
సాక్షి, భద్రాద్రి కొత్త గూడెం: గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో పులి సంచారం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. అడవిలో ఉండాల్సిన పులి.. జనారణ్యంలోకి వచ్చి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో ఆసిఫాబాద్‌లో పులి కలకలం రేపిన సంగతి తెలిసింది. నేటికి కూడా దాని జాడ గుర్తించలేకపోయారు అధికారులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి కలకలం సృష్టించింది. వాజేడు మండలంలోని కొంగాల గ్రామ సమీపంలో గల అడవిలో చిరుత కనిపించింది. పశువులు మేపడానికి వెళ్లిన వారికి చెట్టు ఎక్కిన చిరుతపులి దర్శనమిచ్చింది. వెంటనే వారు తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. చెట్టు చిటారు కొమ్మన ఉంది ఈ చిరుత.
ప్రస్తుతం చెట్టెక్కిన ఈ చిరుత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ విషయం వాజేడు అటవీ శాఖ అధికారులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. దాన్ని క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చిరుతపులి ఉన్న ప్రాంతానికి ఎవర్నీ అనుమతించటంలేదు. ఏదో శబ్దానికి ప్రాణ భయంతో చిరుతపులి చెట్టు ఎక్కి ఉంటుందని భావిస్తున్నారు స్థానికులు. గతంలో ఎన్నడూ లేని విధంగా అడవి జంతువులు గ్రామ సమీపంలో సంచరించిడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment