సాక్షి, హైదరాబాద్/ధరూరు/ దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి సాగర్ దాకా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు. ఆ నీరంతా దిగువన నాగార్జున సాగర్‌కు చేరుతూ.. నిండుకుండలా మారింది. సోమవారం ఉదయం కల్లా సాగర్ పూర్తిగా నిండుతుందని, గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.
భారీగా ప్రవాహాలు..
జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 9 గంటల సమయంలో 4.67 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. 47 గేట్లను ఎత్తి 4.75 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరదకుతోడు సుంకేశుల ద్వారా చేరుతున్న ప్రవాహాలు కలిసి.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని కొనసాగిస్తూ.. పదిగేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. దీనితోపాటు కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తితో 66 వేల క్యూసెక్కుల మేర విడుదలవుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి.
ప్రాజెక్టులో నీటి నిల్వ 264 టీఎంసీలు దాటింది. మరో 48 టీఎంసీలు వస్తే సాగర్ నిండుతుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికల్లా ప్రాజెక్టు నిండనుందని, గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా విడుదలవుతున్న నీళ్లు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్నాయి. బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాల్వలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. 26,712 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
నిండుకుండలా సాగర్!
Published Sun, Aug 1 2021 12:58 AM | Last Updated on Sun, Aug 1 2021 11:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment