పుట్టంగండి (నాగార్జున సాగర్ బ్యాక్‌వాటర్) వద్ద సోమవారం ప్రారంభమైన కృష్ణా జలాల అత్యవసర పంపింగ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వరదాయిని కృష్ణా జలాల అత్యవసర పంపింగ్ సోమవారం ప్రారంభమైంది. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్(పుట్టంగండి) వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టుకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్ల జలాల పంపింగ్ ప్రారంభించినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అత్యవసర పంపింగ్ కోసం ఏర్పాటు చేసిన 10 భారీ మోటార్లను ఆన్ చేసి నగరానికి అవసరమైన రావాటర్‌ను పంపింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ ఇరిగేషన్, జలమండలి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది.
కాగా నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 508 అడుగుల మేర మాత్రమే నీళ్లున్నాయి. త్వరలో రుతుపవనాలు కరుణిస్తే సాగర్‌లో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, అత్యవసర పంపింగ్ కష్టాలు తీరుతాయని జలమండలి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా సిటీకి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలతో పాటు ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్‌సాగర్ జలాలే దాహార్తి తీరుస్తున్నాయి. ఈ జలాశయాల నుంచి నిత్యం 465 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి, శుద్ధి చేసి సిటీలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇటీవల నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో జలమండలి నల్లా, ట్యాంకర్ నీళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. దీంతో అదనపు ట్యాంకర్లతో వినియోగదారులకు తాగునీటిని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment