సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాల నిమిత్తం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి విడుదల చేసిన కృష్ణానీరు దిగువన ఉన్న మన రాష్ట్రంలోని జూరాలకు చేరేందుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి చాలా తక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేయడం, దానిలోనూ ఆవిరి, ప్రవాహ నష్టాలుండటంతో నారాయణపూర్‌కు కేవలం 0.50 టీఎంసీల నీరే చేరింది. ఆ నీటిని ఇప్పటికిప్పుడు విడుదల చేసినా జూరాలకు వచ్చేవరకు మిగిలేది శూన్యమే. మరో పదిరోజులు గడిస్తేనే నీటిపరిమాణంపై స్పష్టత వస్తుంది.
ఆవిరి, ప్రవాహ నష్టాలకే సగం నీరు!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు వీలుగా ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి దిగువన ఉన్న జూరాలకు 2.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ముఖ్యమంత్రికి ఈ నెల 3న విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, నారాయణపూర్ డ్యామ్‌లో సరిపడినంత నీటి లభ్యత లేకపోవడంతో దాని ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి అదేరోజు రాత్రి నారాయణపూర్‌కు నీటి విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి మొత్తంగా 6 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేసినా, అందులో ఆ రాష్ట్ర అవసరాల నిమిత్తం 3 వేల క్యూసెక్కుల నీటిని కాల్వలకు తరలించారు. మరో 3 వేల క్యూసెక్కులు మాత్రమే నారాయణపూర్‌కు వదిలారు. అయితే, ఆ 3 వేల క్యూసెక్కుల నీటిలో సగం ఆవిరి నష్టాలు, ప్రవాహ నష్టాలకే సరిపోయింది.
రైతుల ఆందోళనతో వెనకడుగు
ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదలను నిరసిస్తూ కర్ణాటక రైతులు ఆందోళనకు దిగడంతో నీటి ప్రవాహాన్ని పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు వేసింది. నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేసినా, జూరాలకు చుక్క నీరు రావడం కష్టమే. ఎందుకంటే, నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కి.మీ.ల దూరం ఉంది. మధ్యలో కర్ణాటక పరిధిలోని గూగుల్, గిరిజాపూర్ అనే చిన్న బ్యారేజీలను దాటుకొని నీరు జూరాలకు రావాల్సి ఉంది.
ఈ చిన్న బ్యారేజీలన్నీ ప్రస్తుతం నీరు లేక నోరెళ్లబెట్టడం, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి నుంచి వచ్చే నీటిలో సగం ఆవిరి అయ్యే అవకాశం ఉండటం, దీనికి తోడు ప్రవాహపు నష్టాలు ఎక్కవగా ఉండటంతో నీటి రాక ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలో మరో ఒక టీఎంసీకి మించి నీరు నారాయణపూర్‌కు చేరితేనే అక్కడి నుంచి 10 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అప్పుడే నష్టాలు తక్కువగా ఉండటంతోపాటు త్వరగా నీరు జూరాలకు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌కు నీటి రాక ఆలస్యమైతే జూరాలకు మరింత జాప్యం జరుగనుంది. ప్రస్తత పరిస్థితుల్లో కనిష్టంగా పది రోజులు అయితే కానీ నారాయణపూర్ నుంచి నీరు జూరాలకు వచ్చే అవకాశం లేదని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment