ఔరంగాబాద్‌లో మోహరించిన పోలీసులు
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు 144 సెక్షన్‌ను విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో వివాదం రాజుకుందన్నారు.
తమ కనెక్షన్‌తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఘర్షణ చెలరేగిందన్నారు. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయన్నారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారని వెల్లడించారు. వీరిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులోని 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ సహా 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 37 మంది నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment