Water Council
-
వాటర్ కనెక్ట్ యాప్‌ను ఆవిష్కరణ
-
ఒక్క క్లిక్‌తో నల్లా కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులకు శుభవార్త. నల్లా కనెక్షన్ కోసం వినియోగదారులు పడే అవస్థలకు ఇక ఫుల్స్టాప్ పడనుంది. ఇందుకోసం జలమండలి వాటర్ కనెక్ట్ యాప్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి గృహ వినియోగ (డొమెస్టిక్) నల్లాల కోసం ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు అవసరమైన ఇంటి నిర్మాణ ప్లాన్, సేల్‌డీడ్, ఆక్యుపెన్సీ ధ్రువీకరణపత్రం డాక్యుమెంట్లను స్కాన్ చేసి మొబైల్ ద్వారానే అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఈ వాటర్ కనెక్ట్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా దరఖాస్తులను సమర్పించిన వినియోగదారులకు 15 రోజుల్లో నల్లా కనెక్షన్ జారీ కానుంది. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎండీ దానకిశోర్‌లు ‘వాటర్ కనెక్ట్’ యాప్‌ను ఆవిష్కరించారు. ఇంకుడు గుంతలపై మరింత సమాచారం అందజేసేందుకు జలమండలి రూపొందించిన జలంజీవం యాప్, జలంజీవం వెబ్సైట్లనూ ప్రారంభించారు. అంతకుముందు జలం జీవం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి... చిత్రాలను వీక్షించారు. -
నగర ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దు
- వర్షాకాల సమస్యలపై అప్రమత్తం - సీజన్ ముగిసే వరకు సిబ్బంది సెలవులు రద్దు - వివిధ విభాగాల అధికారులతో కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: నగరంలో గత వర్షా కాలంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా తగిన ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ముగిసే వరకు జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖల్లో అధికారులు, సిబ్బందికి సెలవుల్ని రద్దు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో నగరంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల ప్రణాళిక) పనులపై వివిధ శాఖల అధికారులతో శనివారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షా కాలంలో డ్రైనేజీ, నాలాల్లో పడి మరణించే ఘటనలు జరగడానికి ఇక వీల్లేదని, వాటిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈసారి ఎలాంటి ప్రాణనష్టం జరిగినా అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రోడ్లపై గుంత కనపడకూడదు... రోడ్లపై ఎక్కడా గుంతలు కనపడకూడదని సీఎం ఆదేశించారని కేటీఆర్ చెప్పారు. దానికి అనుగుణంగా మూడు వారాల్లో నగర రోడ్లపై గుంత కనపడకుండా చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. గత వర్షాకాలంలో ప్రజల నుంచి పెద్దయెత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఈసారి వాటికి ఆస్కారం లేకుండా నాలుగు నెలలుగా ఉమ్మడి సమన్వయ గ్రూప్ ఏర్పాటు చేసి, ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విపత్తు నివారణ సెల్... నగరంలో 2010 శిథిల భవనాలను గుర్తించగా, వాటిల్లో 1089 భవనాలను కూల్చివేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మిగతా వాటికి కూడా నోటీసులిచ్చి కూల్చివేతలు పూర్తిచేయాలని మంత్రి సూచించారు. నాలాలపై ప్రధాన అడ్డంకిగా ఉన్న 887 నిర్మాణాలను కూడా కూల్చివేయాలన్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా విపత్తు నివారణ సెల్‌లను ఏర్పాటు చేయాలన్నారు. నెలకోమారు నిర్వహిస్తున్న సిటీ కన్జర్వెన్స్ సమావేశాలను ఇకపై 15 రోజులకోమారు ఏర్పాటు చేయాలన్నారు. 40 వేల ఇళ్ల టెండర్లు పూర్తి... జీహెచ్ఎంసీ పరిధిలో 40 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, మరో 20 వేల ఇళ్ల టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి తీరతామని పునరుద్ఘాటించారు. ఎస్సార్డీపీ పనుల వేగాన్ని పెంచాలన్నారు. ఇది ‘ఎగ్జిక్యూషన్’ సంవత్సరం... నగరంలో పెద్దయెత్తున ఎస్సార్డీపీ, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, ఇతర భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్న మంత్రి... ఈ ఏడాదిని ‘ఇయర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్’గా అభివర్ణించారు. రెవెన్యూ వసూళ్లలో జీహెచ్ఎంసీ దేశంలోనే ప్రశంసనీయమైన అభివృద్ధి సాధించడంపై అభినందించారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మునిసిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. అన్ని ఫిర్యాదులకూ ‘100’ నగర పరిధిలో ఎలాంటి ఫిర్యాదులకైనా ప్రస్తుతం ఉన్న వివిధ నంబర్ల స్థానంలో ప్రజలకు సౌకర్యంగా ఉండేలా 100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ చెప్పారు. రోడ్లు, సివరేజీ ఇంజినీరింగ్ మరమ్మతుల్లో పాల్గొనే కార్మికులకు చేతి గ్లౌజులు, బూట్లు తదితర రక్షణ పరికరాలను విధిగా అందజేయాలని స్పష్టం చేశారు. నీరు నిలిచే 220 ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రి దృష్టికి తేగా, ట్రాఫిక్ పోలీసులతో కలిసి మరోమారు సర్వే చేసి వాటి పరిష్కారానికి మంగళవారం లోగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. -
ట్యాంకర్ల కేటాయింపులో గోల్మాల్!
గిరాకీ ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల కోసం పక్కదారులు... భారీగా ముడుపులు చెల్లిస్తున్న వైనం కొందరికే ‘గిరాకీ కేంద్రాల’ కేటాయింపు చోద్యం చూస్తున్న జలమండలి అధికారులు సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్లకు నీటి ఫిల్లింగ్ కేంద్రాల కేటాయింపు వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుంటోంది. చేతులు తడిపిన వారికే గిరాకీ అధికంగా ఉన్న ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహా నగరం పరిధిలో జలమండలికి ఉన్న 53 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద సుమారు 900 ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మంచినీటి కొరత ఉన్న కాలనీలు, బస్తీల్లో ఉన్న గృహ వినియోగదారులు, వాణిజ్య సముదాయాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆయా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నీటిని సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన ట్యాంకర్ యజమానులకు కొందరు అధికారులు చుక్కలు చూపుతున్నారు. తమను ప్రసన్నం చేసుకున్నవారికే అధికంగా గిరాకీ(ట్యాంకర్ బుకింగ్‌లు)ఉన్న ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయిస్తున్నట్లు పలువురు యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూకట్పల్లి, మాదాపూర్, భరత్‌నగర్, మియాపూర్, ఎన్టీఆర్నగర్, వైశాలీనగర్ తదితర ఫిల్లింగ్కేంద్రాల వద్ద తిష్టవేసేందుకు కొందరు ట్యాంకర్ యజమానులు ట్యాంకరుకు రూ.25 వేల చొప్పున అధికారులకు ఆమ్యామ్యాలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారని తెలిసింది. దీంతో వారికే తొలిప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.ఇటీవల ఆన్లైన్ ద్వారా ట్యాంకర్లకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఫిల్లింగ్ కేంద్రాల కేటాయింపుల్లో మాత్రం పారదర్శకంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ అక్రమాల జాతర... అధిక గిరాకీ ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల వద్ద తిష్టవేసేందుకు కొందరు ట్యాంకర్ యజమానులు ఉన్నతాధికారుల చేతులు తడుపుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండే ఫిల్లింగ్ కేంద్రం వద్ద ఒక్కో ట్యాంకరుకు రోజుకు సగటున 8 నుంచి 10 ట్రిప్పుల గిరాకీ ఉంటుంది. మరోవైపు బహుళ అంతస్తుల భవంతులు, మాల్స్, ఆస్పత్రులు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మెస్‌లు,సినిమా, ఫంక్షన్‌హాళ్లకు అదనంగా నీటిని సరఫరా చేసి అందినకాడికి దండుకునే వెసులుబాటు ఉంటుంది. అంతగా గిరాకీ లేని ఫిల్లింగ్ కేంద్రం వద్ద గరిష్టంగా ఐదు ట్రిప్పులు మాత్రమే దక్కుతాయి. దీంతో ట్యాంకర్ యజమానులు గిరాకీ అధికంగా ఉండే ఫిల్లింగ్ కేంద్రం వద్దే తిష్ట వేసేందుకు ముందుకొస్తారు. ఇదే అదనుగా సదరు యజమానుల నుంచి కొందరు అధికారులు లంచం తీసుకుని సదరు ఫిల్లింగ్ కేంద్రాన్ని కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇక అధికారుల కనుసన్నల్లో మెలిగే ట్యాంకర్ యజమానులు గృహవినియోగానికి సరఫరా చేసే ట్యాంకరు(ఐదువేల లీటర్ల సామర్థ్యం)ను వాణిజ్య అవసరాలకు తరలించి అదనంగా దండుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. సాధారణంగా గృహవినియోగానికి ఐదువేల లీటర్ల నీటిని తరలించే ట్యాంకర్‌కు రూ.400, వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తే ప్రతి ట్రిప్పుకు రూ.700 వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ గృహవినియోగ ట్యాంకర్‌ను వాణిజ్య అవసరాలకు తరలిస్తే ఒక్కో ట్రిప్పుపై రూ.500 వరకు యజమానికి గిట్టుబాటవుతుంది. ఇలా సగటున ఐదు ట్రిప్పులను పక్కదారి పట్టిస్తే నిత్యం ఒక్కో ట్యాంకరుకు రూ.2500 అదనంగా దండుకునే అవకాశం ఉంటుంది. మా దృష్టికి రాలేదు జలమండలి పరిధిలో ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఎన్ని ట్యాంకర్లు అవసరమో స్థానిక జనరల్ మేనేజర్లు నిర్ణయిస్తారు. కానీ ట్యాంకర్లకు ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయించే ప్రక్రియ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచే జరుగుతుంది. గిరాకీ లేనందునే కొన్ని ఫిల్లింగ్ కేంద్రాల వద్ద అదనపు ట్యాంకర్లను అనుమతించడంలేదు. ఈవిషయంలో పారదర్శకంగానే వ్యవహరిస్తున్నాం. అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ట్యాంకర్ల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రస్తుతానికి నూతనంగా ఎవరికీ అవకాశం ఇవ్వడంలేదు. ఆన్లైన్లో స్వీకరించిన పలు దరఖాస్తులు మావద్ద పెండింగ్‌లో ఉన్నాయి. - పీఎస్.సూర్యనారాయణ, జలమండలి రెవెన్యూ విభాగం డెరైక్టర్ -
2 మార్గాలు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన జలమండలి నేడో, రేపో సీఎంకు నివేదన కొందుర్గ్ మీదుగా 221 కి.మీ. మార్గం... రూ.3380 కోట్ల వ్యయం ఖాజీగూడ మీదుగా 154 కి.మీ. మార్గం... రూ.2880 కోట్ల వ్యయం సిటీబ్యూరో: మహా నగర దాహార్తిని తీర్చేందుకు పది టీఎంసీల శ్రీశైలం నీటిని సిటీకి తరలించేందుకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను జల మండలి పరిశీలించింది. ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మార్గాల మ్యాపులను, ప్రాజెక్టు అంచనా వ్యయాలను రూపొం దించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మీదుగా సిటీకి నీటిని తరలిస్తే రూ.3,380 కోట్లు... ఖాజీగూడ మీదుగా తరలిస్తే రూ.2,880 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటిలో సీఎం ఏ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ఆ మార్గంలో పనులు చేపడతామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కొందుర్గ్ మీదుగా మళ్లిస్తే.. కొందుర్గ్ మీదుగా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గం మొత్తం 221 కి.మీ. ఉంటుంది. ఈ మార్గంలో శ్రీశైలం జలాశయం సమీపంలోని ఎల్లూరు (230 మీటర్లు)కు నీటిని పంపింగ్ చేసి... అక్కడి నుంచి 22 కి.మీ. దూరంలో ఉన్న కల్వకోల్ (380 మీటర్ల ఎత్తు)కు తరలించాల్సి ఉంటుంది. అటు నుంచి 25 కి.మీ. దూరంలోని గుడిపల్లి (555మీ)కి నీటిని పంపింగ్ చేసి... అక్కడి నుంచి 34 కి.మీ. దూరంలోని తిమ్మాజీపేటకు (520మీ) తరలిస్తారు. అటు నుంచి 75 కి.మీ. దూరంలోని కొందుర్గ్ (660 మీ)కు తరలిస్తారు. అక్కడి నుంచి 65 కి.మీ. దూరంలో నగరానికి నీటిని తరలించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నింపుతారు. ఈ మార్గంలో 112 కి.మీ. మేర నీటి పంపింగ్, మరో 109 కి.మీ.లో గ్రావిటీ ఆధారంగా నగరానికి నీటిని తరలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఖాజీగూడ మీదుగా నీటిని తరలిస్తే... ఖాజిగూడ మీదుగా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు రూపొందించిన మార్గం మొత్తం 154 కి.మీ. ఉంటుంది. ఈ మార్గంలో శ్రీశైలం జలాశయం సమీపంలోని ఎల్లూరు(230మీటర్లు)కు నీటిని పంపింగ్చేసి అక్కడి నుంచి 16 కి.మీ దూరంలో ఉన్న రాయవరానికి (370మీ. ఎత్తు) నీటిని పంప్ చేస్తారు. అక్కడి నుంచి 69 కి.మీ. దూరంలో ఉన్న మిడ్జిల్‌కు (510మీటర్లు) నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి 40 కి.మీ. దూరంలో గల ఖాజిగూడ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (650మీ)కు నీటిని పంపింగ్ చేస్తారు. అటునుంచి 29 కి.మీ. దూరంలో ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లను పూర్తి స్థాయిలో నింపవచ్చు. ఈ మార్గంలో నీటిని పంపింగ్ చేయాల్సి వస్తే విద్యుత్ ఖర్చు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రంగంలోకి అధికారులు ఈ నెల 5న జలమండలి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన విషయం విదితమే. నగర జనాభా, తాగునీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 10 టీఎంసీల శ్రీశైలం బ్యాక్‌వాటర్ నీటిని సిటీకి తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బోర్డు ఈఎన్సీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డిలు ఈ నెల 13న క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ మార్గాల్లో సాధ్యాసాధ్యాలు, నేలవాలును పరిశీలించారు. పంపింగ్, గ్రావిటీ మార్గం, పైప్లైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుపై ప్రాథమిక ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేశారు. వీటిని నేడో రేపో సీఎంకు సమర్పించి... ఆయన ఆదేశాల మేరకు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. -
వాటర్‌బోర్డులో 60 మంది..?
సాక్షి,సిటీబ్యూరో: జలమండలిలో పలువురు ఉద్యోగులకు ‘స్థానికత’ గుబులు పట్టుకుంది. ఉద్యోగుల సర్వీసు పుస్తకంలో పేర్కొన్న ప్రాంతం ఆధారంగా బదిలీలు జరిగితే సుమారు 60 మంది ఉద్యోగులకు స్థానచలనం తప్పదన్న సంకేతాలు వెలువడుతుండడంతో ప్రస్తుతం బోర్డులో ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా కీలకమైన ఫైనాన్స్డెరైక్టర్, మెడికల్ ఆఫీసర్, ఎస్టేట్ ఆఫీసర్, చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, మేనేజర్,డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాడర్లలో పనిచేస్తున్న ఇంజనీర్లుసహా ఇతర సాంకేతిక సిబ్బంది, ఫైనాన్స్,హెచ్.ఆర్ విభాగంలో దాదాపు 60 మంది వరకు స్థానికేతరులు బోర్డులో పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఆయా ఉద్యోగులు బదిలీకి స్థానికతే ప్రామాణికమైతే వీరంతా తమ సొంత జిల్లాలకు వెళ్లడం అనివార్యమని బోర్డు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉద్యోగ,కార్మిక సంఘాలు సైతం ఇదే అంశంపై వాడీవేడీగా చర్చించుకుంటున్నాయి. డిప్యూటేషన్లపై పనిచేస్తున్న అధికారులను మాత్రమే బదిలీకి పరిమితం చేసి వారిని మాతృసంస్థల్లోకి తిరిగి పంపించాలని, దశాబ్దాల క్రితం బోర్డు ఉద్యోగులుగా ఎంపికైన తమకు బదిలీ నుంచి మినహాయింపునివ్వాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త ఉద్యోగాల భర్తీ ఎప్పుడో : జలమండలి నీటిసరఫరా,మురుగునీటిపారుదల విభాగంలో సుమారు 670 ఖాళీ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి,మార్చి నెలల్లో దరఖాస్తులు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలు,రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో వీటి భర్తీ ప్రక్రియ కూడా పూర్తిగా నిలిచిపోయింది. బోర్డులో ఇప్పటికే హెచ్ఆర్ కార్మికులుగా పనిచేస్తున్నవారికి ప్రత్యేక వెయిటేజీ నిచ్చి సుమారు 600 మందిని ఆయాపోస్టుల్లో భర్తీ చేయనున్నారు. బయటి వ్యక్తులకు కేవలం 70 వరకు ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయి. ఈ 70 పోస్టులకోసమే సుమారు 30 వేలమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాగా ఖాళీ పోస్టుల భర్తీ కొత్త ప్రభుత్వం కొలువుదీరాకనే భర్తీ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. -
నీటి మీటర్లు లేకుంటే రెట్టింపు బిల్లులు
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతిపై బాదుడుకు జలమండలి మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో గృహ వినియోగ కుళాయిలకు(డొమెస్టిక్) నీటి మీటర్లు లేని వినియోగదారుల నుంచి రెట్టింపు నీటి చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మహానగర పరిధిలోని బడా కుళాయిలకు(బల్క్) మీట రింగ్ పాలసీని అమలు చేస్తుండగా.. త్వరలో డొమెస్టిక్ కేటగిరీలోనూ ఈ విధానాన్ని అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ శ్యామలరావు తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్‌లో ని బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో మీటర్లు లేని గృహవినియోగ కనెక్షన్లు సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నాయి. మీటరింగ్ పాలసీ అమలు చేసిన పక్షంలో వీరందరికీ బాదుడు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే ప్రస్తుతం నెలకు రూ.200 బిల్లు చెల్లిస్తున్న వారు రూ.400 బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి రానుంది. బోర్డు పురోగతిపై ఎండీ తెలిపిన విశేషాలివే.. వేసవిలో నో పానీపరేషాన్... గ్రేటర్‌కు మంచినీరందిస్తున్న జలాశయాల్లో నీటి నిల్వలు సంతృప్తికరంగా ఉండడంతో జూలై చివరి నాటి వరకు నగరంలో మంచినీటి కటకట ఉండదని ఎండీ స్పష్టం చేశారు. వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు 24 గంటల పాటు అదనపు ట్యాంకర్ ట్రి ప్పుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. రికార్డు అదాయం.. మార్చి 31 వరకు జలమండలి రికార్డు రెవెన్యూ ఆదాయం ఆర్జించిందని ఎండీ వెల్లడించారు. మార్చి నెలలో 4.50 లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించడంతోపాటు జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన ఆస్తిపన్ను వాటాలో రూ.53 కోట్లు జలమండలి ఖజానాకు చేరడంతో ఒకే నెలలో రూ.160 కోట్లు రెవెన్యూ ఆదాయం లభించిందన్నారు. గడువు పెంపు లేదు.. నీటి బిల్లు బకాయిల వసూలుకు వన్‌టైమ్ సెటిల్మెంట్, అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకాలకు చివరి గడువు మార్చి 31తో ముగిసినందున ప్రస్తుతానికి గడువు పెంచలేమని స్పష్టంచేశారు. ఎన్నికల అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్ నాటికి కృష్ణా మూడోదశ... ఈ ఏడాది జూన్ చివరి నాటికి కృష్ణా మూడోదశ పథకం మొదటి దశను పూర్తిచేసి నగరానికి 45 ఎంజీడీల జలాలు తరలిస్తామన్నారు. గోదావరి మంచినీటి పథకం మొదటి దశను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తై మల్కాజ్గిరి మంచినీటి పథకం పనులకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే పనులు మొదలు పెడతామని తెలిపారు.