bhadradri kothagudem dist
-
ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన కలెక్టర్ భార్య
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి.. ప్రసవం కోసం మంగళవారం రాత్రి భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. రాత్రి 12 గంటల సమయానికి ఆమెను కుటుంబసభ్యులు దవాఖానాకు తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల వైద్యసేవలు మెరుగవగా.. ప్రజల్లో మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ తన సతీమణిని చేర్పించారని కుటుంబసభ్యులు తెలిపారు. -
అభయారణ్యంలో మినీ ఊటి..!
కొత్తగూడెం అర్బన్: ఏజెన్సీ జిల్లాగా పేరున్న భద్రాద్రి కొత్తగూడెంలోని అభయారణ్యంలో మినీ ఊటిని తలపిస్తున్న కిన్నెరసానీ ప్రాజెక్టు పర్యటక ప్రాంతం జిల్లాకే మంచి గుర్తింపును ఇస్తుంది. అక్కడ అభయారణ్యంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చటి చెట్లు, చెట్లలో వంద రకాల పక్షులు, జంతువులు, పులులు, చిరుతలు, అడవిదున్నలు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, నక్కలు, కణుజులు, కోతులు, కొండముచ్చులున్నాయి. వన్యప్రాణులు, జంతువులు జీవ వైవిద్యానికి నిలయం కిన్నెరసానీ ప్రాజెక్టు. జింకల పార్కు 14.50 హెక్టార్ల విస్తీరణంలో ఉండగా, అభయారణ్యం 634.4 చ.కి.మీ విస్తీరణంలో ఉంది. జింకల పార్కు వద్ద పర్యాటకుల సందడి అయితే 1963–64 సంవత్సరంలో నిర్మాణం అయిన కిన్నెరసానీ ప్రాజెక్టు నుంచి నీరు పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలు తాగునీరుగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటుగా 10 వేల ఎకరాల పంటల పొలాలకు నీరును ఎడమ, కుడి కాల్వల ద్వారా అందిస్తుంది. అయితే ప్రాజెక్టు వద్ద 1972 సంవత్సరంలో అభయారణ్యం ప్రాంతంను పర్యటక ప్రాంతంగా టూరిజం వారు గుర్తించి అభివృద్ధి చేశారు. 1974 సంవత్సరంలో ఇక్కడ జింకల పార్కును ఏర్పాటు చేశారు. తొలుత 3 జింకలతో ఏర్పాడిన పార్కు, ప్రస్తుతం 132 జింకలతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇందులో కృష్ణ జింకలు, చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు అయితే తొలుత సింగరేణి ఆదీనంలో ఉన్న ఈ పర్యటక ప్రాంతం 2000 సంవత్సరం తరువాత వైల్డ్లైప్ వారి అప్పగించారు. అయితే ఇక్కడ ఉన్న అద్దాల మెడ ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అయితే 1999 సంవత్సరంలో ఫిపుల్స్ వారు దీనిని పేల్చివేశారు. అయితే ప్రస్తుతం అద్దాల మెడా, కాటేజ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయితే మరింతా మంది సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు, జింకల పార్కు, బొటింగ్ కోసం వారానికి పది వేల మంది వరకు సందర్శకులు అంతర్ రాష్ట్రల నుంచి వస్తున్నారు. జింకల పార్కు దృశ్యం అద్దాల మెడ, కాటేజ్లు పూర్తి అయితే సందర్శకులు, పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కెటీపిఎస్ అధికారులు రిజర్వాయర్ ప్రారంభంలో జలదృశ్యం(విశ్రాంతి గది) ఏర్పాటు చేశారు. అది మాత్రం మనుగడలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రలలలో మొసళ్లు మోరె జాతి (నల్లవి) వేల సంఖ్యలో కిన్నెరసానీ ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో పాటుగా కిన్నెరసానీలో బోటింగ్ ప్రతి రోజు ఉంటుంది. ప్రాజెక్టు చూడడానికి వచ్చిన ప్రతి వారు బోటింగ్ చేయకుండా వెళ్లారు. -
వైరల్: చిటారు కొమ్మన చిరుత.. ఇప్పుడెలా!
సాక్షి, భద్రాద్రి కొత్త గూడెం: గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో పులి సంచారం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. అడవిలో ఉండాల్సిన పులి.. జనారణ్యంలోకి వచ్చి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో ఆసిఫాబాద్లో పులి కలకలం రేపిన సంగతి తెలిసింది. నేటికి కూడా దాని జాడ గుర్తించలేకపోయారు అధికారులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి కలకలం సృష్టించింది. వాజేడు మండలంలోని కొంగాల గ్రామ సమీపంలో గల అడవిలో చిరుత కనిపించింది. పశువులు మేపడానికి వెళ్లిన వారికి చెట్టు ఎక్కిన చిరుతపులి దర్శనమిచ్చింది. వెంటనే వారు తన వద్ద ఉన్న సెల్ఫోన్లో ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. చెట్టు చిటారు కొమ్మన ఉంది ఈ చిరుత. ప్రస్తుతం చెట్టెక్కిన ఈ చిరుత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయం వాజేడు అటవీ శాఖ అధికారులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. దాన్ని క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చిరుతపులి ఉన్న ప్రాంతానికి ఎవర్నీ అనుమతించటంలేదు. ఏదో శబ్దానికి ప్రాణ భయంతో చిరుతపులి చెట్టు ఎక్కి ఉంటుందని భావిస్తున్నారు స్థానికులు. గతంలో ఎన్నడూ లేని విధంగా అడవి జంతువులు గ్రామ సమీపంలో సంచరించిడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: క్రాక్!.. మొదటి నుంచీ ఆ పులిది విచిత్ర ప్రవర్తన -
రేపే పల్స్ పోలియో..
సాక్షి, ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఈనెల 10వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతిబాయి పిలుపునిచ్చారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 0–5 ఏళ్లలోపు 1,27,887 మంది పిల్లలను గుర్తించామని, వారందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయిస్తామన్నారు. అందుకోసం 8,500 వయల్స్ను సిద్ధం చేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 123, పట్టణ ప్రాంతాల్లో› 105, గ్రామీణ ప్రాంతాల్లో 672 పోలియో చుక్కలు వేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు 3,600 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. మైగ్రేటెడ్ ప్రజల కోసం ఆయా ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మురికి వాడల్లో పిల్లల కోసం సంచార వాహనాల ద్వారా పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 11, 12వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి మిగిలిన పిల్లలను గుర్తించి.. వారికి చుక్కలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. ప్రయాణంలో ఉన్న వారి కోసం బస్, రైల్వే స్టేషన్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామని, అలాగే నిర్మాణ స్థలాల్లో తాత్కాలికంగా నివసించే వారి కొరకు సంచార బృందాలను సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు, యువజన, మహిళా సంఘాలు సహకారం అందించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమ పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ మాలతి, డీఐఓ అలివేలు, డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. -
లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురి దుర్మరణం
పినపాక(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పినపాక మండలం దుగునేపల్లి పంచాయతి పరిధిలోని చేగర్సల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం కోట్లపల్లి పంచాయతి గడ్డంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్పై (మణుగూరు-ఏటూరునాగారం జాతీయరహదారిపై) వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఇసుక లారీకి ప్రమాదవశాత్తు ఢీకొన్నారు. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.