నీటితో తొణికిసలాడుతున్న సాగర్ జలాశయం
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/శ్రీశ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జున సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 575 అడుగుల్లో 269.12 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 70,359 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 42.88 టీఎంసీలు అవసరం. కృష్ణా, తుంగభద్ర నుంచి వరద తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త తగ్గింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,38,436 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండు గేట్లను మూసివేశారు. ఒక గేటు ద్వారా 27,846 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 63,332 క్యూసెక్కులు.. వెరసి 91,178 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద
గోదావరిలో మళ్లీ వరద పెరుగుతోంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్‌కి వచ్చే ప్రవాహం పెరిగింది. ఇక్కడి నుంచి డెల్టాకు 6,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,68,278 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 6,46,715 క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 36.6 అడుగులకు పెరిగింది.
ఈ నేపథ్యంలో అధికారులు పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో వంశధారలోనూ వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్‌లోకి 10,465 క్యూసెక్కులు చేరుతోంది. ఆయకట్టుకు 1,897 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 8,568 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
పులిచింతలలో 40.632 టీఎంసీలు
కృష్ణా డెల్టాలో నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే సాగర్‌లో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 30,640 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. సాగర్‌లో నీటిని నిల్వ చేయకుండా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది. సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీకి 4,844 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నుంచి తెలంగాణ విడుదల చేస్తున్న నీటికి మూసీ, హాలియా జలాలు తోడవడంతో 42,705 క్యూసెక్కులు పులిచింతలలోకి చేరుతున్నాయి.
పులిచింతలలో 40.632 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. దీంతో పులిచింతల గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 42,705 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, పాలేరు, వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 77,603 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,513 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 69,990 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment