సాక్షి, అమరావతి/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతోపాటు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల నుంచి 3.08 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరం (2019 జూన్ 1–2020 మే 31)లో శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,230.22 టీఎంసీల వరద రావడంతో పదేళ్ల క్రితం నమోదైన రికార్డు బద్దలైంది.
2009–10లో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,220.54 టీఎంసీల వరద చేరింది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, 14 గేట్లు తెరవడం ద్వారా 2.58 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు దిగువన మూసీ వరద కలుస్తుండటంతో కృష్ణాలో ప్రవాహ ఉధృతి మరింత అధికమైంది. పులిచింతల ప్రాజెక్టులోకి 2.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.80 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూలై 31న శ్రీశైలానికి చేరిన ప్రవాహ ఉధృతి ఇప్పటివరకూ నిరాటంకంగా కొనసాగుతోంది.
469.91 టీఎంసీలు కడలి పాలు
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,82,281 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగిలిన 1,74,034 క్యూసెక్కులను 70 గేట్లు తెరిచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 469.91 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తద్వారా పదేళ్ల రికార్డును తిరగరాసింది.
కడలి వైపు కృష్ణమ్మ
Published Sat, Sep 28 2019 5:06 AM | Last Updated on Sat, Sep 28 2019 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment