సాక్షి, కైకలూరు(కృష్ణా) : కొల్లేరులో ప్రభుత్వానికి ధీటుగా సమాంతర పాలన కొనసాగుతోంది. చట్టాలను లెక్కచేయడం లేదు. మా రాజ్యంలో పెద్దలు చెప్పిందే శాసనం అనే రీతిలో ఆటవీక రాజ్యం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆధ్మాత్మిక కేంద్రంగా పేరుగడించింది. ఈ దేవాలయం చేరడానికి పందిరిపల్లిగూడెం వద్ద సర్కారు కాలువపై ఇనుప వంతెన ఆధారం. దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమ టోలు గేటు వసూల చేస్తూ కొల్లేరు పెద్దలు రూ.కోట్లలో ప్రజాధనాన్ని దండుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని దర్శించుకోడానికి వస్తున్న భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. కొల్లేరు కట్టుబాట్ల కారణంగా అక్రమ వసూళ్లు ఏడాది పొడవునా సాగుతోంది. ప్రశ్నించే భక్తులపై నిర్వాహకులు దాడులకు దిగుతున్నారు. ఈ విషయాలు పోలీసు, రెవెన్యూ, అటవీ అధికారులకు తెలిసినా తెలుగుదేశం నేతల బెదిరింపులు కారణంగా ఏమీ చేయలేని దుస్థితి దాపురించింది. అక్రమ వసూళ్లను అడ్డుకోలేక పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఫారెస్టు అధికారులు ఒకిరిపై ఒకరి తమ పరిధి కాదంటే తమది కాదని చేతులు దులుపుకుంటున్నారు.
ఏడాదికి రూ.44 లక్షల అక్రమ పాట..
పందిరిపల్లిగూడెం సర్కారు కాలువ వంతెన దాటిన తర్వాత ఐదు గ్రామాలు ఉన్నాయి. వంతెన అవతల కొల్లేటికోట గ్రామంలో పెద్దింట్లమ్మ దేవస్థానం ఉంది. ప్రతి ఆదివారం అమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా మార్చిలో జరిగే జాతరకు లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. ఈ విధంగా వంతెన దాటిన ప్రతి ఒక్కరి నుంచి, వాహనాల నుంచి అక్రమ టోలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్రమ టోలు ఫీజు నిమిత్తం గురువారం రాత్రి పందిరిపల్లిగూడెం గ్రామ చావిడి వద్ద పెద్దలు పాటలు నిర్వహించారు. గ్రామానికి చెందిన జయమంగళ కొండయ్య అనే వ్యక్తి ఏడాదికి రూ.44లక్షల 6 వేలు పాట దక్కించుకున్నాడు. ఈ డబ్బులు పందిరిపల్లిగూడెం పెద్దలు తీసుకుంటారు. పాటదారుడికి ఏడాదికి రూ.కోటి 50 లక్షలపైనే ఆదాయం వస్తుంది.
అవినీతి సహించమన్నా చలనం లేదు..
నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలన అందించాలని ఆదేశించారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పందిరిపల్లిగూడెం వంతెనపై అక్రమ టోలు ఫీజును నిలుపుదల చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వమే నామమత్ర ఫీజులను వసూలు చేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇప్పటికైన కొల్లేరులో సమాంతర పాలనకు అడ్డకట్ట వేసి అక్రమ టోలు దోపిడిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment