2 మార్గాలు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన జలమండలి
నేడో, రేపో సీఎంకు నివేదన
కొందుర్గ్ మీదుగా 221 కి.మీ. మార్గం... రూ.3380 కోట్ల వ్యయం
ఖాజీగూడ మీదుగా 154 కి.మీ. మార్గం... రూ.2880 కోట్ల వ్యయం
సిటీబ్యూరో: మహా నగర దాహార్తిని తీర్చేందుకు పది టీఎంసీల శ్రీశైలం నీటిని సిటీకి తరలించేందుకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను జల మండలి పరిశీలించింది. ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మార్గాల మ్యాపులను, ప్రాజెక్టు అంచనా వ్యయాలను రూపొం దించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మీదుగా సిటీకి నీటిని తరలిస్తే రూ.3,380 కోట్లు... ఖాజీగూడ మీదుగా తరలిస్తే రూ.2,880 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటిలో సీఎం ఏ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ఆ మార్గంలో పనులు చేపడతామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
కొందుర్గ్ మీదుగా మళ్లిస్తే..
కొందుర్గ్ మీదుగా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గం మొత్తం 221 కి.మీ. ఉంటుంది. ఈ మార్గంలో శ్రీశైలం జలాశయం సమీపంలోని ఎల్లూరు (230 మీటర్లు)కు నీటిని పంపింగ్ చేసి... అక్కడి నుంచి 22 కి.మీ. దూరంలో ఉన్న కల్వకోల్ (380 మీటర్ల ఎత్తు)కు తరలించాల్సి ఉంటుంది. అటు నుంచి 25 కి.మీ. దూరంలోని గుడిపల్లి (555మీ)కి నీటిని పంపింగ్ చేసి... అక్కడి నుంచి 34 కి.మీ. దూరంలోని తిమ్మాజీపేటకు (520మీ) తరలిస్తారు. అటు నుంచి 75 కి.మీ. దూరంలోని కొందుర్గ్ (660 మీ)కు తరలిస్తారు. అక్కడి నుంచి 65 కి.మీ. దూరంలో నగరానికి నీటిని తరలించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నింపుతారు. ఈ మార్గంలో 112 కి.మీ. మేర నీటి పంపింగ్, మరో 109 కి.మీ.లో గ్రావిటీ ఆధారంగా నగరానికి నీటిని తరలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఖాజీగూడ మీదుగా నీటిని తరలిస్తే...
ఖాజిగూడ మీదుగా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు రూపొందించిన మార్గం మొత్తం 154 కి.మీ. ఉంటుంది. ఈ మార్గంలో శ్రీశైలం జలాశయం సమీపంలోని ఎల్లూరు(230మీటర్లు)కు నీటిని పంపింగ్‌చేసి అక్కడి నుంచి 16 కి.మీ దూరంలో ఉన్న రాయవరానికి (370మీ. ఎత్తు) నీటిని పంప్ చేస్తారు. అక్కడి నుంచి 69 కి.మీ. దూరంలో ఉన్న మిడ్జిల్‌కు (510మీటర్లు) నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి 40 కి.మీ. దూరంలో గల ఖాజిగూడ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (650మీ)కు నీటిని పంపింగ్ చేస్తారు. అటునుంచి 29 కి.మీ. దూరంలో ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లను పూర్తి స్థాయిలో నింపవచ్చు. ఈ మార్గంలో నీటిని పంపింగ్ చేయాల్సి వస్తే విద్యుత్ ఖర్చు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రంగంలోకి అధికారులు
ఈ నెల 5న జలమండలి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన విషయం విదితమే. నగర జనాభా, తాగునీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 10 టీఎంసీల శ్రీశైలం బ్యాక్‌వాటర్ నీటిని సిటీకి తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బోర్డు ఈఎన్‌సీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డిలు ఈ నెల 13న క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ మార్గాల్లో సాధ్యాసాధ్యాలు, నేలవాలును పరిశీలించారు. పంపింగ్, గ్రావిటీ మార్గం, పైప్‌లైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుపై ప్రాథమిక ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేశారు. వీటిని నేడో రేపో సీఎంకు సమర్పించి... ఆయన ఆదేశాల మేరకు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.