంపు గ్రామాల సమస్య ఇంత జటిలమయ్యేది కాదన్నారు. ‘వడ్డీలు’ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సైదు గాయత్రీ సంతోషి అధ్యక్షతన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆ కులస్తుల రాష్ట్రస్థాయి నాయకుల సమావేశంలో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన కులాలను వెలుగులోకి తీసుకొచ్చి వారి సామాజిక, రాజకీయ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అందులో భాగంగానే అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ‘వడ్డీలు’కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి, తద్వారా వారు అభివృద్ధి చెందేలా ఒక చక్కని వేదికను రూపొందించామన్నారు.
ఈ కులస్తుల ప్రధాన సమస్యలైన కొల్లేరు, కాంటూరుపై పూర్తిగా అధ్యయనం చేసి సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. బీసీలను బలమైన నాయకులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్లను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు. సమావేశంలో వడ్డీలు కార్పొరేషన్ డైరెక్టర్లు పలువురు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment