
ఆదివాసీ తిరుగుబాటుకు తిరుగులేని సాక్ష్యంగా నిలిచిన సమ్మక్క-సారలమ్మలకు మేడారం కేంద్రంగా అతి పెద్ద జాతర జరుగు తుంది. వీరితో సంబంధం కలిగినవాడే పగిడిద్దరాజు. ఆదివాసీ స్వయంపాలన కోసం కాకతీయులపై కత్తులు దూసి కదన రంగంలో అమరులైన సమ్మక్క భర్తే ఈయన. ఈయనకు భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ‘వేపలగడ్డ గ్రామం’లో అత్యంత వైభంగా ‘ఆరెం’ వంశస్థులు జాతర జరుపు తారు. ఈ ఏడాది మార్చి 5నుంచి 7 వరకు ఈ జాతర జరుగుతుంది.
కరువుకాలంలో కాకతీయు లకు కప్పం కట్టడానికి నిరాకరించిన కోయ రాజు పగిడిద్దరాజు పైకి చక్రవర్తి ప్రతాప రుద్రుడు దండెత్తి వచ్చాడనీ, ఆ యుద్ధంలో కోయరాజుతో పాటు ఆయన కూతుర్లు సారలమ్మ, నాగులమ్మ; కొడుకు జంపన్న, అల్లుడు గోవింద రాజులు అసువులు బాశారనీ, భార్య సమ్మక్క యుద్ధం చేస్తూ చిలకలగుట్ట ప్రాంతంలో అదృశ్యం అయిందనీ ఆదివాసుల విశ్వాసం. సమ్మక్క కుంకుమ భరణి రూపంలో ఇప్పటికీ చిలకల గుట్టపై ఉందని కోయలు నమ్ముతారు. అందుకే మేడారంలో జరిగే సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం చేరుకుంటేనే జాతర ప్రారంభం అవుతుంది.
పగిడిద్దరాజును ఒక పోరాట యోధునిగా కీర్తిస్తూ స్మరిస్తూనే దైవత్వం నుండే వీరత్వం పుట్టిందని... ఈయనను ఒక దైవంగా నేడు ఆదివాసీలు కొలుస్తున్నారు. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు తరలివస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు క్రీడలు నిర్వహిస్తారు. ఆదివాసీ స్వయం పాలన కోసం పోరాడి అమరుడైన పగిడిద్దరాజు స్ఫూర్తితో నేడు ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటం చేయాలి. మూలవాసీ అస్తిత్వాన్ని చాటు కోవాలి. ‘కంకవనం’ చేజారకుండా పొదివి పట్టుకోవాలి. ఆదివాసీ పోరాటాలకు, ఆరాటాలకు ప్రజాతంత్ర శక్తులన్నీ అండగా నిలవాలి.
– వూకె రామకృష్ణ దొర ‘ (నేటి నుంచి భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా, వేపలగడ్డలో 7వ తేదీ వరకు పగిడిద్ద రాజు జాతర)
Comments
Please login to add a commentAdd a comment