kolletikota temple
-
కొల్లేరులో కొలువైన కొంగు బంగారం పెద్దింట్లమ్మ
కొల్లేటికి మహాపట్టమహిషి పెద్దింట్లమ్మ జాతర ద్వీపకల్పమైన కొల్లేరు సరస్సు మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఏలూరు జిల్లా, కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ జాతర జరుగుతుంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 13 వరకు అమ్మవారి జాతర (తీర్థం) నిర్వహిస్తున్నారు. జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరుల కల్యాణం మార్చి 10, ఆదివారం రాత్రి జరిగింది.కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి 9అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. కాలాలతో పాటు కోటలు మాయమైనప్పటికీ పెద్దింట్లమ్మ తల్లి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సామాన్యంగా ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది. కానీ పెద్దింట్లమ్మ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివసించే వారందరికీ కులదైవంగా ఆరాధింపబడటం విశేషం.గ్రంథాల్లో కొల్లేరు అందాలు..రామాయణం అరణ్యకాండలో అగస్త్య మహాముని శ్రీరాముడికి ఈ సరస్సు గురించి చెప్పినట్లు ఉంది. అదేవిధంగా దండి అనే మహాకవి తన దశకుమార చరిత్రలో కొల్లేరు సరస్సును అభివర్ణించాడు. చరిత్రలో కొల్లేటికోట, కొల్లేరు సరస్సుప్రాంతాన్ని కొల్లేటికోట, కొల్లివీటికోట, కర్ణపురి, కొల్హాపురి, కృష్ణా, గోదావరి సంగమదేవ పుష్కరిణీ, సృష్ట్యారంభ పద్మ సరస్సు, దేవపుష్కరిణి, బ్రహ్మ సరస్సు, అరజా సరోవరం, బ్రహ్మండ సరస్సు, కోలాహలపురం, కొల్లేరు, కొలనువీడు అని వ్యవహరించేవారు. కొల్లేరుకు తెలంగాణ బోనాల సాంప్రదాయం..తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తోన్నారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలు ప్రతీ ఏటా తీసుకొస్తున్నారు. రాత్రి సమయంలో దీపాల మధ్య బోనాలు, 7 కావిళ్ళలో అమ్మవారి పుట్టింటి నైవేద్యం పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లుతో పెద్దింట్లమ్మ దేవస్థానం తీసుకు రానున్నారు. 3 మైళ్ళ దూరంలోని గోకర్ణేశ్వరపురంలో గోకర్ణేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారితో అంగరంగ వైభవంగా ఆదివారం కల్యాణం జరిపించారు. ఆ సమయంలో కొల్లేరు పెద్ద జనారణ్యంగా మారిపోయింది. జాతర పదమూడు రోజులని పేరే కానీ ఫాల్గుణ మాసం నెలరోజులూ ప్రతి ఆదివారం కొల్లేరు భక్తజన సంద్రంగా మారిపోతుంటుంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి, జిల్లాల నుంచి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారినీ దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. – బి.శ్యామ్, సాక్షి, కైకలూరు, కృష్ణా జిల్లా -
పెద్దల ముసుగులో అరాచకం..!
సాక్షి, కైకలూరు(కృష్ణా) : కొల్లేరులో ప్రభుత్వానికి ధీటుగా సమాంతర పాలన కొనసాగుతోంది. చట్టాలను లెక్కచేయడం లేదు. మా రాజ్యంలో పెద్దలు చెప్పిందే శాసనం అనే రీతిలో ఆటవీక రాజ్యం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆధ్మాత్మిక కేంద్రంగా పేరుగడించింది. ఈ దేవాలయం చేరడానికి పందిరిపల్లిగూడెం వద్ద సర్కారు కాలువపై ఇనుప వంతెన ఆధారం. దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమ టోలు గేటు వసూల చేస్తూ కొల్లేరు పెద్దలు రూ.కోట్లలో ప్రజాధనాన్ని దండుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని దర్శించుకోడానికి వస్తున్న భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. కొల్లేరు కట్టుబాట్ల కారణంగా అక్రమ వసూళ్లు ఏడాది పొడవునా సాగుతోంది. ప్రశ్నించే భక్తులపై నిర్వాహకులు దాడులకు దిగుతున్నారు. ఈ విషయాలు పోలీసు, రెవెన్యూ, అటవీ అధికారులకు తెలిసినా తెలుగుదేశం నేతల బెదిరింపులు కారణంగా ఏమీ చేయలేని దుస్థితి దాపురించింది. అక్రమ వసూళ్లను అడ్డుకోలేక పోలీసు, ఆర్అండ్బీ, ఫారెస్టు అధికారులు ఒకిరిపై ఒకరి తమ పరిధి కాదంటే తమది కాదని చేతులు దులుపుకుంటున్నారు. ఏడాదికి రూ.44 లక్షల అక్రమ పాట.. పందిరిపల్లిగూడెం సర్కారు కాలువ వంతెన దాటిన తర్వాత ఐదు గ్రామాలు ఉన్నాయి. వంతెన అవతల కొల్లేటికోట గ్రామంలో పెద్దింట్లమ్మ దేవస్థానం ఉంది. ప్రతి ఆదివారం అమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా మార్చిలో జరిగే జాతరకు లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. ఈ విధంగా వంతెన దాటిన ప్రతి ఒక్కరి నుంచి, వాహనాల నుంచి అక్రమ టోలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్రమ టోలు ఫీజు నిమిత్తం గురువారం రాత్రి పందిరిపల్లిగూడెం గ్రామ చావిడి వద్ద పెద్దలు పాటలు నిర్వహించారు. గ్రామానికి చెందిన జయమంగళ కొండయ్య అనే వ్యక్తి ఏడాదికి రూ.44లక్షల 6 వేలు పాట దక్కించుకున్నాడు. ఈ డబ్బులు పందిరిపల్లిగూడెం పెద్దలు తీసుకుంటారు. పాటదారుడికి ఏడాదికి రూ.కోటి 50 లక్షలపైనే ఆదాయం వస్తుంది. అవినీతి సహించమన్నా చలనం లేదు.. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన అందించాలని ఆదేశించారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పందిరిపల్లిగూడెం వంతెనపై అక్రమ టోలు ఫీజును నిలుపుదల చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వమే నామమత్ర ఫీజులను వసూలు చేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇప్పటికైన కొల్లేరులో సమాంతర పాలనకు అడ్డకట్ట వేసి అక్రమ టోలు దోపిడిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
అక్రమార్కులకు ఎంపీ మాగంటి వత్తాసు
► దేవస్థానం ప్రహరీ కూల్చివేయాలని హుకుం ► కుదరదన్న ఈవో కొండలరావు ► ఎండోమెంటు జేసీకి ఎంపీ ఫోన్ కొల్లేటికోట (కైకలూరు): ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధి ఆయన. అమ్మ దర్శనానికి వస్తున్నా భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కులను అరికట్టాల్సింది పోయి, దోచుకోవడానికి దారి మార్గం కోసం ఎదురుచూస్తున్న వారికి టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) వత్తాసు పలకడం విమర్శలకు దారితీసింది. వివరాలు.. జిల్లాలో ప్రసిద్ధి చెందిన కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర సోమవారం ప్రారంభమైంది. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు హాజరయ్యారు. ఎంపీ వద్దకు సమీపంలో ఇద్దరు దుకాణదారులు మా వ్యాపారాలకు అడ్డుగా దేవస్థాన ప్రహరీ ఉందని, దారి మార్గం కల్పించాలని కోరారు. ముందుగా సిద్ధం చేసుకున్న యాత్రికులను తీసుకొచ్చి ప్రహరీకి గోడ ఉంటే బాగుండదని చెప్పించారు. దీంతో ఎంపీ దేవస్థానం ఈవో ఆకుల కొండలరావును పిలిచారు. జాతర 15 రోజులు ప్రహరీ కూల్చి దారి ఇవ్వాలన్నారు. ఇది నా పరిధి కాదని, జాయింట్ కమిషనరు అనుమతులు ఉండాలన్నారు. ఎంపీ చెప్పిన చేయరా? అంటూ దేవాదాయశాఖ జాయింట్ కమిషనరు చంద్రశేఖర్ ఆజాద్‌కు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. సమీపంలోని కొందరు ఈవో సెల్ నుంచి ఫోన్ చేయండంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. చివరకు ఫోన్ కలవకపోవడంతో మరో సారి మాట్లాడుదామని ఎంపీ వెళ్లిపోయారు. ప్రహరీ కథ ఇది..: పురాతన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం 2.10 ఎకరాల్లో విస్తరించి ఉంది. సుమారు ఎకరం స్థలం ఆక్రమణలకు గురయ్యింది. ప్రతి ఆదివారం వచ్చే భక్తులను సమీప కొందరు దుకాణదారులు కొల్లేరు జలగల మాదిరిగా పీడిస్తూ అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. దీంతో సర్వే చేయించి రూ.14 లక్షల 50వేల నిధులతో దేవస్థానం చుట్టూ ప్రహరీ నిర్మించింది. వెనుక నడక మార్గానికి కొంత వదిలారు. ప్రహరీ వలన అమ్మ దర్శనానికి వచ్చే భక్తులు అక్రమ వసూలు బారి నుంచి తప్పించుకున్నారు. ఇప్పటి వరకు అడ్డేలేదని భావించిన వారికి ఇది మింగుడు పడలేదు. స్థానిక టీడీపీ నేతను ఆశ్రయించారు. ఆయన వచ్చి హడావుడి చేశారు. అది బెడిసి కొట్టడంతో ఇటీవల ఈవోను బెదిరించేందుకు దుకాణదారులు ప్రయత్నించారు. దీంతో ఈవో కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గుమ్మనంగా ఉన్నఆక్రమణదారులు ఎంపీ మాగంటి రాగానే రెచ్చిపోయారు. కేవలం డబ్బులు దండుకోవడానికి అలవాటు పడిన వ్యాపారులకు ఎంపీ కొమ్ముకాస్తారా? లేదా భక్తుల దోపిడీని అడ్డుకుని ప్రహరీని కాపాడతారా? అని భక్తులు, దేవాలయ సిబ్బంది ఆసక్తిగా చూస్తున్నారు.