పాలమూరు, జూరాల ప్రాజెక్టులపై సర్వే
నీటి పారుదల శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాల మూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులకు సర్వే నిర్వహించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత విభాగాలను ఆదేశించారు. నివేదికను సమర్పించేందుకు రెండు నెలల గడువు విధించారు. సర్వే, డీపీఆర్‌ల నిమిత్తం రూ.8.76 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సాగునీటి రంగంలో తొలి ప్రాధాన్యం మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకే ఇస్తామని చెబుతూ వ స్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా తన కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదలశాఖ కార్యదర్శి అరవింద్‌రెడ్డిలతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇందుకు సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తగిన నిధులు విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలుత సర్వే, డీపీఆర్‌ల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.5.73 కోట్లు, జూరాల-పాకాల ప్రాజెక్టుకు రూ.3.03 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు సర్వే పనులను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి, జూరాల-పాకాల పనులను వ్యాప్‌కోకు అప్పగించారు.
రాష్ర్టంలోని కుటుంబాల సమగ్ర వివరాలతో డేటాబేస్
ఈ నెల రెండో వారంలో రాష్ర్టవ్యాప్తంగా చేపట్టనున్న ఆర్థిక, సామాజిక సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సర్వేతో తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి డేటాబేస్ రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు.