నీరు లేక ఎడారిగా మారుతున్న కొల్లేటి సరస్సు ప్రాంతం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొల్లేరు మంచినీటి సరస్సు అంపశయ్యపై ఉంది. సరస్సు మనుగడ పూర్తిగా కోల్పోయింది. కొల్లేరును అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపే చూడటంలేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఎప్పటికప్పుడుపబ్బం గడుపుకుంటున్నాయి.
ఆకివీడు : ఎన్నికల ముందు కొల్లేరు ప్రాంతాన్ని రక్షిస్తామని, సరస్సు మనుగడను కాపాడతామని ప్రగల్భాలు పలికిన నాయకులు అనంతరం దాని ఊసే ఎత్తకపోవడం దారుణం. మూడవ కాంటూర్ వరకూ అయినా సరస్సును కాపాడతారని భావించిన పర్యాటకులకు నిరాశే మిగిలింది. 2004కి ముందు కొల్లేరు సరస్సు ఏ విధంగా ఆక్రమణలకు గురై చేపల చెరువులు తవ్వారో అదే పరిస్థితి నేడు దాపురించింది. బడా కంపెనీలు, పెత్తందార్లు, అధికార పార్టీ నాయకులు కొల్లేరును దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సరస్సులోకి చొచ్చుకువచ్చే కాలువలు : కొల్లేరు సరస్సులోకి రెండు జిల్లాల నుండి సుమారు 120 పంట, మురుగు కాల్వల నుంచి నీరు చొచ్చుకువస్తుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరులతో పాటు వివిధ కాలువల నుంచి నీరు వస్తుంది. కృష్ణా, పశ్చిమ డెల్టాలకు చెందిన ఆయకట్టు నీరు కూడా కొల్లేరులోకే చొచ్చుకువస్తుంది. కొల్లేరు నుండి సుమారు 22 వేల క్యూసెక్కుల నీరు ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది.
అడ్రస్సులేని ఐదో కాంటూర్
ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణా కేంద్రంగా కొల్లేరు సరస్సులోని ఐదవ కాంటూర్ వరకూ భూమిని సేకరించి హద్దులు వేసింది. జీపీఎస్ సర్వే చేసి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఐదో కాంటూర్ వరకూ కొల్లేరు రక్షణకు 2005లో రూ.120 కోట్లు వెచ్చించారు. అప్పటి నుండి కొల్లేరు అభయారణ్యం పరిరక్షణకు ప్రభుత్వం ఏటా మూడు నుండి పది కోట్లు వెచ్చిస్తూ వస్తోంది. అభయారణ్యం పరి«ధిలో ఇంత వరకూ 550కి పైగా కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కాంటూర్‌లోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానరాని చిత్తడి నేలలు చట్టం
దేశంలోని 25 ప్రముఖ సరస్సుల నియంత్రణ బాధ్యతలను కేంద్రం తీసుకుంటూ చిత్తడి నేలల పరిరక్షణ నిర్వహణా నిబంధనలు–2009 పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చింది. చట్ట పరిధిలోకి కొల్లేరు సరస్సును కూడా తీసుకువచ్చి చిత్తడి నేలల్ని మెట్ట భూములుగా మార్చడాన్ని పూర్తిగా నిషేధించింది. కేంద్ర పర్యావరణం, అటవీశాఖ 1989లో విడుదల చేసిన మూడు ఉత్తర్వుల్లో పొందుపరచిన విధంగా ప్రమాదకర వ్యర్థాలను కొల్లేరులో తయారుచేయడం, నిల్వ ఉంచడం, పారవేయడం నిషేధించారు. డ్రెయిన్ల నీరు, పరిశ్రమల వ్యర్థాలు, కలుషితనీరు, ఇతర వ్యర్థాలను సరస్సులోకి వదలకూడదు. అయితే అందుకు విరుద్ధంగా కొల్లేరు సరస్సును డంపింగ్ కేంద్రంగా మార్చివేశారు. పరిశ్రమల రసాయనిక వ్యర్థాలు, పట్టణాలు, నగరాల నుండి కొల్లేరులోకి చొచ్చుకు వస్తున్నాయి. శాశ్వత నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి. పరిశ్రమల స్థాపన కొనసాగుతోంది. ఐదవ కాంటూర్ భూముల్ని పూడ్చివేస్తున్నా అభయారణ్యం పరిరక్షించాల్సిన అధికారులు అడ్రస్సులేరని పలువురు ఆరోపిస్తున్నారు.
రెగ్యులేటర్‌ల నిర్మాణం హుళ్లక్కే?
కొల్లేరు సరస్సు పరిరక్షణకు ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు నిర్మించాలని 1964లోనే మిత్రా కమిటీ సూచించింది. ఆ ప్రకారంగా ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద ఒకటి, సముద్రం ముఖద్వారం వద్ద, ఉప్పుటేరు క్రాస్‌బండ వద్ద మరొకటి నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వం అనేకమార్లు నిపుణుల కమిటీలను నియమించి నివేదికలు సేకరించినా రెగ్యులేటర్ల ఊసేలేదు.
సరస్సు భౌగోళిక స్వరూరం
పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో çసహజసిద్ధంగా వెలసిన కొల్లేరు సరస్సు 340 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరస్సు లోతు రెండు మీటర్లు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 7 మండలాలు, కృష్ణా జిల్లాకు చెందిన 2 మండలాలు కలిపి మొత్తంగా 122 గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 3.20 లక్షల మంది జనాభా (80 వేల కుటుంబాలు) ఉంది. ప్రస్తుతం యాభై శాతం మంది జనాభా వలస వెళ్లిపోయారు. కొల్లేరు ప్రక్షాళన అనంతరం సరస్సును 77,138 ఎకరాలకు కుదించారు. దీనిలో 19,000 ఎకరాలు జిరాయితీ ఉంది.
మూడవ కాంటూర్‌కు కుదించాలి
కొల్లేరు సరస్సును మూడవ కాంటూర్ వరకూ కుదించి సరస్సును అభివద్ధి చేయాలి. ఐదవ కాంటూర్ వరకూ సరస్సు ఉన్నప్పటికీ అభివద్ధి చేయకపోవడంతో నిరుపయోగంగా ఆక్రమణలకు గురవుతోంది. సరస్సును పరిరక్షించి, కొల్లేటి ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలి. – కొల్లి రాంబాబు, గ్రామ పెద్ద, కొల్లేటికోట గ్రామం
రెగ్యులేటర్ నిర్మించాలి
కొల్లేరు సరస్సు కిక్కిసతో నిండిపోయింది. సరస్సు అభివృద్ధికి నిధులు ఇవ్వడంలేదు. సరస్సు ప్రక్షాళన తరువాత 50 శాతం ప్రజలు వలస వెళ్లిపోయారు. కొల్లేరు ప్రజలకు రాయితీలు లేవు, వ్యవసాయం లేదు. వేట లేదు. అభివద్ధి చేయాలి, లేకుంటే ప్రజలకు ఇవ్వాలి. – జుల్లూరి రాజు, గ్రామపెద్ద, పందిరిపల్లిగూడెం
Comments
Please login to add a commentAdd a comment