సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల)/సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ప్రవాహం కారణంగా దాని పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహ జలాలు తగ్గాయి. సోమవారం సాయంత్రం జూరాల, సుంకేసుల నుంచి 3,10,291 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. శ్రీశైలం డ్యామ్ వద్ద 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు తెరిచి 3,72,710 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం రెండు పవర్ హౌస్‌ల నుంచి మరో 63,442 క్యూసెక్కులు వెరసి మొత్తం 4,36,156 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 410 క్యూసెక్కుల నీటిని వదిలారు.
నాగార్జున సాగర్ నుంచి 3,55,349 క్యూసెక్కులు దిగువకు..
నాగార్జున సాగర్ జలాశయం నుంచి సోమవారం రాత్రి ఎడమ కాలువకు 601, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 33,414 క్యూసెక్కులు, 22 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,18,934 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాలువకు 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా సాగర్ జలాశయం నుంచి 3,55,349 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతున్నాయి. సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 3,54,410 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 2,57,439 క్యూసెక్కుల ప్రవాహ జలాలు వచ్చి చేరుతుండగా.. అంతే మొత్తంలో నీటిని బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు. అందులో 9,689 క్యూసెక్కులను కాలువలకు ఇస్తూ.. 2,47,750 క్యూసెక్కులు మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 63 టీఎంసీలు నీరు సముద్రం పాలైంది. ఇదిలావుండగా.. బ్యారేజీకి వరద పోటెత్తి వస్తుండటంతో దానికి ఎగువ, దిగువన ఉండే ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రికి ప్రకాశం బ్యారేజీకి 3.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద చేరే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
జలాశయాలు కళకళ
Published Tue, Aug 3 2021 3:37 AM | Last Updated on Tue, Aug 3 2021 3:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment