Godavari river flow
-
హోరు గోదావరి.. భద్రాచలం వద్ద మళ్లీ అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ఎగువన శ్రీరాంసాగర్ నుంచి దిగువన భద్రాచలం ఆవలిదాకా గోదావరి నది హోరెత్తి ప్రవహిస్తోంది. ప్రధాన నది పొడవునా జలకళ ఉట్టిపడుతోంది. ప్రాణహిత నుంచి ప్రవాహం కాస్త తగ్గినా.. ఎగువ నుంచి వస్తున్న నీరు, కడెం, ఇతర వాగులు, వంకలు కలసి మళ్లీ వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం మెల్లగా పెరుగుతూ వస్తోంది. ఎగువ గోదావరి ఉరకలేస్తూ.. శనివారం రాత్రి 7 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,57,496 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 56.94 టీఎంసీలకు పెరిగింది. మరో 34 టీఎంసీలు చేరితే ఈ ప్రాజెక్టు నిండిపోతుంది. శ్రీరాంసాగర్ దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,92,529 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 20గేట్లు ఎత్తి 2,55,320 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు ప్రాణహిత జలాలు కలసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలోకి 6,10,250 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. మధ్యలో ఇంద్రావతి ఉపనది నీరూ తోడై.. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీలోకి 8,79,450 క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. ఈ నీటిని అలాగే మొత్తంగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు, మధ్యలో ఉప నదులు, వాగుల నుంచి కలుస్తున్న జలాలు మొత్తం భద్రాచలం, పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద మళ్లీ అప్రమత్తం శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం దాకా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ నీరంతా వాగులు, వంకల ద్వారా ప్రాణహితలోకి చేరి గోదావరికి వరద పెరగనుంది. దీనితోపాటు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలు కలసి.. సోమవారం నాటికి భద్రాచలం వద్ద వరద 11 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గోదావరిలో నీటి మట్టం మెల్లగా పెరుగుతూ వస్తోంది. భద్రాచలంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 39 అడుగుల వద్ద నిలిచిన నీటిమట్టం.. రాత్రి 8 గంటలకు 41.01 అడుగులకు చేరింది. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర నేతలు గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కృష్ణాలో పెరుగుతున్న ప్రవాహం పశ్చిమ కనుమల్లో వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద మెల్లగా పెరుగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 83,945 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నీటి నిల్వ 45.50 టీఎంసీలకు చేరింది. మరో 84 టీఎంసీలు వస్తే ఈ డ్యామ్ నిండుతుంది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్‌లోకి ఇన్‌ఫ్లో ఏమీ లేదు. ఇక కృష్ణా ఉప నది అయిన తుంగభద్రలో వరద కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 34,071 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 16.65 టీఎంసీలకు పెరిగింది. ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాలు నిండితే.. దిగువకు వరద రానుంది. ఈ నెలాఖరులోగా శ్రీశైలం జలాశయానికి ప్రవాహాలు మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన వరద మొదలు పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో ప్రవాహం ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మున్నేరు పరవళ్లు తొక్కుతోంది. ఆ నీరంతా కృష్ణాలోకి చేరుతుండటంతో.. శనివారం ప్రకాశం బ్యారేజీలోకి 17,377 క్యూసెక్కులు వరద వస్తోంది. దీంతో కృష్ణా డెల్టాకు 7,087 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. సింగరేణికి వాన దెబ్బ భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. 14 ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ (బొగ్గుపొరలపై ఉన్న మట్టి) వెలికితీత పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీల్లో చేరుతున్న వరద నీటిని తోడిపోసేందుకు భారీ మోటార్లను వినియోగిస్తున్నారు. కోతకు గురైన కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన తెలంగాణ–మహారాష్ట్రల మధ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర వంతెన కోతకు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి వచ్చిన భారీ వరద తాకిడికి మహారాష్ట్ర వైపు ఉన్న చివరిభాగం దెబ్బతిన్నది. అక్కడ వంతెనకు ఆనుకుని పోసిన గ్రావెల్, ఎర్రమట్టి కుంగిపోయింది. గత ఏడాది జూలైలో కూడా ఇదే ప్రాంతంలో కోతకు గురై 20 రోజుల పాటు రాకపోకలు నిలిచిపోవడం గమనార్హం. -
పెరుగుతున్న గోదావరి వరద
సాక్షి, అమరావతి/చింతూరు/ఎటపాక/పోలవరం రూరల్/ధవళేశ్వరం/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/విజయవాడ: గోదావరి వరద పెరుగుతోంది. కృష్ణానదిలో వరద నిలకడగా కొనసాగుతోంది. గోదావరి, శబరి నదుల వరద తగ్గినట్టేతగ్గి మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇక్కడి నుంచి 13.86 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. దీంతో కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో గ్రామాల్లోకి నీరు చేరుతోంది. వరదనీరు ప్రధాన రహదారులపై చేరడంతో మూడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీవర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి కారణంగా చింతూరు వద్ద శబరినది ప్రవాహం పెరుగుతోంది. సోమవారం రాత్రి వరకు తగ్గుతూ వచ్చిన శబరినది వరద మంగళవారం ఉదయం నుంచి పెరుగుతుండడంతో చింతూరు నుంచి శబరిఒడ్డుకు వెళ్లే వీఆర్‌పురం రహదారిపై నీరు చేరింది. చింతూరులోని సంతపాకలు, టోల్గేట్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరుతోంది. మంగళవారం రాత్రికి చింతూరు వద్ద శబరినది 42 అడుగులకు చేరుకుంది. సోమవారం ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు పాక్షికంగా సాగిన రాకపోకలు మంగళవారం నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు ముంపునకు గురైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్ల నుంచి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద నీటిమట్టం మంగళవారం రాత్రి 7 గంటలకు 13.90 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ మిగిలిన 13,08,418 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్దకు బుధవారం నీటి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శ్రీశైలానికి స్థిరంగా కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి కృష్ణానది వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం జూరాల, సుంకేసుల నుంచి 3,35,635 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. డ్యాం 10 రేడియల్ క్రస్ట్‌గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి 3,75,680 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 210.9946 టీఎంసీల నీరు ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్ జలాశయంలోకి 4,07,580 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్ కుడి, ఎడమ కాలువలకు 19,283 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం ఆరుగేట్లను ఐదడుగులు, 20 గేట్లను పదడుగులు ఎత్తి స్పిల్‌వే మీదుగా 3,31,406 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,886 క్యూసెక్కులు.. మొత్తం 3,64,292 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం 586.20 అడుగులకు చేరింది. జలాశయంలో 301.3570 టీఎంసీల నీరు ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి 2,91,483 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కాలువలకు 15,333 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 2,76,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 19న మరో అల్పపీడనం బంగాళాఖాతంలో అల్పపీడనాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం (19న) మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలోను, 13న ఉత్తర బంగాళాఖాతంలోను అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ రెండూ వాయుగుండాలుగా బలపడి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల వైపు వెళ్లాయి. దీంతో ఇవి ఉత్తర కోస్తాపై పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 19, 20 తేదీల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 19న ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఆదాయంలేని గుళ్లకు ‘ధూప దీప నైవేద్యం’ -
భద్రాచలం వద్ద నిలకడగా ఉన్న గోదావరి నీటిమట్టం
-
నేడు గోదావరి నీటిమట్టం 73 అడుగులు దాటే అవకాశం
-
మహోగ్ర గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
సాక్షి, అమరావతి/అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్/చింతూరు/ఎటపాక: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది బుధవారం మహోగ్రరూపం దాల్చింది. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు. బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి 15,11,169 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 15.1 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన కాళేశ్వరంలో 14.67 మీటర్లు, పేరూరులో 16.46 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.41 మీటర్లు, కూనవరంలో 22.27మీటర్లు, కుంటలో 13.31 మీటర్లు, పోలవరంలో 13.84 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 17.23 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు. డెల్టా కాలువలకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 15,07,169 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 19 లక్షల క్యూసెక్కులు దాటితే ఇళ్లలోకి నీరు చేరుతుందని భావిస్తున్నారు. గురువారం రాత్రికి బ్యారేజీలోకి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పోటెత్తిన కడెం ప్రాజెక్ట్ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో జూలై రెండో వారంలోనే గరిష్ట స్థాయిలో వరద ప్రవాహం కడలి వైపు పరుగులు తీస్తోంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 3.82 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో కడెం ప్రాజెక్టు స్పిల్ వేను నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టులోకి కడెం వాగు నుంచి 5.69 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మి, సరస్వతి బ్యారేజీల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేసి.. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజీలోకి 17.65 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 15,14,976 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 54.70 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికి భద్రాచలం వద్దకు 18 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉందని.. నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. గోదావరి చరిత్రలో ఆగస్టు 16, 1986లో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. భద్రాచలం వద్ద వరద మట్టం 75.6 అడుగులుగా నమోదైంది. పోలవరం వద్ద 24 గంటలూ అప్రమత్తత ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 14,54,636 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే వద్ద నీటిమట్టం 34.21 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వరద విడుదల చేస్తుండటంతో దిగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 26 మీటర్లకు చేరుకుంది. గురువారం ఉదయానికి పోలవరం ప్రాజెక్టులోకి 18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లంకల్ని ముంచెత్తిన వరద – నీట మునిగిన రహదారులు.. కాజ్‌వేలు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద ముంపు మరింత పెరిగింది. ప్రధాన రహదారులు ముంపుబారిన పడ్డాయి. ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, ఊడుమూడిలంక, నాగుల్లంక, కె.ఏనుగుపల్లి ముంపుబారిన పడ్డాయి. ఈ గ్రామాల్లో నాలుగు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. అలాగే మానేపల్లి శివారు పల్లిపాలెం, శివాయలంక జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని అయోధ్యలంక, పుచ్చల్లంక, కనకాయలంక, పెదమల్లంలంక, అనగారలంక సైతం నీట మునిగాయి. మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి కాజ్వే, అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంకాఫ్ ఠాన్నేల్లంకలో ఎస్సీ కాలనీలు ముంపుబారిన పడ్డాయి. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు పరిధిలో పొగాకులంక, పొట్టిలంకల్లో రోడ్ల మీద నీరు ప్రవహిస్తోంది. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో ముంపుబారిన పడింది. పాండిచ్చేరి పరిధిలోని యానాంలో బాలయోగి నగర్ కాలనీ, ఓల్డ్ రాజీవ్ నగర్ వద్ద వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 43 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముంపులోనే విలీన మండలాలు తగ్గినట్టే తగ్గిన గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. వరుసగా మూడో రోజు కూడా పోలవరం ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. వరద మరింత పెరిగే పరిస్థితి నెలకొంది. నాలుగు మండలాల్లో 87 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా ఇప్పటికే 6,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చింతూరు ఐటీడీఏలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బోటులో ప్రయాణించి వరద పరిస్థితిని, సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. చింతూరు నుంచి బోట్లు, లాంచీల సాయంతో నిత్యావసర సరుకులను ముంపు మండలాలకు తరలిస్తున్నారు. బోటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్! .. గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి కారణంగా పర్యాటక శాఖ బోటింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. పోచమ్మగండి నుంచి పాపికొండలుకు విహార యాత్రను రద్దు చేసింది. రాజమండ్రి ఘాట్లతో పాటు దిండి ప్రాంతంలో బోటింగ్ ఆపేసింది. విజయవాడలోని బెరంపార్క్–భవానీ ద్వీపానికి జల ప్రయాణానికి విరామం ప్రకటించింది. చురుగ్గా సహాయక చర్యలు గోదావరి వరద సహాయక చర్యల్లో 6 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమై ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గోదావరి లంక గ్రామాల ప్రజలు వారి ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 1800–425–0101, 08632377118లో సంప్రదించాలన్నారు. కాగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. మూడో ప్రమాద హెచ్చరిక వస్తే ప్రభావితం చూపే మండలాలపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. కృష్ణా నదిలో వరద పరవళ్లు కృష్ణా నదితోపాటు ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డాŠయ్మ్లలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడం, ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గేట్లు ఎత్తేసి దిగువకు భారీ ఎత్తున వరదను విడుదుల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గురువారం నుంచి వరద ప్రవాహం పెరగనుంది. పశ్చిమ కనుమల్లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దృష్ట్యా శ్రీశైలంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 167.49 టీఎంసీలు అసవరం. నాగార్జునసాగర్‌కు దిగువన కురుస్తున్న వర్షాల వల్ల మూసీ నుంచి పులిచింతల్లోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతలకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల నుంచి వరద కృష్ణా నది మీదుగా ప్రకాశం బ్యారేజీలోకి 27,746 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 23,746 క్యూసెక్కులను 30 గేట్లను అరడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఎడతెరపి లేని వర్షాలతో ఉప్పొంగుతున్న గోదావరి
-
గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన పడవ
-
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో భారీ వర్షాలు.. గోదారి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/ఎటపాక/చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/పోలవరం రూరల్/ ధవళే శ్వరం/దేవీపట్నం/హోళగుంద/బుట్టాయగూడెం: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉప నదులు ఉప్పొంగుతుండటంతో సోమవారం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీనికి ఉప నదుల నుంచి వస్తున్న వరద తోడవడంతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీల గేట్లు ఎత్తేసి.. 8.68 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు ఉప నదులు, వాగులు, వంకల నుంచి వచ్చిన వరద తోడవడంతో సమ్మక్క బ్యారేజీలోకి 11.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ దిగువన పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంవల్ల సీతమ్మసాగర్‌లోకి 14,30,597 (123.62 టీఎంసీలు) క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా భద్రాచలంలో వరద గంటగంటకూ పెరుగుతోంది. ఇక్కడ వరద మట్టం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. విలీన మండలాల్లో రాకపోకలు బంద్ గోదావరికి వరద పోటెత్తడంతో విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక, రాయనపేట, నెల్లిపాక, వీరాయిగూడెం, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు గ్రామాల వద్ద రహదారిపైకి వరద చేరింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు జాతీయ రహదారులపై నిలిచిపోయాయి. శబరి నది కూడా ఎగపోటుకు గురవుతోంది. దీంతో చింతూరు మండలంలో పలు వాగులు పొంగుతున్నాయి. ఈ ప్రాంతంలోనూ పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద అధికంగా ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని.. నిత్యావసర వస్తువులు, టార్పాలిన్లు సమకూర్చాలన్నారు. అలాగే, జ్వరాలు, డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుజాగ్రత్తగా లక్ష వాటర్ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర నిత్యావసర సరకులతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు. అంతేకాక.. వేలేరుపాడు, కుక్కునూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జేసీ అరుణ్‌బాబు, ఐటీడీఏ పీఓ జి.శ్రీనుకుమార్, ఆర్డీఓ ఎం.ఝాన్సీరాణి ఆయా గ్రామాల్లో పర్యటించారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత పోలవరం నుంచి వస్తున్న వరద జలాలతో ధవళేశ్వరం బ్యారేజీలో సోమవారం రాత్రి 7 గంటలకు బ్యారేజీలోకి 8,02,114 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 10.10 అడుగులకు పెరిగింది. నాలుగు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 7,98,114 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రికి బ్యారేజీలోకి పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశముంది. ఎస్సారెస్సీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 15.70 మీటర్లు ఉంది. వరద ఉధృతి కారణంంగా కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, ఎస్పీ సురేష్‌కుమార్ రెడ్డి సోమవారం ఆయా గ్రామాలకు పడవపై లంకలోకి వెళ్లి వరద ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామన్నారు. జూలై రెండో వారంలో ఈ స్థాయిలో గోదావరికి వరద రావడం ఇదే ప్రథమం అని అధికారులు చెబుతున్నారు. ఆల్మట్టి గేట్లు ఎత్తివేత.. మరోవైపు.. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆదివారం, సోమవారం పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో.. ముందుజాగ్రత్తగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తేసి దిగువకు 75 వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. నారాయణపూర్ కూడా నిండుకుండలా మారడంతో ఆ డ్యామ్ గేట్లు కూడా మంగళవారం ఎత్తివేయనున్నారు. కృష్ణాలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే.. మరో ఐదు రోజుల్లో శ్రీశైలానికి కృష్ణమ్మ చేరుకునే అవకాశముంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఈ డ్యామ్‌లోకి 81 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 91 టీఎంసీలకు చేరుకుంది. మరో 9 టీఎంసీలు చేరితే తుంగభద్ర నిండుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం ఉదయం ఈ డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, పులిచింతల దిగువన బేసిన్లో కురిసిన వర్షాలకు 43 వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతోంది. ఇందులో ఐదు వేల క్యూసెక్కులను డెల్టా కాల్వలకు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 38 వేల క్యూసెక్కులను బ్యారేజ్ 50 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. వరదలకు జాగ్రత్తలు తీసుకోవాలి – మంత్రి అంబటి రాంబాబు రికార్డు స్థాయిలో గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సోమవారం వరద పరిస్థితిని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఈఎన్సీ నారాయణరెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రమాదం తొలగే వరకు ప్రజలను పునరావాస శిబిరంలో ఉంచి వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వరద పెరగడంతో డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలోకి వరద నీరు చేరిందన్నారు. ఫలితంగా.. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. నిజానికి.. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. దీనిని నిపుణుల బృందం పరిశీలిస్తోందని, వారిచ్చిన నివేదిక మేరకు కొత్తది నిర్మించాలా లేదా మరమ్మతులు చేయించాలా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. -
గోదావరి ఉరకలు
ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్ (మాచర్ల): ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం గురువారం సాయంత్రం 10.20 అడుగులకు చేరింది. 7,83,817 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నిజానికి.. గురువారం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ, భద్రాచలం వద్ద నీటి ఉధృతి పెరగలేదు. జిల్లా ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి ఎగువనున్న జూరాల, సుంకేసుల నుంచి 1,17,212 క్యూసెక్కుల వరద నీరు గురువారం విడుదలైంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 32,718 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతికి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు కేంద్రంలో బుధవారం నుంచి గురువారం వరకు 13.927 మిలియన్ యునిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.119 మిలియన్ యునిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 206.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది 883.30 అడుగులకు సమానం. గరిష్టస్థాయిలో సాగర్ నీటిమట్టం ఇక శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరగడంతో ఆరు గేట్ల ద్వారా 48,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగులకు చేరుకుంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకి 8,221, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32,399, ఎస్ఎల్బీసీకి 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
గోదావరిలో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. గోదావరి డెల్టా కాలువలకు కొంతనీరు వదిలి, మిగిలిన 7,62,609 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ బ్యారేజి వద్ద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 70,577 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,426 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 878.80 అడుగుల్లో 181.8320 టీఎంసీల నీరు ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో 71.067 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి› చేసింది. నాగార్జునసాగర్‌లోకి 17,151 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న 19,444 క్యూసెక్కులను స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 63,003 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 11,203 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 51,800 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు వదిలేస్తున్నారు. సోమశిలలోకి పెన్నా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 26 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 72.84 టీఎంసీలకు చేరుకుంది. మరో 5.16 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు. సోమశిల నుంచి వదలుతున్న నీటిలో కండలేరు రిజర్వాయర్‌లోకి 8,600 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం కండలేరులో 54.98 టీఎంసీల నీరుంది. కండలేరు నిండాలంటే ఇంకా 13.05 టీఎంసీలు అవసరం. -
ఉప్పొంగిన గోదారి.. ఉధృతంగా మంజీర
బోధన్: భారీ వర్షాలతో గోదావరి, మంజీర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వానలతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం కందకుర్తి వద్ద వంతెన పైనుం చి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతాల మధ్య రాకపోకలు, నిలిచిపోయాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న సీతారామ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. కందకుర్తి గోదావరి నదికి దిగువ ప్రాంతంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల శివారులోని సుమారు 4 వేల ఎకరాలకుపైగా సోయా, ఇతర పంటలు నీటి మునిగాయని స్థానిక రైతులు అంటున్నారు. పోటెత్తిన మంజీర..: మంజీర నదిలో వరదనీరు పోటెత్తి ప్రవహిస్తోంది. కౌలాస్‌నాలా, నిజాంసాగర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద నీరు, వాగుల నుంచి చేరిన నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గావ్ గ్రామాల శివారులోని వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. హంగర్గ చుట్టూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చేరింది. సుమారు వెయ్యి ఎకరాల పంట వరద నీటిలో మునిగి ఉందని రైతులు తెలిపారు. ఆర్డీవో రాజేశ్వర్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రమాద హెచ్చరిక జారీ ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం గోదావరి నీటి మట్టం 8.54 మీటర్లకు చేరడంతో కేంద్ర జలవనరుల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో నీరు గంటకు పది పాయింట్లు పెరుగుతూ వస్తోంది. రెండో ప్రమాద హెచ్చరిక 9.54 మీటర్ల వద్ద జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక డేంజర్ లెవల్ 11.04కు చేరితే లోతట్టు గ్రామాలను ఖాళీ చేయిస్తారు. -
కృష్ణమ్మ హోరు.. గోదారి జోరు
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/శ్రీశైలం ప్రాజెక్ట్/హొసపేటె/ధవళేశ్వరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఉప నదులు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కాగా, ఈ వరద కనీసం వారం కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల్లోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఆ నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. మరోవైపు తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. ఆదివారం ఉదయానికి ఇన్‌ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉండటంతో నీటినిల్వ 90 టీఎంసీలకు చేరనుంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. నదీ తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలంలో ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న నీటిలో నాగార్జునసాగర్‌కు 29,305 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ ద్వారా పులిచింతల్లోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తోంది. ఈ నీటికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 94,711 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 1,551 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 93,160 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవులో వరద ఉధృతికి నీట మునిగిన రహదారి గోదావరి ఉగ్రరూపం ఎగువ నుంచి భారీగా గోదావరి వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 6,33,474 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. స్పిల్ వే కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటిమట్టం 32 అడుగులకు చేరుకుంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. భద్రాచలం నుంచి పోలవరం వద్దకు ఈ అర్ధరాత్రికి 11.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి ఎత్తేసి 4,61,337 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం తెల్లవారుజామున ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక (10 లక్షల క్యూసెక్కులు దాటితే) స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గోదావరి, పలు వాగుల ఉధృతితో వీఆర్ పురం మండలంలో 10, చింతూరు మండలంలో 11, ఎటపాక మండలంలో 1, పి.గన్నవరం మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో 40 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన వరద నియంత్రణ కార్యాలయం నుంచి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బ్యారేజీ దిగువన పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవు వద్ద వశిష్ట గోదావరి నదీపాయలో లంక గ్రామాల ప్రజలు తాత్కాలికంగా నిర్మించుకున్న రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
CM KCR : అనుక్షణం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, దీంతో తెలంగాణలోకి వరద ఉధృతి పెరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద పరిస్థితిని పర్యవేక్షించేందుకు కొత్తగూడెం, ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతాలకు ఆర్మీ హెలికాప్టర్లతో పాటు అధికారులను పంపించాలని ఆదేశించారు. ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి లోతట్టు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వరదల మూలంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంతో పాటు దుస్తులు, భోజన వసతి సమకూర్చాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా మరిన్ని హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెప్పించాలని సూచించారు. భారీ వర్షాలు, కృష్ణా, గోదావరి వరద పరిస్థితులపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉదయం కూడా వరదలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. మహాబలేశ్వరంలో 70 సెం.మీ. వర్షపాతం సమీక్ష సందర్భంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో నమోదవుతున్న వర్షపాతం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగం మొదలుకుని కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజీల్లో వరద పరిస్థితిపై అధికారులు నివేదిక సమర్పించారు. కృష్ణా నది ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితిని కూడా వివరించారు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, మహాబలేశ్వరంలో 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని విభాగాలు సన్నద్ధంగా ఉండాలి ‘కృష్ణా నదీ ప్రవాహం పెరిగే అవకాశమున్నందున నాగార్జునసాగర్ కేంద్రంగా పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులను పంపించాలి. గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. అగస్టు పదో తేదీదాకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. శుక్ర, శనివారాల్లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నీటిపారుదల, విద్యుత్, పోలీసు విభాగాలు సన్నద్ధంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడంతో పాటు, రిజర్వాయర్ల నుంచి నీటిని నెమ్మదిగా వదలాలి. రోడ్లు, భవనాల శాఖ వంతెనలు, రోడ్లను పరిశీలీస్తూ ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలి. మూసీ వరద కూడా పెరిగే అవకాశం మూసీ నది వరద ఉధృతి కూడా పెరిగే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారిపై హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలి. తక్షణమే శాశ్వత వరద నిర్వహణ బృందం వరదల సందర్భంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గతంలో వరద పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ఏడెనిమిది మంది అధికారులతో కూడిన వరద నిర్వహణ (ఫ్లడ్ మేనేజ్మెంట్) బృందాన్ని శాశ్వతంగా తక్షణమే ఏర్పాటు చేయాలి. పునరావాస క్యాంపుల నిర్వహణపై అవగాహన ఉన్న అధికారిని ఈ బృందంలో సభ్యుడిగా నియమించాలి. ఆర్మీ, పోలీసు, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థల సమన్వయం కోసం ఒకరిని నియమించాలి. వైద్యం, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల సమన్వయం కోసం ఒకరు, జీఏడీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖల సమన్వయం కోసం మరొక అధికారిని ఈ బృందంలో చేర్చాలి..’అని సీఎం ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ‘ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించాలి. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తక్షణమే పరిస్థితిని పర్యవేక్షించాలి. నిర్మల్ పట్టణం ఇప్పటికే నీట మునిగింది. సీఎస్ అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలి. టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. రానున్న రెండురోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు..’అని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీఎం కార్యాలయ ఓఎస్డీలు శ్రీధర్ దేశ్‌పాండే, ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయండి: సీఎస్ ఉదయం సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 16 మంది కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వర్షాలు, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద
సాక్షి, అమరావతి/కొవ్వూరు: గోదావరి నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. ఎగువన తెలంగాణలో లక్ష్మి, సరస్వతి బ్యారేజీలు నిండుకుండలుగా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటిమట్టం 28.75 అడుగులకు చేరుకుంది. 10 రివర్ స్లూయిజ్ గేట్లు, 48 క్రస్ట్ గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్టుగా పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,15,549 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,14,879 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరకపోయినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దీనివల్ల శ్రీశైలంలో నీటిమట్టం 807.45 అడుగులకు, నీటి నిల్వ 32.80 టీఎంసీలకు పడిపోయింది. పులిచింతల నుంచి వదిలేసిన నీటితోపాటు వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీలోకి 11,442 క్యూసెక్కులు వస్తోంది. మిగులుగా ఉన్న 10,310 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. -
వాగులు పొంగె.. గోదావరి ఉప్పొంగె..
సాక్షి,పోలవరం రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌డ్యామ్ ఎగువ భాగంలో రోజురోజుకూ గోదావరి నీరు ఎగపోటు తన్నుతోంది. ముంపు గ్రామాల సమీపంలోకి నీరు చేరుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షం నీరంతా గోదావరిలో కలుస్తోంది. ప్రాజెక్టు కాఫర్‌డ్యామ్ వద్ద మంగళవారం 27.549 మీటర్లకు నీటిమట్టం చేరింది. స్పిల్‌వేలోని 42 గేట్ల నుంచి దిగువకు నీరు చేరుతోంది. స్పిల్ ఛానల్ మీదుగా మహానందీశ్వరస్వామి ఆల య సమీపంలో సహజ ప్రవాహంలో కలుస్తోంది. రంగుమారిన గోదారమ్మ కొండవాగుల నీరు కలవడంతో గోదావరి కొద్దిగా రంగు మారి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువన కూడా నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. నక్కలగొయ్యి కాలువ, ఇసుక కాలువ, పేడ్రాల కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టిసీమ ఔట్‌ఫాల్ స్లూయిజ్ నుంచి కొవ్వాడ కాలువ అధిక జలాలు గోదావరిలోకి చేరుతున్నాయి. నిండుకుండలా జలాశయాలు బుట్టాయగూడెం: భారీ వర్షాలతో బుట్టాయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. పోగొండ రిజర్వాయర్‌లో కూడా వరద నీరు పోటెత్తుతోంది. జల్లేరు జలాశయంలో 211.80 మీటర్లకు, పోగొండ రిజర్వాయర్‌లో 155.7 మీటర్లకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, పిల్ల కాలువలు పొంగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు దిగువన రంగు మారి ప్రవహిస్తున్న గోదావరి 32.8 మి.మీ సగటు వర్షపాతం జిల్లాలో గత 24 గంటల్లో 32.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా మంగళవారం ఉదయం వరకు పరిశీలిస్తే చా గల్లులో అత్యధికంగా 131.8, పాలకోడేరులో 108.4, జీలుగుమిల్లిలో 101.8 మి.మీ వర్షం కురిసింది. దేవరపల్లిలో 75, పోలవరంలో 74.2, కొవ్వూరులో 73.8, గణపవరంలో 69.4, బుట్టాయగూడెంలో 59.4, వీరవాసరంలో 53.2, నిడమర్రులో 48.6, కొయ్యలగూడెంలో 44.6, తాళ్లపూడిలో 41.2, టి.నర్సాపురంలో 40.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జంగారెడ్డిగూడెంలో 38.2, నిడదవోలులో 33.2, గోపాలపురంలో 31.2, ఉండ్రాజవరంలో 30.2, నరసాపురంలో 29.4, ఉండిలో 29.2, ఆకివీడులో 27.8, తణుకులో 28.8, అత్తిలిలో 26.6, కుక్కునూరులో 25.2, మొగల్తూరులో 23.6 మి.మీ వర్షం కురిసింది. చింతలపూడిలో 23.2, పాలకొల్లులో 22.4, ఉంగుటూరులో 22.2, పెంటపాడులో 20.4, పెరవలిలో 18, భీమడోలులో 17.8, కామవరపుకోటలో 17.2, భీమవరంలో 16.8, నల్లజర్లలో 16.0, ఆచంటలో 15.8, పెదపాడులో 15.2, పోడూరులో 14.6, కాళ్లలో 14.4, ఏలూరులో 13.4, వేలేరుపాడు, ద్వారకాతిరుమలలో 12.2 చొప్పున, దెందులూరులో 11.4, తాడేపల్లిగూడెంలో 11, పెనుగొండలో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మూడు రోజులుగా సరాసరి 71.19 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరద భయంతో గ్రామాలు ఖాళీ కుక్కునూరు: గోదావరి వరద పెరుగుతుండటంతో మండలంలోని నదీ పరీవాహక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే తప్ప పట్టించుకోని గిరిజనులు గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరికకు కూడా చేరకుండానే గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బ్యాక్ వాటర్ పెరగడం, గోదావరి పోటెత్తడంతో గొమ్ముగూడెం వద్ద అడుగు మేర నీరు పెరిగిందని అంటున్నారు. -
Photo Feature: బైక్‌తో భళా.. పోలీసులుంటే ఎలా..?
ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలో అరుదైన సప్తవర్ణశోభిత సాలీడు దర్శనమిచ్చింది. వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా హైదరాబాదీలకు అధికారులు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. కాగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాలో వేడుకలు ఘనంగా జరిగాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
కృష్ణా, గోదావరిలో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేస్తున్న నీటికి తుంగభద్ర డ్యామ్ నుంచి వదులుతున్న ప్రవాహం తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 68,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 17,808 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయిలో అంటే 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► సాగర్‌లోకి 17,808 క్యూసెక్కులు చేరుతుండగా.. అదే స్థాయిలో ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పులిచింతల ప్రాజెక్టులోకి 5,085 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా అవసరాల కోసం పది వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 45.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► ప్రకాశం బ్యారేజీలోకి 18,963 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 16,882 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ► తుంగభద్ర డ్యామ్‌లో పూర్తి స్థాయిలో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద ప్రవాహం 36,689 క్యూసెక్కుల్లో కాలువలకు 10,519 క్యూసెక్కులు వదిలి.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 28,423 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► గోదావరి ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,96,413 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,900 క్యూసెక్కులు వదిలి, మిగులుగా ఉన్న 2,83,513 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
-
ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
సాక్షి, తూర్పుగోదావరి : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. బ్యారేజ్ వద్ద వరద 17.7 అడుగులకు తగ్గింది. దావరి వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను తొలగించారు. ప్రస్తుతం అధికారులు బ్యారేజ్ గేట్లు ఎత్తి 18 లక్షల 99వేల క్యూసెక్కల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.ఇప్పటికే వరద నీటిలోనే 27 లంక గ్రామాలు మగ్గుతున్నాయి. భద్రాచలంలో 44 అడుగులకు చేరి గోదావరి నీటి మట్టం ప్రవహిస్తోంది. భద్రాచలంలో వరద నీటిమట్టం తగ్గడంతో ఈ రోజు రాత్రికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పనపల్లి బాలాజీ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ఆంధ్ర అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ ఇంటిని వరద ముంచెత్తింది. కాగా రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దేవీపట్నం, తోయ్యరు, గొందురు వరద బాధితులకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మీ సందర్శించారు. అక్కడి భోజనం వసతిని గురించి ఆడిగి తెలుసుకున్నారు. -
తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ఉధృతి ఫోటోలు
-
వరదలపై పాలసీ
సాక్షి, హైదరాబాద్: వానలు, వరదలు సంభ విస్తే అనుసరించాల్సిన ప్రణాళికను గత పాల కులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రూపొందించి తెలంగాణను పట్టించు కోలేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తెలంగాణలో వానలు, వరదలు, విపత్తులు వచ్చినా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విప త్తుల నిర్వహణ వ్యూహాన్ని తయారు చేసుకోవా లన్నారు. ‘ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ’ పేరిట తయారయ్యే ఈ పాలసీ శాశ్వత ప్రాతిపదికన ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వరదల మూలంగా తలెత్తిన పరిస్థితిపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కె. తారక రామారావు, నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఉగ్ర గోదావరి..) మరో 3, 4 రోజులు కీలకం... ‘నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండటంతోపాటు వాగులు, వంకలు, నదులు పొంగుతున్నాయి. ప్రస్తుతం పరిస్తితి అదుపులో ఉన్నా మరో మూడు నాలుగు రోజులు అత్యంత కీలకం. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికితోడు ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. (ఇంకా వరద బురదలోనే..) ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకొని నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలి. కంట్రోల్ రూమ్‌లలో రెవెన్యూ, పోలీస్, జలవనరులు, విద్యుత్ తదితర శాఖల ప్రతినిధులుండాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నందున ఖర్చుకు వెనకాడకుండా పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అని కేసీఆర్ ఆదేశించారు. జిల్లాలవారీగా పరిస్థితిపై ఆరా.. జిల్లాలవారీగా వర్షాల పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘గోదావరికి భారీ వరద వచ్చే అవకాశం ఉన్నందున ఏటూరునాగారం, మంగపేట మండలాలతోపాటు పరీవాహక ప్రాంతంలోని ముంపు గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భద్రాచలం పట్టణంలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టలు పటిష్టంగా తయారు కావడంతో నిలువ సామర్థ్యం పెరగడంతో బుంగలు పడకుండా నివారించగలిగాం. ఇంకా పనులు చేపట్టని కొన్ని చిన్న కుంటలకే నష్టం జరిగింది. చెరువులకు మరింత వరద వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి’ అని సీఎం సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు.. ‘విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడటమే అత్యంత ముఖ్యమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. ముంపు ప్రమాదంపై అధికార యంత్రాంగానికి ప్రజలు సమాచారం ఇవ్వాలి. కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లు, కాజ్‌వేల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి భోజనం, ఇతర వసతులు, కోవిడ్ రక్షణకు మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానికంగా ఉంటూ సహాయ చర్యలు పర్యక్షించాలి. వానలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేయాలి. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు పట్టణాలు, గ్రామాల నుంచి నివేదికలు తెప్పించుకొని నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం ‘భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాన్ని అధికార యంత్రాంగం రూపొందించుకోవాలి. ఏ స్థాయిలో వర్షం వస్తే ఎక్కడ ఎంత నీరు వస్తుంది? ఏ నదికి ఎంత వరద వస్తుంది? అప్పుడు ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది వంటి అంశాలను అధ్యయనం చేయాలి. భారీ వర్షాలు పడినా లోతట్టు ప్రాంతాలను ఎలా కాపాడాలి? ఎక్కడెక్కడ రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఉంది వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వ్యూహం ఖరారు చేయాలి. అన్ని పట్టణాల్లో మున్సిపల్, పోలీసు విభాగాలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి వెంటనే రంగంలోకి దిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్‌షీట్ తయారు చేసి నదులు పొంగినప్పుడు తలెత్తే పరిస్థితులను నమోదు చేయడంతోపాటు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులతోపాటు ఇతర వ్యా«ధులపై వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యుత్ సిబ్బందికి అభినందన... ప్రకృతి విపత్తు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడటంతోపాటు గ్రిడ్ ఫెయిల్ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్ సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. ‘ఉమ్మడి ఏపీలోనూ లేని రీతిలో ఈ ఏడాది తెలంగాణలో 13,168 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే ఏడాది ఓ సందర్భంలో 4,200 మెగావాట్ల అత్యంత కనిష్టానికి కూడా విద్యుత్ డిమాండ్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రిడ్ కుప్పకూలకుండా తెలంగాణ విద్యుత్ సంస్థలు పనిచేశాయి’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ శాఖ సైతం హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారీ నష్టం కలగకుండా చర్యలు తీసుకుందన్నారు. -
ముంచెత్తిన వాన
-
శాంతిస్తున్న గోదావరి
మూడు రోజులుగా ఏజెన్సీ, కోనసీమ ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గోదావరి వరద మంగళవారానికి కొంత శాంతించింది. నిన్నటి వరకూ వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆందోళన చెందిన బాధితులకు అధికార యంత్రాంగం అందించిన చేయూత భరోసానిచ్చింది. సాక్షి, అమలాపురం : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచెత్తిన వరద గోదావరి తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించి దేవీపట్నం, విలీన మండలాల్లోని దాదాపు 56 గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. మూడు నదీపాయలతో 50కి పైగా లంక గ్రామాలతో ఉన్న కోనసీమ వరద ఉధృతికి గత మూడు రోజులుగా అతలాకుతలమవుతోంది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటిమట్టం మూడు అడుగుల మేర తగ్గడంతో జిల్లా ఏజెన్సీ ప్రజలు వరదల భయం నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. కోనసీమ దిగువన అంటే సముద్ర తీరంలో ఉండడంతో ఎగువన వరద నీరంతా చివరకు ఈ సీమ నుంచే సముద్రంలో కలిసే పరిస్థితి ఉండడంతో ఈ ప్రాంతంలోని 48 లంక గ్రామాలు వరద ఉధృతితో మంగళవారం రాత్రి వరకూ చిగురుటాకుల్లా అల్లాడిపోతూనే ఉన్నాయి. ప్రజలు వదర భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏటిగట్లపై పాడి పశువులతో పాటు వచ్చి వాటికి కాపలాగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ⇔ మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే, అయినవిల్లి మండలం తొగరపాయ ఎదురుబిడిం వద్ద కాజ్‌వేలు వదర నీటితో పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలలు నిలిచిపోయాయి. ⇔ పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఊడిమూడి లంక, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, కమిని తదితర 17 లంక గ్రామాల ప్రజలు వేరే దారి లేక పడవలపైనే ప్రమాదం అంచున ప్రయాణాలు చేస్తున్నారు. ⇔ ధవళేశ్వరం బ్యారేజి నుంచి మంగళవారం మధ్యాహ్నం తర్వాత 2 గంటలకు 14,59,000 క్యూసెక్కుల వరద నీరును సముద్రంలోకి వదిలితే... అదే రాత్రి 7 గంటలకు కాస్త శాంతించడంతో 11,39000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ⇔ కోనసీమలో బుధవారం కూడా వరద పరవళ్లు తప్పవు. ఎందుకంటే ఎగువ వరద నీటి ప్రవాహం మంగళవారం రాత్రి నుంచి తెల్లారే దాకా కూడా దిగువకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వరద ప్రభావం బుధవారం కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో వదర నీరు తగ్గుతూ మరో మూడు రోజుల తరువాతగానీ సాధారణ పరిస్థితికి రాదు. వరద నుంచి బయటపడుతున్న 56 ఏజెన్సీ గ్రామాలు వరదలకు ఏజెన్సీలోని దేవీపట్నం, చింతూరు మండలాల్లో తీవ్రత ఎక్కువగా కనిపించింది. దేవీపట్నం మండలం తొయ్యేరు, పూడిపల్లి, పెనికలపాడు, మంటూరు తదితర గ్రామాలను గోదావరి ముంచెత్తడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మండలంలో 36 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. గండిపోశమ్మ ఆలయం వద్ద వరద నీరు ముంచెత్తడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటిలో మునిగింది. పూర్తిగా నీట మునిగిన అమ్మవారి విగ్రహం ఇంకా బయటపడ లేదు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టడంతో బుధవారం నాటికి దేవీపట్నం వీధుల్లో వరద నీరు తగ్గే అవకాశం ఉంది. ఇక చింతూరు మండలంలోని 20 గ్రామాలను వదర నీరు చుట్టు్టముట్టింది. మంగళవారం తగ్గుముఖంగా అయిదు గ్రామాల నుంచి గోదావరి జలాలు వెనక్కి మళ్లడంతో ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. మిగిలిన 15 గ్రామాలు ఇంకా వరద నీటి దిగ్భంధంలోనే ఉన్నాయి. బుధవారం ఉదయానికి ఈ గ్రామాలను చుట్టుముట్టిన నీరు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రుల బృందం సందర్శన, పర్యవేక్షణ రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, తానేటి వనిత, పినిపే విశ్వరూప్‌తోపాటు జిల్లా ఎంపీలు భరత్, అనురాధ, గీత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కూడా మంత్రుల బృందంతో ఉండి జిల్లా వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. కొనసాగుతున్న నిఘా గోదావరి వరద కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తతతోనే వరద ప్రభావిత గ్రామాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు, సమాచారం ఇస్తున్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతోపాటు పోలీసు, అగ్ని మాపక, విద్యుత్తు తదితర శాఖల అధికారులు, వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు తగు సూచనలిస్తున్నారు. పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లిలో నీట మునిగిన అంగన్వాడీ భవనం గండి పోశమ్మఆలయం వద్ద వరద గోదావరి -
వీడని ముంపు
రెండు నెలల్లో వరుస వరదలు...జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటున్నా పైన కురిసిన వర్షాల కారణంగా వరద నీరు వీధుల్లోకి,ఇళ్లల్లోకి రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం, కోనసీమ మండలాల్లో ఈ ముంపు ముప్పు వెంటాడుతోంది. సాక్షి, రాజమహేంద్రవరం : వరద గోదావరి ఉగ్రరూపంతో మన్యంలో గిరిజనులు, కోనసీమలోని లంకవాసులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఈ సీజన్లో మూడోసారి వరదలు రావడంతో జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఎగువన కురుస్తున్నభారీ వర్షాలకుతోడు నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లాపై ప్రభావం చూపిస్తున్నాయి. వరుస వరదలతో ముంపులో ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా అనాలోచితంగా నిర్మించిన కాఫర్ డ్యామ్ రంపచోడవరం ఏజెన్సీలోని దేవీపట్నం పరిసర గ్రామాలను వరదతో ముంచేసింది. రెండు రోజులుగా వరద నీటిలో నానుతున్న మన్యం వాసుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం సాయంత్రానికి ఎగువన భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినా మంగళవారం మధ్యాహ్నం వరకూ జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితే కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను వరద ముంపు మరో 24 గంటల వరకూ వీడేలా లేదు. ఉదయం నుంచి ఉగ్రరూపం దాల్చిన వరద గోదావరి సాయంత్రం శాంతించి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద 51.2 అడుగుల వద్దకు చేరిన నీటి మట్టం సోమవారం సాయంత్రం నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 47.90 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకోగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ఉపసంహరించే అవకాశం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నుంచి 14లక్షల 81వేల 674 క్యూసెక్కులు మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ 2479 టీఎంసీల మిగులు జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. సోమవారం ఒక్క రోజు సముద్రంలోకి వృథాగా పోయిన 128 టీఎంసీల నీటితో ఒక ఖరీఫ్ లేదా, ఒక రబీ పంటను జిల్లాలో సాగుచేసుకోవచ్చు. ఇది పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంతో సమానం. ఏజెన్సీలో... దేవీపట్నం ప్రధాన రహదారి నీట మునిగింది. చినరమణయ్యపేట–దేవీపట్నం, దండంగి–పురుషోత్తపట్నం రోడ్లు ముంపులో ఉండటంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోసమ్మగండి వద్ద అమ్మవారి మండపాన్ని తాకుతూ వరద గోదావరి ప్రవహిస్తుంది. అమ్మవారి విగ్రహం పూర్తిగా మునిగిపోయింది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 ఇళ్లు వరద నీటిలో చిక్కుకోవడంతో 2500 కుటుంబాలు ముంపులో ఉన్నాయి. ఈ గ్రామాల్లో 22 పాఠశాలలు మూతపడ్డాయి. రెవెన్యూ అధికారులు భోజనా లు వెలుగు సిబ్బంది ద్వారా వరద బాధితులకు పంపిణీ చేశారు. సెక్టోరియల్ అధికారులు పరిస్ధితిని సమీక్షిస్తూ వరద బాధితులకు మంచినీటి ప్యాకెట్లు, ఆహార పదార్ధాలు పంపిణీ చేశారు. రంపచోడవరం మండలం బొర్నగూడెం వసతిగృహానికి రావాలని నిర్వాసితులను అధికారులు కోరగా బాధితులు అంత దూరం రాలేమని దేవీపట్నం శివాలయం, హైస్కూల్, వీరవరం మండల కార్యాలయం వద్ద కొందరు ఉండిపోయారు. మూలపాడు, అగ్రహారం, పెనికలపాడు, కచ్చులూరు. ఏనుగులగూడెం, గానుగులగొంది తదితర గ్రామాల గిరిజనులు కొండలపై సురక్షితంగా తలదాచుకున్నారు. చింతూరు వద్ద శబరి నదికి గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో చింతూరు–వీఆర్ పురం, ఆంధ్రా–ఒడిశాల మధ్య రహదారులు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 17 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. శబరి వద్ద నీటిమట్టం 38 అడుగులు వద్ద నిలకడగా ఉంది. వరద నీరు రోడ్డుపైకి రావడంతో కూనవరం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లంకల్లో పంటలకు దెబ్బమీద దెబ్బ... వరదలు లంక రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒక్క కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2,500 ఎకరాల లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఊబలంక, రావులపాలెం, కొమరాజులంక, వశిష్ట గోదావరి చేరి ఉన్న ఎల్ పోలవరం, పొడగట్లపల్లి, గోపాలపురం గ్రామాల్లో అరటి, కంద, కూరపాదులకు తీరని నష్టం కలిగింది. ఆలమూరు మండలం బడుగువానిలంక చుట్టూ వరదనీరు చేరింది. మడికి, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, చొప్పెల్ల గ్రామాల పరిధిలోని సుమారు 500 ఎకరాల్లోని లంకభూముల్లో ఉద్యాన పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక, వద్దిపర్రు, రాజవరం, ఆత్రేయపురం, వెలిచేరు, వాడపల్లి, వానపల్లి శివారు నారాయణలంక, సత్తెమలంక, నక్కావారిపేట, మందపల్లి, వాడపాలెం, కేదార్లంకల్లో సుమారు 500 ఎకరాల్లో అరటి, కంద, పసుపు, బొప్పాయి పంటలు నీటమునిగాయి. కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక శివారు పల్లపులంక, నారాయణ లంకలలోని పొలాలు మునిగిపోగా కేదారిలంక ఇటుక బట్టీలు నీటమునిగాయి. కె .గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీ నీటమునిగి సుమారు 50 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. కోటిపల్లి–ముక్తేశ్వరం పంటు ప్రయాణాన్ని నిలిపివేయగా, కోటిపల్లి నుంచి మసకపల్లి, బ్రహ్మపురి వరకు ఏటిగట్టు లంకభూముల్లో ఉన్న బొప్పాయి, అరటి, కొబ్బరి తోటల నీటమునిగాయి. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. మానేపల్లి శివారు శివాయిలంక, పల్లెపాలెం, ఏనుగుపల్లిలంక, మొండెపులంక, అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పెదపట్నం గ్రామాలతోపాటు పాశర్లపూడి, పాశర్లపూడిలంక గ్రామాల్లో ప్రజలు వరదతో ఇబ్బంది పడుతున్నారు. అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, పొట్టిలంక, కొండుకుదురులంక, శానపల్లిలంక, తొత్తరమూడి కె.పెదలంక, చింతనలంక, మడుపల్లెలంక ప్రాంతాల ప్రజలు వరదతో అవస్థలు పడుతున్నారు. -
ప్రళయ గోదావరి!
జలప్రళయమొచ్చినట్టుగా గోదావరి ఉప్పొంగి పోతోంది. ఇరుతీరాలనూ ఏకం చేస్తూ.. ఒడ్డున ఉన్న గ్రామాల్లోకి ఉరకలెత్తి ముంచెత్తుతోంది. ఉపనదులైన సీలేరు, శబరి, ఇంద్రావతి పొంగి ప్రవహిస్తూండడంతో.. వాటి నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి గంటగంటకూ తీవ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద 51 అడుగులకు నది నీటిమట్టం చేరింది. పోలవరం కాఫర్ డ్యామ్ పాపంతో దేవీపట్నాన్ని వరద ముంచెత్తింది. అక్కడి నుంచి దిగువకు ఉరుకుతూ ధవళేశ్వరం బ్యారేజీని దాటుకొని వడివడిగా కడలి దరికి పరుగు తీస్తోంది. ఆ మార్గంలో ఉన్న కోనసీమ లంకల్నీ ముంచెత్తుతోంది. దీంతో నదీ తీర గ్రామాల ప్రజలు ప్రచండ మారుతంలో గడ్డిపోచల్లా గజగజా వణికిపోతున్నారు. మరోసారి భారీ వరద ముప్పు తలెత్తడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం టౌన్) : ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు వచ్చిన వరదలు మిగిల్చిన నష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే.. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద నీటితో జిల్లాలో జలప్రళయం సృష్టిస్తోంది. ఫలితంగా జిల్లాలోని మొత్తం 86 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువన ఉన్న ఏజెన్సీ, విలీన మండలాలతో పాటు దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరింది. సోమవారానికి ఇది 55 నుంచి 58 అడుగులకు చేరవచ్చని భావిస్తున్నారు. భద్రాచలం వద్ద అర్ధరాత్రికల్లా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవీపట్నం.. అతలాకుతలం నెల రోజుల వ్యవధిలో గోదావరికి మూడుసార్లు వచ్చిన వరద దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు గ్రామాలను అతలాకుతలం చేసింది. గురువారం నుంచి పెరుగుతూ వచ్చిన గోదావరి ఆదివారం ఉదయానికి దేవీపట్నం గ్రామాన్ని ముంచేసింది. ఇప్పటివరకూ దేవీపట్నం చుట్టూ పంటపొలాల్లోకి మాత్రమే చేరిన వరద నీరు ఆదివారం గ్రామంలోకి చొరబడింది. సాయంత్రానికి సుమారు నాలుగు అడుగులు పెరిగి గ్రామం మొత్తం జలమయమైంది. దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, ఏనుగులగూడెం, గానుగులగొంది, అగ్రహారం, మూలపాడు, పోశమ్మ గండి గ్రామాలకు చెందిన వరద బాధితులు పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నాలుగు రోజులుగా మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మూడు రోజుల నుంచి 18 పడవలతో 85 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి ఎక్కువవడంతో బాధితులు ఆందోళనతో పడవల కోసం నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయానికి దండంగి వాగు పోటు గ్రామాన్ని తాకింది. గ్రామంలో ఎస్సీ కాలనీలో పలు ఇళ్లు నీట మునిగాయి. పోశమ్మ గండి వద్ద అమ్మవారి ఆలయంలోకి వరద నీరు చొచ్చుకు పోయింది. అమ్మవారి విగ్రహం సగభాగం వరకూ వరద నీరు ప్రవహిస్తోంది. పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద ఆదివారం సాయంత్రానికి 27.4 అడుగులకు నీటిమట్టం చేరింది. కాఫర్ డ్యామ్‌కు ఇరువైపుల నుంచీ వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పై నుంచి భారీ స్థాయిలో వరదనీరు పోతున్నప్పటకీ ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో బ్యాక్ వాటర్ కారణంగా వరద పోటు ఎక్కువైంది. గత నెలలో వచ్చిన వరదల కంటే ఎక్కువ స్థాయిలో వరద నీరు గోదావరికి చేరనుండడంతో వచ్చే మూడు రోజుల పాటు దేవీపట్నం వద్ద వరద ఉధృతి మరింత ప్రమాదకర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆదివారం దేవీపట్నం గ్రామం మొత్తాన్ని ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దేవీపట్నం జాలరిపేట పరిసర ప్రజలు ఉమాచోడేశ్వరస్వామి ఆలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వీరవరం మండల కార్యాలయం వద్దకు తరలివెళ్లారు. దేవీపట్నం ఎగువన మంటూరు, తున్నూరు, కొండమొదలు, కచ్చులూరు, గొందూరు తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆయా గ్రామాలకు నియమించిన సెక్టోరియల్ అధికారులు సహాయ చర్యలు అందించేందుకు తరలి వెళ్లారు. ఆదివారం వరద పోటు ఎక్కువై చినరమణయ్యపేట నుంచి వీరవరం వరకూ రహదారి పైకి వరద నీరు చేరింది. రంపచోడవరం ఆర్డీవో శ్రీనివాసరావు ఆదివారం దేవీపట్నం, వీరవరం, తొయ్యేరుల్లో పర్యటించి, వరద పరిస్థితిని సమీక్షించారు. శివాలయం వద్ద తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. బోర్నగూడెం వసతి గృహానికి తరలిరావాలని కోరినప్పటికీ అక్కడ సురక్షితంగానే ఉన్నామని బాధితులు తెలిపారు. కోనసీమ లంకలకు వరద పోటు గోదావరికి వరద పోటెత్తడంతో కోనసీమలోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీపాయలు, లంక గ్రామాలతో ఉండే కోనసీమ ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద ప్రభావిత మండలాలుగా ఉన్న సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సాధారణంగా ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక సమయానికే దాదాపు 50 వరకూ కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధానికి చేరువలో ఉంటాయి. ఇక రెండో ప్రమాద హెచ్చరిక రాగానే ఆ 50 లంక గ్రామాల పరిస్థితులు మరీ దయనీయంగా మారుతాయి. ఆదివారం సాయంత్రానికే అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లోని అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, జి.పెదపూడి లంక, బూరుగులంక, అరిగెలవారి లంక, ఊడిమూడిలంక, లంక ఆఫ్ ఠానేలంక, కమినిలంక, గురజాపులంక, సలాదివారిపాలెం తదితర 16 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద కాజ్వే ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఆ మండలంలోని అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాలకు, బయటి ప్రపంచానికి రాకపోకలు తెగిపోతాయి. రాజోలు దీవిలోని అప్పనరామునిలంక, సఖినేటిపల్లి లంక, రామరాజులంక, మధ్యలంక తదితర గ్రామాల్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. పి.గన్నవరం మండలంలో ఇప్పటికే బూరుగలంకను వరద చుట్టిముట్టింది. వరద ఉధృతి పెరుగుతూండడంతో జి.పెదపూడిలంక రేవులో రాకపోకలను ఆదివారం సాయంత్రం నుంచే నిలిపివేశారు. అయినవిల్లి మండలం శానపల్లిలంక – కె.గంగవరం మండలం కోటిపల్లి మధ్య గౌతమి నదిలో వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ నదీపాయపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులను నిలిపివేశారు. రాత్రి సమయంలో అమాంతం వరద నీరు చుట్టిముట్టినా తమ పశువులకు ఎలాంటి ప్ర మాదం లేకుండా కొన్ని లంక గ్రామాల ప్రజలు ముందు జాగ్రత్తగా వాటిని సురక్షిత ప్రాంతాల కు తరలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కోనసీమలోని అన్ని మండలాల అధికారులనూ ఇప్పటికే అప్రమత్తం చేశామని అమలాపురం ఆర్డీవో బి.వెంకటరమణ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండి రాత్రంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి తక్షణ సమాచారం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు కూడా మండలాల్లో ఉండి వరద రక్షణ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తెల్లారేసరికి ధవళేశ్వరం వద్ద కూడా అదే హెచ్చరిక జారీ చేసే అవకాశాలుంటాయన్న ఉద్దేశంతో మరింత అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెంకటరమణ తెలిపారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు 11.75 అడుగులకు నీటిమట్టం చేరడంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటగంటకూ పెరుగుతూ రాత్రి 9 గంటలకు 12.90 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుంచి 11,43,206 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8,700 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం సోమవారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరే అవకాశం ఉందని ఫ్లడ్ కన్జర్వేటర్, హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు తెలిపారు. వరదలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా.. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు భారీగా పెరుగుతూండడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 9 గంటలకు 50.90 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూండటంతో గోదావరి నీటిమట్టాలు భారీగా పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.77 మీటర్లు, పేరూరులో 14.86 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.38 మీటర్లు, కూనవరంలో 18.83 మీటర్లు, కుంటలో 10.97 మీటర్లు, కొయిదాలో 22.24 మీటర్లు, పోలవరంలో 13.28 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.62 మీటర్ల మేర నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
నిడదవోలు: గోదావరి ఎగువన భారీ వర్షాలు కురువడంతో గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరిగినట్లు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తీవ్రతను పర్యవేక్షిస్తున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు స్పష్టం చేశారు. దాంతో ముంపు ప్రాంత మండలాల అధికారులను, సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజల సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కమిషనర్ సూచించారు. వినాయక నిమజ్జానికి నదకి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వరల నీటీలో ఈతకు వెళ్లడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయవద్దన్నారు. బోటు, మోటారు బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. వరద ఉధృతి క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో రేపు దవళేశ్వరం వద్ద రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. -
మళ్ళీపెరుగుతున్న గోదావరి
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : గోదావరి ఎగువన మహారాష్ట్ర, ఇంద్రావతి, శబరి ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో మళ్ళీ గోదావరి పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం 21 అడుగులు ఉండగా మంగళవారం రాత్రి 8 గంటలకు 25.10 అడుగులకు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రాత్రి 8 గంటల సమయంలో 10.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. గోదావరి విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్ బ్యారేజీల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యారేజీల 175 గేట్ల ద్వారా మంగళవారం 2,74,241 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి గోదావరిలోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు చేరతాయని ధవళేశ్వరం హెడ్ వర్క్స్ ఈఈ మోహనరావు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు రైతుల సాగు నీటి అవసరాల కోసం జలవనరుల శాఖాధికారులు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. జిల్లాలో వర్షాలు కురవడంతో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమ డెల్టాకు 6,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మధ్య డెల్టాకు 2,000 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 3,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో ఏలూరు కాలువకు 1,124 క్యూసెక్కులు, తణుకు కాలువకు 632, నరసాపురం కాలువకు 1,704 ,అత్తిలి కాలువకు 5,99 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,809 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
పొంగి కృశిం‘చేను’
గోదావరి వరదలకు జిల్లాలో వరి పంటతోపాటు ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. లంక గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో వేసిన ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం నష్టం అంచనాలో నిమగ్నమైంది. ముంపు మండలాల్లో ప్రభుత్వం సేకరించిన భూముల్లో కూడా ఈ ఏడాది పంటలు వేశారు. అవి కూడా దెబ్బతిన్నాయి. వీటికి కూడా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాక్షి, పశ్చిమగోదావరి : గత నెల 31 నుంచి గోదావరికి వరద సంభవించింది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గంట గంటకూ వరద హెచ్చుతగ్గులతో రైతులు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ వరద తగ్గుముఖం పట్టినా పంటలను భారీగా ముంచింది. జిల్లా వ్యాప్తంగా గోదావరి తీర ప్రాంత రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సమాయత్తమయ్యారు. ఎగువన ఉన్న కుక్కునూరు మండలం నుంచి వేలేరుపాడు, పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల వరకూ గోదావరి పరీవాహక ప్రాంతంలో వరి, కూరగాయలు, పత్తి, అరటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రకృతి గోదావరి వరద రూపంలో కన్నెర్ర చేసింది. నదీపరీవాహక ప్రాంతంలో రైతులను నష్టలపాలు చేసింది. మరో అడుగుమేర వరద పెరిగినా మరింత భారీస్థాయిలో పంటలు నష్టపోవాల్సి వచ్చేదని అధికారులు చెబుతున్నారు. అధికారులు అప్రమత్తం వరద ప్రారంభం నుంచే జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ గౌసియాబేగం వరద ప్రాంతాల్లో పర్యటించారు. పంటల వివరాలను ప్రాథమికంగా అంచనా వేసేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ దుర్గేష్ ఉద్యానవన పంటల నష్టాల అంచనాకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రోజూ పంటలు ఏ మేర నష్టపోవాల్సి వస్తుందో అంచనాకు వచ్చారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీరు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పంట చేల నుంచి బయటకు వెళ్లకపోవడంతో నష్టం అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్యాన, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నరసాపురం రెవెన్యూ డివిజన్లోని మండలాల్లో ఇంకా ముంపు బారినే పంటలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల రైతులకు కష్టం పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో రైతుల వద్ద నుంచి భూసేకరణ చేపట్టారు. అయితే వారిని ఇంకా అక్కడి నుంచి తరలించలేదు. దీంతో ప్రభుత్వం సేకరించిన భూముల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో వరద వల్ల అక్కడి రైతులు పంటలను నష్టపోయారు. ఈ ప్రాంతాల్లోనూ అధికారులు నష్టాలను నమోదు చేశారు. వీరికి నిబంధనల ప్రకారం.. ఎటువంటి సాయం అందదు. అయితే ఇటీవల ఏరియల్ రివ్యూ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కలెక్టర్ ముత్యాలరాజు ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. దీంతో వారికి కూడా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నష్టపోయిన రైతులకు వెంటనే విత్తనాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంట నష్టాలు ఇలా... జిల్లాలో అరటి 190 హెక్టార్లు, కూరగాయలు 62 హెక్టార్లలో, బొప్పాయి 8 హెక్టార్లలో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 105.8 హెక్టార్లలో 1,587 మంది రైతులు వరినారుమళ్లు నష్టపోగా 183.8 హెక్టార్లలో వరి సాగుకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కుక్కునూరు మండలంలో పత్తి 800 హెక్టార్లలో, వేలేరుపాడు మండలంలో 20 హెక్టార్లలో వరి నారుమళ్లు, 100 హెక్టార్లలో వరిసాగు, పోలవరం మండలంలో 182 హెక్టార్లు వరి నారుమళ్లకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు అంచనాలు సిద్ధం చేశారు. అయితే ఈ నష్టం రెండింతలు ఉండవచ్చని సమాచారం. నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే అసలు నష్టం ఎంత అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
వరద మిగిల్చిన వ్యధ
పది రోజుల కిందట వరుణుడు తోడుగా ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ నీటిజడి పెరుగుతూ.. తగ్గుతూ ఏజెన్సీ, కోనసీమ లంక వాసులను భయాందోళనకు గురిచేసింది. సోమవారం నాటికి వరద ముంపు వీడడంతో ఏజెన్సీ గ్రామాలు...కోనసీమ లంకలవాసులు ఊపిరి పీల్చుకున్నా పేరుకుపోయిన బురదతో బెంబేలెత్తుతున్నారు. ఏజెన్సీలో రహదారుల మీద... కోనసీమ లంకల్లో కాజ్వేలపైన ముంపు వీడడంతో రాకపోకలు ఆరంభమై సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గినా అది తీసుకువచ్చిన బురద ప్రభుత్వ యంత్రాంగానికి, స్థానికులకు పెద్ద సవాలుగా మారింది. పారిశుద్ధ్య చర్యలు పెద్ద ఎత్తున చేపట్టకపోతే అంటు రోగాల బారిన పడే ప్రమాదముందని వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. విలీనమండలాలు వి.ఆర్.పురం, కూనవరం, ఎటపాకతోపాటు దేవీపట్నం మండలాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం కాఫర్ డ్యామ్ వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా 36 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న దేవీపట్నం మండలం నెమ్మదినెమ్మదిగా తేరుకుంటోంది. ఈ మండలంలో వరద పూర్తిగా తగ్గింది. మండల కేంద్రమైన దేవీపట్నం, పూడిపల్లి వెళ్లేందుకు మార్గాలు ఏర్పడలేదు. ఎగువున మంటూరు, పెంకులుపాడు, మూలపాడు వంటి గ్రామాలకు రాకపోకలు ఆరంభం కాలేదు. గోదావరి వరదతోపాటు కొట్టుకువచ్చిన వ్యర్ధాలు బురదకు తోడవడంతో స్థానికులు తలపట్టుకుంటున్నారు. దేవీపట్నంలో శివాలయం, ఉన్నత పాఠశాల, వీరవరంలో తహసీల్దార్ కార్యాలయం, రంపచోడవరం గొర్నగూడెం హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల గ్రామాలకు ఆహారం సరఫరా చేస్తున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వెళ్లి చాలా మంది పరిసరాలను శుభ్రం చేసేపనిలో పడ్డారు. వీరితోపాటు అధికార యంత్రాంగం కూడా పారిశుద్ధ్య చర్యల్లో తనమునకలైంది. పోచమ్మగండి గ్రామం ముంపు నుంచి బయటపడింది. వీఆర్.పురం, చింతూరు, కూనవరం మండలాల్లో వరదల వల్ల 28 గ్రామాలు వరద నీటిలో చిక్కుకోగా ఇప్పుడు రోడ్లన్నీ ముంపు నుంచి బయటపడ్డాయి. కానీ తోకిలేరువాగు నుంచి వచ్చిన బురద రోడ్డుపై పేరుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. కోనసీమలో ఊరట కోనసీమలంకలు కూడా ముంపుబారి నుంచి బయటపడుతున్నాయి. ముక్తేశ్వరం వద్ద ఎదురుబిడియం కాజ్వే, మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేలు వరద ముంపు నుంచి బయట పడ్డాయి. దీంతో ఈ కాజ్‌వేలపై వాహనాల రాకపోకలు ఆరంభమయ్యాయి. ఈ నెల నాల్గో తేదీ నుంచి ఈ కాజ్‌వేలపై వరద నీరు చేరడంతో ఎక్కువ రోజులు పడవల మీదనే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. పి.గన్నవరం మండలం కనకాయిలంక కాజ్‌వేపై ఇంకా రెండు అడుగులు ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ఈ మండలంలో మానేపల్లి శివారు శివాయలంక ఇంకా ముంపులోనే ఉంది. అల్లవరం మండలం బోడసుకుర్రు నదీ తీరంలో వరద పూర్తిగా తగ్గింది. నదిని ఆనుకుని ఉన్న స్థానిక మత్స్యకార కాలనీతోపాటు పలు ఇళ్లు ముంపునుంచి బయటపడ్డాయి. ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక వంటి గ్రామాలు వరద నుంచి బయటపడ్డాయి. గోదావరి మధ్య ఉండే సలాదివారిపాలెం, కమిని వంటి గ్రామాలకు, అలాగే పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఉడుమూడిలంక, అరిగెలవారిలంక, బూరుగలంక గ్రామాలు గోదావరి మధ్యనే ఉంటాయి. ఇక్కడ వరద తగ్గడంతో సాధారణ పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. -
హమ్మయ్య..!
ఒకటి కాదు.. రెండు కాదు తొమ్మిది రోజులుగా మహోగ్రరూపమెత్తిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఇటు గోదావరి, అటు శబరి పోటెత్తడంతో విలవిలలాడిన ఏజెన్సీ వాసులు నెమ్మదిగా తేరుకుంటున్నారు. వరద ఉధృతి తగ్గుతున్నా కోనసీమ లంకలను ఇంకా ముంపు వీడలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం రాత్రి ఏడు గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 10.80 అడుగులకు తగ్గింది. సాక్షి, తూర్పుగోదావరి : ఈ నెల 2న మొదలైన గోదావరి వరద ఉధృతికి ఏజెన్సీ, కోనసీమ లంకల్లోని వందల ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వరద నీటిలో రోజుల తరబడి ఉండడంతో పలుచోట్ల ఇళ్లు నానిపోయి కుప్పకూలిపోతున్నాయి. ప్రభుత్వం పక్కాగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టడంతో బాధితులకు సాంత్వన చేకూరింది. ఆర్థిక సహాయం ప్రకటించడంతో సామాన్యులు, నిరుపేదలు, మత్స్యకారులకు, రైతులకు ఊరట కలిగింది. అయినప్పటికీ రోజుల తరబడి ముంపులో ఉండడంతో ఏజెన్సీ, లంక వాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. సోమవారం సాయంత్రం తరువాత కానీ ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా ముంపులోనే దేవీపట్నం ఏజెన్సీలో గోదావరి వరద తగ్గుముఖం పట్టినా కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో రాకపోకలు పూర్తిస్థాయిలో ఆరంభం కాలేదు. దేవీపట్నం కూడా ఇంకా ముంపులోనే ఉంది. ఇక్కడ వరద ఉధృతి చాలావరకూ తగ్గింది. మండల పరిధిలోని తొయ్యేరు చప్టా, దండంగి, వీరవరం వద్ద రహదారులు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఫలితంగా మండల పరిధిలోని గ్రామాల మధ్య రాకపోకలు పునరుద్ధరణ జరగలేదు. ఇళ్లలో చాలావరకూ నీరు తీసింది. తొమ్మిది రోజులుగా ముంపులో ఉన్న పూరిళ్లు నానిపోయి కూలిపోతున్నాయి. దేవీపట్నం మత్స్యకార కాలనీ, తొయ్యేరు, పూడిపల్లి ఎస్సీ కాలనీలను ముంపు వీడలేదు. చాలామంది పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటూండగా, మరికొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఇక్కడ సోమవారం సాయంత్రం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది. గోదావరి తగ్గుముఖం పడుతూండడం, శబరి సాధారణ స్థితికి చేరడంతో విలీన మండలాల్లో రాకపోకలకు మార్గం సుగమమైంది. శనివారం వరకూ 30, 326 జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ముంపు వీడడంతో చింతూరు నుంచి ఆయా ప్రాంతాలకు ఆదివారం రాకపోకలు ఆరంభమయ్యాయి. రోడ్డు మునిగిపోవడంతో చింతూరు మండలం చట్టి వద్ద సుమారు 150 వరకూ లారీలు, బస్సులు నిలిచిపోయాయి. ఇది తెలిసి సుదూర ప్రాంతాలవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించారు. రహదారుల్లో ముంపు వీడిందని తెలియడంతో రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం నుంచి ఆయా రాష్ట్రాలకు వెళ్లే లారీలు, బస్సుల రాకపోకలు నెమ్మదిగా మొదలయ్యాయి. చింతూరు నుంచి వీఆర్ పురం మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా ముంపు తగ్గడంతో రాకపోకలు ఆరంభమయ్యాయి. అయితే వీఆర్ పురంలో కన్నాయిగూడెం – చింతరేవుపల్లి వద్ద వాగు ఇంకా పొంగుతూండడంతో ఎనిమిది గ్రామాల మధ్య రాకపోకలు ప్రారంభం కాలేదు. కూనవరం మండలంలో వరద ప్రభావం చాలావరకూ తగ్గింది. జలదిగ్బంధంలోనే కోనసీమ లంకలు కోనసీమలోని పి.గన్నవరం మండలంలో ఇంకా ఆరు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. కె.ఏనుగుపల్లి రహదారిపై రెండడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికుదురు మండలంలోని మూడు గ్రామాలు ఇప్పటివరకూ బాహ్య ప్రపంచంతో సంబంధాల పునరుద్ధరణకు నోచుకోలేదు. అప్పనపల్లి కాజ్వే వద్ద శుక్రవారం గల్లంతైన ఇద్దరు యువకుల్లో కాకినాడ రూరల్ మండల రేపూరుకు చెందిన షేక్ సమీర్ బాషా (23), పెదపట్నం గ్రామానికి చెందిన షేక్ రెహ్మాన్ అలియాస్ నాని (17) మృతదేహాలను ఆదివారం ఉదయం వెలికి తీశారు. మామిడికుదురు మండలంలోని పలు గ్రామాల్లో పడవల ద్వారా, అప్పనపల్లి ఉచ్చులవారిపేట వెళ్లే రహదారిపై వరద నీరు తగ్గడంతో ట్రాక్టర్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి మండలం ఎదురుబిడిం కాజ్‌వేపై కూడా ఇంకా పడవల పైనే రాకపోకలు జరుగుతున్నాయి. మండల పరిధిలోని ఏడు గ్రామాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అల్లవరం మండలం బోడసకుర్రు కూడా ఇంకా ముంపులోనే ఉంది. ఇక్కడ ఒక అడుగు మాత్రమే వరద తగ్గింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మట్టితో నిర్మించిన మత్స్యకారుల ఇళ్లు కరిగి, కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. మండల వ్యాప్తంగా 114 ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. బోడసకుర్రులో 180 ఎకరాల్లో నారుమళ్లు, వరినాట్లు నీట మునిగాయి. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఇక్కడ ముంపు తగ్గే అవకాశం లేదు. మలికిపురం మండలం రామరాజులంక లోతట్టు ప్రాంతాలు, సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలోను ఇంకా పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, ముమ్మిడివరం మండలాల్లో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. తీవ్రమవుతున్న నదీకోత గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీకోత తీవ్రత ఎక్కువగా ఉంది. ఆలమూరు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో కోత తీవ్రమవుతోంది. వరద పెరిగిన సమయంలోను, తిరిగి తగ్గుతున్న సమయంలోను కోత తీవ్రత అధికంగా ఉందని రైతులు చెబుతున్నారు. వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నదిలో కలిసిపోతున్నాయి. ఆలమూరు మండలం బడుగువానిలంక, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, కమిని, గురజాపులంక, లంకాఫ్ ఠాన్నేల్లంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వంటి ప్రాంతాల్లో కోత తీవ్రత అధికంగా ఉంది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి గోదావరి వరద వీడిన తరువాత రెట్టింపు సమస్యలు ఎదురవుతాయి. బురద పేరుకుపోయిన రోడ్లు, ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువచ్చే వ్యర్థాలు.. ఇళ్ల చుట్టూ ముంపునీరు.. కలుషితమయ్యే భూగర్భ జలాల వల్ల ప్రజలు అంటురోగాల బారిన పడే ప్రమాదముంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పారిశుద్ధ్య చర్యలు పక్కాగా చేపట్టాల్సి ఉంది. -
పెరిగిన వడి... మళ్లీ అలజడి
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగి భయపెడుతోంది. ఇళ్ల చుట్టూ చేరిన వరద నీరు బుధవారం నాటికి మూడు నుంచి నాలుగు అడుగులు లాగేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు పునరావాస చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో వరద ముంపు, తీసుకుంటున్న పునరావాస చర్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు మంత్రుల బృందాన్ని ఏజెన్సీ దేవీపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటించేలా చేసి బాధితులకు భరోసా నింపేలా చేశారు. ఇంతలోనే బుధవారం సాయంత్రానికి మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాఫర్ డ్యామ్‌తో ఎదురైన ముంపు, పోలవరం పునరావాస ప్యాకేజీపై గత చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో నిర్వాసితుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు సీఎం ఆదేశాల మేరకు భారీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బుధవారం ఏజెన్సీలోని ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని మంత్రి వారికి చెప్పి వెళ్లారు. మరోపక్క ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తదితర నిత్యావసరాలను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తున్నారు. నష్టం రూ.5.53 కోట్లుగా అంచనా ప్రాథమికంగా జిల్లాలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టం రూ.5.53 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ⇔ ముమ్మిడివరం నియోజకవర్గం లంక ఆఫ్ ఠాణేల్లంక, గురజాపులంక, కేశనకుర్రు శివారు పొగాకులంక తదితర ప్రాంతాల్లో ముంపు నుంచి బయటపడటంతో ఉపశమనం పొందుతున్నారు. ⇔ గురజాపులంకలో బెండ, ఆనప, వంగ తోటలు ముంపుతో తీవ్రంగా నష్టపోవడం కనిపించింది. గోదావరి ప్రవాహ వేగానికి సుమారు 50 ఎకరాల ముమ్మిడివరం మండలంలోని లంక భూములు కోతకు గురయ్యాయి. ⇔ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం తొర్రేడు, కోలమూరు తదితర గ్రామాల్లోని పంటలు ముంపులోనే ఉన్నాయి. కపిలేశ్వరపురం మండలంలో సుమారు 390 ఎకరాల్లో కూరగాయలు, అరటి, బొప్పాయి పంటలు ముంపుతో దెబ్బతిన్నాయి. ⇔ రాజోలు నియోజక వర్గంలో సుమారు వెయ్యికి పైగా ఇళ్లు ఇప్పటికీ జల దిగ్బంధంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సుమారు పది వేల ఎకరాల్లో వరి చేలు వరద ముంపులో నానుతున్నాయి. ⇔ కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో సుమారు 1500 ఎకరాల్లో అరటి, కంద, పసుపు, బొప్పాయి పంటలతో పాటు పశుగ్రాసం వరదనీటిలో మునిగాయి. ⇔ అల్లవరం మండలం బోడసకుర్రు పరిధిలో వరద ముంపులో 40ఇళ్లు ఉన్నాయి. పల్లిపాలెంలో మత్స్యకారులకు చెందిన 60 ఇళ్లు వరద ముంపులో చిక్కుకున్నాయి. ⇔ పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఊడిమూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ కూడా నాటుపడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి కనిపించింది. మానేపల్లి శివారు చివాయిలంక ప్రజలు నడుంలోతు నీటిలో ప్రయాణం సాగిస్తున్నారు. ముంపులో కాజ్‌వేలు... పాశర్లపూడి ఏటిగట్టు దిగువన జల దిగ్బంధంలో ఉన్న కాజ్వే నుంచి రాకపోకలు పునరుద్ధరించారు. ఇదే మండలం కొర్లగుంట ఏటిగట్టు దిగువన కాజ్‌వేపై ఎనిమిదో రోజు కూడా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. ముక్తేశ్వరం–అయినవిల్లిలంక గ్రామాల మధ్య ఎదురుబిడిం కాజ్‌వేపై ఇంకా రెండడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. పడవల రాకపోకలు నిలుపుదల చేశారు.. ఏజెన్సీలో దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. ఎనిమిది రోజులైనా ఇప్పటికీ రవాణా సౌకర్యాలు పునరుద్ధరించ లేదు. మంత్రులు వచ్చి వెళ్లాక ఏజెన్సీలో సహాయక చర్యలు మాత్రం సక్రమంగానే సాగుతున్నాయి. భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరుకోవడం, శబరి నది ఉధృతి ఎక్కువగా ఉండటంతో దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో ఇంకా వరద ముంపు కొనసాగుతోంది. మంగళవారం నాలుగు అడుగులు తగ్గిన వరద బుధవారం సాయంత్రం మరో అడుగు పెరగడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాంతాల్లో ముంపు కాస్త తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. వారం రోజులుగా సుమారు 4,500 కుటుంబాలు ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం వరద ముంపు తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ స్వల్ప పెరుగుదల నమోదవడంపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎగువన మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న ప్రభావంతో వరద మరోసారి పెరిగేందుకు అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అభిప్రాయపడుతోంది. ఉద్యానవన పంటలకు అపార నష్టం... జిల్లాలో 2510 హెక్టార్లలో ఉద్యావన పంటలు నీట మునిగాయని ప్రాథమికంగా జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పొలవరం, మామిడికుదురు, పి. గన్నవరం, కె గంగవరం మండలాల్లో రూ.2.45 కోట్లు మేర 1563 హెక్టార్లలో కూరగాయలకు, రూ.2.17 కోట్ల మేర 708 హెక్టార్లలో అరటి, రూ.19 లక్షల మేర 104 హెక్టార్లలో బొప్పాయి, రూ.60 లక్షల మేర 80 హెక్టార్లలో తమలపాకులకు, రూ.4.50 లక్షల మేర 30 హెక్టార్లలో పసుపునకు, రూ.7.15 లక్షల మేర 25 హెక్టార్లలో పువ్వులతోటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవి కాకుండా మరో 4వేల 377 హెక్టార్లలో వరి పంటకు నష్టం సంభవించిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. సహాయ చర్యలు ముంపునకు గురైన ప్రాంతాల్లో వరద బాధితుల కోసం 104 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 43 వేల 293 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వరద బాధితుల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, బృందాలు పనిచేస్తున్నాయి. నాలుగు లాంచీలతోపాటు, మరపడవలను వినియోగిస్తున్నారు. ఉరకలేస్తున్న గోదారమ్మ ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): కాటన్‌బ్యారేజీ వద్ద గోదారమ్మ ఉరకలేస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు 11.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతూ ఉదయం 11 గంటలకు 11.75 అడుగులకు చేరుకోవడంతో తిరిగి మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. అక్కడ నుంచి మరింత పెరుగుతూ రాత్రి 7 గంటలకు 12.20 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. కాటన్ బ్యారేజీ నుంచి 10,45,343 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి జలాలు నిలిపివేత సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాల విడుదల నిలిపివేశామని జలవనరులశాఖ డీఈ వెంకట్రావు తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బురద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పై అధికారుల సూచనలతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాల విడుదల నిలిపివేశామన్నారు. -
ఆగని వర్షం.. తీరని కష్టం
సాక్షి, తూర్పుగోదావరి : వరద గోదావరి ఉగ్రరూపం వారం రోజుల తరువాత మంగళవారం నాటికి కాస్త శాంతించినా.. వర్షం మళ్లీ ప్రారంభమవడంతో ఇటు ఏజెన్సీ, అటు కోనసీమలోని పలు ప్రాంతాల ప్రజలు భయాం దోళనల్లోనే ఉన్నారు. కోనసీమలోని లంకల్లో వాణిజ్య పంటలు నీట మునిగి వారం రోజులు దాటిపోవడంతో తీవ్రంగా నష్టపోతామనే ఆందోళనలో రైతులున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, మామిడికుదురు, అల్లవరం, రావుపాలెం, తాళ్లరేవు, కె గంగవరం తదితర మండలాల్లో ఇప్పటికీ వందలాది ఇళ్లు వరద ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా ప్రమాదం పూర్తిగా వీడలేదని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. భద్రాచలంలో రాత్రి 8 గంటలకు గోదావరి నీటిమట్టం 39.10 అడుగులుండగా ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించగా, ధవళేశ్వరంలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అదే ధవళేశ్వరం వద్ద మంగళవారం తెల్లవారుజామున గోదావరి 12.10 అడుగులుండగా సుమారు 12 గంటలపాటు అదే కొనసాగింది. రాత్రి 8 గంటలకు 12 అడుగులుగా నమోదవగా 10.35 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా అటు ఏజెన్సీ, ఇటు కోనసీమలో ముంపు వీడటానికి నాలుగైదు రోజులు పడుతుంది. వరద తీవ్రత ఏజెన్సీ ప్రాంతంతో పాటు కోనసీమ ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. దేవీపట్నం మండలంతోపాటు కోనసీమలోని గోదావరి తీర ప్రాంతాలు, లంక గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలో వరద ఉధృతి తగ్గకపోగా మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా నీటిలో నానుతుండటంతో ఇళ్లు కూలిపోతాయని ముంపు ప్రాంతాల్లో ఉన్న వారు కలవరపడుతున్నారు. కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వరద పరిస్థితి, పునరావాస ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఏజెన్సీలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు బుధవారం వస్తున్నారు. మంత్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి గండిపోశమ్మ ఆలయం మీదుగా దేవీపట్నం వెళతారు. ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలో గోదావరి వరద ఉధృతి తగ్గింది. ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో దేవీపట్నంలో వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఎగువన మహారాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద పూర్తిగా తగ్గుతుందనే నమ్మకం కలగడం లేదని అధికారులు చెబుతున్నారు. భద్రాచలంలో వరద తగ్గుముఖం పట్టినా దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాల్లో ఇంకా నీరు వదల్లేదు. దీంతో వరద బాధితులు పునరావాస కేంద్రాలకే పరిమితమయ్యారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలను పరిశీలించారు. విలీన మండలాల్లో కూడా ఇంకా వరద ముంపు వీడలేదు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కోనసీమలో... కోనసీమలోని కొత్తపేట, రావుపాలెం, ఆలమూరు, కె గంగవరం, ముమ్మిడివరం తదితర మండలాల్లోని లంకల్లో వాణిజ్య పంటలు పూర్తిగా ముంపులో ఉన్నాయి. ముంపు వచ్చి వారం రోజులు గడిచిపోవడంతో పంటలకు తీవ్ర నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురజాపు లంక, కమిని, లంకాఫ్ ఠానేల్లంక తదితర ప్రాంతాల్లో వరద ఉధృతికి లంకలు గోదాట్లో కలిసిపోయాయి. వరద తగ్గితే ఈ కోత మరింత పెరుగుతుందంటున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఊబలంక, రావులపాలెం, కొమరాజులంక, వశిష్ట గోదావరి చేరి ఉన్న ఎల్ పోలవరం, పొడగట్లపల్లి, గోపాలపురం, బడుగువానిలంక చుట్టూ వరదనీరు చేరింది. మడికి, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, చొప్పెల్ల, పిచ్చుకలంక, వద్దిపర్రు, రాజవరం, ఆత్రేయపురం, వెలిచేరు, వాడపల్లి గ్రామాలలో అరటి, కంద, పసుపు, బొప్పాయి పంటలతో పాటు పశుగ్రాసం వరదనీటిలో మునిగిపోయాయి. రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లిలంక, అప్పనరామునిలంక, సఖినేటిపల్లి లాకుపేట, రామరాజులంక, గ్రామాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. సుమారు వెయ్యికి పైగా ఇళ్లు జల దిగ్బంధంలో ఉండటంతో దైనందిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. దిండి, శివకోడు, రాజోలు బాడవలలో పలు నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. పి.గన్నవరం నియోజకవర్గం ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, కె.ఏనుగుపల్లి, మానేపల్లి శివారు చివాయిలంక, జొన్నల్లంక, మొండెపులంక, నాగుల్లంక చివారు కాట్రగడ్డ, అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పెదపట్నం గ్రామాలతో పాటు పాశర్లపూడి, పాశర్లపూడిలంక మత్స్యకార పేట వాసులు, అయినవిల్లి మండల పరిధిలోని వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, పొట్టిలంక, తొత్తరమూడి గ్రామ పరిధిలోని కె.పెదలంక, కొండుకుదురులోని గుణ్ణంమెరక ప్రాంతాల ప్రజలు వరదతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో మత్స్యకారులకు చెందిన 60 ఇళ్లు వరద ముంపులో చిక్కుకున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బాధితులను పరామర్శించారు. ఉగాది నాటికి వరద బాధితులందరికీ ఇళ్లు స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముమ్మిడివరం మండలం గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయల మధ్య ఉన్న లంక గ్రామాలు గోదావరి ఆటుపోట్లు మధ్య తల్లడిల్లి పోతున్నాయి. సలాదివారి పాలెం, శేరిల్లంక గ్రామాలలో సుమారు 40 ఎకరాల విలువైన వ్యవసాయ భూములు నదీకొతకు గురై అండలుగా జారి గోదావరిలో కలిసిపోయాయి. లంకాఫ్ ఠానేల్లంక, గురజాపు లంక గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో గోదావరి పక్కనే ఉన్న ఇళ్లు కొంత మేర పాక్షికంగా దెబ్బతిన్నాయి. లంక భూముల్లో ఉన్న బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అద్దంకివారిలంక, వీధివారిలంక, నారాయణలంక, పల్లపులంక గ్రామాల్లో పంటపొలాలను వరదనీరు చుట్టుముట్టింది. గ్రామాల్లోని పశువులను మెరక ప్రాంతాలకు తరలించారు. అరటి, కూరగాయలు, బొప్పాయితోటలు ముంపు బారిన పడ్డాయి. ధనమ్మమర్రి సమీపంలోని ఇటుకల బట్టీలవరకు వరదనీరు ముంచెత్తింది. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గోదావరి వద్ద ఉన్న జల్లకాలువ గేటు మూసివేయడంతో కాలువలో నీరు వెనక్కి ప్రవహిస్తుంది. తొర్రేడు, కోలమూరు తదితర గ్రామాల్లోని సుమారు 100 హెక్టార్లలో వరిపొలం ముంపునకు గురైంది. ధవళేశ్వరం సాయిబాబాగుడి ఆవకాలువ గేటు మూసివేయడంతో రాజమహేంద్రవరం నగరం నుంచి వచ్చే మురుగునీరు వెనక్కి తన్నడంతో బొమ్మూరు నేతాజీనగర్ ప్రాంతం ముంపులో ఉంది. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం శాంతించగా కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చిన వరద జలాల్లో 7,800 క్యూసెక్కులను డెల్టా కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 10,45,848 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. బుధవారం వరద మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 2,10,312 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 82,661 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 868.6 అడుగుల్లో 135.94 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా నదీ జన్మస్థానమైన మహాబలేశ్వరం పర్వతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల మేరకు ఈ రెండు జలాశయాల నుంచి మంగళవారం సాయంత్రం నీటి విడుదలను నాలుగు లక్షల క్యూసెక్కులకు పెంచారు. బీమా నదిపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిగా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు జూరాల ప్రాజెక్టు మీదుగా శ్రీశైలాన్ని చేరనున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి నాలుగు నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో శ్రీశైలం, ఆ తర్వాత వారం రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండుతాయి. తుంగభద్రలో సోమవారంతో పోల్చితే.. మంగళవారం వరద ప్రవాహం కాస్త పెరిగింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించారు. మంగళవారం ఉదయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 0.226 మిలియన్ యూనిట్లు, భూగర్భ విద్యుత్ కేంద్రంలో 15.703 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. నేడు తీరం దాటనున్న వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని బాలాసోర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తుపానుగా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది. మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సహాయ చర్యలు ముమ్మరం తూర్పుగోదావరిలో వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. ముంపునకు గురైన గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తూర్పు గోదావరి జిల్లాలో 18,809 మందికి 85 సహాయ, పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించింది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 85 వైద్య శిబిరాలను నిర్వహించింది. ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 1,377.5 క్వింటాళ్ల బియ్యం, 10,100 లీటర్ల కిరోసిన్, 5,240 కిలోల కందిపప్పు, 6,967 లీటర్ల పామాయిల్, 6,967 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 420 గ్రామాల ప్రజలు వరదలబారిన పడ్డారు. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో తూర్పుగోదావరి జిల్లాలో 64, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కలిపి మొత్తం 112 గ్రామాలకు రవాణా సదుపాయాలు లేకుండా పోయాయి. 17,737 ఇళ్లు గత 24 గంటలుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు తొమ్మిది వేల ఎకరాల్లోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్ మంగళవారం వరద బాధితులను పరామర్శించారు. వచ్చే ఉగాది నాటికి వరద బాధితులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. -
ఆరో రోజూ...అదే ఆగ్రహం
ఇంటా బయటా నీరు... కాలు బయట పెట్టాలంటే భయం... నిత్యావసర వస్తువులు తెచ్చుకునే వీలులేదు ... తెచ్చినా పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు. బిక్కుబిక్కుమంటున్న బాధితులకు భరోసానిస్తూ వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : జిల్లా వాసులకు అన్నపానీయాలు అందించే జీవనది గోదావరి కొన్ని రోజులుగా ఉరుముతూ...వరద ఉరకలేస్తూ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సోమవారం కొంతమేర తగ్గుముఖం పట్టినా ఎగువ మేడిగెడ్డ నుంచి భారీగా వరద నీరు వస్తుండడం.. భద్రాచలం వద్ద తిరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అటు ఏజెన్సీ గ్రామ వాసులను..ఇటు లంక వాసులను తీవ్ర ఆందోళన గురి చేస్తోంది. వరద సహాయక చర్యలు, బాధితులకు పునరావాస కేంద్రాల ఏర్పాట్లలో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం మంగళవారం నుంచి వరద విపత్తు పెరిగితే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. భద్రాచలం వద్ద 43 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణాలోని మేడిగెడ్డ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ఆ ప్రభావం వచ్చే 24 గంటల్లో జిల్లాపై పడుతుందేమోనని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జిల్లావాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో వరద ఉధృతి తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద 12.50 అడుగులకు తగ్గింది. సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి సుమారు 10.92 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గోదావరి వరద అధికారుల అంచనాకు అందకుండా పోయింది. సోమవారం రాత్రికే రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేయాల్సి వస్తుందని సాగునీటి పారుదల శాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. ఇన్‌ఫ్లో కూడా 14 లక్షలు ఉంటుందని భావించారు. అయితే వారి అంచనాల మేరకు బ్యారేజీ వద్ద వరద లేకపోవడం విషయం కాగా, ఉన్న వరద కొంత తగ్గడం గమనార్హం. పోలవరం వద్ద కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో కొత్త ప్రాంతాలకు వరద విస్తరిస్తోందని, దీనివల్ల బ్యారేజీకు గతం కన్నా తక్కువ సమయానికి వరద వస్తోందని చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి వరద పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ప్రభావం జిల్లాలో తగ్గుతున్నా అటు ఏజెన్సీ, ఇటు కోనసీమ లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. దేవీపట్నం మండలం ముంపు నుంచి నెమ్మదిగా బయటపడుతోంది. ఇక్కడ రెండు అడుగుల మేర నీరు తగ్గింది. గడిచిన నాలుగు రోజులుగా గోదావరి, శబరి నదులు వరదల వల్ల వి.ఆర్.పురం మండలంలో సుమారు 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు సోమవారం కూడా ప్రారంభం కాలేదు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఈసారి వరద ముంపు ఎక్కువగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో భద్రాచలం వద్ద 76 అడుగుల వరద వచ్చినప్పుడు కూడా ఇంత ముంపు లేదని వారు చెబుతున్నారు. ఈసారి మరింత వరద వచ్చే అవకాశముందనే అంచనాలతో నదిని ఆనుకుని ఉన్న గ్రామం కావడంతో ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని పోచమ్మగండివాసులు ఆందోళన చెందుతున్నారు. ముంపు బాధితులకు రంపచోడవరం గొర్రనగూడెం పాఠశాల, వీరవరం వద్ద తహసీల్దార్ కార్యాలయం వద్ద, దేవీపట్నంలో ఉమా చోడేశ్వరస్వామి ఆలయం, దామనపల్లి పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. ముంపులో ఉన్నా కొంతమంది ఇళ్లు వీడి వచ్చేందుకు ముందుకు రాకపోవడంతో భోజనాన్ని పట్టుకుని వెళ్లి అందిస్తున్నారు. ఏజెన్సీతోపాటు కోనసీమలోని మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల పరిధిలో సుమారు 15 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక్కడ రెండు అడుగుల మేర వరద తగ్గింది. గోదావరి మధ్యలో ఉన్న లంక వాసులతోపాటు కాజ్‌వేలు ముంపుబారిన పడడంతో ఏటిగట్టును ఆనుకుని ఉన్న గ్రామాల వాసులు సైతం రాకపోకలకు పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. గడిచిన మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడం, తాజాగా ఎగువన వరద పెరగడంతో తమ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవని లంక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలకు తోడు, కోనసీమలో పలుచోట్ల భారీ వర్షం పడుతుండడం మురుగునీటి కాలువల ద్వారా ముంపునీరు దిగే అవకాశం లేక వరి ముంపు తీవ్రత మరింత పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
గోదారి తగ్గింది..
సాక్షి, ఖమ్మం(చర్ల) : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద ఉధృతి కూడా తగ్గింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురవడంతో గోదావరికి వరదలు వచ్చాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గోదావరికి ఎగువన ఉన్న తాలిపేరు, గుండ్లవాగు, పాలెంవాగు, చీకుపల్లివాగు, గుబ్బలమంగి తదితర వాగుల నుంచి వరదనీరు గోదావరిలో చేరడంతో నది ఉగ్రరూపం దాల్చింది. చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ నుంచి కూడా మూడు రోజుల పాటు వరదనీటిని గోదావరిలోకి విడుదల చేశారు. గురువారం 1.53 లక్షలు, శుక్రవారం 1.93 లక్షలు. శనివారం 1.15 లక్షల క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేయగా.. ఆ నీరంతా గోదావరిలోకే చేరింది. దీంతో నది ఉధృతి మరింతగా పెరిగింది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రాత్రి 10 గంటలకు 46.60 అడుగులకు చేరుకుంది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే అప్పటి నుంచే క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు 42.05 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించారు. అధికారుల అప్రమత్తం... గోదావరికి శనివారం భారీగా వరద రావడంతో కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ భద్రాచలం చేరుకుని అధికారులతో సమీక్షించారు. గోదావరి తీర ప్రాంతంలో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీంతో సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వీపీ గౌతమ్ చర్ల, దుమ్ముగూడెం మండలాల సెక్టోరియల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలను అప్రమత్తం చేశారు. కాగా శనివారం రాత్రి నుంచి గోదావరికి వరద ఉధృతి తగ్గుతుండడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం వరకు చర్ల మండలం దండుపేట –కొత్తపల్లి రోడ్డు, చర్ల – లింగాపురం మధ్యలో లింగాపురంపాడు వద్ద రోడ్డు వరద నీటితో మునిగిపోయింది. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి, కాగా ఆదివారం వరదనీరు తగ్గడంతో ఈ రోడ్లపై యథావిధిగా రాకపోకలు సాగించారు. వరద ప్రవాహం ఇలా.. మూడు దశాబ్దాల కాలంలో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 8 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి (43 అడుగులు), ఐదు సార్లు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి (48 అడుగులు), తొమ్మిది సార్లు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి(53 అడుగులు) దాటింది. 1979, 1980, 1992, 1995, 2002, 2011, 2012, 2019 (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరాలలో మొదటి ప్రమాద హెచ్చరికను దాటగా, 1981, 2001, 2007, 2008, 2016, సంవత్సరాలో రెండో ప్రమాద హెచ్చరిక దాటింది. ఇక 1983, 1986, 1988, 1990, 2000, 2005, 2006, 2010, 2013 సంవత్సరాలలో మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ఉగ్రరూపం ప్రదర్శించింది. సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఆదివారం సాయంత్రం 5 గంటలకు 42.80 అడుగులకు చేరుకున్నందున మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. వరద ఉధృతి వలన గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లు, పశువులు, ప్రభుత్వ ఆస్తులు తదితర వివరాల నివేదికలు అందజేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీఓలకు సూచించారు. ప్రజల ప్రయాణాలకు వీలుగా, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా రహదారులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు అధికారులు కార్యస్థానం విడిచి వెళ్లవద్దని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించిన ఫొటోలు ఎప్పటికప్పుడు వాట్సప్ ద్వారా తీసుకుంటూ వారికి తగిన సలహాలు, సూచనలు అందజేశామని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణంలోకి వరదనీరు ప్రవేశించకుండా విస్తా కాంప్లెక్స్ వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటుచేసి నీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. -
ఉగ్ర గోదావరి
సాక్షి, రంపచోడవరం(తూర్పుగోదావరి) : వరద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలను ముంచెత్తుతోంది. పోలవరం నిర్వాసితులు ముందు నుంచి అనుకుంటున్నట్టే కాఫర్ డ్యామ్ తమను నట్టేట ముంచిందని లబోదిబోమంటున్నారు. దేవీపట్నంలో వరద శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెరగడంతో అనేక గ్రామాలు నీటి మునిగాయి. శనివారం ఉదయం గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఎటూ పోలేని పరిస్థితి తలెత్తింది. చేతికందిన సామాన్లు సద్దుకుని, ప్రాణాలు అరచేత పెట్టుకుని పడవల కోసం ఎదురుచూశారు. ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి పిల్లలను వెంటబెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. దేవీపట్నం గ్రామంలో ఉన్న బోట్ల సాయంతో ఉమాచోడేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కొంతమంది తరలి వెళ్లారు. మంగళవారం నుండి పెరుగుతూ వచ్చిన గోదావరి వల్ల కాఫర్ డ్యాంకు దగ్గరలో ఉన్న పోశమ్మగండి, పూడిపల్లి, దేవీపట్నం, తొయ్యేరు గ్రామాల్లో ఇళ్లు నీటమునిగాయి. శనివారం వచ్చిన వరద నీటికి ఎ.వీరవరం, దండంగి, చినరమణయ్యపేట గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. కె. వీరవరం, శీతారం, దామనపల్లి మొదలుకుని పెనికలపాడు, మడిపల్లి, అగ్రహారం, గానుగులగొంది, ఏనుగులగూడెం, మంటూరు గ్రామాల వరకూ వరద నీరు ముంచెత్తింది. వరద పోటు వల్ల ఆయా గ్రామాల్లో సుమారు 2500 ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద ప్రాంతంలో మంత్రి, ఎమ్మెల్యే పర్యటన వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకుని బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, పార్టీ నేత కర్రి పాపారాయుడు çహుటాహుటిన వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను పట్టించుకోకుండా అనాలోచితంగా కాఫర్ డ్యాం నిర్మించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టామన్నారు. వరద బాధితులకు తక్షణ సాయంగా కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. పూడిపల్లిలో వరద బాధితులు తమకు టార్పాలిన్లు ఇవ్వాలని కోరారు. పూడిపల్లి వరద బాధితులతో మాట్లాడుతున్న మంత్రి బోస్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే ధనలక్ష్మి సురక్షిత ప్రాంతాలకు బాధితులు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఏఎన్ఎస్, ఫైర్ సిబ్బంది రంగంలో ఉన్నారు. వరద బాధితుల కోసం రమణయ్యపేట వరకు తరలించి అక్కడ నుంచి రంపచోడవరం సమీపంలోని బోర్నగూడెం ఆశ్రమ పాఠశాల వద్ద, దామనపల్లి గ్రామం, రంపచోడవరం డైట్ కళాశాల, గురుకుల పాఠశాలలు, ఇర్లపల్లి బాలికల పాఠశాల, రంపచోడవరంలో బాలికల హాస్టళ్లలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 ఆర్టీసీ బస్సులను వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. దేవీపట్నంలోని పోలీస్‌స్టేషన్, పీహెచ్సీ, జూనియర్ కళాశాల, ఎంపీపీ పాఠశాల నీటిమునిగాయి. గండిపోశమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించిది. వందల ఎకరాల్లో పంటలు నీటి మునిగాయి. వరద గుప్పిట్లో విలీన మండలాలు విలీన మండలాల్లో గోదావరి, శబరి పొంగి ప్రహించడంతో జనజీవనం స్తంభించింది. చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, తెలంగాణలోని తాలిపేరు ద్వారా వస్తున్న వరద నీటితో విలీన మండలాలకు ఎగువన ఉన్న భద్రాచలంలో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహిస్తోంది. రాత్రి ఏడు గంటలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 46.6 అడుగులు ఉండగా 50 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. వరద వల్ల కూనవరం, ఎటపాక, వీఆర్ పురం, చింతూరు మండలాల్లోని సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని చిడుమూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్రా నుంచి చత్తీస్‌గఢ్ ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 48 అడుగులు దాటితే.. నెల్లిపాక (రంపచోడవరం): గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద క్రమేపీ పెరుగుతుండడంతో విలీన మండలాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 41 అడుగులు ఉన్న వరద శనివారం తెల్లవారుజాముకు మొదటి ప్రమాదహెచ్చరిక చేసే 43 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద క్రమేపీ పెరుగూతూ వచ్చి శనివారం సాయంత్రం 7 గంటలకు 46.4 అడుగులు నమోదైంది. రాత్రికి 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే ఎటపాక మండలంలోని మురుమూరు వద్ద రహదారిపైకి వరదనీరు చేరడంతో భద్రాచలం నుంచి కూనవరం వెళ్లేందుకు సాయంత్రం నుంచే రహదారి సౌకర్యం నిలిచిపోయింది. వీరాయిగూడెం, బొట్లకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్తగా ఎటపాక మండలంలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండవ ప్రమాద హెచ్చరిక దాటితే మురుమూరు, నందిగామ, నెల్లిపాక, రాయనపేట తదితర గ్రామాల వద్ద ప్రధాన రహదారిపైకి వరద చేరుతుంది. ఇప్పటికే తోటపల్లి, గుండాల, నందిగామ, గన్నవరం సమీపంలో పత్తి చేలు నీట మునిగాయి. గోదావరికి వరద ఉధృతి కొనసాగితే పలుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవటమే కాకుండా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం కల్యాణకట్ట నీటమునిగింది. చర్ల తాలిపేరు ప్రాజెక్టు నుంచి 24 గేట్లు పూర్తిగా ఎత్తి 1,18,700 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కంఠం వరకూ వరదనీట మునిగిన గండిపోశమ్మతల్లి పొంగి పొర్లుతున్న డ్రైన్లు అమలాపురం: ఒకవైపు గోదావరి వరద, మరోవైపు వర్షాలు కురవడంతో మేజర్, మీడియం డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. దీనితో జిల్లాలో డెల్టా తీర ప్రాంత మండలాల్లో వరిచేలకు ముంపు తీవ్రత పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది.గోదావరి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం బ్యారేజి నుంచి శనివారం రాత్రి 11 గంటలకు సుమారు 11,97,825 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో డ్రైన్ల ద్వారా వచ్చే ముంపునీరు నదుల ద్వారా దిగడం లేదు. తూర్పు డెల్టాలో తుల్యభాగ, మధ్య డెల్టాలో ఓల్డ్ బండారులంక, గొరగనమూడి, ఓల్డ్ అయినాపురం, ఐలెండ్‌లోని నార్త్ అడ్డాల్, పెరుమళ్ల కోడు డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. రాజోలు దీవిలో గొంది నోవా, శంకరగుప్తం, వేపచెట్టు, అంతర్వేది, రాళ్ల కాలువల నుంచి కూడా ముంపునీరు నదులలో దిగడం లేదు. డ్రెయిన్ల నుంచి నీరు గోదావరిలోకి దిగే చోట అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు, వాటి షటర్లు దెబ్బతినడంతో ముంపునీరు ముంచెత్తుతోందని రైతులు వాపోతున్నారు. తూర్పుడెల్టాలో తాళ్లరేవు, కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం, కరప, మధ్య డెల్టాలో ముమ్మిడివరం, అమలాపురం, అల్లవరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, మామిడికుదురు, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ముంపునీరు డ్రైన్ల ద్వారా దిగే అవకాశం లేకుండా పోతోంది. గురువారం జిల్లా వ్యాప్తంగా 11.5 మిల్లీ మీటర్ల సగటున వర్షం కురిసింది. శుక్రవారం 34.3, శనివారం 12.5 మిల్లీ మీటర్ల చొప్పున వర్షం పడింది. రెండు డెల్టాల్లోని శివారుల్లో మొత్తం 1.80 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా, సుమారు 42 వేల ఎకరాలు ముంపులో ఉన్నాయి. దీనిలో 30 వేల ఎకరాల్లో నాట్లు పూర్తయిన చేలు కాగా, మరో 12 వేల ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగినట్టు అంచనా. బండారులంక కౌశిక డ్రైన్ గట్లను ఆనుకుని నీరు ప్రవహిస్తోంది. -
గోదావరికి పెరిగిన వరద ఉధృతి
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): గోదావరి నదిలో వరద నీటి ఉధృతి పెరుగుతోందని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కోరారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశముందని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాక ఉభయ గోదావరి జిల్లాల ప్రభావిత మండలాల అధికారులు ఎటువంటి ఏమరుపాటుకు లోనుకాకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు పంపామని, లోతట్టు ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించాలని కమిషనర్ కోరారు. అదేవిధంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని ఆదేశించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. -
భారీ వర్షాలు; పెరుగుతున్న గోదావరి ఉధృతి
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. మరో 24 గంటల్లో వరద తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో గోదావరి తీర లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 8 లక్షల 60 వేల క్యూసెక్కులు ఉండగా గంట గంటకు ఉధృతి పెరుగుతూ నది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు దేవిపట్నం మండలంలోని దాదాపు 26 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం ఇప్పటికే 10.6 అడుగులకు చేరడంతో బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. ధవళేశ్వరం దిగువన గోదావరి ఉప నదులైన వశిష్ట, వైనతేయ, గౌతమి పరవళ్లు తొక్కుతున్నాయి. సాయంత్రానికి నీటిమట్టం విలువ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదారి వరద పోటెత్తడంతో మొదటి ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. -
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
-
గోదావరి నది ఉగ్రరూపం
-
తూర్పుగోదావరి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి
-
గోదావరిలో యువకుడి గల్లంతు
పలిమెల: ఛత్తీస్‌గఢ్ నుంచి పిక్నిక్ కోసం వచ్చిన బృందంలోని ఓ యువకుడు గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన మండలంలోని దమ్మూరు గ్రామం సమీపంలో శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ బ్లాక్ కాలనీకి చెందిన ఖుజూర్ అభిషేక్(22) ఐటీఐ చదువుతున్నాడు. అతడు తన మిత్రులతో కలిసి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను విడదీస్తూ మూడు నదుల సంగమ ప్రాంతానికి వచ్చాడు. అప్పటివరకు ఎంతో ఆనందంగా గడిపిన అభిషేక్ స్నానం కోసం నదిలోకి దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా నీటి అడుగున ఉన్న ఇసుకలో దిగబడిపోయాడు. ఈత రాని అతడు బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ ప్రవాహ ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న అతడి స్నేహితులకు సైతం ఈత రాకపోవడంతో అభిషేక్‌ను కాపాడే సాహసం చేయలేకపోయారు. వారు కేకలు వేయగా సమీపంలోని జాలర్లు అక్కడికి చేరుకునేలోపే అభిషేక్ కనిపించకుండా పోయాడు. యువకుడి గల్లంతుపై సమాచారం అందుకున్న ఛతీస్‌గఢ్‌లోని భద్రకాళి పోలీసులు అక్కడికి వచ్చి జాలర్లకు సహాయాన్ని అందిస్తున్నారు. రెండు రోజులుగా గాలించినప్పటికీ అభిషేక్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టేందుకు సహకరించాలని వేడుకుంటున్నారు. -
భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ ఫుల్
-
ప్రాజెక్టులన్నీ ఫుల్
♦ భారీ వర్షాలతో మహోగ్రంగా గోదావరి, ఉపనదులు ♦ ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ల గేట్లు ఎత్తివేత ♦ ఇంద్రావతి, ప్రాణహిత పరీవాహకంలోనూ వ రద ముప్పు ♦ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ♦ కృష్ణా నదిలోనూ పెరిగిన ప్రవాహాలు.. ♦ శ్రీశెలానికి 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ♦ కరీంనగర్ జిల్లాలో తెగిన మిడ్‌మానేరు డ్యామ్ మట్టికట్ట ♦ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలకు తోడు భారీ వర్షాలతో చేరుతున్న నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి అయితే మహోగ్రరూపంతో పారుతోంది. ఈ బేసిన్‌లోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు డ్యాం, కడెం ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారాయి. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అటు కృష్ణా పరీవాహకంలో వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఆ నీటిని వచ్చింది వచ్చినట్లుగా వదిలేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడం, నదులన్నీ పొంగడంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పరిస్థితిని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయం గా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుల పరిధిలో పర్యటిస్తూ అధికారులకు సూచనలు జారీచేస్తున్నారు. ఉప్పొంగిన గోదావరి మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్‌కు ఆదివారం కూడా 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగింది. శనివారమే ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు.. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 1090 అడుగుల వద్ద 84 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు. ఇక మంజీరా నది కూడా ఉప్పొంగుతుండడంతో సింగూరు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తేశారు. సింగూరుకు ఆదివారం ఉదయం లక్షా 20వేల క్యూసెక్కుల వరదరాగా.. సాయంత్రానికి అది 70 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఔట్‌ఫ్లో 62 వేల క్యూసెక్కుల వరకు ఉంది. ఈ నీటితోపాటు హల్దివాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా కలిపి నిజాం సాగర్ ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.9 టీఎంసీలుకాగా.. సాయంత్రానికి 14 టీఎంసీలకు చేరింది. మరింత వరద వస్తుండటంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 23 గేట్లను ఎత్తి 1.5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. గత మూడేళ్లలో తొలిసారిగా ఈ మూడు ప్రాజెక్టులు నిండడం గమనార్హం. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో 4.49 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ నీళ్లన్నీ దిగువకు విడుదల చేస్తున్నారు. వీటికితోడు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ప్రభుత్వం నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఇక ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మట్టం ఆదివారం 21 అడుగులుగా నమోదైంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో.. నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పెరగొచ్చ ని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లోయ ర్ మానేరు డ్యామ్‌లోకి భారీగా వరద చేరుతోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ఆదివారం రాత్రి వరకు 14 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలానికి భారీ వరద మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు నిండిపోవడంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీంతో ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 1.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 9.65 టీఎంసీలుకాగా.. 8.86 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా మరో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద మరింతగా పెరిగే అవకాశాలుండడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 1.98 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా చేరుతుండడంతో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 185.56 టీఎంసీలకు చేరింది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే మరో రెండు రోజుల్లోనే రిజర్వాయర్ నిండిపోనుంది. వరద పెరిగే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఎడమగట్టు, కుడిగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ.. 68,645 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా నాగార్జునసాగర్‌కు చేరుతోంది. ప్రస్తుతం సాగర్‌లో 141.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇది పూర్తిగా నిండాలంటే మరో 170.14 టీఎంసీలు అవసరం. నల్లగొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్‌కు ఆదివారం ఉదయం 11 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మధ్యాహ్నానికి 25 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 5 గేట్లను ఎత్తి 11 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మిడ్‌మానేరుకు గండి వరద నీటి ఉధృతికి కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మిడ్ మానేరు జలాశయం స్పిల్‌వే మట్టికట్టకు గండిపడింది. అది ఉధృతమై ఆదివారం రాత్రి 20 మీటర్ల మేర తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న చొక్కారావుపల్లె, యూస్వాడ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివారం ఉదయమే మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామం నీట మునగడంతో 450 కుటుంబాలను ఖాళీ చేయించారు. మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకుని తెగిపోయిన కట్టను పరిశీలించారు. ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇక 4.25 టీఎంసీల నిల్వతో మధ్య మానేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. స్వయంగా పర్యవేక్షిస్తున్న హరీశ్‌రావు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతుండడం, నీటి విడుదలతో పరీవాహక ప్రాంతాలకు ముప్పు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి, జిల్లాల అధికారులతోపాటు మహారాష్ట్ర అధికారులతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టును హరీశ్‌రావు పరిశీలించారు. ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి పరిస్థితి వివరించారు. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీకి నీటిని వదులుతామని.. ఎల్ఎండీ నిండితే దిగువకు విడుదల చేస్తామని వివరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పరిస్థితి వివరాలు కూడా చెప్పారు. ఈ మేరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ సూచించారు.