సాక్షి, అమరావతి: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం మరోసారి పెరిగింది. ఎగువ నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,00,987 (8.72 టీఎంసీలు) క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి.. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 95,963 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 182.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని జలాశయాల నుంచి సైతం భారీఎత్తున వరద జలాలను దిగువకు విడుదల చేస్తుండడంతో శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మరింతగా పెరగనుంది. మరోవైపు.. కృష్ణా, ప్రధాన ఉపనదులైన తంగభద్ర, భీమా పరివాహక ప్రాంతాలలో కూడా రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణఫూర్ జలాశయాల్లోకి ఈ పాయ నుంచి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
భీమా నదిలో వరద ప్రవాహం పెరగడంతో ఉజ్జయిని జలాశయం నుంచి 30 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 2.03 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రలోనూ వరద ప్రవాహం భారీగా పెరిగింది. దాంతో తుంగభద్ర జలాశయం నుంచి 85 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న నీటిలో నాగార్జునసాగర్‌కు 23,260 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో కుడి, ఎడమ కాలువలు, పులిచింతల, ఏఎమ్మార్పీలకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 9,753 క్యూసెక్కులు చేరుతుండగా 5 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 11,451 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 16,774 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
గంటగంటకూ పెరుగుతున్న గోదావరి
ఇదిలా ఉంటే.. చత్తీస్‌గఢ్.. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు పోటెత్తి గోదావరి నదికి చేరుతున్నాయి. దాంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజిలోకి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 5,53,077 క్యూసెక్కులు చేరుతుండగా.. బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 5,54,774 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు.. వంశధార నదిలోనూ వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 36,566 క్యూసెక్కులు చేరుతుండగా 22 గేట్లు ఎత్తి 37,954 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి మళ్లీ వరద
Published Sat, Sep 7 2019 4:38 AM | Last Updated on Sat, Sep 7 2019 4:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment