Section 144
-
HYD Alert: మియాపూర్, చందానగర్ పరిధిలో 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్, చందానగర్ పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కాగా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదివారం ఉదయం మియాపూర్‌లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదీనాగూడ సర్వే నెంబర్ 100, 101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నాం. మియాపూర్, చందానగర్ పరిధిలో ఈరోజు నుంచి జూన్ 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగుడి ఉన్న చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందిపైన కేసులు నమోదు చేశాం. మరికొంత మందిని గుర్తించి కేసులు పెడతాము అని చెప్పారు. ఇదిలా ఉండగా.. మియాపూర్‌లో ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసుల కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు చాలా మంది మహిళలను రెచ్చగొట్టారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్స్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారని అన్నారు. పేదలను రెచ్చగొట్టిన పది మందిపై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. The people of Miyapur came to take over the lands campaigned on social media in Hyderabad saying come and take over the lands.#Hyderabad #Miyapur pic.twitter.com/z29xhzJWvX— ఉత్తరతెలంగాణ నౌ (@UttaraTGNow) June 23, 2024 -
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఎత్తివేత
-
విజయనగరం జిల్లాలో 144 సెక్షన్
-
అన్సారీ అంత్యక్రియలు పూర్తి
లక్నో: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు శనివారం యూపీలోని గాజీపూర్‌లో ముగిశాయి. వేలాది మంది అన్సారీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. కొందరు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్యక అఖౌరీ మధ్య ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
అక్కడ మే 17 వరకు 144 సెక్షన్.. ఎందుకంటే..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మే 17 వరకు లక్నోలో 144 సెక్షన్ విధించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు, హోలీ, రంజాన్‌తో సహా ముఖ్యమైన, మతపరమైన పండుగల దృష్ట్యా లక్నో నగరంలో 144 సెక్షన్ విధించినట్లు లా అండ్ ఆర్డర్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ తెలియజేశారు. లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి ఐదో దశలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. పోలీసుల నిషేదాజ్ఞల ప్రకారం.. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటానికి వీల్లేదు. పాదయాత్రలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడంపై నిషేధం. అలాగే లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ బ్యాండ్ల వినియోంగంపై నిషేధం ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా సామాజిక కార్యక్రమాలు, నిరసనలు లేదా నిరాహార దీక్షలు చేపట్టడానికి అనుమతి లేదు. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రాపై బీజేపీ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. రాజ్‌నాథ్ 2014, 2019 ఎన్నికల్లో లక్నో స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1991 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. -
జన్వాడలో ఉద్రిక్తత: 144 సెక్షన్.. 21 మంది అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని జన్వాడ చర్చ్‌పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు తెలిపారు. కాగా, వివరాల ప్రకారం.. జన్వాడలో రోడ్ వైడ్నింగ్ చేయాలని ఒక వర్గం పట్టుబట్టింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ అధికారులు దీనికి ఒప్పుకోకపోవడంతో అక్కడున్న చర్చ్‌పై వారంతా దాడికి పాల్పడ్డారు. కాగా, చర్చ్ కూల్చివేతను మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేప్టటారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ తెలిపారు. అలాగే, జాన్వాడలో 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. ఈనెల 21వ తేదీ వరకు జన్వాడలో ఆంక్షలు అమలులో ఉంటాయని హెచ్చరించారు. -
Delhi Chalo: హస్తినలో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పలు డిమాండ్ల సాధనతో మంగళవారం దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధం అయ్యారు. ఉదయం నుంచే బారికేడ్లతో ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద నిలబడ్డారు. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు నెల రోజులపాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నారు. రైతు సంఘాల ‘చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ఇతర అనుమతి లేని ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైనా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | Ambala, Haryana: Security heightened at the Shambhu border in view of the march declared by farmers towards Delhi today. pic.twitter.com/AwRAHprtgC — ANI (@ANI) February 13, 2024 రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్‌లు పంపడంపైనా నిషేధం ఉందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావడంతోపాటుఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు మంగళవారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. రోడ్లపై బారికేడ్లు.. కొయ్యముక్కలు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతోపాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 13వ తేదీన పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2 వేలకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. నిరసనకారులను ∙అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్యముక్కలు బిగించారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Gazipur Border) pic.twitter.com/XeKWMWi1S9 — ANI (@ANI) February 13, 2024 రైతు సంఘాలతో మంత్రుల చర్చలు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలతో రెండో దశ చర్చలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత జగజీత్ దలీవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో డిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 2020–2021 కాలంలో చేపట్టిన రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు -
తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్
-
#KhaidiNo7691 : ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్ విఫలం
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు విఫలమైంది. యధావిధిగా ప్రజా జీవనం కొనసాగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్.. రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. ఈ పరిణామాలను నిరసిస్తూ.. టీడీపీ, అనధికారిక మిత్రపక్షం జనసేన పార్టీలు ఇవాళ(సోమవారం) ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అయితే చంద్రబాబు అరెస్ట్లాగానే.. ఈ బంద్ పిలుపును కూడా ఏపీ ప్రజలు అసలు పట్టించుకోలేదు. చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ జనం నుంచి స్పందన కరువైంది. బంద్‌కు మద్దతుగా వ్యాపార, విద్యా సంస్థల నుండి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. సోమవారం వేకువ జాము నుంచే ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ రోజూ వారిలాగే నడుస్తున్నాయి. అదే విధంగా.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. విద్యాసంస్థలు సైతం మాములుగానే నడుస్తున్నాయి. అదే సమయంలో.. తెలుగు తమ్ముళ్లు రోడ్లపైన కనిపించ లేదు. ఇంకోవైపు ఇరు పార్టీల ముఖ్య నేతలు దాదాపుగా ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొందరు కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కి హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు అతి చేష్టలకు దిగగా.. అరెస్టుల పర్వం కొనసాగింది. టీడీపీ సంగతి ఏమోగానీ.. జనసేన కార్యకర్తలు బంద్‌ను అసలు పట్టించుకోలేదు. విజయవాడ: నగరంలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులు యధాతధంగా తిరుగుతున్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా.. పండిట్ నెహ్రూబస్ స్టేషన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి.. రాజమండ్రి నగరంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. రాజమండ్రిలో ఉదయాన్నే దుకాణాలు షాపులు తెరుచుకున్నాయి. బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి. ప్రజల రోజు వారి కార్యకలాపాలు మాములుగానే కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉన్న సంగతీ తెలిసిందే. ఏపీలో 144 సెక్షన్ విధింపు ఇదిలా ఉంటే.. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు విధ్వంసానికి తెగబడే అవకాశాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. జిల్లాలో సెక్షన్30 అమలు టీడీపీ అధినేత చంద్రబాబును రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీని ప్రకారం జిల్లాలో ఎటువంటి ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదు. ఈ నిబంధనలు 10వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకూ అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నామని తెలిపారు. కాగా, జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ వాహ నాలతో ప్రత్యేక పోలీసు బృందాలతో పాటు, స్పెషల్ పార్టీ పోలీసులను నియమించారు. విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఇచ్చిన బంద్ పిలుపునకు స్పందన కొరవడింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు కొందరు టిడిపి కార్యకర్తలు చేరుకొని బస్సులను ఆపాలని ప్రయత్నించారు. బంద్‌కు అనుమతి లేకపోవడంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బస్సులు రాకపోకలకు ఆటంకం లేకుండా నియంత్రించారు. ఈ చర్యలతో బస్సు ప్రయాణికుల కు ఎక్కడా అసౌకర్యం కలగలేదు. బస్ లు యధావిధిగా గా నడుస్తున్నాయి. చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సులు యధావిధిగా తిరుగుతుండగా.. వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. రోడ్డు మీద కొందరు టీడీపీ కార్యకర్తలు జెండాలతో హడావిడి చేస్తున్నా.. అవేం పట్టించుకోని జనాలు తమ పనులు తాము చేసుకుంటున్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఓవరాక్షన్ టీడీపీ బంద్ పిలుపులో భాగంగా.. కుప్పంలో టీడీపీ శ్రేణులు బస్సు అద్దాలు ధ్వంసం చేశాయి. ఆ సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి: జిల్లాలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సుల రాకపోకలు యధావిదిగా కనిపిస్తున్నాయి. పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి చోడవరం మాడుగుల పట్టణాల్లో తెరుచుకున్న దుఖానాలు.. యధావిధిగా జనజీవనం నడుస్తోంది. తిరుపతి: శ్రీకాళహస్తి లో టిడిపి బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు, మార్కెట్లు యధావిధిగా తెరచుకున్నాయి. ప్రజాజీవనం యధాతధంగా నడుస్తోంది. పలాసలో బందు విఫలం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకిస్తూ,టీడీపీ పార్టీ సోమవారం చేపట్టిన బంద్ శ్రీకాకుళంలో పూర్తిగా విఫలమైంది. జన జీవనం యధావిధిగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులను ఆపడానికి ప్రయత్నించిన టీడీపీ క్యాడరును అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్‌లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్‌లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్‌లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
బళ్లారిలో 144 సెక్షన్...
-
బీహార్‌లో హైటెన్షన్.. ఒకరు మృతి, 80 మంది అరెస్ట్
పాట్నా: శ్రీరామనవమి సందర్భంగా బీహార్‌లో రాజుకున్న ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నలంద జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఓ వ్యక్తి మృతిచెందడంతో పోలీసులు 80 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక, అల్లర్ల కారణంగా బీహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని ససారంలో శనివారం సాయంత్రం బాంబ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడుపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఫొరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రోహ్తాస్లోని ఓ గుడిసెలో బాంబు పేలినట్టు తమకు సమాచారం అందిందని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిందని అన్నారు. ఇది మతపరమైన సంఘటనగా కనిపించడం లేదని ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. Bihar | It has been found that 6 persons were injured during the handling of illegal explosives at a private property in Rohtas; a team of forensic experts is conducting an investigation at the spot. Two persons arrested: Rohtas Police pic.twitter.com/5CLihSFYmh — ANI (@ANI) April 2, 2023 మరోవైపు, నలందాలోని బీహార్‌షరీఫ్‌లో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పహర్‌పూర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముఖేష్ కుమార్ అనే బాధితుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఇక శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగడంతో నలందాలో 80 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇక, ఆదివారం కూడా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. మార్చి 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే ఈ అల్లర్ల వల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో అమిత్ షా పర్యటన రద్దయ్యింది. #WATCH | Police personnel deployed in Biharsharif, Nalanda as Section 144 is imposed in the city after a fresh clash erupted last night following violence during Ram Navami festivities#Bihar pic.twitter.com/Th9zffoJFt — ANI (@ANI) April 2, 2023 -
అదానీపై విచారణ డిమాండ్‌తో... ఈడీ ఆఫీసుకు విపక్షాల ర్యాలీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అవకతవకలపై ఈడీతో లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీలు సమైక్యంగా కదం తొక్కాయి. ఈ ఉదంతంపై ఈడీకి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో పార్లమెంటు భవనం నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీగా బయల్దేరారు. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న ఎంపీలను మార్గమధ్యంలోనే విజయ్ చౌక్ సమీపంలో పోలీసులు అడ్డుకుని ముందుకు వెళ్లకుండా నిలువరించారు. బారికేడ్లతో రోడ్లను మూసేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీని అనుమతించబోమని చెప్పారు. దీనిపై నేతలంతా మండిపడ్డారు. అదానీపై విచారణ కోరుతూ ఈడీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే మోదీ సర్కారు నిరంకుశంగా అడ్డుకుందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. దాదాపు 200 మంది ఎంపీల శాంతియుత ర్యాలీని అమానుషంగా అడ్డుకున్నారంటూ దుయ్యబట్టారు. అనంతరం ఎంపీలంతా పార్లమెంటు ప్రాంగణానికి వెనుదిరిగారు. ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పాల్గొనకపోవడం విశేషం. అంతకుముందు తృణమూల్ విడిగా ఎల్పీజీ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసింది. -
శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ జాషువా
-
గన్నవరంలో 144 సెక్షన్.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. 'పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. చదవండి: గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు ప్రయత్నించడం టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసు అధికారులు నిరాకరించారు. అయినా ఎన్ఎస్యూఐకి చెందిన విద్యార్థులు దీన్ని స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో క్యాంపస్‌కు కరెంట్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఫలితంగా విద్యార్థులు యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా యువత భారీగా తరలివచ్చారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. 24 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. తాము స్కీనింగ్‌కు ఏర్పాట్లు చేశామని, ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్లను ధ్వసం చేశారని విద్యార్థులు ఆరోపించారు. Students gathered for screening of BBC’s documentary, India: The Modi Question, at Arts Faculty, DU were stopped by police and security personnel.#BBC #BBCDocumentary #IndiaTheModiQuestion #DU #ArtsFaculty #NorthCampus #DelhiUniversity pic.twitter.com/WwJQEGebS3 — Chirag Jha (@iChiragJha) January 27, 2023 అటు అంబేడ్కర్ యూనివర్సిటీలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు విఫలయత్నం చేశారు. దీనికి కూడా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ రెండు యూనివర్సిటీల్లో ఎలాంటి వీడియోలు ప్రదర్శించడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అయినా వారు మెబైల్ ఫోన్లలో చూడాలనుకుంటే వారి విచక్షణకే వదిలేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇది దురుద్ధేశపూర్వకంగా ఉందని కేంద్రం బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్లో ఈ వీడియో లింకులను బ్లాక్ చేసింది. అయినా కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఈ వీడియో స్క్రీనింగ్‌కు ప్రయత్నించగా.. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చదవండి: రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే.. -
Macherla: 144 సెక్షన్ గడువు పొడిగింపు
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 22వ తేదీ వరకు 144 సెక్షన్‌ను పొడిగించినట్లు అర్బన్ సీఐ టి బాలకృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 16వ తేదీన పట్టణంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, బహిరంగసభలు నిర్వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి 144 సెక్షన్‌కు అనుగుణంగా నిబంధనలు పాటించాలని సీఐ కోరారు. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. (క్లిక్ చేయండి: ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్) -
‘మహా’మేళాకు కర్ణాటక నో.. ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు
బెళగావి: హద్దుల పంచాయితీతో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తారస్థాయికి చేరుకుంది. ‘మహా’ మేళ నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవటంపై బెళగావి సమీపంలో సోమవారం వందల మంది ఆందోళన చేపట్టారు. కొగ్నోలి టోల్ ప్లాజా వద్దకు ‘మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి’(ఎంఈఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు వందల మంది చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బెళగావి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున బెళగావిలో ప్రతిఏటా సమావేశం నిర్వహిస్తుంది మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి. గత ఐదేళ్లుగా సరిహద్దు వివాదంపై ఆందోళనలు చేస్తోంది ఎంఈఏస్. ఈ ఏడాది కూడా శీతాకాల సమావేశల తొలిరోజున భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెళగావి జిల్లా ప్రధాన కేంద్రంలోని తిలక్‌వాడీ ప్రాంతంలో ఉన్న వ్యాక్సిన్ డిపో గ్రౌండ్ వద్ద ఎంఈఎస్ ఆందోళనకు దిగింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల మంది ఎంఈఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిలక్‌వాడీ రోడ్డులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ మహారాష్ట్ర వికాస్ అకాడీ(ఎంవీఏ) కార్యకర్తలు బెళగావిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. 5వేల మంది పోలీసులు.. బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు 5,000 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు ఎస్పీలు, 11 మంది ఏఎస్పీలు, 43 మంది డిప్యూటీ ఎస్పీలు, 95 మంది ఇన్స్పెక్టర్లు, 241 మంది ఎస్సైలు ఆందోళనల ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. Belagavi, Karnataka | Members of Maharashtra Ekikaran Samiti and NCP stage protest near Kognoli Toll Plaza near Karnataka-Maharashtra border over inter-state border issue pic.twitter.com/XaPJwEbBKv — ANI (@ANI) December 19, 2022 ఇదీ చదవండి: అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం -
Hyderabad: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం కొనసాగుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వివిధ రాజకీయ పార్టీల ధర్నాలు, ఆందోళనలు కొనసాగే అవకాశాన్ని గుర్తించిన అధికారులు పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా, ఎవరూ లోనికి దూసుకురాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. శనివారం బీజేపీ కార్యకర్తలు, నేతలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి యత్నించగా వారిని సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పక్కా ప్రణాళికతో కమాండ్ కంట్రల్ సెంటర్ వద్దకు రాకుండానే వారిని నియంత్రించారు. ఇందుకోసం సరికొత్త బారికేడింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా పికెటింగ్‌లు కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా ఆధునిక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆందోళనకారులు ముందుకు రాకుండా నిరోధించేందుకు ఈ కొత్త బారికేడింగ్ సిస్టమ్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష నేపథ్యంలో 144 సెక్షన్ అమలు హిమాయత్‌నగర్: సీబీఆర్టీ పరీక్షల నేపథ్యంలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష కేంద్రాల వద్ద సుమారు 500 అడుగుల మేర నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం 6 గంటల పాటు, మంగళవారం 6 గంటల పాటు ట్విన్ సిటీస్‌లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సెంటర్స్‌లో సీబీఆర్టీ ఎగ్జామ్ జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షకు ఏవిధమైన ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్) -
ముంబైలో ఈనెల 16 నుంచి మీటింగ్‌లు, ఊరేగింపులు నిషేధం.. ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: ముంబైలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముంబై, తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో ముంబైకర్లు ఒకచోట నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి గుంపుగా ఉండరాదు. గుంపులుగా ఉంటే పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి తోడు శివసేనకు అసలు వారసులం మేమేనని, మాకే సంఖ్యా బలం ఎక్కువ ఉందని, అందుకు పార్టీ గుర్తు విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అటు ఏక్నాథ్ శిందే వర్గం మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం తాజాగా ఉండగానే రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో కూడా శిందే వర్గం తలదూర్చనుంది. ఠాక్రే వర్గం, శిందే వర్గం పరస్పరంగా ఎదురుపడితే ఘర్షణ జరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. పోటాపోటీగా ఇరువర్గాలు... ఈ నెల 24 నుంచి దీపావళి పర్వదిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలకు కానుకలు, నూతన సంవత్సర క్యాలండర్లు పంపిణీ చేయడం లాంటి పనులతో వారితో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు ఇరు పార్టీలూ పోటాపోటీగా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ప్రజావ్యవస్ధలో నెలకొన్న ప్రశాంతతను దెబ్బతీసి ప్రాణ, ఆస్తి నష్టం జరిగేలా కొన్ని ఆసాంఘిక దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నగరం, ఉప నగరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని ముంబై పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 15 రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నియమాలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ లాట్కర్ స్పష్టం చేశారు. చదవండి: కారులో ప్రయాణిస్తే అది తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్! నిబంధనల్లో భాగంగా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నలుగురికంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదు. అదేవిధంగా నగరంలో ఎలాంటి ఊరేగింపులు, లౌడ్స్పీకర్లు, బ్యాండ్, ఇతర వాయిద్యాలు వినియోగించకూడదు. బాణసంచా పేల్చడం లాంటి పనులపై సైతం నిషేధం వి«ధించినట్లు సంజయ్ తెలిపారు. పరిస్ధితులు ఇలాగే ఉంటే ఉంటే గడువు ముగిసిన తరువాత కూడా వీటిపై నిఘా ఉంటుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘించే వారికి జరిమానా లేదా జైలు శిక్ష, వాయిద్య సామాగ్రి జప్తు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా దీపావళి పర్వదినం సందర్భంగా అనేక మంది భవనాల టెర్రస్ల పైనుంచి, సముద్ర తీరాల నుంచి ఆకాశంలోకి పెద్ద సంఖ్యలో కందిళ్లను (చుక్కలను) ఎగురవేస్తారు. వీటిపై కూడా నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. టపాసులు, దీపెంతలు, విద్యుత్ తోరణాలు తదితర ప్రమాదకర చైనా తయారీ వస్తువులు, కందిళ్లు నిల్వచేసే వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 144 సెక్షన్ అమలు ఉన్న రోజుల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు, అంత్యక్రియల శోక సభలు, అలాగే కార్యాలయాలు, క్లబ్బులు, సొసైటీ ఆవరణలో, నాట్యగృహాలు, హాలులో, ఫ్యాక్టరీలు, షాపులు, సాధారణ వ్యాపారులు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో జరిగే సభలు, సమావేశాలకు మినహాయింపు ఉంటుందన్నారు. అయితే ముందస్తుగా స్ధానిక పోలీసు స్టేసన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్ సంజయ్ లాట్కర్ స్పష్టం చేశారు. -
కర్ణాటకలో ముసుగు దుండగుల దాడి కలకలం
బెంగళూరు: కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్‌లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది. కారులో వచ్చిన దుండగులు.. అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు దూసుకొచ్చారు. భయంతో అతను పరుగులు తీసే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కర్రలతో, కత్తులతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వాళ్లు పారిపోగా.. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తొలుత పోలీసులు వెల్లడించారు. ఆపై అతను మరణించినట్లు తెలుస్తోంది. Karnataka | Last rites of man hacked to death by an unidentified group yesterday being performed in Surathkal near Mangaluru pic.twitter.com/40mIW4SleD — ANI (@ANI) July 29, 2022 ఘటన తర్వాత సురత్కల్‌ను తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు నగర కమిషనర్. 144 సెక్షన్ విధించి.. జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు పోలీసులు. దాడికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. బాధితుడిని 25 ఏళ్ల ఫాజిల్‌గా గుర్తించారు. దీంతో మత కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టారు హత్య దక్షిణ కన్నడ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కూడా. ఇదీ చదవండి: ఘోరం.. కుప్పకూలిన మిగ్–21.. ఇద్దరు పైలట్ల దుర్మరణం -
ఉదయ్‌పూర్ హత్య: రాజస్థాన్‌లో నెలపాటు 144 సెక్షన్
జైపూర్: మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్ అనే వ్యక్తిపై.. అతని దుకాణంలోనే ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మాల్దాస్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. మరోవైపు సీఎం అశోక్‌గెహ్లాట్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కోరుతున్నారు. ఈ ఉదంతంపై నిరసనలు, మతపరమైన ఉద్రిక్తతలతో ఉదయ్‌పూర్‌తో పాటు రాజస్తాన్ అంతా అట్టుడికింది. పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్ కాకుండా చూస్తున్నారు. సంయమనం పాటించాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్ఐఏ బృందాన్ని పంపింది. కస్టమర్లలా వచ్చి... మృతుడు కన్హయ్యా లాల్ ఉదయ్‌పూర్‌లో టైలర్. హంతకులు రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్ బట్టలు కుట్టించుకునే సాకుతో మంగళవారం మధ్యాహ్నం మాల్దాస్‌లోని దాన్ మండీలో ఉన్న అతని దుకాణంలోకి ప్రవేశించారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్ కత్తి తీసి కన్హయ్య మెడపై వేట్లు వేశాడు. దీన్నంతా గౌస్ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే ఇద్దరూ అక్కణ్నుంచి పారిపోయారు. ఈ దారుణంపై స్థానిక దుకాణదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా వారంతా దుకాణాలు మూసేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే యూఐటీ ప్రకారం.. కన్హయ్య లాల్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య ఎనిమిదేళ్ల కుమారుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా దాన్ని కన్హయ్య సమర్థించినట్టు చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఆయనను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. కన్హయ్యను చంపుతామంటూ జూన్ 17న తీసిన వీడియోను కూడా హంతకులు మంగళవారమే సోషల్ మీడియాలో పెట్టారు. తమ వర్గం వారు ఇలాంటి దాడులను ఉధృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్తర్ స్థానిక మసీదులో పని చేస్తుండగా.. గౌస్ కిరాణా దుకాణం నడుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్యేనని ఉదయ్‌పూర్ ఎస్పీ మనోజ్‌కుమార్ చెప్పారు. రక్షణ కోరినా పట్టించుకోలేదు.. మృతుడు పోలీసు రక్షణ కోరినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ ఆరోపించింది. రాజస్తాన్‌లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీశ్ పునియా ఆరోపించారు. ‘‘హంతకులు కత్తులు చేతబట్టి నేరుగా ప్రధానినే చంపుతామని బెదిరిస్తూ వీడియోలు పోస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెను సవాలు’’ అని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్‌కుమార్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మొదలుకుని పలువురు నేతలు హత్యను ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్త: షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే.. -
బెంగాల్లో మళ్లీ హింస
కోల్‌కతా/లక్నో/రాంచీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో రగిలిన కార్చిచ్చు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్లో రెండో రోజు శనివారం కూడా హింస చోటుచేసుకుంది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దాడిలో పోలీసులు గాయపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించి జనాన్ని చెదరగొట్టారు. హౌరా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు ఈ నెల 14వ తేదీ దాకా నిలిపేశారు. పలు ప్రాంతాల్లో 15వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్‌ను 144 సెక్షన్ అమల్లో ఉన్న హౌరా జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బెంగాల్ జమ్మూ కశ్మీర్‌లా మారుతోందని సుకాంత ఆరోపించారు. శుక్రవారం నిరసనల్లో బాలులను భాగస్వాములను చేశారన్న అభియోగాలపై ఫిర్జాదా ఆఫ్ ఫర్ఫురా షరీఫ్‌కు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ షోకాజులిచ్చింది. బెంగాల్లో శాంతిభద్రతలు దిగజారుతున్నాయంటూ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆదేశించారు. నిందితుల పట్ల ఔదార్యం చూపుతుండడం దురదృష్టకరమంటూ ట్వీట్ చేశారు. యూపీలో 255 మంది అరెస్టు యూపీలో శుక్రవారం హింసాత్మక ఘటనలకు సంబంధించి 255 మందిని జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులపై రాళ్ల దాడికి చిన్నపిల్లలను దుండగులు నియోగించినట్లు గుర్తించారు. కారకులపై 29 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు చెప్పారు. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ తల నరికేస్తున్నట్టు వీడియో రూపొందించి యూట్యూబ్‌లో పెట్టిన జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫైజల్ వనీ అనే యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోయలో పలుచోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. ఢిల్లీలో జామా మసీదు బయట ప్రదర్శనల ఉదంతానికి సంబంధించి కేసు నమోదైంది. ప్రతి మసీదు, మదర్సా లోపల, బయట హై క్వాలిటీతో కూడిన సీసీ కెమెరాలు పెట్టాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. ఆందోళనకారులు ఏయే ప్రార్థనా స్థలాల్లో నుంచి బయటికొచ్చి గొడవకు దిగారో అవే ఈ విధ్వంసానికి బాధ్యత వహించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. భారత్‌లో పాలన రాజ్యాంగం ప్రకారం నడుస్తుందే తప్ప షరియా ప్రకారం కాదని విధ్వంసకులు తెలుసుకోవాలన్నారు. నుపుర్ శర్మకు బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మద్దతుగా నిలిచారు. ఆలయంపైకి పెట్రోల్ బాంబులు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శుక్రవారం నిరసనల్లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు బులెట్ గాయాలతో చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ హింసకు నిరసనగా హిందూ సంఘాలు శనివారం రాంచీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దాంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసకు కారకులపై కేసులు పెట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నామరు. నగరంలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. రాంచీలోని ఓ ఆలయంలో పూజారి, ఆయన కుటుంబం ప్రాంగణంలో నిద్రిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన నిరసనలకు సంబంధించి 100 మందికిపైగా వ్యక్తులపై కేసులు పెట్టారు. విమర్శకు ఎవరూ అతీతులు కారు: తస్లీమా న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతోన్మాదుల ఆగడాలను చూస్తే దిగ్బ్రాంతి కలుగుతోందని బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. వాటిని చూస్తే మహ్మద్ ప్రవక్త దిగ్భ్రాంతికి గురయ్యేవారని అభిప్రాయపడ్డారు. ‘‘విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. ఏ మనిషీ, మత గురువూ, మత బోధకుడూ, ప్రవక్తా, దేవుడూ... ఎవరూ అతీతులు కారు. ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా మార్చాలంటే సూక్ష్మ పరిశీలన, విమర్శ అవసరం’’ అని కామెంట్ చేశారు. -
కర్ణాటకలో అల్లర్లు.. సోషల్ మీడియా పోస్టుతో రగడ
హుబ్బళ్లి: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక సోషల్ మీడియా పోస్టు భారీ విధ్వంసానికి కారణమైంది. కోపోద్రిక్తులైన ఒక వర్గం విధ్వంసానికి పాల్పడడంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆస్పత్రి, ఆలయం కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. ‘నగరంలో ఈ నెల 20 దాకా 144 సెక్షన్ విధించాం. 40 మందికిపైగా అరెస్టు చేశాం. 12 మంది పోలీసులు గాయపడ్డారు’ అని హుబ్బళ్లి–ధార్వాడ్ పోలీసు కమిషనర్ లభురామ్ చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరికొందరు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై ఒకరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. అయితే ఇంతటితో తృప్తిపడని కొందరు ప్రజలు పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడారని, వారిని చెదరగొట్టడం జరిగిందని వివరించారు. అనంతరం అర్థరాత్రి సమయంలో మరలా చాలామంది గుమిగూడడంతో వారి నాయకులను పిలిపించి సదరు కేసులో తీసుకున్న చర్యలను వివరించామన్నారు. అయితే ఎంత నచ్చజెప్పినా వినకుండా ఈ మూక విధ్వంసానికి పాల్పడిందని లభురామ్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా రాళ్లు పడి ఉండడాన్ని గమనించిన పోలీసులు ముందుగానే ట్రక్కు నిండా రాళ్లు, ఇటుకలు తెప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే హుబ్బళ్లిలో దాడి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే చేశారని కర్ణాటక సీఎం బొమ్మై అభిప్రాయపడ్డారు. ఇలాంటివి సహించబోమని దీని వెనకున్నవారు గ్రహించాలని హెచ్చరించారు. దాడుల వెనక ఉన్నవారందరినీ అరెస్టు చేస్తామన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుమవద్దని ప్రజలను కోరారు. స్టేషన్ ముందు ఒక్కమారుగా భారీగా జనాలు మూగారంటే అది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిన ఘటనగా భావించాలన్నారు. గాయపడిన పోలీసుల్లో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు. ఘటనకు సంబంధించి కొందరిని అరెస్టు చేశామని, దేవర జీవనహళ్లి, కడుగొండహళ్లి లాంటి చోట్ల జరిగిన విధ్వంసాన్ని ఇక్కడా చేయాలని కొందరు భావించారని చెప్పారు. విధ్వంసకారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంఎల్ఏలు డిమాండ్ చేశారు. ఘటనను మాజీ సీఎం కుమారస్వామి ఖండించారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. -
గద్వాల జిల్లా ఇర్కిచేడులో 144 సెక్షన్
గద్వాల రూరల్/ కేటీదొడ్డి: బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రాజుకున్న వివాదం.. చివరికి విగ్రహానికి నిప్పుపెట్టడంతో పాటు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. దీంతో గ్రామంలో ఏప్రిల్ 6 వరకు 144 సెక్షన్‌ను విధించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఒక వర్గం వారు నిర్ణయించి తహసీల్దార్ వద్ద అనుమతి పొందారు. సదరు స్థలం అప్పటికే నీలమ్మ అనే మహిళ కబ్జాలో ఉంది. గురువారం ఆ స్థలంలో విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించగా నీలమ్మ, ఆమె కుటుంబీకులు ఆత్మహత్య చేసుకుంటామని అడ్డుకున్నారు. దీంతో విగ్రహాన్ని రోడ్డు మధ్యలో పెట్టేందుకు యత్నించగా గ్రామానికి చెందిన మరోవర్గం వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే ఆత్మహత్య చేసుకుంటానని వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాలను విగ్రహం పరిసర ప్రాంతంలో పడేశారు. పోలీసులు అక్కడి నుంచి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసిన చోట నిప్పు అంటించారు. దీంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, ఎస్సై కురుమయ్య కాలికి అంటుకున్నాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకొని కర్ణాటకలోని రాయచూరు, ఇర్కిచేడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంబేడ్కర్‌వాదులు భారీ సంఖ్యలో గ్రామానికి చేరుకోవడంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ ఇర్కిచేడును సందర్శించి ఏప్రిల్ 6 వరకు గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.