ఉగ్ర గోదావరి | Godavari River Get Huge Water In East Godavari | Sakshi
Sakshi News home page

ఉగ్ర గోదావరి

Published Sun, Aug 4 2019 12:04 PM | Last Updated on Sun, Aug 4 2019 12:04 PM

Godavari River Get Huge Water In East Godavari - Sakshi

వరదనీటితో మునిగిన దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామం

సాక్షి, రంపచోడవరం(తూర్పుగోదావరి) : వరద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలను ముంచెత్తుతోంది. పోలవరం నిర్వాసితులు ముందు నుంచి అనుకుంటున్నట్టే కాఫర్‌ డ్యామ్‌ తమను నట్టేట ముంచిందని లబోదిబోమంటున్నారు. దేవీపట్నంలో వరద శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెరగడంతో అనేక గ్రామాలు నీటి మునిగాయి. శనివారం ఉదయం గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఎటూ పోలేని పరిస్థితి తలెత్తింది. చేతికందిన సామాన్లు సద్దుకుని, ప్రాణాలు అరచేత పెట్టుకుని పడవల కోసం ఎదురుచూశారు. ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి పిల్లలను వెంటబెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు నానా అవస్థలూ పడ్డారు.

దేవీపట్నం గ్రామంలో ఉన్న బోట్ల సాయంతో ఉమాచోడేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కొంతమంది తరలి వెళ్లారు. మంగళవారం నుండి పెరుగుతూ వచ్చిన గోదావరి వల్ల కాఫర్‌ డ్యాంకు దగ్గరలో ఉన్న పోశమ్మగండి, పూడిపల్లి, దేవీపట్నం, తొయ్యేరు గ్రామాల్లో ఇళ్లు నీటమునిగాయి. శనివారం వచ్చిన వరద నీటికి ఎ.వీరవరం, దండంగి, చినరమణయ్యపేట గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. కె. వీరవరం, శీతారం, దామనపల్లి మొదలుకుని పెనికలపాడు, మడిపల్లి, అగ్రహారం, గానుగులగొంది, ఏనుగులగూడెం, మంటూరు గ్రామాల వరకూ వరద నీరు ముంచెత్తింది. వరద పోటు వల్ల ఆయా గ్రామాల్లో సుమారు 2500 ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి.

వరద ప్రాంతంలో మంత్రి, ఎమ్మెల్యే పర్యటన
వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకుని బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, పార్టీ నేత కర్రి పాపారాయుడు çహుటాహుటిన వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను పట్టించుకోకుండా అనాలోచితంగా కాఫర్‌ డ్యాం నిర్మించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టామన్నారు. వరద బాధితులకు తక్షణ సాయంగా కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. పూడిపల్లిలో వరద బాధితులు తమకు టార్పాలిన్లు ఇవ్వాలని కోరారు.


పూడిపల్లి వరద బాధితులతో మాట్లాడుతున్న మంత్రి బోస్, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే ధనలక్ష్మి

సురక్షిత ప్రాంతాలకు బాధితులు
వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ చర్యలు అందించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఏఎన్‌ఎస్, ఫైర్‌ సిబ్బంది రంగంలో ఉన్నారు. వరద బాధితుల కోసం రమణయ్యపేట వరకు తరలించి అక్కడ నుంచి రంపచోడవరం సమీపంలోని బోర్నగూడెం ఆశ్రమ పాఠశాల వద్ద, దామనపల్లి గ్రామం, రంపచోడవరం డైట్‌ కళాశాల, గురుకుల పాఠశాలలు, ఇర్లపల్లి బాలికల పాఠశాల, రంపచోడవరంలో బాలికల హాస్టళ్లలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 ఆర్టీసీ బస్సులను వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. దేవీపట్నంలోని పోలీస్‌స్టేషన్, పీహెచ్‌సీ, జూనియర్‌ కళాశాల, ఎంపీపీ పాఠశాల నీటిమునిగాయి. గండిపోశమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించిది. వందల ఎకరాల్లో పంటలు నీటి మునిగాయి.

వరద గుప్పిట్లో విలీన మండలాలు
విలీన మండలాల్లో గోదావరి, శబరి పొంగి ప్రహించడంతో జనజీవనం స్తంభించింది. చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, తెలంగాణలోని తాలిపేరు ద్వారా వస్తున్న వరద నీటితో విలీన మండలాలకు ఎగువన ఉన్న భద్రాచలంలో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహిస్తోంది. రాత్రి ఏడు గంటలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 46.6 అడుగులు ఉండగా 50 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. వరద వల్ల కూనవరం, ఎటపాక, వీఆర్‌ పురం, చింతూరు మండలాల్లోని సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని చిడుమూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్రా నుంచి చత్తీస్‌గఢ్‌ ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
 

48 అడుగులు దాటితే..
నెల్లిపాక (రంపచోడవరం): గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద క్రమేపీ పెరుగుతుండడంతో విలీన మండలాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 41 అడుగులు ఉన్న వరద శనివారం తెల్లవారుజాముకు మొదటి ప్రమాదహెచ్చరిక చేసే 43 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద క్రమేపీ పెరుగూతూ వచ్చి శనివారం సాయంత్రం 7 గంటలకు 46.4 అడుగులు నమోదైంది. రాత్రికి 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే ఎటపాక మండలంలోని మురుమూరు వద్ద రహదారిపైకి వరదనీరు చేరడంతో భద్రాచలం నుంచి కూనవరం వెళ్లేందుకు సాయంత్రం నుంచే రహదారి సౌకర్యం నిలిచిపోయింది. వీరాయిగూడెం, బొట్లకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ముందు జాగ్రత్తగా ఎటపాక మండలంలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండవ ప్రమాద హెచ్చరిక దాటితే మురుమూరు, నందిగామ, నెల్లిపాక, రాయనపేట తదితర గ్రామాల వద్ద ప్రధాన రహదారిపైకి వరద చేరుతుంది. ఇప్పటికే తోటపల్లి, గుండాల, నందిగామ, గన్నవరం సమీపంలో పత్తి చేలు నీట మునిగాయి. గోదావరికి వరద ఉధృతి కొనసాగితే పలుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవటమే కాకుండా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం కల్యాణకట్ట నీటమునిగింది. చర్ల తాలిపేరు ప్రాజెక్టు నుంచి 24 గేట్లు పూర్తిగా ఎత్తి 1,18,700 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.


కంఠం వరకూ వరదనీట మునిగిన గండిపోశమ్మతల్లి

పొంగి పొర్లుతున్న డ్రైన్లు
అమలాపురం: ఒకవైపు గోదావరి వరద, మరోవైపు వర్షాలు కురవడంతో మేజర్, మీడియం డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. దీనితో జిల్లాలో డెల్టా తీర ప్రాంత మండలాల్లో వరిచేలకు ముంపు తీవ్రత పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది.గోదావరి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం బ్యారేజి నుంచి శనివారం  రాత్రి 11 గంటలకు సుమారు 11,97,825 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో డ్రైన్ల ద్వారా వచ్చే ముంపునీరు నదుల ద్వారా దిగడం లేదు. తూర్పు డెల్టాలో తుల్యభాగ, మధ్య డెల్టాలో ఓల్డ్‌ బండారులంక, గొరగనమూడి, ఓల్డ్‌ అయినాపురం, ఐలెండ్‌లోని నార్త్‌ అడ్డాల్, పెరుమళ్ల కోడు డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. రాజోలు దీవిలో గొంది నోవా, శంకరగుప్తం, వేపచెట్టు, అంతర్వేది, రాళ్ల కాలువల నుంచి కూడా ముంపునీరు నదులలో దిగడం లేదు.

డ్రెయిన్ల నుంచి నీరు గోదావరిలోకి దిగే చోట అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు, వాటి షటర్లు దెబ్బతినడంతో ముంపునీరు ముంచెత్తుతోందని రైతులు వాపోతున్నారు. తూర్పుడెల్టాలో తాళ్లరేవు, కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం, కరప, మధ్య డెల్టాలో ముమ్మిడివరం, అమలాపురం, అల్లవరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, మామిడికుదురు, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ముంపునీరు డ్రైన్ల ద్వారా దిగే అవకాశం లేకుండా పోతోంది. గురువారం జిల్లా వ్యాప్తంగా 11.5 మిల్లీ మీటర్ల సగటున వర్షం కురిసింది. శుక్రవారం 34.3, శనివారం 12.5 మిల్లీ మీటర్ల చొప్పున వర్షం పడింది. రెండు డెల్టాల్లోని శివారుల్లో మొత్తం 1.80 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా, సుమారు 42 వేల ఎకరాలు ముంపులో ఉన్నాయి. దీనిలో 30 వేల ఎకరాల్లో నాట్లు పూర్తయిన చేలు కాగా, మరో 12 వేల ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగినట్టు అంచనా. బండారులంక కౌశిక డ్రైన్‌ గట్లను ఆనుకుని నీరు ప్రవహిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement