Krishna river flood
-
శ్రీశైలంలోకి తగ్గిన వరద
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్ (మాచర్ల): నారాయణపూర్ డ్యామ్ దిగువన కృష్ణా ప్రధానపాయ, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 1,55,213 క్యూసెక్కులకు తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా ద్వారా 527, కల్వకుర్తి ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. స్పిల్ వే రెండు గేట్లను పదడుగులు ఎత్తి 55,692, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,285.. మొత్తం 1,18,977 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.5 అడుగుల్లో 212.91 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 68,847 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే గేట్లను మూసేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ 33,617 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువల ద్వారా 18,674 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.2 అడుగుల్లో 305.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతలలోకి 12,912 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 29,382 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 170.17 అడుగుల్లో 38.59 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,78,749 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,199 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 2,63,550 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
‘కృష్ణా’లో స్థిరంగా వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/విజయపురిసౌత్ (మాచర్ల)/అచ్చంపేట/పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతంలో ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా గోదావరిలో క్రమంగా తగ్గుతోంది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సా.6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వచేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లోకి 4.09 లక్షల క్యూసెక్కులు అలాగే, నాగార్జునసాగర్‌లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. 586.3 అడుగుల్లో 301.87 టీఎంసీలను నిల్వచేస్తూ.. 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల్లోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల్లో 35.59 టీఎంసీలను నిల్వచేస్తూ.. 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,15,036 క్యూసెక్కులు చేరుతోంది. మిగులుగా ఉన్న 4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వచ్చిన నీటిని వచ్చిట్లుగా 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలోకి ఇదే రీతిలో వరద కొనసాగనుంది. గోదావరిలో క్రమంగా తగ్గుముఖం మరోవైపు.. గోదావరిలోనూ వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శనివారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 14.90 అడుగులకు చేరింది. మిగులుగా ఉన్న 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
సాగర్‌లో 193.15 టీఎంసీల నిల్వ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్‌లోకి కృష్ణమ్మ వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం 542.7 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 193.15 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. గరిష్ట నీటి నిల్వ 312.05 టీఎంసీలు. మూసీ ద్వారా కృష్ణాలోకి ప్రవాహం చేరుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 7,400 క్యూసెక్కులు నీరు వస్తోంది. తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ పది వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. తద్వారా పాలేరు, మున్నేరు, వైరా, కట్టలేరు ఉరకలెత్తడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 62,775 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 5,275 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 57,500 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోకి 1,02,418 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి గట్టు కేంద్రంలో ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 27,180, ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గడంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్పిల్ వేలో ఒక గేటును మూసి వేశారు. మరో గేటును పది అడుగుల మేర ఎత్తి 26,744 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాలు, స్పిల్ వే గేటు ద్వారా మొత్తం 85,708 క్యూసెక్కులు సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం తగ్గింది. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల గేట్లు మూసేశారు. విద్యుదుత్పత్తి ద్వారా మాత్రమే నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి విద్యుదుత్పత్తి, స్పిల్ వే ద్వారా 16,494 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 199.7354 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 882.10 అడుగులకు చేరుకుంది. -
శ్రీశైలం @854 అడుగులు.. వరద ఇదేరీతిలో కొనసాగితే ఆరురోజుల్లో
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారంతో పోలిస్తే శనివారం వరద ఉద్ధృతి పెరిగింది. సాయంత్రం 6 గంటలకు కృష్ణా ప్రధాన పాయపై ఉన్న జూరాల నుంచి 1,52,368.. ఉపనది తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1,61,988.. వెరసి 3,14,356 క్యూసెక్కులు చేరుతుండటంతో శ్రీశైలంలో నీటినిల్వ 854 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90 టీఎంసీలు నీరుంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 125 టీఎంసీలు అవసరం. వరద ఉద్ధృతి ఇదేరీతిలో కొనసాగితే ఆరురోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉంది. కృష్ణానది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్.. ఉపనది తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్‌లలోకి చేరుతున్న వరదను చేరినట్లుగా దిగువకు వదులుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 1.68 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.48 లక్షల క్యూసెక్కులు విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం కూడా ఇదేరీతిలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి కొనసాగనుంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువనున్న నాగార్జునసాగర్‌కు 31,784 క్యూసెక్కులు తరలిస్తోంది. నాగార్జునసాగర్‌కు దిగువన బేసిన్లో వర్షాలు తెరిపి ఇవ్వడంలో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద కూడా 11,081 క్యూసెక్కులకు తగ్గింది. కృష్ణా డెల్టా కాలువలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు శ్రీకారం
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులతో కృష్ణా నదికి వరద ప్రవాహం వచ్చే రోజులు తగ్గినందున.. గతం కంటే తక్కువ రోజుల్లో శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వర్షాభావ ప్రాంతమైన రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో –4.806 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,450 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచబోతోంది. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా కాలువ విస్తరణ, 8 చోట్ల ఎత్తిపోతలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి ఈనెల 1న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. –4.806 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు రూ.2,487.02 కోట్లు, 88 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు చేయాల్సిన పనులకు రూ.2,165.46 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా పనులు అప్పగించి.. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 73 రోజుల్లోనే ఒడిసిపట్టేలా.. శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించేలా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా పనులు చేపట్టారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో కృష్ణా నదికి వరద వచ్చే రోజులు గణనీయంగా తగ్గాయి. అనేకసార్లు వరద ఒకేసారి గరిష్ట స్థాయిలో వస్తోంది. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టేలా కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం లేకపోవడంతో ఏటా వందలాది టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే 73 రోజుల్లోనే హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. -
శాంతించిన కృష్ణమ్మ.. శ్రీశైలంలోకి తగ్గిన వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల(రెంటచింతల)/అచ్చంపేట/విజయపురి సౌత్: పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణమ్మ శాంతించింది. అధికారులు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తూ.. దిగువకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో శ్రీశైలంలోకి వచ్చే వరద తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు, కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాల ద్వారా 1,77,321 క్యూసెక్కులను వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 29,792 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్ గేట్లను మూసివేశారు. సాగర్ విద్యుత్కేంద్రాల ద్వారా దిగువకు 68,126 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటితో దిగువన టెయిల్‌పాండ్‌ను నింపుతున్నారు. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 23,706 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగ నరసింహారావు మంగళవారం తెలిపారు. మొత్తం మీద పులిచింతలలోకి 51 వేల క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతల గేట్లను కూడా అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ఉధృతి కాస్త తగ్గింది. మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 2,05,689 క్యూసెక్కులు చేరుతుండగా.. 9,689 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. మిగులుగా ఉన్న 1.96 లక్షల క్యూసెక్కులను 70 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. జూన్ 1 నుంచి మంగళవారం రాత్రి 7 గంటల వరకు సుమారు 77 టీఎంసీల జలాలు సముద్రంలో కలవడం గమనార్హం. గోదావరిలోనూ వరద తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి వస్తున్న నీటిని డెల్టాకు విడుదల చేయగా.. మిగులుగా ఉన్న 91 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
జలాశయాలు కళకళ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల)/సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ప్రవాహం కారణంగా దాని పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహ జలాలు తగ్గాయి. సోమవారం సాయంత్రం జూరాల, సుంకేసుల నుంచి 3,10,291 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. శ్రీశైలం డ్యామ్ వద్ద 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు తెరిచి 3,72,710 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం రెండు పవర్ హౌస్‌ల నుంచి మరో 63,442 క్యూసెక్కులు వెరసి మొత్తం 4,36,156 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 410 క్యూసెక్కుల నీటిని వదిలారు. నాగార్జున సాగర్ నుంచి 3,55,349 క్యూసెక్కులు దిగువకు.. నాగార్జున సాగర్ జలాశయం నుంచి సోమవారం రాత్రి ఎడమ కాలువకు 601, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 33,414 క్యూసెక్కులు, 22 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,18,934 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా సాగర్ జలాశయం నుంచి 3,55,349 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతున్నాయి. సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 3,54,410 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 2,57,439 క్యూసెక్కుల ప్రవాహ జలాలు వచ్చి చేరుతుండగా.. అంతే మొత్తంలో నీటిని బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు. అందులో 9,689 క్యూసెక్కులను కాలువలకు ఇస్తూ.. 2,47,750 క్యూసెక్కులు మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 63 టీఎంసీలు నీరు సముద్రం పాలైంది. ఇదిలావుండగా.. బ్యారేజీకి వరద పోటెత్తి వస్తుండటంతో దానికి ఎగువ, దిగువన ఉండే ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రికి ప్రకాశం బ్యారేజీకి 3.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద చేరే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. -
నిండుకుండలా సాగర్!
సాక్షి, హైదరాబాద్/ధరూరు/ దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి సాగర్ దాకా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు. ఆ నీరంతా దిగువన నాగార్జున సాగర్‌కు చేరుతూ.. నిండుకుండలా మారింది. సోమవారం ఉదయం కల్లా సాగర్ పూర్తిగా నిండుతుందని, గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. భారీగా ప్రవాహాలు.. జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 9 గంటల సమయంలో 4.67 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. 47 గేట్లను ఎత్తి 4.75 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరదకుతోడు సుంకేశుల ద్వారా చేరుతున్న ప్రవాహాలు కలిసి.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని కొనసాగిస్తూ.. పదిగేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. దీనితోపాటు కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తితో 66 వేల క్యూసెక్కుల మేర విడుదలవుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 264 టీఎంసీలు దాటింది. మరో 48 టీఎంసీలు వస్తే సాగర్ నిండుతుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికల్లా ప్రాజెక్టు నిండనుందని, గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా విడుదలవుతున్న నీళ్లు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్నాయి. బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాల్వలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. 26,712 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కృష్ణాలో స్థిరంగా వరద.. శాంతించిన గోదావరి
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం: కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా.. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.98 లక్షల క్యూసెక్కుల ప్రవాహ జలాలు చేరుతున్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ దిగువకు 35,315 క్యూసెక్కులు విడుదల చేస్తోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో కుడి గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ సర్కార్ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. శ్రీశైలం ప్రాజెక్టు సీఈ మురళీనాథ్‌రెడ్డి సూచనల మేరకు మంగళవారం రాత్రి నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టామని విద్యుత్ కేంద్రం సీఈ సుధీర్ తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలంలో 876.89 అడుగుల్లో 172.66 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 539.7 అడుగులకు పెరిగింది. నీటి నిల్వ 187.70 టీఎంసీలకు చేరుకుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో మంగళవారం భారీ వర్షాలు కురవడంతో ఎగువన ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం 3.92 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్రలోనూ వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 26,011 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 5,977 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 20,034 క్యూసెక్కులను 27 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం వద్దకు 2.65 లక్షల క్యూసెక్కులు గోదావరిలో వరద మంగళవారం మరింత తగ్గింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 2,65,670 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో 42 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వేకు ఎగువన వరద నీటి మట్టం 30.32 మీటర్లకు తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,32,010 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గోదావరి డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కులు వదలి.. మిగులుగా ఉన్న 4,21,510 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/బళ్లారి/జూపాడు బంగ్లా: కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు నిల్వ ఉండగా.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరింది. మరోవైపు తుంగభద్ర పరవళ్లు తొక్కుతుండటంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో డ్యామ్ గేట్లు ఎత్తివేసి దిగువకు 46.5వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో సాగర్‌కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు నీటిని వదిలేస్తోంది. ఆ ప్రవాహానికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 55,571 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 3,631 క్యూసెక్కులు వదలుతూ.. మిగులుగా ఉన్న 51,940 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు నూతన హెడ్ రెగ్యులేటర్ 4, 5, 6 గేట్లను అడుగుమేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం దిగువకు విడుదల చేశారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ సముదాయం నుంచి తెలుగు గంగ కాల్వకు మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
కృష్ణమ్మ హోరు.. గోదారి జోరు
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/శ్రీశైలం ప్రాజెక్ట్/హొసపేటె/ధవళేశ్వరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఉప నదులు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కాగా, ఈ వరద కనీసం వారం కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల్లోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఆ నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. మరోవైపు తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. ఆదివారం ఉదయానికి ఇన్‌ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉండటంతో నీటినిల్వ 90 టీఎంసీలకు చేరనుంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. నదీ తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలంలో ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న నీటిలో నాగార్జునసాగర్‌కు 29,305 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ ద్వారా పులిచింతల్లోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తోంది. ఈ నీటికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 94,711 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 1,551 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 93,160 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవులో వరద ఉధృతికి నీట మునిగిన రహదారి గోదావరి ఉగ్రరూపం ఎగువ నుంచి భారీగా గోదావరి వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 6,33,474 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. స్పిల్ వే కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటిమట్టం 32 అడుగులకు చేరుకుంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. భద్రాచలం నుంచి పోలవరం వద్దకు ఈ అర్ధరాత్రికి 11.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి ఎత్తేసి 4,61,337 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం తెల్లవారుజామున ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక (10 లక్షల క్యూసెక్కులు దాటితే) స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గోదావరి, పలు వాగుల ఉధృతితో వీఆర్ పురం మండలంలో 10, చింతూరు మండలంలో 11, ఎటపాక మండలంలో 1, పి.గన్నవరం మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో 40 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన వరద నియంత్రణ కార్యాలయం నుంచి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బ్యారేజీ దిగువన పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవు వద్ద వశిష్ట గోదావరి నదీపాయలో లంక గ్రామాల ప్రజలు తాత్కాలికంగా నిర్మించుకున్న రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
నిండుకుండల్లా ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: మూడురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువన కర్ణాటకలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణానదీ ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టిలోకి మంగళవారం కేవలం 10 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవగా, బుధవారం సాయంత్రానికి ఏకంగా 56 వేల క్యూసెక్కులకు పెరిగాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది. ఆల్మట్టి నుంచి 20 వేల క్యూసెక్కులను నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా, నారాయణపూర్ నుంచి 24 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా గురువారం సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ప్రస్తుతం కేవలం 3,800 క్యూసెక్కుల ప్రవాహాలు మాత్రమే నమోదవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సైతం ప్రస్తుతం ప్రవాహాలు తగ్గినా, రెండ్రోజుల్లో మళ్లీ పుంజుకోనున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలో ఉన్న ఎస్సారెస్పీకి మంగళవారం 90 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు రాగా, బుధవారం 52 వేల క్యూసెక్కులకు తగ్గాయి. నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 53.54 టీఎంసీలకు చేరింది. ► ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా..పూర్తిస్థాయిలో నీరు చేరింది. ► మూసీ ప్రాజెక్టులో 7 క్రస్టుగేట్లు ఒక అడుగు మేర ఎత్తి 4,600 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ► భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 15.3 అడుగులకు చేరింది. తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. కిన్నెరసాని జలాశయంలో 400.90 అడుగుల మేర నీరు చేరింది. ► ఎల్లంపల్లి ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ► కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సరస్వతీ బ్యారేజీ 66 గేట్లలో 26 గేట్లెత్తి కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్‌ను తాకుతూ 8 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. గోదావరి, ప్రాణహితల ద్వారా లక్ష్మీబ్యారేజీకి ఇన్‌ఫ్లో 96,630 క్యూసెక్కులు వస్తోంది. -
నేడు ‘కృష్ణా’ రిటైనింగ్ వాల్‌కు సీఎం శంకుస్థాపన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. కృష్ణా నది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారంగా రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.35 గంటల నుంచి 11.00 గంటల మధ్య రాణీగారితోట వద్ద వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇలా.. ► విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు 1.5 కి.మీ పొడవునా ఫ్లడ్ ప్రొటెక్షన్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. ► నదికి భారీ వరదలు వచ్చినప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్‌కు రూపకల్పన చేశారు. ► ఇందులో భాగంగా మూడు అడుగుల వ్యాసంలో 18 మీటర్ల లోతుకు పైల్, రాఫ్ట్ పునాదులపై 8.9 మీటర్ల ఎత్తులో 1.5 కి.మీ పొడవునా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు. వైఎస్సార్ సంకల్పమే.. కాగా, 2009లో కృష్ణా నదికి వరదలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విజయవాడ వచ్చి ఫ్లడ్ రిటైనింగ్ వాల్ మంజూరు చేశారు. అప్పట్లో యనమలకుదురు నుంచి కోటినగర్ వరకు ఈ వాల్ నిర్మించారు. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం కరకట్ట (వారధి) నుంచి కోటినగర్ వరకు ఫ్ల్లడ్ రిటైనింగ్ వాల్‌ను నిర్మించనున్నారు. -
వదలని వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్ (మాచర్ల): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 3,83,769 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 2,594 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3,81,300 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 4,26,223 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. శ్రీశైలం వద్ద 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేర తెరచి 3,76,170 క్యూసెక్కులను, విద్యుత్ ఉత్పాదన అనంతరం 27,190 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 7 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులను వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 211.4759 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. మరోవైపు నాగార్జున సాగర్ వద్ద 18 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 3,70,191 క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,63,791 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి 13,867 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 11,581 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
వరద నియంత్రణ భేష్
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదుల వరదను సమర్థంగా నియంత్రించారని, వరద ముప్పు నుంచి తప్పించారని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అభినందించారు. అల్పపీడన ప్రభావం వల్ల ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా నదికి భారీగా వరద వస్తోందని.. ఆ వరదను నియంత్రించడంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో కలిసి వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరకట్టలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందే అప్రమత్తం చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. -
కృష్ణాలో కొనసాగుతున్న వరద 'ఉధృతి'
సాక్షి,అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 4,90,980 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా కృష్ణా డెల్టా కాలువలకు 3,472 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 4,87,508 క్యూసెక్కులను 70 గేట్లు పూర్తిగా ఎత్తేసి సముద్రంలోకి వదులుతున్నారు. ఈ సీజన్లో అంటే జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 1,006.196 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. రెండు దశాబ్దాల్లో ఒక సీజన్లో ప్రకాశం బ్యారేజీ నుంచి గరిష్ఠంగా కృష్ణా జలాలు సముద్రంలో కలవడం ఇదే తొలిసారి. ► ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్రల నుంచి విడుదల చేసిన జలాలకు నల్లమలలో కురిసిన వర్షాలు తోడై శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,41,069 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం జలాశయం పదిగేట్లను ఎత్తి, కుడి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 4,98,890 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి వస్తున్న 4,62,586 క్యూసెక్కులను, పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న 4,32,920 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నేడు వరద తగ్గే అవకాశం ► పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ఆల్మట్టి డ్యామ్‌లోకి వచ్చే వరద 52 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఆల్మట్టి నుంచి దిగువకు 37 వేల క్యూసెక్కులు వదులుతుండగా, నారాయణపూర్ నుంచి ఆరువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని నుంచి 51,800, తుంగభద్ర నుంచి 13,985 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి శ్రీశైలంలోకి ఎగువ నుంచి వచ్చే వరద తగ్గనుంది. దిగువ కృష్ణా బేసిన్లో ప్రధానంగా కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండురోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అంచనాలపై వరద ప్రభావం ఆధారపడి ఉంది. పెన్నా, వంశధారల్లో తగ్గిన వరద ► పెన్నానదిలో వరద తగ్గుముఖం పట్టింది. సోమశిల ప్రాజెక్టులోకి 13,700 క్యూసెక్కులు చేరుతుండగా కండలేరుకు 8,566 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం సోమశిలలో 74.53, కండలేరులో 56.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గొట్టా బ్యారేజీలోకి వంశధారనది నుంచి వస్తున్న 18,693 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులన్నీ ఫుల్ గోదావరినదిపై మహారాష్ట్ర, తెలంగాణల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి గోదావరి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు తోడై ధవళేశ్వరం బ్యారేజీలోకి వస్తున్న 2,49,515 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి బేసిన్లో ప్రాజెక్టులన్నీ నిండటం రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. -
స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్ (మాచర్ల)/శ్రీశైలంప్రాజెక్ట్/అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 6,15,797 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 3,472 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 6,12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 2 లక్షలు, ఉజ్జయిని నుంచి 1.50 లక్షలు, తుంగభద్ర నుంచి 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కరకట్ట లోపల తగ్గిన వరద గుంటూరు జిల్లా వైపు కరకట్ట లంక గ్రామాల్లో వరద కొంతమేర తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కొల్లూరు, తాడేపల్లిలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీరు చేరిన ఇళ్లను గుర్తించేందుకు వెంటనే సర్వే చేపట్టాలని ఆదేశించారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. కొల్లిపర మండలంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల పర్యటించారు. గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 26,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 24,520 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,73,089 క్యూసెక్కులు చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి 5,12,690 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,12,690 క్యూసెక్కులు చేరుతోంది. పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి.. కుడి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 5,09,948 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. -
రాజధాని ప్రాంతంలోకి ఎగదన్నిన కృష్ణా వరద
సాక్షి,అమరావతి/తాడేపల్లిరూరల్/పటమట(విజయవాడ తూర్పు): కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువైతే రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తుతుందన్న విషయం మరోసారి రుజువైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పది గంటల వరకూ ప్రకాశం బ్యారేజీలోకి గరిష్టంగా 7.03 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో ఉండవల్లి అవుట్‌ఫాల్ స్లూయిజ్ గుండా కృష్ణా వరద నీరు కొండవీటివాగులోకి ఎగదన్నింది. ఈ వరద నీరు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాకల్లోని పొలాలను ముంచెత్తింది. కొండవీటివాగు వరద 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి గతంలో టీడీపీ సర్కార్ రూ. 237 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2009, అక్టోబర్ 5న ప్రకాశం బ్యారేజీకి గరిష్టంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తరహాలో ఇప్పుడు వరద వచ్చి ఉంటే.. రాజధానిలోని 29 గ్రామాల్లో 71 శాతానికిపైగా ముంపునకు గురయ్యేవని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకునే తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణం ఏమాత్రం అనుకూలమైనది కాదంటూ అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీ, పర్యావరణవేత్తలు, చెన్నై–ఐఐటీ, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేశాయని ఆ నిపుణులు గుర్తు చేస్తున్నారు. దేవినేని ఉమా హడావుడి కొండవీటివాగు ఎత్తిపోతల వద్ద టీడీపీ నేత దేవినేని ఉమా హడావుడి చేశారు. ఇరిగేషన్ అధికారులు మోటార్లను ఆఫ్ చేసిన తర్వాత అక్కడకి చేరుకున్న ఆయన రాజధాని మునిగిపోతుంటే ఇంజన్లు ఆఫ్ చేస్తారా అంటూ హంగామా సృష్టించారు. మోటార్లు ఆన్ చేస్తే కృష్ణానదిలో నుంచి వరదనీరు ఉధృతంగా వస్తోందని అక్కడి సిబ్బంది చెప్పినా వినకుండా మళ్లీ మోటార్లు ఆన్‌చేయించారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు దేవినేని ఉమా హడావుడి చేస్తున్నారని అక్కడ ఉన్న వారు విమర్శించారు. ఇదో అవినీతి గోడ.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువున సుమారు 10 వేల కుటుంబాలు నివాసాలుండే ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి రక్షించడానికి రిటైనింగ్ వాల్ నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతి ఇచ్చారు. ఆయన మరణానంతరం ఈ ప్రతిపాదన అటకెక్కింది. గత ప్రభుత్వం హయాంలో ఈ వాల్ నిర్మాణం జరిగింది. 11.5 మీటర్ల ఎత్తున 2.3 కిలోమీటర్ల పరిధిలో రూ. 164 కోట్ల అంచనాతో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌తో పనులు చేయించారు. లెవలింగ్ లేకుండా నిర్మాణం, నాసిరకమైన మెటీరియల్ వల్ల ఆ గోడకు చిల్లుపడింది. ఇప్పుడు వరద నీరు నివాసాలను ముంచెత్తింది. కొండవీటివాగుకు వరద వచ్చి ఉంటే.. ► ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా గరిష్ట వరద నీటిమట్టం 21.50 మీటర్లు. కొండవీటివాగు గరిష్ట వరద నీటిమట్టం 17.50 మీటర్లు. అంటే.. కృష్ణా నది గరిష్ట వరద నీటిమట్టం కంటే కొండవీటివాగు వరద నీటిమట్టం దిగువన ఉంటుంది. ► సోమవారం కృష్ణా నదిలో వరద పెరగడంతో దిగువన ఉన్న కొండవీటివాగులోకి నీరు ఎగదన్నింది. ► కొండవీటివాగు వరద ప్రవాహాన్ని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసి, రాజధానికి ముంపు ముప్పును తప్పించడానికి టీడీపీ సర్కార్ నిర్మించిన ఎత్తిపోతల ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ► సోమవారం ఆరు మోటార్ల ద్వారా రెండు వేల క్యూసెక్కులను ఎత్తిపోసినా.. కృష్ణా నదిలోని నీరు స్లూయిజ్ ద్వారా కొండవీటివాగులోకి మళ్లీ వచ్చింది. ► రాజధాని గ్రామాల్లో ప్రవహించే కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల సోమవారం ఆవాగులో వరద ఉధృతి లేదు. ఒకవేళ వరద ప్రవాహం ఉంటే.. వాగు పరివాహక ప్రాంతం 221.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముంపు ముప్పు తీవ్రంగా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
కడలివైపు కృష్ణమ్మ, పెన్నమ్మ
సాక్షి, అమరావతి/ శ్రీశైలం ప్రాజెక్ట్/ విజయపురి సౌత్ (మాచర్ల): పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు పది రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు తెరచి 3,77,160 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 26,777 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. కుడిగట్టు కేంద్రంలో 14.47 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ► నాగార్జునసాగర్ జలాశయం నుంచి 20 గేట్ల ద్వారా 3,40,344 క్యూసెక్కులు, పులిచింతల ప్రాజెక్టు నుంచి 3,56,872 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ► ప్రకాశం బ్యారేజీ నుంచి మిగులుగా ఉన్న 2,24,468 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. పెన్నా, ఉప నదులు పాపాఘ్ని, కుందూ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో గండికోట, మైలవరం, సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ► సోమశిల నుంచి కండలేరుకు, అక్కడి నుంచి మిగులుగా ఉన్న 60 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నమ్మ సముద్రం వైపు పరుగులు తీస్తోంది. గోదావరిలోనూ వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మిగులుగా ఉన్న 3,55,011 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
కృష్ణాలో వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ విజయపురి సౌత్/ శ్రీశైలం ప్రాజెక్టు: కృష్ణా, ఉప నదులు తుంగభద్ర, భీమా పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 2,28,584 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎనిమిది గేట్లు ఎత్తి 2,23,128 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 590.0 అడుగులకు చేరుకుంది. దాంతో 12 గేట్లు ఎత్తి అదే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ► పులిచింతల ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 1,20,330 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► పులిచింతల నుంచి విడుదల చేస్తున్న జలాలు చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రికి బ్యారేజీ గేట్లు ఎత్తేయనున్నారు. ► మరోవైపు, పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గిపోవడంతో శనివారం నుంచి శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టనుంది. ► గోదావరిలో వరద మరింత తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మిగులుగా ఉన్న 1,07,298 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రవాహాల వివరాలిస్తే ‘మిగులు’ లెక్క తేల్చుతాం ఏపీ, తెలంగాణలకు కృష్ణా బోర్డు లేఖ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో గత 20 ఏళ్లుగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీలలోకి వచ్చిన వరద ప్రవాహాలు.. విడుదల చేసిన ప్రవాహాల వివరాలు ఇస్తే మిగులు జలాల లెక్క తేల్చుతామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. కేంద్ర జలసంఘం.. సీఈ విజయ్ శరణ్ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీకి తక్షణమే వివరాలు పంపాలని సూచించింది. ► జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి, సముద్రంలోకి వదులుతున్న సమయంలో.. ఏ రాష్ట్రం వాడుకున్నా సరే ఆ నీటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేస్తోంది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తూ వస్తోంది. ► ఇరు రాష్ట్రాల సూచనల మేరకు మిగులు జలాల లెక్క తేల్చాలని కేంద్రానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. దాంతో మిగులు జలాల లెక్క తేల్చేందుకు సీడబ్ల్యూసీ సీఈ విజయ్ శరణ్ నేతృత్వంలో సాంకేతిక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు మరిన్ని వివరాలు పంపాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా శుక్రవారం లేఖ రాశారు. -
కృష్ణా, గోదావరిలో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేస్తున్న నీటికి తుంగభద్ర డ్యామ్ నుంచి వదులుతున్న ప్రవాహం తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 68,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 17,808 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయిలో అంటే 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► సాగర్‌లోకి 17,808 క్యూసెక్కులు చేరుతుండగా.. అదే స్థాయిలో ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పులిచింతల ప్రాజెక్టులోకి 5,085 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా అవసరాల కోసం పది వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 45.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► ప్రకాశం బ్యారేజీలోకి 18,963 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 16,882 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ► తుంగభద్ర డ్యామ్‌లో పూర్తి స్థాయిలో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద ప్రవాహం 36,689 క్యూసెక్కుల్లో కాలువలకు 10,519 క్యూసెక్కులు వదిలి.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 28,423 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► గోదావరి ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,96,413 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,900 క్యూసెక్కులు వదిలి, మిగులుగా ఉన్న 2,83,513 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/కర్నూలు (అగ్రికల్చర్) /శ్రీశైలం ప్రాజెక్ట్/నిడదవోలు/సాక్షి, అమరావతి బ్యూరో: పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో కృష్ణా, దాని ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండల్లా మారడం.. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలంలో 127.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇంకో 87 టీఎంసీలు చేరితే నిండిపోతుంది. నాగార్జునసాగర్‌లో 243.20 టీఎంసీలు నిల్వ ఉండగా.. మరో 69 టీఎంసీలు చేరితే నిండుతుంది. పులిచింతల ప్రాజెక్టులోకి కేవలం 1,950 క్యూసెక్కులు మాత్రమే చేరుతుండటంతో నీటి నిల్వ 8.90 టీఎంసీలకు పరిమితమైంది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటు పులిచింతల ప్రాజెక్టుకు దిగువన ఖమ్మం (తెలంగాణ), గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా మున్నేరు, వైరా, కట్టలేరు, కొండవాగులు ఉప్పొంగుతుండటంతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 80,520 క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తి 60,707 క్యూసెక్కులను కడలిలోకి విడుదల చేస్తున్నారు. ఉధృతంగా గోదావరి గోదావరి నదిలోకి భారీగా వరద చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం రాత్రి 7 గంటలకు 10 అడుగులకు చేరింది. దీంతో 175 గేట్లను ఎత్తి 7,86,935 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం ఎనిమిది లక్షల క్యూసెక్కులకు చేరింది. రాత్రి పది గంటలకు ఆ వరద ప్రవాహం తొమ్మిది లక్షల క్యూసెక్కులకు చేరుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. బలపడుతున్న అల్పపీడనం ► ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి శాఖ తెలిపింది. ► దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం ప్రకటించింది. ► కాగా, ఈ నెల 19న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ► దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచి సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. ► గత 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిశాయి. -
శ్రీశైలం @ 107.45 టీఎంసీలు
సాక్షి, అమరావతి/ శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతూ వస్తోంది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,87,698 క్యూసెక్కులు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 107.45 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 560.5 అడుగుల్లో 233.59 టీఎంసీలకు చేరుకుంది. ► మరో 25 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. ► పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కృష్ణా నదికి మంగళవారం వరద పెరుగుతుందని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది. ► ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నుంచి గోదావరి నదిలోకి వరద ప్రవాహం చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 1.73 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ గోదావరికి ఇదే గరిష్ట వరద. కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వర ఆలయం! పాములపాడు/కొత్తపల్లి: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి వెళ్తోంది. సోమవారానికి ఆలయ శిఖరం నాలుగు అడుగులు మాత్రమే బయటకు కన్పిస్తోంది. శ్రీశైలం జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా ఆలయ శిఖరం పూర్తిగా మునిగిపోనుంది. -
శ్రీశైలంలోకి కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/సాక్షి బళ్లారి: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. శనివారం సాయంత్రం శ్రీశైలంలోకి 98,765 క్యూసెక్కులు చేరుతుండగా.. రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వస్తున్న వరదకు శ్రీశైలం.. నాగార్జునసాగర్, పులిచింతల నిండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ► పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉప నదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పెరుగుతోంది. ► ఆల్మట్టిలోకి వస్తున్న వరద పెరుగుతుండటంతో.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) సూచనల మేరకు నీటి నిల్వలను ఖాళీ చేసి దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాలకు చేరిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న జలాలు సాగర్‌లోకి చేరుతుండటంతో నీటి మట్టం 558.20 అడుగులకు చేరుకుంది. ► కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ ఎత్తున వరదను విడుదల చేస్తుండటంతో తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ► మరోవైపు.. పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలోనూ వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 7 వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
24 గంటల్లో 6 టీఎంసీలు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా నది వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆది వారం సాయంత్రం ఆరు గంటలకు నీటి నిల్వ 66.01 టీఎంసీలకు చేరుకుంది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి.. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆరు టీఎంసీలు వరద ప్రవాహం చేరడం గమనార్హం. పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో ఎగువన వరద ప్రవాహం పెరిగింది. ► ప్రకాశం బ్యారేజీలోకి 9,347 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 6,290 క్యూసెక్కులు వదిలి 3,057 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► ధవళేశ్వరం బ్యారేజీలోకి గోదావరి జలాలు 56,039 క్యూసెక్కులు చేరుతుండగా 44,039 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రాన్ని ఆదివారం సాయంత్రం కృష్ణా జలాలు చుట్టేశాయి. ఆలయం కూడా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతోంది. -
పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/మాచర్ల/శ్రీశైలం ప్రాజెక్ట్/హోస్పేట/రాయచూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయంలోకి వరద పెరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలోకి 3.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో.. ఒక గేటును ఎత్తి 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఆ తరువాత మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసే నీటిని పెంచారు. నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పశ్చిమ కనుమలతోపాటు కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ అంచ నాల నేపథ్యంలో.. బుధవారం ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. పశ్చిమ కనుమల్లో ఆదివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి విడుదల చేసిన వరద మంగళవారం శ్రీశైలానికి చేరింది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటంతో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని నియంత్రిస్తూ.. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి వస్తున్న వరదను కాలువలకు విడుదల చేస్తూ మిగులు ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. నేడు శ్రీశైలానికి మరింత వరద మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి నుంచి 2.50 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 2.57 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర ఉరకలెత్తుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 1.48 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. గేట్లన్నీ ఎత్తేసి 1.55 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నది ఉధృతికి కర్ణాటకలోని చారిత్రక పర్యాటక క్షేత్రం హంపీలో పలు ప్రాచీన కట్టడాలు నీట మునిగాయి. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాత్రి 11 గంటలకు 2.70 లక్షల ప్రవాహం వస్తుండగా.. 6 గేట్లను ఎత్తి 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రెండు పవర్ హౌస్‌లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,753 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 6,458 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయాలు నిండుకుండలుగా మారిన నేపథ్యంలో ప్రజలను ముంపు బారి నుంచి తప్పించేలా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద రెండు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. -
కడలి వైపు కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతోపాటు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల నుంచి 3.08 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరం (2019 జూన్ 1–2020 మే 31)లో శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,230.22 టీఎంసీల వరద రావడంతో పదేళ్ల క్రితం నమోదైన రికార్డు బద్దలైంది. 2009–10లో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,220.54 టీఎంసీల వరద చేరింది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, 14 గేట్లు తెరవడం ద్వారా 2.58 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు దిగువన మూసీ వరద కలుస్తుండటంతో కృష్ణాలో ప్రవాహ ఉధృతి మరింత అధికమైంది. పులిచింతల ప్రాజెక్టులోకి 2.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.80 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూలై 31న శ్రీశైలానికి చేరిన ప్రవాహ ఉధృతి ఇప్పటివరకూ నిరాటంకంగా కొనసాగుతోంది. 469.91 టీఎంసీలు కడలి పాలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,82,281 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగిలిన 1,74,034 క్యూసెక్కులను 70 గేట్లు తెరిచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 469.91 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తద్వారా పదేళ్ల రికార్డును తిరగరాసింది. -
కృష్ణమ్మ ఉరకలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/అమలాపురం టౌన్/శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట(పెదకూరపాడు): ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణా నది ఉరకలెత్తుతోంది. మంగళవారం జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,90,452 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఆరు గేట్లను ఎత్తి 4,24,530 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,13,198 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి విడుదల చేసిన జలాల్లో పులిచింతల ప్రాజెక్టుకు 3,90,452 క్యూసెక్కులు చేరుతుండగా.. 3,83,002 క్యూసెక్కులను గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 42.72 టీఎంపీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు డీఈ తెలిపారు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద గంటగంటకూ వరద భారీ ఎత్తున పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 1,79,124 క్యూసెక్కులు వస్తుండగా 50 గేట్లు తెరిచి 93,173 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి ప్రకాశం బ్యారేజీలోకి 3.50 లక్షల క్యూసెక్కుల వరద పెరిగే అవకాశం ఉంది. కాగా, ఒక నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31 వరకూ) కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టుల గేట్లను రెండు పర్యాయాలు తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేయడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. శ్రీశైలం గేట్ల పైనుంచి నీరు.. శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్ల పైనుంచి వరద నీరు ఓవర్ ఫ్లో అయ్యింది. జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఉండటంతో సోమవారం రాత్రి 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.85 టీఎంసీలు కాగా.. 215.3263 టీఎంసీలను అధికారులు నిల్వ చేశారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటం, జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదనను పెంచడం, తగ్గించడం వంటి కారణాలతో జలాశయంలో నీరు గేట్లపై నుంచి ఓవర్‌ఫ్లో అయ్యింది. ఇది గమనించిన అధికారులు 10 అడుగుల మేర తెరిచిన గేట్లను మంగళవారం 23 అడుగులకు ఎత్తారు. దీంతో ఓవర్‌ఫ్లో నిలిచిపోయింది. శాంతించిన గోదావరి.. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద ఉధృతి తగ్గింది. గత మూడు రోజులుగా మహోగ్రంగా ప్రవహించిన గోదావరి మంగళవారం కాస్త శాంతించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎగువున ఉన్న ఏజెన్సీ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ధవళేశ్వరం దిగువున ఉన్న కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు 14,59,000 క్యూసెక్కుల వరద నీరును విడిచిపెట్టగా.. అది రాత్రి 7 గంటలకు 11,39,000 క్యూసెక్కులకు తగ్గించారు. ఇక భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రానికి నీటి మట్టం మూడు అడుగుల మేర తగ్గింది. దేవీపట్నం మండలాన్ని ఇంకా వరద నీరు వణికిస్తూనే ఉంది. కోనసీమలో మంగళవారం రాత్రికి దాదాపు 48 లంక గ్రామాలు జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. 17 లంక గ్రామాలకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. చింతూరు మండలంలో 15 గ్రామాల్లో వరద నీరు ప్రభావంతో ఆంధ్రా, ఒడిశా మధ్య రాకపోకలు పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. కోనసీమలో బుధవారం నుంచి వరద తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మరో మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. స్థిరంగా వంశధార ప్రవాహం వంశధార నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 27,832 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 3,925 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 23,907 క్యూసెక్కులను గొట్టా బ్యారేజీ 22 గేట్లు తెరిచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది. -
శ్రీశైలానికి మళ్లీ వరద
సాక్షి, అమరావతి: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం మరోసారి పెరిగింది. ఎగువ నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,00,987 (8.72 టీఎంసీలు) క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి.. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 95,963 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 182.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని జలాశయాల నుంచి సైతం భారీఎత్తున వరద జలాలను దిగువకు విడుదల చేస్తుండడంతో శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మరింతగా పెరగనుంది. మరోవైపు.. కృష్ణా, ప్రధాన ఉపనదులైన తంగభద్ర, భీమా పరివాహక ప్రాంతాలలో కూడా రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణఫూర్ జలాశయాల్లోకి ఈ పాయ నుంచి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భీమా నదిలో వరద ప్రవాహం పెరగడంతో ఉజ్జయిని జలాశయం నుంచి 30 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 2.03 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రలోనూ వరద ప్రవాహం భారీగా పెరిగింది. దాంతో తుంగభద్ర జలాశయం నుంచి 85 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న నీటిలో నాగార్జునసాగర్‌కు 23,260 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో కుడి, ఎడమ కాలువలు, పులిచింతల, ఏఎమ్మార్పీలకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 9,753 క్యూసెక్కులు చేరుతుండగా 5 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 11,451 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 16,774 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గంటగంటకూ పెరుగుతున్న గోదావరి ఇదిలా ఉంటే.. చత్తీస్‌గఢ్.. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు పోటెత్తి గోదావరి నదికి చేరుతున్నాయి. దాంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజిలోకి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 5,53,077 క్యూసెక్కులు చేరుతుండగా.. బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 5,54,774 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు.. వంశధార నదిలోనూ వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 36,566 క్యూసెక్కులు చేరుతుండగా 22 గేట్లు ఎత్తి 37,954 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
మళ్లీ ‘కృష్ణా’కు వరద ప్రవాహం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా.. తెలంగాణలోని పాత నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో మున్నేరు, కట్టలేరు, వైరా తదితర వాగులు వంకలు పోటెత్తి ప్రవహించడంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువన కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 31,135 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి (3.07 టీఎంసీలు) చేరుకోవడంతో.. కృష్ణా డెల్టాకు 20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,491 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజి పది గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు.. పశ్చిమ కనుమల్లో కూడా సోమవారం వర్షాలు కురవడంతో ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలుగా మారడంతో.. కాలువలకు విడుదల చేయగా మిగిలిన నీటిని విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి మంగళవారం 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఉజ్జయిని, తుంగభద్ర నదుల్లో వరద పెరగడంతో కాలువలకు విడుదల చేయగా మిగిలిన నీటిని విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. గోదావరి, వంశధార నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి మంగళవారం 2,85,111 క్యూసెక్కులు రాగా కాలువలకు 14,300 క్యూసెక్కులు విడుదల చేసి, మిగిలిన నీటినిసముద్రంలోకి వదులుతున్నారు. -
వరద ప్రాంతాలకు ఉచితంగా విత్తనాలు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి సహా వివిధ నదులకు వచ్చిన వరదలతో పంట దెబ్బతిన్న ప్రాంతాలకు పూర్తి సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయనుంది. వరదలతో మొత్తం పది జిల్లాలకు నష్టం జరిగినప్పటికీ నాలుగు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 90 మండలాలు, 484 గ్రామాలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ లెక్క తేల్చింది. 1,777 హెక్టార్లలో నారుమళ్లు, 22,022 హెక్టార్లలో వరినాట్లు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 13,574 మంది రైతులు నష్టపోయారు. సుమారు 71,253 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి నష్టం జరిగినట్టు తేలింది. ఫలితంగా రూ.95.23 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్టు అంచనా. వరద తాకిడికి గురైన ప్రాంతాలకు పూర్తి సబ్సిడీపై వరి, మినుము, పెసర, మొక్కజొన్న విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయనుంది. ప్రస్తుతం వివిధ పంటలకు ఇస్తున్న పరిహారాన్ని 15 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన పంటలకు నష్టం: రూ.228 కోట్లు ఉద్యాన పంటలకు ఈ వరదల్లో భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణా నది వరదలతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కంద, పసుపు, అరటి, చేమ, తమలపాకు తోటలతో పాటు పలు కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి నష్టం రూ.228 కోట్లకు పైగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు మండలాలు కూడా ముంపునకు గురయ్యాయి. -
వరద నియంత్రణ వల్లే చంద్రబాబు ఇల్లు భద్రం
సాక్షి, విజయవాడ: కృష్ణా నదీ గర్భంలో నిర్మించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి నివాసం ప్రభుత్వ అధికార అధికార యంత్రాంగం ముందుచూపుతో శాస్త్రీయంగా వరద నియంత్రణ చేపట్టడం వల్లే నీట మునగకుండా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు. వరద ఉధృతి అంచనాలో విఫలమైనా, వరద నియంత్రణ చర్యలు శాస్త్రీయంగా లేకపోయినా చంద్రబాబు ఇల్లు వరదలో మునగడంతో పాటు పులిచింతల రిజర్వాయర్ పరిసర గ్రామాలు, ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాలూ పూర్తిగా నీట మునిగేవి. అధికార యంత్రాంగం ముందు చూపుతో చేపట్టిన వరద నియంత్రణ చర్యల వల్లే గండం గడిచిందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గరిష్ట నీటి నిల్వ 3.05 టీఎంసీలు ఉన్నప్పుడు కృష్ణా నదిలో నీటి నిల్వ స్థాయి 17.36 మీటర్లు ఉంటుంది. చంద్రబాబు ఇల్లు 19.5 మీటర్ల ఎత్తులో ఉంది. కృష్ణా నది కరకట్ట 23.5 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు అధికంగా రానంత వరకూ కరకట్టపై ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి గరిష్టంగా 8.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. బ్యారేజీ వద్ద 19.35 మీటర్ల ఎత్తుకు జలాలు చేరాయి. బ్యారేజీ నుంచి వెనక్కి వెళ్లే కొద్దీ నీటి నిల్వ ఎత్తు పెరుగుతూ ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 19.35 మీటర్లు ఎత్తుకు చేరినప్పుడు చంద్రబాబు ఇంటి వద్ద 19.99 మీటర్ల ఎత్తుకు నీరు చేరింది. దీంతో ఆయన ఇంటి సెల్లార్లోకి, హెలిప్యాడ్‌పైకి నీరు వచ్చింది. 2009లో ప్రకాశం బ్యారేజీకి 10.6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పట్లో 22 మీటర్ల స్థాయికి నీటి నిల్వ పెరిగింది. ఫలితంగా కరకట్ట అంచు వరకు నీరు చేరింది. అప్పట్లో నదీతీరంలో ఉన్న భవనాలు మొదటి అంతస్తు వరకు వరద నీటిలో మునిగిపోయాయి. లింగమనేని రమేష్ భవనం(ఇప్పటి చంద్రబాబు నివాసం) మొదటి అంతస్తు కూడా నీట మునిగింది. అప్పట్లో కొన్ని భవనాలపై ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు చేసిన మార్కింగ్‌లు ఇప్పటికీ ఉన్నాయి. 10 లక్షల క్యూసెక్కులు విడుదల చేసి ఉంటే.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా వరద నియంత్రణను అధికార యంత్రాంగం శాస్త్రీయంగా చేసింది. ఎగువన ఉన్న ప్రతి ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు నీటి నిల్వ సామర్థ్యం, వరద ఉధృతిని కచ్చితంగా అంచనా వేస్తూ విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల భద్రత, దిగువన ముంపు ప్రమాదం, ప్రజల రక్షణ.. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నీటి విడుదల చేశారు. పులిచింతల వద్ద 8.50 లక్షల క్యూసెక్కులు కాకుండా 6 లక్షల క్యూసెక్కుల నీటిని తొలుత విడుదల చేశారు. తర్వాత వరద ఉధృతి పెరగడంతో క్రమేణా నీటి విడుదల పరిమాణాన్ని పెంచుకుంటూ పోయారు. ఈ నెల 17వ తేదీ నాటికి పులిచింతలలో వరద ఉధృతి గరిష్ట స్థాయికి చేరింది. తొలుత వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేయకుండా పులిచింతలలో నిల్వ చేసి ఉంటే, 17వ తేదీన ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తేది. అదే జరిగితే ప్రకాశం బ్యారేజీ వద్ద కరకట్ట వరకూ నీరు చేరేది. నదీ గర్భంలో నిర్మించిన అన్ని భవనాలూ నీట మునిగిపోయేవి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెనుముప్పు తప్పిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
నా ఇల్లు మంత్రులు చూడ్డమేంటి ? : చంద్రబాబు
సాక్షి, అమరావతి: కృష్ణా నది వరదలపై సీఎం, మంత్రులు ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. తాను లేనప్పుడు తన ఇల్లు మునిగిపోతోందని ముగ్గురు మంత్రులు చూడటానికి రావడమేమిటని ప్రశ్నించారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన దుర్మార్గపు చర్య అని విమర్శించారు. వరదలు వస్తాయని వాతావరణ శాఖ, ఇస్రో ఎప్పటికప్పుడు సమాచారమిచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు రావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందని, ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన కార్యాచరణ చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని అన్నారు. వరద వస్తున్నపుడు రాయలసీమలో ఖాళీగా ఉన్న రిజర్వాయర్లను నింపుదామన్న ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. -
వరద తగ్గింది
సాక్షి, అమరావతి: వరద నీటితో ఉరకలెత్తిన కృష్ణా నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 5.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 70 గేట్లు ఎత్తి 6.16 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. శనివారంతో పోలిస్తే ఆదివారం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వచ్చే వరద భారీగా తగ్గింది. ఆల్మట్టిలోకి 2.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. నారాయణపూర్‌లోకి 2 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. భీమానదిలో ప్రవాహం కొంత పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 12,351 క్యూసెక్కులు వస్తుండగా.. 15,590 క్యూసెక్కులను కృష్ణాలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్ట్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.32 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 5.98 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 4.73 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4.24 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 5.13 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలలోకి వచ్చే వరద సోమవారం నుంచి తగ్గుముఖం పట్టనుంది. తగ్గిన గోదావరి ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపివ్వడంతో ఆదివారం గోదావరిలోకి వచ్చే ప్రవాహం తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాయంత్రం 6 గంటలకు 4.81 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. అంతే స్థాయిలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 13,129 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
ముంపులోనే లంక గ్రామాలు!
సాక్షి, అమరావతి/కొల్లూరు/సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ నదీ తీరంలోని లంక గ్రామాల్లో ఆదివారం కూడా వరద ముప్పు కొనసాగింది. గుంటూరు జిల్లాలో ప్రధానంగా తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లూరు, అమరావతి, దాచేపల్లి మండలాల్లో 29,754.75 ఎకరాల్లో ఉద్యాన, వాణిజ్య పంటలు నీట మునిగాయి. మిరప, అరటి, బొప్పాయి, నిమ్మ, మామిడి, కొబ్బరి, జామ, పసుపు, కంద, కూరగాయల తోటలు, పూల తోటలు, పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పడవల ద్వారా వెళ్లి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. లంక గ్రామాల్లో కొంత నీరు తగ్గినప్పటికీ పంట పొలాల్లో మాత్రం అలానే ఉండటంతో పంటలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అమరావతి– విజయవాడ మధ్య ఇంకా రాకపోకలు సాగడం లేదు. సహాయక బృందాలకు ప్రశంసలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. గత రెండు రోజుల్లో అన్నవరపులంకలో 100 మందిని, జువ్వలపాలెంలో 50 మందిని, పల్లెపాలెంలో 80 మందిని వరద ముప్పు నుంచి ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. రెండు జిల్లాల్లో 23,551 మందిని సహాయ శిబిరాలకు తరలించాయి. శిబిరాల్లో బాధితులకు భోజనం, వైద్యం, వసతి సౌకర్యాలు కల్పించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్లో విధులు నిర్వహించిన ఫైర్ సిబ్బంది సేవలకు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ముంపు ప్రాంతం నుంచి బోటులో తీసుకొచ్చిన బాలింతను కిందకు దించేందుకు ఓ ఫైర్ ఉద్యోగి తనే స్టూల్గా మారి బాలింతకు ఊతమిచ్చాడు. ఆయన వీపుపై కాలు మోపి ఆ బాలింత సురక్షితంగా కిందకు దిగింది. శనివారం జరిగిన ఈ సన్నివేశం ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సుచరిత వరదల కారణంగా నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి రాగానే వరదలపై సమీక్ష నిర్వహించి నష్టపరిహారం ప్రకటిస్తామన్నారు. కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో మరొకరు వరద కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. వరదల ప్రభావం గుంటూరు జిల్లాలో 53 గ్రామాలపైనా, కృష్ణా జిల్లాలో 34 గ్రామాలపైనా ఉందన్నారు. రెండు జిల్లాల్లో 17,491 మంది వరద ముంపు బారిన పడ్డారని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు సహాయ చర్యలు చేపడుతున్నామని, ఆహార పొట్లాలు, పెరుగు, పాలు, తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశం అనంతరం మంత్రి కొల్లూరు, దోనేపూడి గ్రామాల్లో కరకట్ట దిగువన వరద ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసీ దిలీప్‌కుమార్, ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్, డీఎస్పీ శ్రీలక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కొల్లిపరలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కలెక్టర్ శామ్యూల్ వరద పరిస్థితిపై ఆరా తీశారు. కొల్లూరు, పెసర్లంకలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పర్యటించారు. హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువలకు గండ్లు బొమ్మనహాళ్/ఉరవకొండ: తుంగభద్ర, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నా కాలువలకు అడుగడుగునా గండ్లు పడుతుండటంతో ఆశలు ఆవిరవుతున్నాయి. ఆదివారం హెచ్చెల్సీ కాలువకు, హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీకి గండ్లు పడి నీరు వృథా అయ్యాయి. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు బొమ్మనహాళ్ మండలంలోని మైలాపురం సమీపంలో 122–200 కిలోమీటరు వద్ద ఆదివారం గండి పడి నీరు వృథాగా పారింది. కాగా, హంద్రీ నీవా 34వ ప్యాకేజీలో భాగంగా నిర్మించిన డీ2 డిస్ట్రిబ్యూటరీ కాలువకు భారీ వర్షంతో మూడు చోట్ల గండి పడింది. వరద నీటిలో బోటు కార్మికుడి గల్లంతు భట్టిప్రోలు(వేమూరు):కృష్ణా నది లంక గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన బోటు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై వరద నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మరొక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కొల్లూరు మండలం ఈపూరులంక నుంచి బోటులో పెదపులివర్రు వైపు వస్తుండగా విద్యుత్ తీగలు అడ్డుపడ్డాయి. వాటిని చేతితో పైకెత్తడంతో రేపల్లె మండలం పెనుమూడికి చెందిన వల్లభనేని వెంకట్రాజు (27) షాక్‌కు గురై బోటులోంచి వరద నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఒడుగు ప్రభుదాస్ (37) కూడా షాక్‌కు గురికాగా.. అతడు బోటులో పడిపోయాడు. అతడిని తోటి కార్మికులు వెల్లటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు. గల్లంతైన వెంకట్రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కృష్ణాలో తగ్గిన వరద
శ్రీశైలం జలాశయంలో 204.7 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లకు వరద ప్రవాహం తగ్గడంతో దిగువకు విడుదల చేసే నీటిని కూడా తగ్గించారు. దాంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ప్రవాహాలు తగ్గాయి. గురువారం జూరాల ప్రాజెక్టుకు 1.02 లక్షల క్యూసెక్కులు రాగా.. దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులు వదిలారు. సాయంత్రానికి వరద ప్రవాహం 60 వేల క్యూసెక్కులకు తగ్గింది. దాంతో.. శ్రీశైలం రిజర్వాయర్‌కు 57,948 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 204.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండాలంటే మరో 11.01 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గినా శ్రీశైలం రిజర్వాయర్ ఎడమ, కుడి గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 41,751 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇందులో 36,126 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. దాంతో సాగర్‌లో నీటి నిల్వ 163.50 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే మరో 148.55 టీఎంసీలు అవసరం. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం.. నైరుతి రుతుపవనాలు తిరోగమించే దశకు చేరుకోవడంతో నాగార్జునసాగర్ ఈ ఏడాది కూడా నిండే అవకాశం కనిపించడంలేదు. ఇక గోదావరి ప్రాజెక్టుల్లోనూ వరద ఉధృతి తగ్గింది.