అడవి బిడ్డలకు ఆర్థిక వనరుగా భరోసా
బలవర్థక మందుల తయారీలో పువ్వు వినియోగం
కొత్తగూడ: ఇప్ప చెట్టు ఆదివాసీల కల్పవృక్షంగా పేరుగాంచింది. వారికి పలు రకాల ఆదాయాన్ని సమకూరుస్తూ ఆర్థిక భరోసానిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంత అడవుల్లో విరివిగా కనిపించే ఇప్పచెట్లకు ఆదివాసీ తెగలో కొందరు పూజలు చేస్తారు. ఇప్ప నుంచి వచ్చే పూలు, గింజలతో ఆదివాసీ తెగలకు ప్రత్యేక అనుబంధం ఉంది.
ఇప్ప పువ్వులో ఎన్నో బలవర్థకమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా కుడుములు చేసుకుని తినడం ఆదివాసీల ఆహారపు అలవాటు. గతంలో ఆదివాసీలు ఇప్పపువ్వుతో సారాయి తయారు చేసుకుని తాగేవారు. ప్రస్తుతం జీసీసీ (గిరిజన సహకార సంస్థ) ద్వారా పలు ఆయుర్వేద కంపెనీలు ఇప్ప పువ్వును సేకరించి శవన్‌ప్రా , బిస్కెట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు.
దైవారాధనకు ఇప్ప నూనె
ఇప్ప గింజలతో నూనె తీస్తారు. ప్రాచీన కాలంలో ఆదివాసీ కుటుంబాలు వంటల తయారీలో ఈ నూనె వాడుకునేవారు. ప్రస్తుతం దైవారాధనలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆదివాసీలు గింజలను పట్టించి కిలో ఇప్ప నూనెకు బదులు కిలో వంట నూనె (సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్, రైస్‌రిచ్ తదితర) తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో సేకరించిన వారు జీసీసీకి విక్రయిస్తున్నారు. జీసీసీ ఇప్పపువ్వును కిలో రూ.30, ఇప్ప పలుకు రూ.29తో కొనుగోలు చేస్తోంది. దీంతో స్థానికులు ఇప్ప పువ్వు, గింజల సేకరణకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ఆదివాసీలకు ఇప్పచెట్టుతో అవినాభావ సంబంధం
ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీ తెగలకు ఇప్ప చెట్టుతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఏటా జూన్ ప్రారంభంలో ఇప్ప చెట్టుకు పూజలు చేస్తారు. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా లభించే ఇప్ప ఉత్పత్తులను తక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్నారు. ఇప్ప పువ్వుకు రూ.100, పలుకులకు రూ.50 చెల్లించాలి.
– వాసం వీరస్వామి, ఉపాధ్యాయుడు
విక్రయానికి ఇబ్బందులు లేకుండా చూడాలి
ఇప్ప పువ్వు సేకరించి శుద్ధి చేసి విక్రయించుకునేందుకు వెళ్తే కొనుగోలు చేసే వారు ఆలస్యం చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిందే తరలించలేదు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సేకరణ సమయంలో ఇబ్బందులు లేకుండా చూడాలి.
– దాట్ల సుదర్శన్, కొత్తపల్లి గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment