
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులకు శుభవార్త. నల్లా కనెక్షన్ కోసం వినియోగదారులు పడే అవస్థలకు ఇక ఫుల్‌స్టాప్ పడనుంది. ఇందుకోసం జలమండలి వాటర్ కనెక్ట్ యాప్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి గృహ వినియోగ (డొమెస్టిక్) నల్లాల కోసం ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు అవసరమైన ఇంటి నిర్మాణ ప్లాన్, సేల్‌డీడ్, ఆక్యుపెన్సీ ధ్రువీకరణపత్రం డాక్యుమెంట్లను స్కాన్ చేసి మొబైల్ ద్వారానే అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఈ వాటర్ కనెక్ట్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈ యాప్ ద్వారా దరఖాస్తులను సమర్పించిన వినియోగదారులకు 15 రోజుల్లో నల్లా కనెక్షన్ జారీ కానుంది. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎండీ దానకిశోర్‌లు ‘వాటర్ కనెక్ట్’ యాప్‌ను ఆవిష్కరించారు. ఇంకుడు గుంతలపై మరింత సమాచారం అందజేసేందుకు జలమండలి రూపొందించిన జలంజీవం యాప్, జలంజీవం వెబ్‌సైట్లనూ ప్రారంభించారు. అంతకుముందు జలం జీవం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి... చిత్రాలను వీక్షించారు.