తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి వరదతో నీట మునిగిన గండిపోశమ్మ ఆలయం
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/శ్రీశైలం ప్రాజెక్ట్/హొసపేటె/ధవళేశ్వరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఉప నదులు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కాగా, ఈ వరద కనీసం వారం కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల్లోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఆ నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు.
ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. మరోవైపు తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. ఆదివారం ఉదయానికి ఇన్‌ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉండటంతో నీటినిల్వ 90 టీఎంసీలకు చేరనుంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. నదీ తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలంలో ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న నీటిలో నాగార్జునసాగర్‌కు 29,305 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ ద్వారా పులిచింతల్లోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తోంది. ఈ నీటికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 94,711 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 1,551 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 93,160 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవులో వరద ఉధృతికి నీట మునిగిన రహదారి
గోదావరి ఉగ్రరూపం
ఎగువ నుంచి భారీగా గోదావరి వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 6,33,474 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. స్పిల్ వే కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటిమట్టం 32 అడుగులకు చేరుకుంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. భద్రాచలం నుంచి పోలవరం వద్దకు ఈ అర్ధరాత్రికి 11.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి ఎత్తేసి 4,61,337 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం తెల్లవారుజామున ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక (10 లక్షల క్యూసెక్కులు దాటితే) స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గోదావరి, పలు వాగుల ఉధృతితో వీఆర్ పురం మండలంలో 10, చింతూరు మండలంలో 11, ఎటపాక మండలంలో 1, పి.గన్నవరం మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో 40 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన వరద నియంత్రణ కార్యాలయం నుంచి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బ్యారేజీ దిగువన పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవు వద్ద వశిష్ట గోదావరి నదీపాయలో లంక గ్రామాల ప్రజలు తాత్కాలికంగా నిర్మించుకున్న రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment