water connection
-
ఇంకా 44 శాతం గిరిజన ప్రాంతాలకు నల్లా నీరు లేదు: కేంద్రం
ఇంకా 44 శాతం గిరిజన ప్రాంతాలకు నల్లా నీరు లేదు: కేంద్రం -
కేటీఆర్ అంకుల్.. కాలనీకి నల్లానీరు ఇప్పించరూ
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నివసించే ఉమర్ అనే బాలుడు మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావును కోరిన చిరుకోరిక తక్షణమే నెరవేరింది. నగరంలోని రాజేంద్రనగర్ గోల్డెన్ సిటీలో పిల్లర్ నంబర్ 248 వద్ద నివసిస్తున్న తాము ఐదేళ్లుగా మున్సిపల్ నీటి కనెక్షన్ కోసం నిరీక్షిస్తూ ఎన్నో సమస్యలు పడుతున్నామంటూ చిన్నారి ఉమర్ ఓ వీడియోలో ప్లకార్డు ప్రదర్శించాడు. ఈ వీడియోను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు సోమవారం ట్వీట్ చేయడంతో ఆయన దీన్ని చూసి తక్షణమే స్పందించారు. బాలుడు నివసించే కాలనీకి ప్రత్యక్షంగా వెళ్లి సమస్యను పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఆదేశించారు. దీంతో ఎండీ సోమవారం గోల్డెన్ సిటీ కాలనీలో పర్యటించారు. బాలుడు ఉమర్‌తోపాటు కాలనీవాసులను కలిసి సమస్యను తెలుసుకున్నారు. తక్షణం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కాలనీలో నల్లా పైప్‌లైన్ ఏర్పాటుకు జలమండలి రూ. 2.85 కోట్లను మంజూరు చేసిందని... ఇటీవల వర్షాల కారణంగా రోడ్‌కటింగ్ అనుమతులు లేకపోవడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రెండు వారాల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసి నల్లా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా కాలనీకి నీటి సరఫరా కొనసాగిస్తామన్నారు. బాలుడు ఉమర్ తమ కాలనీ నీటి సమస్యను వివరించిన నాలుగు గంటల్లోపే మంత్రి కేటీఆర్ స్పందించడం, జలమండలి ఎండీ దానకిశోర్ నేరుగా గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం చకచకా జరిగిపోవడం విశేషం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కేటీఆర్ అత్యంత ప్రాధాన్యతనివ్వడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. -
అందని ద్రాక్షగా వీడీఎస్
చింతల్: అక్రమ నీటి కనెక్షన్లను సక్రమంగా చేసుకునేందుకు జలమండలి (వాలంటరీ డిస్పోజల్ స్కీమ్) ప్రవేశపెట్టిన వీడీఎస్ పథకం నెల రోజులు కావస్తున్నా కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ డివిజన్ పరిధిలో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో వినియోగదారులు వాటర్ వర్క్స్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కనెక్షన్లను గతంలో సంవత్సరం పాటు నీటి బిల్లుల వేసి వీడీఎస్‌కు బదిలీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఎటువంటి రుసుము చెల్లించకుండానే కనెక్షన్లను మార్పు చేసేందుకు వీలు కల్పిస్తున్నా ఏ ఒక్క కనెక్షన్ ఇంత వరకు వీడీఎస్‌కు బదిలీ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ పథకం అసలు అమలు అవుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో పనికి.. ఒక్కో రేటు.. వాలంటరీ డిస్పోజల్ స్కీమ్‌తో ప్రతి రోజు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రెండు కనెక్షన్లు ఉన్న వారు సైతం వీడీఎస్‌కు దరఖాస్తు చేస్తున్నారు. కాగా కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే బదలాయింపు చేపట్టాల్సి ఉంది. కానీ అధికారులు తమ సిబ్బంది తెచ్చిన వాటినే స్వీకరిస్తూ మిగతా వాటిని పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేయి తడపనిదే ఫైల్ ముందుకు కదలడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో కనెక్షన్‌కు ఒక్కో రేటు చొప్పున ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఫైల్ రిజక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీడీఎస్ దరఖాస్తులు అధికారుల వద్దకు చేరినా క్రమబద్ధీకరణకు గడువు ముంచుకొస్తుండటంతో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. చివరి నిమిషంలో ఫైల్ నాట్ సబ్మిటెడ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారని కొంతమంది వినియోగదారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు అప్లోడ్ చేసినా నేటికీ ఆర్డర్ కాపీ/ఫీజుబులిటీ కాపీలు రావడం లేదు. దీంతో ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటు న్నాయి. సిబ్బందే మీడియేటర్లు.. వీడీఎస్ స్కీమ్ దరఖాస్తులను సిబ్బందే మీడియేటర్లుగా మారినట్లు సమాచారం ఒక్కో కనెక్షన్‌కు రేట్లు మాట్లాడుకుని దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది సిబ్బందికి ఎటువంటి పనులు లేకపోయినా ఆ పని.. ఈç పని అంటూ ఉదయం రావడంతో పైరవీలు చేయడం వారి దినచర్యగా మారినట్లు తెలుస్తోంది. రెవెన్యూ వసూళ్ల పేరుతో ఉద్యోగం చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. కొత్త కనెక్షన్ల విషయంలోనూ వారే అధికారులకు వెన్నుదన్నుగా ఉండి నూతన భవనానికి గోతులు తీయగానే గద్దల్లా వాలిపోయి కనెక్షన్ల పైరవీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు నేరుగా కార్యాలయానికి వచ్చే వారిని మధ్యవర్తుల వద్దకు పంపుతున్నట్లు కోడై కూస్తోంది. అధికారులు ఎక్కడా నేరుగా వినియోగదారులతో సంప్రదింపులు జరుపకుండా మధ్యవర్తులనే ముందు నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా త్రిబుల్ టైమ్ బిల్లులు.. డివిజన్ పరిధిలోని వివిధ సెక్షన్లలో అధికారులు ఇష్టారాజ్యంగా ఫీజుబులిటీలు ఇచ్చినట్లు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 600 గజాలు దాటిన వాటికి బిల్డింగ్‌లకు పోర్షన్ల వారీగా నమోదు చేయాల్సి ఉండగా 100 నుంచి 200 వందల గజాలకు సైతం పోర్షన్లు యాడ్ చేశారు. రూ.650 రావాల్సిన నీటి బిల్లుకు పోర్షన్లు యాడ్ చేయడంతో రూ.3,600కు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా కొన్ని భవనాలకు పోర్షన్ల వారీగా నమోదు చేయడంతో వినియోగదారులు డివిజన్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్న జీఎం శ్రీధర్‌రెడ్డి వాటిని సాధారణ కనెక్షన్లుగా మార్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో ఈ ఫిర్యాదులే వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
మత ఘర్షణల్లో ఇద్దరి మృతి
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు 144 సెక్షన్‌ను విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో వివాదం రాజుకుందన్నారు. తమ కనెక్షన్‌తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఘర్షణ చెలరేగిందన్నారు. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయన్నారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారని వెల్లడించారు. వీరిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులోని 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ సహా 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 37 మంది నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. -
మూడు వారాల్లో ఇంటింటికీ తాగునీరు
ఇబ్రహీంపట్నం(కోరుట్ల) : మిషన్‌భగీరథ ద్వారా మూడు వారాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్‌రావు అన్నారు. మండలంలోని డబ్బా గ్రామంలో వాటర్‌గ్రిడ్ వద్ద పంప్‌హౌస్‌లో భారీ విద్యుత్ మోటర్లను ఆన్ చేసి గుట్టపైన ఉన్న 30 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంకుకు నీళ్లు ఎక్కించి గ్రామాలకు వెళ్లే పైప్లైన్లకు నీటిని విడుదల చేశారు. గ్రిడ్‌నుంచి ఎక్కడా ఎలాంటి అవంతరాలు లేకుండా గుట్టపైకి నీళ్లు చేరడంతో ట్రయిల్‌రన్ విజయవంతం అయినట్లు ఆనందం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతు పంప్‌హౌస్ నుంచి 644 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు విద్యుత్ మోటార్లను నడిపిస్తూ డబ్బాగుట్ట ట్యాంకుకు నీళ్లు ఎక్కిస్తున్నామని, ఈ ట్యాంకు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మక్కపేట వద్ద గల 4 లక్షల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకుకు ఎక్కించి నిరంతరం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల గ్రామాలతోపాటు మెట్‌పల్లిలోని ఐదు గ్రామాలకు ఇక్కడనుంచి పైప్లైన్ల ద్వారా నీళ్లు వెళ్తాయని వివరించారు. మరో పైప్‌లైన్ ద్వారా కోరుట్ల, జగిత్యాల ధర్మపురి వరకు వెళ్తాయని తెలిపారు. ప్రస్తుతం పైప్లైన్ల ద్వారా నీటిని విడుదల చేశామని ఎక్కడైన లీకేజీ ఉన్నాయో సిబ్బంది పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త ట్యాంకులు, పైప్‌లైన్ నిర్మాణాలు పూర్తికాగనే వాటికి కనెక్షన్ ఇచ్చి నీటిని సరాఫరా చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఈఈ జ్ఞాన్‌కుమార్, డీఈ శేఖర్‌రెడ్డి, ఏఈ మల్లేశ్, సిబ్బంది ఉన్నారు. -
వాటర్ కనెక్ట్ యాప్‌ను ఆవిష్కరణ
-
ఒక్క క్లిక్‌తో నల్లా కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులకు శుభవార్త. నల్లా కనెక్షన్ కోసం వినియోగదారులు పడే అవస్థలకు ఇక ఫుల్స్టాప్ పడనుంది. ఇందుకోసం జలమండలి వాటర్ కనెక్ట్ యాప్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి గృహ వినియోగ (డొమెస్టిక్) నల్లాల కోసం ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు అవసరమైన ఇంటి నిర్మాణ ప్లాన్, సేల్‌డీడ్, ఆక్యుపెన్సీ ధ్రువీకరణపత్రం డాక్యుమెంట్లను స్కాన్ చేసి మొబైల్ ద్వారానే అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఈ వాటర్ కనెక్ట్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా దరఖాస్తులను సమర్పించిన వినియోగదారులకు 15 రోజుల్లో నల్లా కనెక్షన్ జారీ కానుంది. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎండీ దానకిశోర్‌లు ‘వాటర్ కనెక్ట్’ యాప్‌ను ఆవిష్కరించారు. ఇంకుడు గుంతలపై మరింత సమాచారం అందజేసేందుకు జలమండలి రూపొందించిన జలంజీవం యాప్, జలంజీవం వెబ్సైట్లనూ ప్రారంభించారు. అంతకుముందు జలం జీవం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి... చిత్రాలను వీక్షించారు. -
జల వరం!
సాక్షి, హైదరాబాద్: రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలకు జలమండలి జల‘వరం’ ప్రకటించింది. డిసెంబరు నెలాఖరులోగా ఏకంగా 303 బస్తీవాసులకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయడం ద్వారా ట్యాంకర్ అవస్థల నుంచి విముక్తి కల్పించనుంది. ప్రధాన నగరంలోని 11 నిర్వహణ డివిజన్ల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ పనులు చేపట్టనుంది. ఆయా బస్తీల్లో ఇప్పటికే 67 కి.మీ మార్గంలో పైపులైన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలో పనులు మొదలుపెట్టడంతోపాటు నూతనంగా 43,350 నల్లాకనెక్షన్లను జారీచేయనుంది. ఆ తర్వాత దశలవారీగా మహానగరం పరిధిలో మంచినీటి సరఫరావ్యవస్థ లేని కాలనీలు, బస్తీల్లో ఇదే తరహాలో ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేస్తారు. రూ.7.27 కోట్లు ఆదా.. దశాబ్దాలుగా జలమండలి పరిధిలో ట్యాంకర్ నీళ్ల దందా అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. మరోవైపు బస్తీవాసులకు కన్నీళ్లనే మిగిలిస్తోంది. ఈనేపథ్యంలో ఈ అవస్థలకు చరమగీతం పలికేందుకు బోర్డు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం క్షేత్రస్థాయి మేనేజర్లు,డిప్యూటీ జనరల్ మేనేజర్లు 303 బస్తీల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ నల్లా ఏర్పాటుచేయాల్సిన వీధులను గుర్తించారు. వీటిల్లో ఏమేర పైపులైన్లు, జంక్షన్లు, వాల్వ్‌లు ఏర్పాటు చేయాలో గుర్తించారు. వీటి ఏర్పాటుకు రూ.11.13 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. దీంతో ఈ పనులకు మోక్షం లభించింది. ఇక ట్యాంకర్ నీళ్లకోసం ఏటా బోర్డు ఖర్చుపెడుతోన్న రూ.7.27 కోట్లు ఆదాకానున్నాయి. జలమండలికి రూ.8.72 కోట్ల ఆదాయం ఇక ట్యాంకర్ నీళ్లకు చేస్తున్న ఖర్చుతగ్గడమేకాక..ఆయా బస్తీల్లో నూతనంగా ఏర్పాటుచేయనున్న 43,350 నల్లా కనెక్షన్లతో జలమండలికి ఏటా రూ.8.72 కోట్ల ఆదాయం లభించనుంది. ట్యాంకర్ రహిత బస్తీలతో ఉపయోగాలివేబస్తీవాసులు ట్యాంకర్ నీళ్లకోసం రేయింబవళ్లు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దుస్థితి తప్పనుంది. బస్తీవాసులు ప్రధానంగా మహిళలు, చిన్నారులు ట్యాంకర్ల వద్ద గుమిగూడి తోపులాట, ఘర్షణ పడే అవస్థలు ఉండవు. నీటి వృథాను అరికట్టవచ్చు. దారితప్పే ట్యాంకర్ల ఆగడాలకు చెక్‌పడుతోంది. నిరుపేదల అవస్థలు తీర్చేందుకే... నిరుపేదల దాహార్తి తీర్చడం..వారి విలువైన సమయాన్ని ట్యాంకర్ నీళ్లకోసం ఎదురుచూస్తూ వృథా చేసుకుంటున్న దురవస్థను తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న 9.65 లక్షల నల్లాలకు అదనంగా పట్టణమిషన్ భగీరథ పథకం కింద నూతనంగా మరో లక్ష నల్లాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హడ్కో నిధులతో 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 52 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను డిసెంబరు నెలాఖరునాటికి సిద్ధంచేస్తున్నాం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 1400 కి.మీ మార్గంలో నూతన పైపులైన్ వ్యవస్థను ఏర్పాటుచేయగా...నూతనంగా మరో 450 కి.మీ మార్గంలో పైపులైన్లు ఏర్పాటుచేసి తాగునీటి సరఫరావ్యవస్థ..ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నాం. – ఎం.దానకిశోర్ -
22 ఏళ్లుగా ఆ ఇంటికి వాటర్ బిల్లే లేదు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సీనియర్ శాస్త్రవేత్త గత 22 ఏళ్లుగా నీటి బిల్లు కట్టడం లేదు. ఎందుకంటే ఆయన ఇంటికి అసలు ప్రభుత్వ కుళాయి కనెక్షన్ కూడా లేదు. అదేమిటీ బెంగళూరులాంటి నగరంలో అసలు కుళాయి కనెక్షన్ లేకుండా ఎలా జీవితాన్ని గడుపుతున్నారని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఏఆర్ శివకుమార్ అనే వ్యక్తి ఓ శాస్త్రవేత్త. అతడు కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన తన నివాసాన్ని హరిత గృహంగా నిర్మించారు. రోజుకు కనీసం 400 లీటర్ల వర్షపు నీటిని స్టోర్ చేసేలా కట్టుకున్నారు. ఈ విధంగా నీటి కష్టాలు మొత్తం రాష్ట్రం మొత్తం ఎదుర్కొంటున్నా తన ఇంట్లో మాత్రం ఎలాంటి సమస్య లేకుండా హాయిగా గడిపేస్తున్నారు. మొత్తం మీద ఆయన ఇంటికి దాదాపు 45వేల లీటర్ల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఉంది. శక్తివనరులు, వర్షపు నీటిని తిరిగి వినయోగించుకుకోవడం ఎలా అనే విభాగంలో పని చేస్తున్న ఆయన తన ఇంటికి ఏడాదికి మొత్తం 2.3లక్షల లీటర్ల నీరు సరిపోతుందని చెప్పారు. రోజుకు 400 లీటర్ల చొప్పున అవసరం అవుతుందని, 100 రోజులకు 40000 లీటర్ల నీరు అవసరం ఉంటుందని, కానీ తమకు 45వేల లీటర్ల నిలువ నీటి సామర్థ్యం ఉందని అన్నారు. -
ఆ హీరోయిన్ ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తాం
చెన్నై: ఇంటి పన్ను కట్టనందుకుగాను నటుడు జయరాం, నటి నయనతారల ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు ఊటీ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని లవ్టెల్ రోడ్డు రాయల్ కాస్టిల్ అనే ప్రాంతంలో 122 ఇళ్లు ఉన్నాయి. వీటి సొంతదారులు కొందరు కార్పొరేషన్‌కు ఇంటి పన్నును చాలా కాలంగా చెల్లించడం లేదు. దీంతో కార్పొరేషన్ అధికారులు మంగళవారం పన్ను కట్టని ఇళ్లకు జప్తు నోటీసులు అంటించి వచ్చారు. దీని గురించి కార్పొరేషన్ కమిషనర్ శివకుమార్ మాట్లాడుతూ, ఊటీ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటి పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పారు. రాయల్ కాస్టిల్ ప్రాంతంలో నటుడు జయరాం, నటి నయనతారలకు చెందిన ఇళ్లు ఉన్నాయన్నారు. వారితో పాటు పలు వ్యాపారవేత్తలు ఇంటి పన్ను చెల్లించకపోవడంతో తాము ఒత్తిడి తీసుకొస్తూ నోటీసులు కూడా అంటించామన్నారు. అయినా వాటిని కొందరు చింపి పారేశారే గానీ పన్ను చెల్లించలేదన్నారు. దీంతో వారి ఇళ్లకు జప్తు నోటీసు అంటించినట్లు తెలిపారు. ఇప్పటికీ వారు స్పందిచకపోతే ముందుగా వారి ఇళ్లకు వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు ఆ తరువాత జప్తుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.