సుందర కొల్లేరు.. ఉప్పొంగితే ‘ముప్పు’టేరు | Kolleru was flooded again | Sakshi
Sakshi News home page

సుందర కొల్లేరు.. ఉప్పొంగితే ‘ముప్పు’టేరు

Published Fri, Sep 13 2024 6:03 AM | Last Updated on Fri, Sep 13 2024 6:03 AM

Kolleru was flooded again

బుడమేరు, తమ్మిలేరు, రామిలేరుతోపాటు 35 డ్రెయిన్లు, కాలువలతో సతమతం

ఏటా వరదలు పోటెత్తడంతో అతలాకుతలం

ఫలితంగా దీని చుట్టుపక్కల గ్రామాలు, లంకలకు ముంపు ముప్పు

కొల్లేరు పరిరక్షణకు 1964లో మిత్ర కమిటీతోపాటు అనేక సిఫార్సులు

పర్యాటక కేంద్రంగా.. పర్యావరణ క్షేత్రంగా తీర్చిదిద్దితే మేలు 

‘‘విశాలమైన సరస్సులో ఈదులాడే చేపలు.. విదేశాల నుంచి విడిదికి వచ్చి విహరించే పక్షి సమూహాలు.. నీటి మధ్య వెలసిన ఊర్లలో రెక్కల కష్టంతో బతికే మనసులు’’.. ఇది సహజ సిద్ధమైన కొల్లేరులో మామూలు రోజుల్లో కన్పించే సుందర దృశ్యం..

‘‘ఎటు చూసినా సముద్రంలా ఉప్పొంగిన నీరు.. వరద నీటిలో మునిగిన గ్రామాలు.. రెక్కల కష్టం మొత్తం నీటిపాలై బతుకు జీవుడా అనుకుని భోరున విలపించే ప్రజలు.. నిలువ నీడలేక విలవిల్లాడే పక్షులు.. వరద పోటుకు గల్లంతయ్యే చేపలు’’.. ఇదీ ఏటా వరద ధాటికి కొల్లేరు ఉగ్రరూపం.

కొల్లేరుకు మళ్లీ వరద పోటెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే కొల్లేరు చిగురుటాకుల్లా వణికిపోతోంది. కృష్ణా–గోదావరి నదుల మధ్య డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతంలో విస్తరించిన ఈ సరస్సుకు ఏటా భారీగా వరదనీరు పోటెత్తడంతో అతలాకుతలమవుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు భారీ డ్రెయిన్లతో పాటు మరో 31 మీడియం, మైనర్‌ డ్రెయిన్లు, కాలువలు, ఛానల్స్‌ ద్వారా వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కొల్లేరుకు చేరుతుంది. 

ప్రస్తుతం వరద పోటు పెరగడంతో 1,10,920 క్యూసెక్కుల నీరు కొల్లేరుకు వస్తోందని అంచనా. కొల్లేరు నుంచి కేవలం 12 వేల క్యూసెక్కులు మాత్రమే ఉప్పుటేరు డ్రెయిన్‌ ద్వారా 62 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలోకి చేరుతుంది. దీంతో కొల్లేరులోని గ్రామాలు, లంకలతోపాటు దానికి ఆనుకుని ఉన్న గ్రామాలు సైతం ముంపు ముప్పుతో సతమతమవుతున్నాయి.  – సాక్షి, అమరావతి 

దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు.. 
ఏలూరు–పశి్చమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ చిత్తడి నేలల జాబితాలో దీన్ని గుర్తిస్తూ 1971లో ఇరాన్‌ సదస్సు తీర్మానించింది. కొల్లేరు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు, ఉద్య­మ­కారులు గళమెత్తారు. 

కొల్లేరులో చేపల చెరువుల సాగు­తోపాటు గ్రామాలు కూడా పెద్దఎత్తున వెలిశాయి. ఏలూరు జిల్లాలోని కైకలూరు, మండవల్లి, పెదపాడు, ఏలూ­రు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమ­ర్రు మండలాలతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో విస్తరించిన కొల్లేరులో 71 గ్రామాలు, కొల్లేరు­కు ఆనుకుని 150 గ్రామాలు కలిపి మొత్తం 221 గ్రామాలున్నాయి.  

కొల్లేరు రక్షణకు అధ్యయనాలెన్నో.. 
కొల్లేరు సరస్సు గొప్ప జీవవైవిధ్యం కలిగి ఉంది. వలస పక్షులు, అరుదైన చేప జాతులతోపాటు ప్రజలకు జీవనాధారంగా మారింది. కానీ, చేపల చెరువుల సాగు,  ఆక్రమణలతో సహజత్వాన్ని కోల్పోయింది. దీనికితోడు.. వస్తే వరదలు ముంచెత్తడం.. లేదంటే ఉప్పుటేరు ముఖద్వారం ద్వారా సముద్రపు నీరు చొచ్చుకురావడంతో కొల్లేరు దెబ్బతింటోంది. 

ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు ఇబ్బందిలేకుండా కొల్లేరు సహజత్వాన్ని కాపాడి పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పర్యాటక రంగాన్ని కూడా పెంపొందిస్తే మేలని పలు సంస్థలు, పర్యావరణవేత్తలు అధ్యయనం చేసి పలు  సిఫార్సులు చేశారు. 1964లో మిత్ర కమిటీ నివేదిక తర్వాత అనేక కమిటీలు అధ్యయనం చేశాయి. తాజాగా.. న్యూఢిల్లీలోని ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌ విభాగం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహకారంతో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీకృత అధ్యయనం నిర్వహించింది. 

కొల్లేరును కాపాడుకునేలా సిఫార్సులు.. 
రెగ్యులేటర్ల నిర్మాణంతోపాటు కొల్లేరుకు సమాంతరంగా ప్రత్యామ్నాయ ఛానల్స్‌ ఏర్పాటుచేసి వరద నీటిని సముద్రానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరును కనీసం మూడో కాంటూర్‌గా నిర్ణయించి ఆ పరిధిలో ఆక్వా సాగును అనుమతించకూడదు. వీటితోపాటు..

»  సరస్సులోను, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోను పర్యావరణ పరిరక్షణకు ప్రాధా­న్యత ఇవ్వాలి.  

»  కొల్లేరు నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా సము
ద్రానికి వెళ్లేలా ఉప్పుటేరును పూర్తిగా తవి్వన తర్వాతే ప్రత్యామ్నాయ ఛానలైజేషన్‌ పథకాన్ని పునఃప్రారంభించాలి.  

»  సరస్సు లోపల నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకునే నిర్మాణాలు, చెరువులను, రోడ్లను తొలగించాలి.

కొల్లేరు పూడిపోకుండా  ఎప్పటికప్పుడు డీసిల్టింగ్‌ కార్యకలాపాలు తప్పనిసరిగా నిర్వహించాలి.

»  కాలువలకు అడ్డంగా ఉన్న అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లను ఏర్పాటుచేయాలి.  

» కొల్లేరుకు ఉప్పునీటి చొరబాటును నియంత్రించేలా ఉప్పుటేరుపై పడతడిక, మొల్లపర్రు ఓల్డ్‌ కోర్సు, ఆకివీడు సమీపంలోని పేరంటాల కనుమ వద్ద మూడు రెగ్యులేటర్లను నిరి్మంచాలి.

»  ఆలపాడు నుండి గుండుగొలను రహదారికి తూర్పున ఉన్న ఈ అలైన్‌మెంట్‌ను ఒక భాగం.. కైకలూరు–ఏలూరు రహదారితోపాటు ఆళ్లపాడు–ప్రత్తికోళ్లలంక–గుడివాకలంక–ఏలూరు మధ్య రెండో భాగం.. కైకలూరు–ఏలూరు రహదారికి పశి్చమం వైపు 3వ భాగం.. ఏలూరు–గుడివాకలంక–కొక్కిరాయిలంక–చెట్టున్నపాడు–కమ్మగుండపాడు–ఆగడాలలంక–గుండుగొలను రోడ్డు (’యు’ ఆకారంలో రహదారి) అలైన్‌మెంట్‌ను 4వ భాగంగా అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.  

»  సరస్సు నీటిమట్టం తగినంతే ఉండేలా బుడమేరు, తమ్మిలేరు వంటి ప్రధానమైన వాటి నీటి ప్రవాహాలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలి.  

»  రోడ్డు నిర్మాణాల కారణంగా ఛిన్నాభిన్నమైన కొల్లేరు సరస్సును రహదారి అమరికల ఆధారంగా నాలుగు భాగాలుగా (10,000 నుండి 12,000 ఎకరాల వరకు) విభజించి అభివృద్ధి చెయ్యొచ్చు.  

»  కొల్లేరుకు తూర్పున పంది­కోడు, తోకలపల్లి, కాపవరం కాలువలను ఉప్పుటేరులో ఒకటి,పశి్చ­మ వైపున బుడమేరు, రామిలేరు, పోల్రాజు, చంద్రయ్య, పెద కొమ్మిలేరు, చైనా కొమ్మిలేరు కాలువలను ఉప్పుటేరులో కలుపు­తూ మరొకటి.. వరదను నివారించేలా ఇరువైపులా డ్రెయిన్లు నిరి్మంచాలి.

»  సరస్సు చుట్టూ ఉన్న పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుండి వ్యర్థ జలాలను నివారించడంతోపాటు వాటి నుంచి వచ్చే నీటి నాణ్యతను, సరస్సు జలాల నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మానిటరింగ్‌ స్టేషన్‌ను 
ఏర్పాటుచేయాలి.  

»  సరస్సు నీటి పర్యావరణ నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రయోగశాల సౌకర్యాలతో కూడిన హైడ్రో బయోలాజికల్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement