
మార్చి 13 వరకు పెద్దింట్లమ్మ జాతర
వేంగి – చాళుక్యుల కాలం నుంచి పెద్దింట్లమ్మకు పూజలు
తెలంగాణ బోనాల తరహాలో మొక్కులు
కొల్లేటికి మహాపట్టమహిషి పెద్దింట్లమ్మ జాతర ద్వీపకల్పమైన కొల్లేరు సరస్సు మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఏలూరు జిల్లా, కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ జాతర జరుగుతుంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 13 వరకు అమ్మవారి జాతర (తీర్థం) నిర్వహిస్తున్నారు. జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరుల కల్యాణం మార్చి 10, ఆదివారం రాత్రి జరిగింది.
కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి 9అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. కాలాలతో పాటు కోటలు మాయమైనప్పటికీ పెద్దింట్లమ్మ తల్లి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సామాన్యంగా ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది. కానీ పెద్దింట్లమ్మ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివసించే వారందరికీ కులదైవంగా ఆరాధింపబడటం విశేషం.
గ్రంథాల్లో కొల్లేరు అందాలు..
రామాయణం అరణ్యకాండలో అగస్త్య మహాముని శ్రీరాముడికి ఈ సరస్సు గురించి చెప్పినట్లు ఉంది. అదేవిధంగా దండి అనే మహాకవి తన దశకుమార చరిత్రలో కొల్లేరు సరస్సును అభివర్ణించాడు. చరిత్రలో కొల్లేటికోట, కొల్లేరు సరస్సుప్రాంతాన్ని కొల్లేటికోట, కొల్లివీటికోట, కర్ణపురి, కొల్హాపురి, కృష్ణా, గోదావరి సంగమదేవ పుష్కరిణీ, సృష్ట్యారంభ పద్మ సరస్సు, దేవపుష్కరిణి, బ్రహ్మ సరస్సు, అరజా సరోవరం, బ్రహ్మండ సరస్సు, కోలాహలపురం, కొల్లేరు, కొలనువీడు అని వ్యవహరించేవారు.
కొల్లేరుకు తెలంగాణ బోనాల సాంప్రదాయం..
తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తోన్నారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలు ప్రతీ ఏటా తీసుకొస్తున్నారు. రాత్రి సమయంలో దీపాల మధ్య బోనాలు, 7 కావిళ్ళలో అమ్మవారి పుట్టింటి నైవేద్యం పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లుతో పెద్దింట్లమ్మ దేవస్థానం తీసుకు రానున్నారు.
3 మైళ్ళ దూరంలోని గోకర్ణేశ్వరపురంలో గోకర్ణేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారితో అంగరంగ వైభవంగా ఆదివారం కల్యాణం జరిపించారు. ఆ సమయంలో కొల్లేరు పెద్ద జనారణ్యంగా మారిపోయింది. జాతర పదమూడు రోజులని పేరే కానీ ఫాల్గుణ మాసం నెలరోజులూ ప్రతి ఆదివారం కొల్లేరు భక్తజన సంద్రంగా మారిపోతుంటుంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి, జిల్లాల నుంచి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారినీ దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ
ఉంటారు.
– బి.శ్యామ్, సాక్షి, కైకలూరు, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment