సాగర్‌లో మూతపడ్డ క్రస్ట్‌గేట్లు
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్ (మాచర్ల): నారాయణపూర్ డ్యామ్ దిగువన కృష్ణా ప్రధానపాయ, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 1,55,213 క్యూసెక్కులకు తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా ద్వారా 527, కల్వకుర్తి ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు.
స్పిల్ వే రెండు గేట్లను పదడుగులు ఎత్తి 55,692, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,285.. మొత్తం 1,18,977 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.5 అడుగుల్లో 212.91 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 68,847 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే గేట్లను మూసేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ 33,617 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువల ద్వారా 18,674 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.2 అడుగుల్లో 305.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతలలోకి 12,912 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 29,382 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
ప్రస్తుతం పులిచింతలలో 170.17 అడుగుల్లో 38.59 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,78,749 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,199 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 2,63,550 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment