ప్రకాశం బ్యారేజ్‌లోకి లక్షా 51వేల క్యూసెక్కుల ప్రవాహం
నేడు కూడా ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం
70 గేట్లు ఎత్తి 1,37,450 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
పులిచింతలలో 37.10 టీఎంసీలకు చేరిన నిల్వ
గోదావరిలోనూ స్వల్పంగా వరద పెరుగుదల
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: కడలి వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సా.6 గంటలకు 1లక్షా 51వేల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 13,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 1,37,450 క్యూసెక్కులను 50 గేట్లను మూడు అడుగులు, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లోకి గురువారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.
మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3.74 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇక్కడ 37.10 టీఎంసీలను నిల్వచేస్తూ దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.32 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 882.8 అడుగుల్లో 203.42 టీఎంసీలు నిల్వచేస్తూ పది గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి చేస్తూ 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలు నిల్వచేస్తూ గేట్లు ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆ రెండింటి నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 59 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 103.74 టీఎంసీలు నిల్వచేస్తూ 60 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో.. గురువారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.
స్వల్పంగా పెరుగుతున్న గోదావరి..
ఇదిలా ఉంటే.. గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలతో ఉప నదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ నదిలోకి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30.800 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 6.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద పెరుగుతూ 35.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరద మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున చింతూరు మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలంలో అన్నవరం వాగు పొంగి వరదనీరు రహదారి పైనుండి ఉధృతంగా ప్రవహించింది. వరినాట్లు నిమిత్తం అవతలి పక్కకు వెళ్లిన వ్యవసాయ కూలీలు తిరుగుమార్గంలో ప్రాణాలకు తెగించి వాగును దాటారు.
Comments
Please login to add a commentAdd a comment