Krishna Water Pipe Line
-
నవ్వుకుంటున్న టీడీపీ శ్రేణులు.. ప్రజలు
చిత్తూరు, బి.కొత్తకోట: కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు రప్పించానని సోమవారం కుప్పం పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంపై టీడీపీ శ్రేణులు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం హడావుడిగా జిల్లాలో కృష్ణా జలాలు పారించిన చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చుక్కనీరైనా పారించలేదు. గత ఏడాది జనవరి 21న జిల్లాలోకి ప్రవేశించి కృష్ణా జలాలను ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 వరకు మొక్కుబడిగా పారించి మరుసటి రోజున నిలిపివేశారు. ఈ చర్యతో జిల్లాకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు హంద్రీ–నీవా పూర్తి చేశానని, కుప్పానికి నీటిని రప్పించానని చెప్పి మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారని సాక్షా త్తు టీడీపీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు. జనవరి 21 నుంచి ఏప్రిల్ 11 వరకు 82 రోజులు నీటిని పారించింది కేవలం 775 ఎంసీఎఫ్‌టీలు. అంటే ఒక టీఎంసీ నీటికి 225 ఎంసీఎఫ్‌టీలు తక్కువ. ఈ నీటిలో 207 కిలోమీటర్ల పుంగనూరు ఉపకాలువ (గడ్డంవారిపల్లె నుంచి బొమ్మరాజుపల్లె వరకు)లో 742.19 ఎంసీఎఫ్‌టీలు, కుప్పం కాలువలో 32.81 ఎంసీఎఫ్‌టీల నీరు పారింది. పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె నుంచి 43వ కిలోమీటరులోని వీ.కోట మండలం నార్నిపల్లె వరకు జలాలు సాగి ఆగిపోయాయి. విశేషమేమంటే కుప్పానికి నీరు తరలిస్తానని పదేపదే ప్రక టించిన చంద్రబాబు మాట తప్పారు. కృష్ణా జలాలు కనీసం కుప్పం నియోజకవర్గాన్ని కూడా తాకలేదు. ఇప్పుడేమో కుప్పానికి నీళ్లిచ్చానని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. జిల్లాకు 12 టీఎంసీల నీటి వాటా పారించాల్సి ఉండగా కనీసం పట్టించుకోని ఆయన ఇప్పుడు గొప్పలు చెప్పడం నవ్వులపాలు చేస్తోంది. టీజీపీ, జీఎన్ఎస్ఎస్ అంతే తన హయాంలో ఎన్టీఆర్ టీజీపీ, గాలేరు–నగరి ప్రాజెక్టులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పడం మరో విడ్డూరం. సోమశిల ప్రాజెక్టులకు సంబంధించిన సోమశిల–స్వర్ణముఖి లింక్ కెనాల్, పెన్నా రివర్ స్కీం, సంగం బ్యారేజీ, సోమశిలకు సంబంధించిన పనులు, సిద్దాపురం ఎత్తిపోతలు, పెన్నా డెల్టా పనులకు సంబంధించి చంద్రబాబు హయాంలో 2019 ఏప్రిల్ 12 నాటికి రూ.95.21 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. గాలేరు–నగరి ప్రాజెక్టు పనులు రూ.1,200 కోట్లతో 7 ప్యాకేజీల్లో పనులు ప్రారంభిస్తే గత ప్రభుత్వంలో కేవలం రూ.200కోట్ల పనులు జరగ్గా, రూ. 20కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. తెలుగు గంగ ప్రాజెక్టును రూ.1,184 కోట్లతో టీడీపీ ఆధికారంలోకి రాకముందే చేపట్టారు. 2014 నాటికి ప్రాజెక్టు పనుల కోసం రూ.550 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్యకాలంలో చేసిన ఖర్చు కేవలం రూ.150 కోట్లు, ఇందులో పెండింగ్ బిల్లులు రూ.10కోట్లు. ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదని వాస్తవ లెక్కలు కళ్లకు కనిపిస్తుండగా ప్రాజెక్టులను తానే పూర్తి చేయించానని ప్రకటించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అన్నదాతకు హంద్రీ–నీవా వరం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కళ్లెదుటే గలగలా నీళ్లు పారుతున్నా ఏడేళ్లుగా పొలాలకు పారించుకోలేని దుస్థితి సీమ రైతన్నలకు ఇక తొలగిపోనుంది. రాయలసీమ సాగునీటి కష్టాలు తీర్చే బృహత్తర ప్రాజెక్టు హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–1 ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని, ఫేజ్–2లో చెరువులకు నీరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్లో ప్రకటించడం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సీమ’ వాసుల 15 ఏళ్ల స్వప్నం సాకారమై బీడు భూములు కృష్ణా జలాలతో తడిసి బంగారు పంటలు పండించనున్నాయని పేర్కొంటున్నారు. 2004 జూలై 24న వైఎస్సార్ శంకుస్థాపన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం పనులకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి ‘సీమ’లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి 2004 జూలై 24న శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో రూ.4,340.36 కోట్లు ఖర్చు చేశారు. అయితే వైఎస్ మృతి చెందటం హంద్రీ–నీవాకు శాపంగా మారింది. ఎట్టకేలకు 2012లో కృష్ణమ్మ కర్నూలు జిల్లాలోని పందికోన, కృష్ణగిరితోపాటు ‘అనంత’లోని జీడిపల్లి రిజర్వాయర్లకు చేరుకున్నా రైతులకు మాత్రం నిరాశే మిగిలింది. 2012 నవంబర్ 29న ‘అనంత’లోని జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి. 2014 ఖరీఫ్‌లోనే హంద్రీ–నీవా తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని ప్రకటించిన నాటి టీడీపీ సర్కారు మాట నిలబెట్టుకోలేదు. పైగా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేయవద్దని 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 22 జారీ చేయడం గమనార్హం. దీంతో ఐదేళ్లుగా కృష్ణా జలాలు కళ్లెదుటే పారుతున్నా పొలంలోకి మళ్లించుకోలేని దుస్థితిలో సీమ రైతులు ఉన్నారు. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలని డీపీఆర్‌లో నిర్దేశించారు. ఫేజ్–1లో 1.98 లక్షల ఎకరాలున్నాయి. కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి రిజర్వాయర్లు ఇందులో ఉన్నాయి. వీటి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలి. ఇందులో కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. నిత్యం కరువుతో అల్లాడే ఆలూరు నియోజకవర్గంలో 48 వేల ఎకరాలు, పత్తికొండలో 10 వేల ఎకరాలకు నికరంగా సాగునీరు అందనుంది. ఉరవకొండలో కూడా 70 వేల ఎకరాలకు అత్యధికంగా సాగునీరు అందనుంది. సాగునీరు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో డిస్ట్రిబ్యూటరీ పనులు ఇక వేగవంతం కానున్నాయి. పిల్ల కాలువ పనుల్లో గత సర్కారు తాత్సారం.. కర్నూలు జిల్లాలో పందికోన రిజర్వాయర్ నుంచి 61,400 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇందులో కుడి కాలువ కింద 50,626 ఎకరాలు, ఎడమ కాలువ కింద 10,774 ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి కాలువ పరిధిలో 32 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా 28 డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యాయి. ఎడమ కాలువ పరిధిలోని మొత్తం 11 డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తయ్యాయి. అయితే వీటి నుంచి పిల్ల కాలువల పనులు చేయడంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. రెండు ప్యాకేజీలుగా పిల్ల కాలువ పనులకు టెండర్లు పిలిచారు. 28వ ప్యాకేజీ పనులను మాక్స్ ఇన్ఫ్రా దక్కించుకుంది. 29వ ప్యాకేజీ పనులను ఆర్‌మెహిత్, బూరత్నమ్(జాయింట్ వెంచర్) కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు 87–90 శాతం పనులు పూర్తి చేశాయి. మిగతా పనులు నిలిపివేయడంతో పిల్ల కాలువల పనులకు బ్రేక్ పడింది. అనంతపురం జిల్లాలో 36వ ప్యాకేజీ ద్వారా అత్యధికంగా 80,600 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి. ఈ పనులను రూ.336 కోట్లతో ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఆయకట్టుకు నీరు అందలేదు. వీటిని సమీక్షించి పనులు చేయని కాంట్రాక్టులను రద్దు చేసి త్వరగా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే కనీసం వచ్చే ఖరీఫ్ నుంచైనా ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అప్పుల నుంచి అన్నదాతలకు విముక్తి హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరందిస్తే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. వర్షాధారంగా పంటలు సాగు చేసి అప్పుల పాలయ్యే దుస్థితి రైతన్నలకు తప్పుతుంది. రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పని ఉండదు. ఫేజ్–2లో కూడా చెరువులకు నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్ల పరిధిలోని రైతులకు మేలు జరుగుతుంది. -
పంపింగ్ ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వరదాయిని కృష్ణా జలాల అత్యవసర పంపింగ్ సోమవారం ప్రారంభమైంది. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్(పుట్టంగండి) వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టుకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్ల జలాల పంపింగ్ ప్రారంభించినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అత్యవసర పంపింగ్ కోసం ఏర్పాటు చేసిన 10 భారీ మోటార్లను ఆన్ చేసి నగరానికి అవసరమైన రావాటర్‌ను పంపింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ ఇరిగేషన్, జలమండలి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది. కాగా నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 508 అడుగుల మేర మాత్రమే నీళ్లున్నాయి. త్వరలో రుతుపవనాలు కరుణిస్తే సాగర్‌లో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, అత్యవసర పంపింగ్ కష్టాలు తీరుతాయని జలమండలి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా సిటీకి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలతో పాటు ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్‌సాగర్ జలాలే దాహార్తి తీరుస్తున్నాయి. ఈ జలాశయాల నుంచి నిత్యం 465 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి, శుద్ధి చేసి సిటీలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇటీవల నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో జలమండలి నల్లా, ట్యాంకర్ నీళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. దీంతో అదనపు ట్యాంకర్లతో వినియోగదారులకు తాగునీటిని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
జూరాలకు కృష్ణమ్మ రాక ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాల నిమిత్తం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి విడుదల చేసిన కృష్ణానీరు దిగువన ఉన్న మన రాష్ట్రంలోని జూరాలకు చేరేందుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి చాలా తక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేయడం, దానిలోనూ ఆవిరి, ప్రవాహ నష్టాలుండటంతో నారాయణపూర్‌కు కేవలం 0.50 టీఎంసీల నీరే చేరింది. ఆ నీటిని ఇప్పటికిప్పుడు విడుదల చేసినా జూరాలకు వచ్చేవరకు మిగిలేది శూన్యమే. మరో పదిరోజులు గడిస్తేనే నీటిపరిమాణంపై స్పష్టత వస్తుంది. ఆవిరి, ప్రవాహ నష్టాలకే సగం నీరు! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు వీలుగా ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి దిగువన ఉన్న జూరాలకు 2.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ముఖ్యమంత్రికి ఈ నెల 3న విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, నారాయణపూర్ డ్యామ్‌లో సరిపడినంత నీటి లభ్యత లేకపోవడంతో దాని ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి అదేరోజు రాత్రి నారాయణపూర్‌కు నీటి విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి మొత్తంగా 6 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేసినా, అందులో ఆ రాష్ట్ర అవసరాల నిమిత్తం 3 వేల క్యూసెక్కుల నీటిని కాల్వలకు తరలించారు. మరో 3 వేల క్యూసెక్కులు మాత్రమే నారాయణపూర్‌కు వదిలారు. అయితే, ఆ 3 వేల క్యూసెక్కుల నీటిలో సగం ఆవిరి నష్టాలు, ప్రవాహ నష్టాలకే సరిపోయింది. రైతుల ఆందోళనతో వెనకడుగు ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదలను నిరసిస్తూ కర్ణాటక రైతులు ఆందోళనకు దిగడంతో నీటి ప్రవాహాన్ని పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు వేసింది. నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేసినా, జూరాలకు చుక్క నీరు రావడం కష్టమే. ఎందుకంటే, నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కి.మీ.ల దూరం ఉంది. మధ్యలో కర్ణాటక పరిధిలోని గూగుల్, గిరిజాపూర్ అనే చిన్న బ్యారేజీలను దాటుకొని నీరు జూరాలకు రావాల్సి ఉంది. ఈ చిన్న బ్యారేజీలన్నీ ప్రస్తుతం నీరు లేక నోరెళ్లబెట్టడం, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి నుంచి వచ్చే నీటిలో సగం ఆవిరి అయ్యే అవకాశం ఉండటం, దీనికి తోడు ప్రవాహపు నష్టాలు ఎక్కవగా ఉండటంతో నీటి రాక ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలో మరో ఒక టీఎంసీకి మించి నీరు నారాయణపూర్‌కు చేరితేనే అక్కడి నుంచి 10 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అప్పుడే నష్టాలు తక్కువగా ఉండటంతోపాటు త్వరగా నీరు జూరాలకు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌కు నీటి రాక ఆలస్యమైతే జూరాలకు మరింత జాప్యం జరుగనుంది. ప్రస్తత పరిస్థితుల్లో కనిష్టంగా పది రోజులు అయితే కానీ నారాయణపూర్ నుంచి నీరు జూరాలకు వచ్చే అవకాశం లేదని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి. -
ఆ గ్రామంలో అన్నీ సమస్యలే..!
సాక్షి, కనగల్ : మండలంలోని అమ్మగూడెం పరిధి కుమ్మరిగూడెంకు వెళ్లే దారిలో కంపచెట్లు రహదారికి ఇరుపక్కల పెరగడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఊరు తూర్పు రోడ్డు మొత్తం కంపచెట్లుతో అల్లుకుపోవడంతో స్థానికులతోపాటు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలోకి వెళ్లాలంటే కంపచెట్లు అడ్డుగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు.చెరువు కట్టకు ఇరువైపులా పెరిగిన చెట్లు కంపచెట్లకుతోడు చిన్నపాటి వర్షానికే మట్టి రోడ్డు అంతా బురదమయం అవుతుండడంతో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. కంపచెట్లు తొలగించి రోడ్డును అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పాలకులు పట్టించుకోవడంలేదు. దీనితోపాటు గ్రామానికి ఎగువన ఉన్న చెరువు కట్టపై నుంచి నిత్యం వందలాది మంది రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. కట్టపై ఇరుపక్కల కంపచెట్లు పెరగడంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఆటంకంగా మా రింది. కంపచెట్లను తొలగించాలని అమ్మగూడెం, కుమ్మరిగూడెం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సమస్యలతో సావాసం: కుమ్మరిగూడెంలో ఒక్క డ్రెయినేజీ లేదు. దీంతో మురుగు వీధుల్లో పారుతుండడంతో ఈగలు, దోమలు ప్రబలుతున్నాయి. నల్లా పైపులు పలుచోట్ల పగిలి నీరు కలుషితం అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోకి కృష్ణాజలాల పైపులైన్ వేసినప్పటికీ రెండేళ్లుగా ప్రజలకు కృష్ణాజలాలు అందడంలేదు. ఎయిర్ వాల్వ్ దగ్గర నీళ్లు రా కుండా చేయడంతో పలుమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ. 10 వెచ్చింది శుద్ధ జలాలు కొనుక్కొని తాగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లతోపాటు డ్రెయినేజీలు నిర్మించి, కంపచెట్లను తొలగించి గ్రామానికి దారి సౌకర్యం మెరుగుపర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామానికి కృష్ణాజలాలు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కంపచెట్లను తొలగించాలి: గ్రామంలోకి వచ్చే దారిలో ఇరుపక్కల కంపచెట్ల పెరిగాయి. చెరువుకట్టపై సైతం కంపచెట్లు పెరిగి రాకపోకలకు అడ్డంకిగా మారింది. కంపచెట్లను తొలగించి గ్రామంలోకి వచ్చే రోడ్డును అభివృద్ధి చేయాలి. –లక్ష్మీనారాయణ, కుమ్మరిగూడెం కృష్ణాజలాలు అందించాలి: గ్రామంలోకి కృష్ణాజ లాలు రాకపోవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నాం. గ్రామంలోకి కృష్ణాజలాలను స రఫరా చేయాలి. మా గ్రామం దాటి ఎం.గౌరారంకు కృష్ణాజలాలు వెళుతున్నా మాకు మాత్రం కృష్ణాజలాలు అందడంలేదు. సమస్యలను పరిష్కరించాలి. –తిరుమలేశ్, కుమ్మరిగూడెం -
పేలిన గ్యాస్ సిలిండర్: ఐదుగురికి గాయాలు
-
పేలిన గ్యాస్ సిలిండర్: ఐదుగురికి గాయాలు
హైదరాబాద్ : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని నేరేడ్మెట్ కృప కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. కృష్ణాపైప్ లైన్ లీకేజి మరమ్మత్తుల్లో భాగంగా గ్యాస్ సిలిండర్‌తో కార్మికులు పని చేస్తున్నారు. ఈ సమయంలో సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.