నీళ్లు వదులుతారు.. మళ్లించుకుంటారు! | The share of water to Andhra massive fir | Sakshi
Sakshi News home page

నీళ్లు వదులుతారు.. మళ్లించుకుంటారు!

Published Fri, Apr 22 2016 4:04 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

నీళ్లు వదులుతారు..    మళ్లించుకుంటారు!

నీళ్లు వదులుతారు.. మళ్లించుకుంటారు!

ఆంధ్ర నీటివాటాలో భారీ కొత
ఆంధ్ర సరిహద్దు వరకు అక్రమ నీటి పంపింగ్ కేంద్రాలు
నీరు సక్రమంగా సరఫరాకాకపోవడంతో వెలవెలబోతున్న జలాశయాలు

 
 వేసవిలో జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి విడుదల చేసిన తుంగభద్ర నీరు కర్నూలుకు చేరడం ప్రశ్నార్థకంగా మారింది. అందుకు కారణం తుంగభద్ర దిగువ కాలువపై కర్ణాటక నీటి సరఫరా అధికారులు అక్రమంగా ఆంధ్రసరిహద్దు వరకు విచ్చలవిడిగా నీటి పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం. నీటిని వదిలేనట్లే వదిలి మళ్లీ వారే మళ్లించుకోవడంతో సమస్య జఠిలమైంది. పంపింగ్ కేంద్రాల ద్వారా ప్రస్తుతం దిగువ కాలువకు విడుదల చేసిన నీటిని భారీ ఎత్తున మళ్లిస్తున్నారు. వారి జలాశయాల్లో పెద్దఎత్తున నీటిని నిల్వ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. జిల్లా ప్రజాప్రతినిధులు, దిగువ కాలువ ఆంధ్ర అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
 
 
 ఆలూరు రూరల్/హాలహర్వి/హొళగుంద: తాగునీటి కోసం తుంగభద్ర కాలువ ఎల్లెల్సీ ద్వారా మనరాష్ట్ర నీటివాటా కింద 1.8 టీఎంసీలు నీరు రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో తుంగభద్ర దిగువకాలువ అధికారుల కోరిక మేరకు ఆ వాటా నీటిని ఈ నెల 5న విడుదల చేయాలని కోరారు. అందుకు తుంగభద్ర డ్యాం అధికారులు డ్యాంలో ప్రస్తుతం 582 అడుగులతో 5.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందని, ఆ నీరు కూడా ఎండకు రోజురోజుకు ఇంకి పోతోందని చెప్పారు. కేవలం ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు అంగీకరించారు. అది కూడా ఆలస్యంగా ఈ నెల 8న విడుదల చేశారు.

ఆంధ్ర అధికారుల లెక్కల ప్రకారం హొళగుంద సెక్షన్ దాటిన తర్వాత 250 మైలురాయి ఆన్వాలు వద్ద రోజూ 600 క్యూసెక్కుల నీరు ప్రవహించాలి. అయితే అందులో ప్రతిరోజు 350 క్యూసెక్కుల నీరు కూడా రాని పరిస్థితి. కారణం అనాధికారికంగా ఆంధ్ర అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఏడాది క్రితం మోకా, ఎం.గొనేహాల్ వద్ద భారీ నీటి పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆ పంపింగ్ కేంద్రాల ద్వారా రిజర్వాయర్‌లోనికి నీటిని మళ్లించేలా చూశారు. ప్రస్తుతం మోకా వద్ద ఏర్పాటు చేసిన నీటి పంపింగ్ కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం దాదాపు రూ.39 కోట్లను ఖర్చు చేసింది. ఆంధ్ర సరిహద్దు ఎ.గొనేహాల్ వద్ద కూడా దిగువ కాలువ ద్వారా అక్కడ అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 6.00 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని రిజర్వాయర్‌లోనికి మళ్లించుకుంటున్నారు. ఆ రెండు రిజర్వాయర్లకు తోడు ఆంధ్ర సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపురం నీటి పంపింగ్ కేంద్రం కూడా చాలా పెద్దది.

ఆ పంపింగ్ కేంద్రం ద్వారా అక్కడ గతంలో ఏర్పాటు చేసిన పెద్ద రిజర్వాయర్‌లోనికి పెద్దపెద్ద మోటార్ల ద్వారా నీటి పంపింగ్ జరుగుతోంది. ఇలా కర్ణాటక దిగువ కాలువ అధికారులు అక్రమంగా రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుని మన తాగునీటి వాటాకు కూడా గండి కొడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక అక్రమ రిజర్వాయర్లలో నీటి నిల్వల కారణంగా ఆంధ్ర సరిహద్దు చింతకుంట, బాపురం, విరుపాపురం తదితర రిజర్వాయర్లలోనికి నీరు సక్రమంగా రాని పరిస్థితి ఏర్పడింది.
 
 
 దిగువ కాలువకు నీటి నిలిపివేత
 తుంగభద్ర దిగువ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి బళ్లారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో నీటిని నిలిపి వేశారు. నీరు నిలిపివేసినా ఆంధ్ర సరిహద్దు మైలురాయి 135 నుంచి ఆన్వాల్ 250 మైలురాయి వరకు నాలుగు రోజులపాటు నీరు ప్రవహించే అవకాశం ఉందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా తెలిపారు. పెద్దపెద్ద మోటార్ల ఉపయోగించి నీటిని పంపింగ్ చేసుకొని రిజర్వాయర్లలోనికి మళ్లిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement