సాక్షి, జైనూరు: తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒంటరిగా తన ఊరికి వెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీకి ఫోన్ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.
కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవుగూడ గ్రామం ఉంది. దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ.. తన సోదరులను కలిసేందుకు నెల 31న సిర్పూర్(యు) మండలంలోని కోహినూర్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. జైనూర్‌లో ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం.. ఆమెను నమ్మించి తాను కోహినూరు వెళ్తున్నట్టు చెప్పి ఆటో ఎక్కించాడు. ఈక్రమంలో షేక్ ముగ్దూం రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించాడు.
దీంతో, భయపడిన ఆమె కేకలు వేసింది. అనంతరం, షేక్ మగ్దూం.. ఆమెను బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో ఆమె ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో ఆమెను అక్కడే వదిలేసి ఆటో డ్రైవర్ పారిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఆమెను గుర్తించి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
అయితే, ఆమె స్పృహాలో లేకపోవడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తమ్ముడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు తాజాగా స్పృహలోకి రావడంతో అసలు విషయం బయట పడింది. తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి చేయడానికి యత్నించాడని, తాను ఎదురు తిరిగితే.. తన ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడని వివరించింది. దీంతో, పోలీసులు.. నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment