
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్‌ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు.
మరోవైపు, పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. నటుడు ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారు.
త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment