
ఆదివాసీ సమాజంలో ఇలవేల్పు జాతరలు అత్యంత ప్రధానమైనవి. ప్రతి ఏడాదీ మాఘ పున్నమి తరువాత తమ తమ కులదేవతలకు జాతరలను జరపడం ఆదివాసీల ఆచారం. ప్రతి తెగలో వంశాలు, ఇంటిపేర్లు బట్టి కులదేవతలు ఉంటారు. కోయ తెగవారిలో ఉన్న వంశాలను ‘గొట్లు’గా పిలుస్తారు. బేరంబోయిన వంశానికి చెందిన వారిది ఈ గొట్లలో ఒకటి. ఈ వంశానికి చెందిన కొమరం ఇంటి పేరు ఉన్న వారి ఇల వేల్పు ‘రెక్కల రామక్క.’ వీరు రెండేళ్లకొక మారు ఆమెకు జాతర జరపడం తరతరాలుగా వస్తోంది. భద్రాది–కొత్త గూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం, నడిమి గూడెంలో ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుండి 21 వరకు జాతర జరుగుతోంది.
ప్రచారంలో ఉన్న కథ ప్రకారం–బేరంబోయిన రాజు కోయల్లో గొట్టు – గోత్రాల వ్యవస్థ ఏర్పాటు చేశారని నమ్ముతారు. ఈ రాజునే కార్తీక రాజు అంటారు. ఆయన భార్య మూడవ గట్టుకు చెందిన కాకేరి పూజారి గోత్రం అడ బిడ్డ వరందేవి. ఈమెనే ఆదిశక్తిగా కూడా పిలుస్తారు. రెక్కల రామక్క(పక్షి) రూపంలో బేరంబోయినవారు ఈమెను కొలుస్తున్నారు. జాతర సందర్భంగా ఈమెకు బోనం సమర్పిస్తారు. అలాగే ఈ దేవతకు (వంశానికి) సంబంధించిన ‘పడిగ’ జాతరలో ప్రత్యేక ఆకర్షణ. పడిగపై చిత్రలిపి ఉంటుంది. పడిగ అంటే కోయ తూర్ సమాజంలో ‘ఇంటికి పెద్ద కొడుకు’ అని అర్థం. అంటే కుటుంబాన్ని రక్షించేవాడు. మధ్య భారతంలోని కోయతూర్ సమాజం పడిగలను అతి పవిత్రంగా పూజిస్తూ వేల్పుగా కొలుస్తారు. ఈ పడిగ త్రిభుజ ఆకారంలో ఉండే ఎర్రని గుడ్డ. దీనిపై బొమ్మలు ఉంటాయి.
జాతరకు వచ్చే వంశస్థులు తమ పడిగను తీసుకు వస్తారు. అక్కడ ‘డోలి’వారు వారిని కూర్చోబెట్టి పడిగలోని చిత్రలిపిని చూపి రేల పాటలతో ఆ వంశ చరిత్రను మొత్తం చెబుతారు. జాతర్లలలో పడిగలకు పసుపు, కుంకుమలు రాసి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. జాతర అయిపోయినాక ఈ పడిగలను తీసుకెళ్ళె అతి పవిత్రంగా దాచి... మరలా రెండేళ్ళకు జాతర నాడు మాత్రమే పూజలు చేసి బయటకు తీసి ఆడిస్తారు.
– వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
(ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు రెక్కల రామక్క జాతర)
Comments
Please login to add a commentAdd a comment