ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్‌లోకి ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,56,766 క్యూసెక్కులు చేరుతుండగా కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీలకు 7,048 క్యూసెక్కులు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ నదిలోకి 4,774 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 572.10 అడుగుల్లో 261.84 టీఎంసీల నీరు ఉంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 50 టీఎంసీలు కావాలి. ఆదివారం పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్రలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది.
ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద
సాగర్‌లో విద్యుదుత్పత్తి దిగువకు విడుదల చేస్తున్న నీటికి, మూసీ, హాలియా నదుల ప్రవాహం తోడవడంతో పులిచింతల్లోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి పాలేరు, మున్నేరు తదితర వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 50,276 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణాడెల్టాకు 9,741 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగిలిన 40,535 క్యూసెక్కులను బ్యారేజ్ 55 గేట్లు ఒక్క అడుగుమేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తుంగభద్ర డ్యామ్ 30 గేట్లు ఎత్తివేత
శనివారం రాత్రి, ఆదివారం పశ్చిమ కనుమల్లో తుంగ, భద్ర నదులు పురుడుపోసుకునే కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు తుంగభద్ర డ్యామ్‌లోకి 98,519 క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ గరిష్టస్థాయిలో 101.27 టీఎంసీలు ఉండటంతో 30 గేట్లను ఎత్తి 98,561 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కులు కడలిలోకి
పరీవాహక ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం కాస్త పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3,10,843 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 9,700 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,01,143 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
గొట్టా బ్యారేజ్, నారాయణపురం ఆనకట్టల నుంచి సముద్రంలోకి..
ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పరవళ్లు తొక్కుతున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 7,470 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 1,392 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 6,078 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నాగావళి వరద ఉద్ధృతితో నారాయణపురం ఆనకట్టలోకి 6,200 క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు.
ఈ సీజన్‌లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది మూడోసారి
శనివారం రాత్రి శ్రీశైలంలోకి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. కానీ.. శనివారం రాత్రి, ఆదివారం నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,52,670 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో మూడుగేట్లను పదడుగుల మేర ఎత్తి 83,673 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,442 క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. దీంతో 1,47,115 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లయింది. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం సాగర్ వైపు పరుగులు పెడుతోంది. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment