సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్‌లోకి కృష్ణమ్మ వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం 542.7 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 193.15 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. గరిష్ట నీటి నిల్వ 312.05 టీఎంసీలు. మూసీ ద్వారా కృష్ణాలోకి ప్రవాహం చేరుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 7,400 క్యూసెక్కులు నీరు వస్తోంది. తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ పది వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. తద్వారా పాలేరు, మున్నేరు, వైరా, కట్టలేరు ఉరకలెత్తడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 62,775 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
కృష్ణా డెల్టా కాలువలకు 5,275 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 57,500 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోకి 1,02,418 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి గట్టు కేంద్రంలో ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 27,180, ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గడంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్పిల్ వేలో ఒక గేటును మూసి వేశారు.
మరో గేటును పది అడుగుల మేర ఎత్తి 26,744 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాలు, స్పిల్ వే గేటు ద్వారా మొత్తం 85,708 క్యూసెక్కులు సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం తగ్గింది. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల గేట్లు మూసేశారు. విద్యుదుత్పత్తి ద్వారా మాత్రమే నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి విద్యుదుత్పత్తి, స్పిల్ వే ద్వారా 16,494 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 199.7354 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 882.10 అడుగులకు చేరుకుంది.
సాగర్‌లో 193.15 టీఎంసీల నిల్వ
Published Mon, Jul 25 2022 3:33 AM | Last Updated on Mon, Jul 25 2022 8:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment