
దేశవ్యాప్తంగా గిరిజన తెగల భాషా వారసత్వాన్ని పెంపొందించడానికి, దాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. భాషాపరమైన అంతరాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా భిలి, ముండారి, సంతాలి, గోండితో సహా అనేక దేశీయ గిరిజన భాషల్లో అనువాదం, అభ్యాసం కోసం కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ ‘ఆది వాణి’(Aadi Vaani)ని కేంద్రం ఆవిష్కరించనుంది.
సాంకేతికతతో సాధికారత
ఆది వాణిని అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వంటి ప్రముఖ సంస్థల సాయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గిరిజన భాషల్లో ప్రత్యేకత కలిగిన భాషావేత్తలు, పరిశోధకుల సహకారం కోరినట్లు చెప్పాయి. అనువాదం, విద్యా ప్రయోజనాల కోసం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన విద్యార్థులు వారి మాతృభాషలో చదువు నేర్చుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పారు. అదే సమయంలో అంతరించిపోతున్న కొన్ని అరుదైన భాషలను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
భాష పరిరక్షణకు..
భారతదేశంలో 700కి పైగా విభిన్న గిరిజన సమాజాలున్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన భాష, మాండలికాలు, సంప్రదాయాలను కలిగి ఉంది. కారణాలు ఏవైనా ఈ భాషల్లో అనేకం అంతరించిపోతున్నాయి. కొన్ని తెగలు వారి భాషా గుర్తింపునే కోల్పోతున్నాయి. ఆది వాణితో ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భాషలను పరిరక్షించడమే కాకుండా దైనందిన జీవితంలో దీన్ని చురుగ్గా ఉపయోగించే వాతావరణాన్ని సృష్టించాలని కేంద్రం భావిస్తోంది.
ఇదీ చదవండి: రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్
విద్యార్థులకు ఎంతో మేలు..
ఆది వాణి యాప్‌లో గిరిజన భాషా అనువాదాలను అందించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఏ భాషలో కంటెంట్ ఇచ్చినా అది తాము కోరుకున్న గిరిజన భాషలోకి మారుతుంది. తమ మాతృభాషలో పాఠ్యపుస్తకాలు, ఆడియో, విజువల్ కంటెంట్ పాఠాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్రయత్నం వల్ల విద్యార్థులకు కష్టంగా ఉండే గణితం, సైన్స్, చరిత్ర వంటి సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి, అందులో రాణించడానికి వీలవుతుంది. దాంతోపాటు ఈ యాప్ ఉపాధ్యాయులకు విలువైన వనరుగా ఉంటుందని, భాషా అవసరాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. సాంస్కృతిక, భాషా నేపథ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న కేంద్రం విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది.