సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు.
'పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు.
గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు.
చదవండి: గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment