తెల్లవారుజాము నుంచే పోలీసుల హల్‌చల్
144 సెక్షన్ విధింపు
పలువురు నాయకుల ముందస్తు అరెస్టు
పోలీసుల పహారా మధ్య ఇసుక లోడింగ్
ఘంటసాల మండలం శ్రీకాకుళంలో బుధవారం పోలీసులు అలజడి సృష్టించారు. రెండురోజులుగా ధర్నా చేస్తున్న గ్రామస్తులు నిరాహారదీక్ష తలపెట్టడంతో ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో తెల్లవారుజాముకే పెద్ద సంఖ్యలో పోలీసులు గ్రామానికి చేరుకుని హల్‌చల్ చేశారు. ఉదయం ఆరు గంటల నుంచే 144 సెక్షన్ విధించారు. పలువురు నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. దీంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు.
శ్రీకాకుళం(ఘంటసాల): ఘంటసాల మండలం శ్రీకాకుళంలో బుధవారం పోలీసులు హల్‌చల్ చేశారు. శ్రీకాకుళం ఇసుకక్వారీలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, లారీడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆత్మకూరి నవీన్, తమ్మన వెంకటసుబ్బయ్య, రావూరి వెంకటేష్ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న గ్రామస్తులు బుధవారం నిరాహారదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెల్లవారుజాము నాలుగు గంటలకే పోలీసులు శ్రీకాకుళంకు చేరుకున్నారు. అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు రమణ, చంద్రశేఖర్, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, కోడూరు, నాగాయలంక, కూచిపూడి ఎస్‌ఐలు శివరామకృష్ణ, వెంకటకుమార్, వై సుధాకర్, ఎ.వెంకటేశ్వరరావు, పి.వెంకటేశ్వరరావు, సురేష్ ఆధ్వర్యంలో సబ్‌డివిజన్‌లోని పోలీసులతోపాటు మచిలీపట్నానికి చెందిన 24 మంది ప్రత్యేక బెటాలియన్ గ్రామానికి చేరుకుంది. తెల్లవారుజాము నుంచి పోలీసులు గ్రామంలో హడావుడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
144సెక్షన్ విధింపు..
గ్రామంలో ఎలాంటి ఆందోళనలు, దీక్షలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆందోళనలు, నిరాహారదీక్షలకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమిత మయ్యారు.
పోలీసుల పర్యవేక్షణలో ఇసుక లోడింగ్..
గ్రామస్తుల ఆందోళనతో రెండు రోజుల నుంచి నిలిచిపోయిన ఇసుక లోడింగ్ పనులను బుధవారం పోలీసుల పహారా మధ్య కొనసాగించారు. ఇసుక లోడింగ్‌చేసే ప్రొక్లెయిన్ వద్ద పోలీసులు కాపలా ఉండగా లారీల్లో ఇసుకను లోడింగ్ చేశారు.
పలువురు నాయకుల అరెస్ట్..
ఆందోళనలు, దీక్షలు చేయకుండా తెల్లవారు జామునుంచే పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమ, మంగళవారాల్లో ఆందోళనలో పాల్గొన్న నాయకుల ఇళ్లకు వెళ్లి, వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా అందుబాటులో లేకపోవడంతో వారికోసం గ్రామాన్ని జల్లెడ పట్టారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు సింహాద్రి శ్రీనివాసరావును బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేయగా, పంచాయతీ కార్యాలయం వద్ద ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతున్న సీపీఎం దివి డివిజన్ కార్యదర్శి శీలం నారాయణరావు, మండల కార్యదర్శి కంచర్ల నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈసందర్భంగా శీలం నారాయణరావు మాట్లాడుతూ తప్పతాగి ఇసుకలోడు లారీని నడుపుతూ ముగ్గురి ప్రాణాలను బలిగొన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్న తమను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా, స్థానిక ఎమ్మెల్యే ఎక్కడున్నారని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయమని ఆందోళన చేస్తుంటే పోలీసుల ద్వారా బలవంతంగా నోళ్లు నొక్కిస్తున్నారని, బ్రిటీష్ వారి హయాంలోనూ ఇలాంటి దుశ్చర్యలు జరగలేదని ఆయన విమర్శించారు.
శ్రీకాకుళంలో టెన్షన్ టెన్షన్
Published Thu, Feb 26 2015 12:49 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement