water pumping
-
పంపింగ్ ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వరదాయిని కృష్ణా జలాల అత్యవసర పంపింగ్ సోమవారం ప్రారంభమైంది. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్(పుట్టంగండి) వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టుకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్ల జలాల పంపింగ్ ప్రారంభించినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అత్యవసర పంపింగ్ కోసం ఏర్పాటు చేసిన 10 భారీ మోటార్లను ఆన్ చేసి నగరానికి అవసరమైన రావాటర్‌ను పంపింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ ఇరిగేషన్, జలమండలి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది. కాగా నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 508 అడుగుల మేర మాత్రమే నీళ్లున్నాయి. త్వరలో రుతుపవనాలు కరుణిస్తే సాగర్‌లో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, అత్యవసర పంపింగ్ కష్టాలు తీరుతాయని జలమండలి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా సిటీకి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలతో పాటు ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్‌సాగర్ జలాలే దాహార్తి తీరుస్తున్నాయి. ఈ జలాశయాల నుంచి నిత్యం 465 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి, శుద్ధి చేసి సిటీలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇటీవల నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో జలమండలి నల్లా, ట్యాంకర్ నీళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. దీంతో అదనపు ట్యాంకర్లతో వినియోగదారులకు తాగునీటిని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆగని నీటి తరలింపు.. పరిస్థితి ఉద్రిక్తం
శారదా నీటి పంపింగ్‌ను అడ్డుకునే యత్నం యల్లయ్య గ్రోయిన్ వద్ద వైఎస్సాఆర్సీపీ, సీపీఐ, రైతుల రాస్తారోకో పోలీస్‌స్టేషన్‌కు నాయకుల తరలింపు అనకాపల్లి: యల్లయ్య గ్రోయిన్ అనుసంధాన కాలువ నుంచి ఏలేరు కాలువలోకి నీటిని పంపింగ్ చేస్తున్న అంశం ఉద్రిక్తతకు దారితీసింది. కొద్దిరోజులుగా వైఎస్సాఆర్సీపీతోపాటు వివిధ పక్షాల నేతలు ఏలేరు కాలువలోకి ఎల్లయ్య గ్రోయిన్ నీటిని పంపింగ్ చేయడం కుదరదని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం వైఎస్సాఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అఖిలపక్షాల నేతలు ఆందోళన చేసిన సమయంలో పంపింగ్ యంత్రాలను తొలగించిన ట్లు నటించి బుధవారం యథావిధిగా నీటిని పంపింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలియడంతో వైఎస్సాఆర్సీపీ, సీపీఎం నేతలు యల్లయ్య కాలువ గ్రోయిన్ వద్దకు తరలివెళ్లారు. అక్కడి విశాఖపట్నం ఇండస్ట్రీస్ వాటర్ సప్లయ్ కంపెనీ ఏజీఎం అప్పలనాయుడు నేతృత్వంలో కొందరు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులు సైతం రంగప్రవేశం చేశారు. నీటిని తరలించేందుకు తాము అంగీకరించబోమని వైఎస్సాఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, సీపీఐ నేత వై.ఎన్.భద్రంలు హెచ్చరించినప్పటికీ విస్కో ప్రతినిధులు తమకు నీటిని తరలించేందుకు అనుమతి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు చర్చలు జరిగిన అనంతరం నాయకులు యంత్రాలు ఉన్న చోట బైఠాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు. అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న పట్టణ సీఐ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సాఆర్సీపీ, సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకొని జీపులో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో నినాదాలు అనకాపల్లి పరిధిలో శారదా నది నుంచి యల్లయ్య గ్రోయిన్ లోని నీటిని పంపింగ్ చేయడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన తమను అరెస్టు చేయడంపై వైఎస్సాఆర్సీపీ, సీపీఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు, వరదలు లేనప్పుడు శారదా నది నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇదే స్థాయిలో నీటిని తోడేస్తే అనకాపల్లి పట్టణ, మండలాలకు తాగు, సాగునీరు దక్కడం గగనమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లాలో దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన మాజీ మంత్రులు అనకాపల్లి నీటిని తరలిస్తున్నా ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి చెందిన నీటిని దోపిడీ చేస్తున్నప్పటికీ నేతలు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సాఆర్సీపీ పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, మండల పార్టీ కార్యదర్శి భీశెట్టి జగన్, అధికార ప్రతినిధి ఒమ్మి రాముయాదవ్, ఆహార కమిటీ సభ్యుడు ఏడువాకల నారాయణరావు, దళిత సోషితసంఘ సభ్యుడు మామిడి నూకరాజు, సీపీఐ నాయకుడు భద్రం,, శంకరరావు, కుండలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లు వదులుతారు.. మళ్లించుకుంటారు!
► ఆంధ్ర నీటివాటాలో భారీ కొత ► ఆంధ్ర సరిహద్దు వరకు అక్రమ నీటి పంపింగ్ కేంద్రాలు ► నీరు సక్రమంగా సరఫరాకాకపోవడంతో వెలవెలబోతున్న జలాశయాలు వేసవిలో జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి విడుదల చేసిన తుంగభద్ర నీరు కర్నూలుకు చేరడం ప్రశ్నార్థకంగా మారింది. అందుకు కారణం తుంగభద్ర దిగువ కాలువపై కర్ణాటక నీటి సరఫరా అధికారులు అక్రమంగా ఆంధ్రసరిహద్దు వరకు విచ్చలవిడిగా నీటి పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం. నీటిని వదిలేనట్లే వదిలి మళ్లీ వారే మళ్లించుకోవడంతో సమస్య జఠిలమైంది. పంపింగ్ కేంద్రాల ద్వారా ప్రస్తుతం దిగువ కాలువకు విడుదల చేసిన నీటిని భారీ ఎత్తున మళ్లిస్తున్నారు. వారి జలాశయాల్లో పెద్దఎత్తున నీటిని నిల్వ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. జిల్లా ప్రజాప్రతినిధులు, దిగువ కాలువ ఆంధ్ర అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆలూరు రూరల్/హాలహర్వి/హొళగుంద: తాగునీటి కోసం తుంగభద్ర కాలువ ఎల్లెల్సీ ద్వారా మనరాష్ట్ర నీటివాటా కింద 1.8 టీఎంసీలు నీరు రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో తుంగభద్ర దిగువకాలువ అధికారుల కోరిక మేరకు ఆ వాటా నీటిని ఈ నెల 5న విడుదల చేయాలని కోరారు. అందుకు తుంగభద్ర డ్యాం అధికారులు డ్యాంలో ప్రస్తుతం 582 అడుగులతో 5.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందని, ఆ నీరు కూడా ఎండకు రోజురోజుకు ఇంకి పోతోందని చెప్పారు. కేవలం ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు అంగీకరించారు. అది కూడా ఆలస్యంగా ఈ నెల 8న విడుదల చేశారు. ఆంధ్ర అధికారుల లెక్కల ప్రకారం హొళగుంద సెక్షన్ దాటిన తర్వాత 250 మైలురాయి ఆన్వాలు వద్ద రోజూ 600 క్యూసెక్కుల నీరు ప్రవహించాలి. అయితే అందులో ప్రతిరోజు 350 క్యూసెక్కుల నీరు కూడా రాని పరిస్థితి. కారణం అనాధికారికంగా ఆంధ్ర అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఏడాది క్రితం మోకా, ఎం.గొనేహాల్ వద్ద భారీ నీటి పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ పంపింగ్ కేంద్రాల ద్వారా రిజర్వాయర్‌లోనికి నీటిని మళ్లించేలా చూశారు. ప్రస్తుతం మోకా వద్ద ఏర్పాటు చేసిన నీటి పంపింగ్ కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం దాదాపు రూ.39 కోట్లను ఖర్చు చేసింది. ఆంధ్ర సరిహద్దు ఎ.గొనేహాల్ వద్ద కూడా దిగువ కాలువ ద్వారా అక్కడ అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 6.00 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని రిజర్వాయర్‌లోనికి మళ్లించుకుంటున్నారు. ఆ రెండు రిజర్వాయర్లకు తోడు ఆంధ్ర సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపురం నీటి పంపింగ్ కేంద్రం కూడా చాలా పెద్దది. ఆ పంపింగ్ కేంద్రం ద్వారా అక్కడ గతంలో ఏర్పాటు చేసిన పెద్ద రిజర్వాయర్‌లోనికి పెద్దపెద్ద మోటార్ల ద్వారా నీటి పంపింగ్ జరుగుతోంది. ఇలా కర్ణాటక దిగువ కాలువ అధికారులు అక్రమంగా రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుని మన తాగునీటి వాటాకు కూడా గండి కొడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక అక్రమ రిజర్వాయర్లలో నీటి నిల్వల కారణంగా ఆంధ్ర సరిహద్దు చింతకుంట, బాపురం, విరుపాపురం తదితర రిజర్వాయర్లలోనికి నీరు సక్రమంగా రాని పరిస్థితి ఏర్పడింది. దిగువ కాలువకు నీటి నిలిపివేత తుంగభద్ర దిగువ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి బళ్లారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో నీటిని నిలిపి వేశారు. నీరు నిలిపివేసినా ఆంధ్ర సరిహద్దు మైలురాయి 135 నుంచి ఆన్వాల్ 250 మైలురాయి వరకు నాలుగు రోజులపాటు నీరు ప్రవహించే అవకాశం ఉందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా తెలిపారు. పెద్దపెద్ద మోటార్ల ఉపయోగించి నీటిని పంపింగ్ చేసుకొని రిజర్వాయర్లలోనికి మళ్లిస్తామని చెప్పారు. -
గోదావరి పరుగు
{పయోగ పరీక్ష విజయవంతం ముర్మూరు నుంచి బొమ్మకల్‌కు సరఫరా 30 ఎంజీడీల నీరు పంపింగ్ మరో రెండు నెలల్లో నగరానికి... సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీర్చే గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ప్రయోగ పరీక్ష (ట్రయల్ రన్) విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా ముర్మూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 58 కి.మీ. దూరంలో ఉన్న బొమ్మకల్‌కు మంగళవారం 30 ఎంజీడీల నీటిని పంపింగ్ చేశారు. ఈ నీటిని 3000 డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ద్వారా బొమ్మకల్‌కు తరలించారు. పైప్లైన్ల సామర్థ్యం, హైడ్రాలిక్ టెస్టులు, పైప్లైన్ల ఎయిర్‌వాల్వ్‌లు, జాయింట్లను పరిశీలించారు. ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎల్లంపల్లి బ్యారేజి నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉన్న ముర్మూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఇప్పటికే నీటిని భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా తరలించిన విషయం విదితమే. అక్కడి నుంచి బొమ్మకల్- మల్లారం - కొండపాక- ఘన్పూర్ మార్గంలో రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్లతో పాటు సుమారు 186 కి.మీ మార్గంలో పైప్లైన్ల పనులు పూర్తయిన విషయం విదితమే. గోదావరి తొలిదశ ద్వారా గ్రేటర్‌కు 172 ఎంజీడీల జలాలను తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి 30 ఎంజీడీల నీటిని ఒకే మోటారు ద్వారా పంపింగ్ చేస్తున్నారు. మొత్తం పంపింగ్‌కు అవసరమైన 9 మోటార్లను ముర్మూరు పంప్ హౌస్ వద్ద సిద్ధంగా ఉంచారు. -
హమ్మయ్య దాహం తీరింది!
హార్సిలీహిల్స్‌కు 2 కొత్త బోర్ల నుంచి ప్రారంభమైన పంపింగ్ బి.కొత్తకోట: మండలంలోని హర్సిలీహిల్స్లో రెండేళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్య ఎట్టకేలకు తీరింది. ఇటీవల వేసిన 2 కొత్తబోర్ల నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. దీంతో కొంత దాహం తీరినట్లయింది. ఆదివారం కొత్తబోర్లకు విద్యుత్ సరఫరా ఇవ్వడంతో నీటిని సంపులకు పంపింగ్ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో సమ స్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. హార్సిలీ కొండకు 7 దశల్లో నీటిని కురబలకోట మండలం గాలేటివారిపల్లె నుంచి పం పింగ్ చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ బ్రిటీష్ పాలకుల హయాంలో నిర్మాణం చేసిం ది. ఈ ప్రాంతంలో టూరిజం శాఖకు చెందిన 7 బోర్లున్నాయి. రెండేళ్లుగా ఆరు బోర్ల నుంచి నీటి పంపింగ్ లేకుండాపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ రైతుల నుంచి నాలుగు బోర్లను లీజుకు తీసుకున్నారు. అయినా నీటి స మస్య తీరలేదు. నీటి సమస్య కారణంగా 10 అతిథి గృహాలను పర్యాటకులకు కేటాయించకుండా నిలిపివేయాల్సి వచ్చింది. రోజుకు లక్ష లీటర్ల కొరత తీరింది నిన్నటి వరకు హార్సిలీకొండకు రోజుకు లక్షల నీటి కొరత ఉండేది. ఆదివారం నుంచి ఆ కొరత నుంచి బయపడ్డారు. కొండపై రోజుకు 1.5 లక్షల లీటర్ల నీటి వినియోగం ఉంది. అయితే బోర్లు ఎండిపోవడంతో వేసవికి ముందు రోజుకు కేవలం 40 వేల లీటర్లు, ఇటీవల వరకు 25 వేల లీటర్ల నీళ్లే లభ్యమయ్యేది. ఈ నీరు పర్యాటక శాఖకే సరిపోకపోవడంతో స్థానికులకు, ఇతర శాఖలకు అం దించే వీలులేకపోయింది. ఒక ట్యాంకర్ నీటిని రూ.2 వేలతో కొనుగోలు చేశారు. పర్యాటక శాఖకు నీటినిల్వల కోసం నిర్మించిన 2.4 లక్షల లీటర్ల సామర్థ్యమున్న రెండు సంపులు ఎండిపోయాయి. ప్రస్తుతం కొత్తగా వేసిన 2 బోర్ల నుంచి నాలుగించుల నీళ్లు లభ్యమవుతున్నాయి. ఇప్పుడు రోజుకు లక్ష లీటర్ల నీటి లభ్యత మొదలైంది. అయితే లక్ష లీటర్ల వినియోగం తగ్గించి 80 వేల లీటర్లే పంపింగ్ అయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. సంపులకు నీటిని నింపేసి, మిగిలిన పంపింగ్ నీటిని అందరికీ సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మారిన నీటి ధరలు కొండపై నీటి వినియోగంపై కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. గతంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే నీటికి లీటర్‌కు 3పైసలు ఉండగా 10పైసలు పెంచారు. గృహ అవసరాలకు వినియోగించే నీటికి 2 పైసల నుంచి 5 పైసలకు పెంచారు. పెరిగిన ఈ ధరతో పర్యాటక శాఖకు కొంతమేరకు ఆదాయం సమకూరనుంది. -
2 మార్గాలు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన జలమండలి నేడో, రేపో సీఎంకు నివేదన కొందుర్గ్ మీదుగా 221 కి.మీ. మార్గం... రూ.3380 కోట్ల వ్యయం ఖాజీగూడ మీదుగా 154 కి.మీ. మార్గం... రూ.2880 కోట్ల వ్యయం సిటీబ్యూరో: మహా నగర దాహార్తిని తీర్చేందుకు పది టీఎంసీల శ్రీశైలం నీటిని సిటీకి తరలించేందుకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను జల మండలి పరిశీలించింది. ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మార్గాల మ్యాపులను, ప్రాజెక్టు అంచనా వ్యయాలను రూపొం దించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మీదుగా సిటీకి నీటిని తరలిస్తే రూ.3,380 కోట్లు... ఖాజీగూడ మీదుగా తరలిస్తే రూ.2,880 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటిలో సీఎం ఏ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ఆ మార్గంలో పనులు చేపడతామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కొందుర్గ్ మీదుగా మళ్లిస్తే.. కొందుర్గ్ మీదుగా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గం మొత్తం 221 కి.మీ. ఉంటుంది. ఈ మార్గంలో శ్రీశైలం జలాశయం సమీపంలోని ఎల్లూరు (230 మీటర్లు)కు నీటిని పంపింగ్ చేసి... అక్కడి నుంచి 22 కి.మీ. దూరంలో ఉన్న కల్వకోల్ (380 మీటర్ల ఎత్తు)కు తరలించాల్సి ఉంటుంది. అటు నుంచి 25 కి.మీ. దూరంలోని గుడిపల్లి (555మీ)కి నీటిని పంపింగ్ చేసి... అక్కడి నుంచి 34 కి.మీ. దూరంలోని తిమ్మాజీపేటకు (520మీ) తరలిస్తారు. అటు నుంచి 75 కి.మీ. దూరంలోని కొందుర్గ్ (660 మీ)కు తరలిస్తారు. అక్కడి నుంచి 65 కి.మీ. దూరంలో నగరానికి నీటిని తరలించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నింపుతారు. ఈ మార్గంలో 112 కి.మీ. మేర నీటి పంపింగ్, మరో 109 కి.మీ.లో గ్రావిటీ ఆధారంగా నగరానికి నీటిని తరలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఖాజీగూడ మీదుగా నీటిని తరలిస్తే... ఖాజిగూడ మీదుగా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు రూపొందించిన మార్గం మొత్తం 154 కి.మీ. ఉంటుంది. ఈ మార్గంలో శ్రీశైలం జలాశయం సమీపంలోని ఎల్లూరు(230మీటర్లు)కు నీటిని పంపింగ్చేసి అక్కడి నుంచి 16 కి.మీ దూరంలో ఉన్న రాయవరానికి (370మీ. ఎత్తు) నీటిని పంప్ చేస్తారు. అక్కడి నుంచి 69 కి.మీ. దూరంలో ఉన్న మిడ్జిల్‌కు (510మీటర్లు) నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి 40 కి.మీ. దూరంలో గల ఖాజిగూడ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (650మీ)కు నీటిని పంపింగ్ చేస్తారు. అటునుంచి 29 కి.మీ. దూరంలో ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లను పూర్తి స్థాయిలో నింపవచ్చు. ఈ మార్గంలో నీటిని పంపింగ్ చేయాల్సి వస్తే విద్యుత్ ఖర్చు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రంగంలోకి అధికారులు ఈ నెల 5న జలమండలి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన విషయం విదితమే. నగర జనాభా, తాగునీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 10 టీఎంసీల శ్రీశైలం బ్యాక్‌వాటర్ నీటిని సిటీకి తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బోర్డు ఈఎన్సీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డిలు ఈ నెల 13న క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ మార్గాల్లో సాధ్యాసాధ్యాలు, నేలవాలును పరిశీలించారు. పంపింగ్, గ్రావిటీ మార్గం, పైప్లైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుపై ప్రాథమిక ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేశారు. వీటిని నేడో రేపో సీఎంకు సమర్పించి... ఆయన ఆదేశాల మేరకు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. -
ఈత సరదాకు విద్యార్థి బలి
మరిపెడ : స్నేహితులతో ఈత కోసమని సరదాగా వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మృతిచెందిన సంఘటన మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెలో శనివారం చోటుచేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని సీతారాంపురం వీధికి చెందిన గడ్డం మల్సూర్, రాములమ్మ దంపతుల ఏకైక కుమారుడురాము(13) ఇదే వీధిలోని సీతారాంపురం హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో త్రైమాసిక పరీక్షలు రాసిన తర్వాత తన తరగతి స్నేహితులైన గుండా సాయి, ఎల్లుట్ల లోకేష్, బాలం సం దీప్, ప్రశాంత్, గణేష్‌తో కలిసి ఆటోలో పురుషోత్తమాయ గూడేనికి చెందిన నూకల నరేష్ రెడ్డి మామిడితోటలో ఉన్న నీటి పంపింగ్ స్టోరేజ్ కొలనులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. మెట్లు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రాము కొలనులో పడి మునిగిపోయూడు. దీంతో మిగతా విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వారిని గమనించిన తోట కాపరి బోధ్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ముగ్గురు విద్యార్థులు చేతికి దొరకగా... విషయం అడగడంతో రాము నీటమునిగినట్లు వారు చెప్పారు. అతడి సమాచారంతో కురవి సీఐ కరుణసాగర్‌రెడ్డి, మరిపెడ ఎస్సై నాగభూషణం సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా చేశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెళ్లెల్లు శోకసంద్రంలో మునిగిపోయారు.