శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్ (మాచర్ల): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 3,83,769 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 2,594 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3,81,300 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 4,26,223 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. శ్రీశైలం వద్ద 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేర తెరచి 3,76,170 క్యూసెక్కులను, విద్యుత్ ఉత్పాదన అనంతరం 27,190 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 7 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులను వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 211.4759 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. మరోవైపు నాగార్జున సాగర్ వద్ద 18 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 3,70,191 క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,63,791 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి 13,867 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 11,581 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment